కోవిడ్-19 మూలం ఎక్కడ? తేల్చడానికి ‘ఇదే చివరి అవకాశం’ - ప్రపంచ ఆరోగ్య సంస్థ

వుహాన్‌లో కరోనా నియంత్రణ చర్యలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోవిడ్-19 మొట్టమొదట వెలుగుచూసింది వుహాన్‌ నగరంలోనే.. దీంతో కరోనా మూలాలపై ప్రశ్నలకు కూడా ఈ నగరం కేంద్రమైంది

కోవిడ్ -19 మూలాలను కనుగొనడానికి చివరి అవకాశం 'కొత్త టాస్క్‌ ఫోర్స్‌' కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది.

సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ది ఆరిజిన్స్‌ ఆఫ్‌ నావెల్‌ పాథోజెన్స్‌(సాగో)కి 26 మంది నిపుణులను నామినేట్ చేసింది.

చైనా నగరమైన వుహాన్‌లో వైరస్ కనుగొన్నప్పటి నుంచి, ఒకటిన్నర సంవత్సరాలకు పైగా ఈ వైరస్‌ మొదట ఎలా ఉద్భవించిందనేది, సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

వుహాన్ మార్కెట్లలో జంతువుల నుండి మానవులకు వైరస్ సంక్రమించిందా లేదా ల్యాబ్ ప్రమాదంలో లీక్ అయిందా అనే అంశాలను ఈ బృందం పరిశీలించనుంది.

అయితే రెండో సిద్ధాంతాన్ని చైనా తీవ్రంగా ఖండించింది.

ఫిబ్రవరిలో, కోవిడ్ మూలాలపై పరిశోధించే పనిలో భాగంగా డబ్ల్యూహెచ్‌ఓ బృందం చైనాకు వెళ్లింది. వైరస్ బహుశా గబ్బిలాల నుండి వచ్చి ఉంటుందని, అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరం అని ఓ అంచనాకు వచ్చింది.

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ పుట్టిల్లు వుహాన్‌లో ఇప్పుడు పరిస్థితి ఏంటి?

కానీ, చైనా పారదర్శకంగా వ్యవహరించకపోవడం, డేటా ఇవ్వకపోవడం వల్ల విచారణకు ఆటంకం ఏర్పడిందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఆ తర్వాత చెప్పారు.

సాగో గ్రూపులోని ప్రతిపాదిత సభ్యులలో మునుపటి బృందంలో చైనా సందర్శించిన ఆరుగురు నిపుణులు ఉన్నారు.

ఈ బృందం కరోనావైరస్ కాకుండా ఇతర హై-రిస్క్ వ్యాధికారకాల మూలాలను కూడా పరిశీలించనుంది.

"భవిష్యత్తులో వైరస్‌లు వ్యాప్తి చెందకుండా ఉండటానికి కొత్త వ్యాధికారకాలు ఎక్కడ నుండి వచ్చాయో అర్థం చేసుకోవడం చాలా అవసరం" అని డాక్టర్ టెడ్రోస్ చెప్పారు.

సైన్స్ జర్నల్‌లో ఉమ్మడి సంపాదకీయంలో డాక్టర్ టెడ్రోస్, ఇతర డబ్ల్యూహెచ్‌ఓ ఉన్నతాధికారులు "ల్యాబ్ ప్రమాదాన్ని తోసిపుచ్చలేము" అని చెప్పారు.

సాగో చేసే అధ్యయనం "ఈ వైరస్ మూలాలను అర్థం చేసుకోవడానికి చివరి అవకాశం" కావొచ్చు అని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సిస్‌ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు.

మహమ్మారి ప్రారంభ నెలల్లో తీసుకున్న వేలాది రక్త నమూనాలను పరీక్షించడానికి చైనా సిద్ధమవుతోందని సీఎన్‌ఎన్‌ నివేదించిన అనంతరం ఈ కొత్త గ్రూపు(సాగో) ఏర్పాటుపై ప్రకటన వచ్చింది.

కానీ సాగో పరిశోధనల పేరుతో "రాజకీయం చేయకూడదు" అని జెనీవాలో ఐక్యరాజ్యసమితిలోని చైనా రాయబారి చెన్ జు అన్నారు.

"ఇతర ప్రాంతాలకు కూడా బృందాలను పంపాల్సిన సమయం వచ్చింది" అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ చైనాలోని వుహాన్‌లో డిసెంబర్‌ కన్నా ముందే బయటపడిందా?

ప్రాణాంతకమైన సార్స్-సీఓవీ-2 వైరస్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉద్భవించింది?

బీబీసీ గ్లోబల్ హెల్త్ కరస్పాండెంట్ తులిప్ మజుందార్ విశ్లేషణ

మహమ్మారి ప్రారంభమై దాదాపు రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ, ప్రాణాంతకమైన సార్స్-సీఓవీ-2 వైరస్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉద్భవించిందో మనకు ఇంకా తెలియదు. కొత్త వైరస్‌లను పరిశోధించడం ఎప్పుడూ చాలా క్లిష్టంగా ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు మునుపటి రెండు కరోనావైరస్‌ల వ్యాప్తికి మూలాలను కనుగొన్నారు. ఈ రెండూ జంతువుల నుండి ఉద్భవించినవే.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన బృందం వుహాన్‌లో పర్యటించి తిరిగి వచ్చి తొమ్మిది నెలలు గడిచింది. ఇంతకు ముందులాగే ఈ వైరస్‌ కూడా జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెంది ఉండొచ్చన్న అంచనాకు వచ్చారు. వేలాది గబ్బిలాల నమూనాలున్న వుహాన్‌ ల్యాబ్‌లో కరోనా వైరస్‌లపై అధ్యయనం చేస్తుండగా, ప్రమాదవ శాత్తూ లీక్‌ అయిందనే అనుమానాలు కూడా ఉత్పన్నమయ్యాయి. అయితే ఈ వాదనలను చైనా నిర్ద్వందంగా తోసిపుచ్చింది.

మహమ్మారి ప్రారంభంనాటి నుండి చైనా ఇప్పటికీ కీలకమైన డేటాను పంచుకోలేదని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ఈ సమస్యపై అతిపెద్ద భౌగోళిక రాజకీయ శక్తులైన చైనా, యుఎస్ మాటల యుద్ధాల నడుమ డబ్ల్యూహెచ్‌ఓ చిక్కుకున్నా, ల్యాబ్ లీక్ సిద్ధాంతంపై నిజాలు నిగ్గు తేలాలన్న తన వాదనలను బలంగా వ్యక్తపరుస్తోంది.

అంతర్జాతీయ శాస్త్రవేత్తలను తిరిగి దేశంలోకి అనుమతించడానికి చైనా నిరాకరించడంతో సైన్స్‌ను రాజకీయం చేస్తున్నారు. 26 దేశాల నిపుణులతో ఉన్న కొత్త సాగో బృందం ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలికి, అవసరమైన సమాధానాలను పొందితే.. భవిష్యత్తులో ఉద్భవించే వైరస్‌ల వ్యాప్తిపై ప్రపంచం సంసిద్ధం అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)