కేఎస్ఎం: '9/11 దాడుల సూత్రధారి ఖాలిద్ షేక్ మొహమ్మద్ అంతకు ముందే ఎఫ్‌బీఐ నుంచి ఎలా తప్పించుకున్నాడు’

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, గోర్డాన్ కొరేవా, స్టీవ్ స్వానిన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
20 ఏళ్ల కిందట అమెరికాలో జరిగిన 9/11 దాడుల సూత్రధారి ఆ కేసులో విచారణ కోసం ఎదురుచూస్తూ జైలులో ఉన్నారు. అయితే, ప్రపంచాన్ని వణికించిన ఆ దాడులకు ముందే ఆయన్ను అడ్డుకునే అవకాశం వచ్చిందా? వస్తే ఎందుకు అడ్డుకోలేకపోయారు?
వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలను విమానాలు ఢీకొంటున్న దృశ్యాలు టీవీలో వస్తున్నప్పుడు, ఫ్రాంక్ పెల్లెగ్రినో మలేసియాలోని ఒక హోటల్ గదిలో ఉన్నారు.
ఆ దాడి చూసిన వెంటనే ఆయన "మై గాడ్.. అది ఖాలిద్ షేక్ మొహమ్మద్ పనే... " అనుకున్నారు.
ఖాలిద్ షేక్ మొహమ్మద్ ఉద్దేశం, లక్ష్యం కూడా అదే. అతడు ఏమేం చేయాలని అనుకున్నాడో ఫ్రాంక్ పెల్లెగ్రినోకు చాలా బాగా తెలుసు.
ఎఫ్‌బీఐ మాజీ స్పెషల్ ఏజెంట్ అయిన ఫ్రాంక్... ఖాలిద్ షేక్ మొహమ్మద్ మీద దాదాపు మూడు దశాబ్దాలపాటు నిఘా పెట్టారు.
అయితే 9/11 సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఖాలిద్ ఇప్పటికీ విచారణ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ కేసు ముగియడానికి మరో 20 ఏళ్లు పట్టవచ్చని ఖాలిద్ మొహమ్మద్ లాయర్ బీబీసీతో అన్నారు.
9/11 దాడులకు ప్రధాన కారణం ఆ సమయంలో అల్ ఖైదా నేతగా ఉన్న ఒసామా బిన్ లాడెన్ అని అందరూ భావిస్తారు.
కానీ, ఈ దాడులకు ప్రధాన సూత్రధారి ఖాలిద్ మొహమ్మద్ షేక్(కేఎస్ఎం) అని ఈ దాడులపై దర్యాప్తు జరిపిన కమిషన్ తన రిపోర్టులో చెప్పింది.
విమానాలతో ట్విన్ టవర్లను ఢీకొట్టాలనే తన ఆలోచనను అల్ ఖైదా దగ్గరకు తీసుకెళ్లిన వ్యక్తి అతడే.

ఫొటో సోర్స్, Getty Images
విధ్వంసం సృష్టించే లక్ష్యం
కువైట్‌లో పుట్టిన కేఎస్ఎం, అమెరికాలో చదువుకున్నారు. 80వ దశకంలో అఫ్గానిస్తాన్‌లో పోరాడారు.
ఎఫ్‌బీఐ ఏజెంట్ ఫ్రాంక్ పెల్లెగ్రినో 9/11 దాడులకు కొన్నేళ్ల ముందు నుంచే ఈ జిహాదీ ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 1993లో జరిగిన బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును ఎఫ్‌బీఐ పెల్లెగ్రినోకు అప్పగించింది.
ఖాలిద్ షేక్ మొహమ్మద్ పేరు మొదటిసారి అమెరికా అధికారులకు తెలిసింది అప్పుడే. ఎందుకంటే, ఆ కేసులో ప్రమేయం ఉన్నవారిలో ఒకరికి కేఎస్ఎం డబ్బు బదిలీ చేశారు.
కొన్ని అంతర్జాతీయ విమానాలను పసిఫిక్ మీదుగా తీసుకెళ్లి పేల్చేయాలని కుట్రలో అతడి పేరు కూడా బయటపడడంతో, కేఎస్ఎం ఎలాంటి విధ్వంసకర లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడో ఫ్రాంక్‌కు 1995లో అర్థమైంది.
ఫ్రాంక్ 90లలో మొహమ్మద్‌ను దాదాపు అరెస్ట్ చేయగలిగేంత వరకు వచ్చారు,
కేఎస్ఎం ఖతార్‌లో ఉన్నట్టు గుర్తించిన ఫ్రాంక్ తన టీమ్‌తో ఒమన్ చేరుకున్నారు. అక్కడ నుంచి వాళ్లు ఖతార్ వెళ్లి, మొహమ్మద్‌ను అరెస్ట్ చేయాలని అనుకున్నారు.
కేఎస్ఎంను అమెరికా తీసుకెళ్లడానికి ఒక విమానం కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ అక్కడున్న అమెరికా దౌత్యవేత్తలు మాత్రం ఆ ఆపరేషన్‌కు వెనుకాడారు.
ఖతార్ వెళ్లిన ఫ్రాంక్ పెల్లెగ్రినో అక్కడ అమెరికా ఎంబసీలో అధికారులను కలిసి కేఎస్ఎంను పట్టుకునే తన ప్లాన్ గురించి చెప్పారు. అయితే, దౌత్యాధికారులు అక్కడ తాము ఎలాంటి ఇబ్బందులు కొనితెచ్చుకోవాలని కోరుకోవడం లేదని ఫ్రాంక్‌తో చెప్పారు.
కేఎస్ఎంను పట్టుకుంటే ఏదైనా గందరగోళం తలెత్తుతుందేమోనని వాళ్లు భయపడ్డారని అని ఆయన గుర్తు చేసుకున్నారు.
చివరికి కేఎస్ఎం తప్పించుకున్నట్లు ఖతార్ అధికారులు తమకు సమాచారం ఇచ్చారని వారు ఫ్రాంక్‌కు చెప్పారు.
"అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. మంచి అవకాశం చేజారిపోయిందని మాకు అప్పుడే తెలుసు" అని ఫ్రాంక్ చెప్పారు.

ఫొటో సోర్స్, FRANK PELLEGRINO
ఖాలిద్ షేక్ మొహమ్మద్ కనెక్షన్స్, కార్యకలాపాలు
అయితే, 90లలో కేఎస్ఎంకు తాము పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని కూడా ఫ్రాంక్ అంగీకరించారు.
కేఎస్ఎం పేరును పెల్లెగ్రినో అమెరికా టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో కూడా చేర్చలేకపోయారు.
"ఆ లిస్టులో ఇప్పటికే చాలా మంది తీవ్రవాదులు ఉన్నారని నాకు చెప్పారు" అంటారు ఫ్రాంక్.
అమెరికాను తాను(కేఎస్ఎం) టార్గెట్ చేశాననే విషయం తెలిసిపోయిందని బహుశా ఖాలిద్ షేక్ మొహమ్మద్‌కు కూడా తెలిసిపోయింది.
దాంతో, అతడు ఖతార్ పారిపోయాడు, అక్కడ నుంచి అఫ్గానిస్తాన్ చేరుకున్నాడు.
తర్వాత కొన్నేళ్లపాటు కేఎస్ఎం పేరు అప్పుడప్పుడూ బయటికొచ్చేది. ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడా అరెస్టయ్యే అనుమానిత తీవ్రవాదుల ఫోన్ కాంటాక్ట్ లిస్టులో అతడి పేరు కనిపించేది.
దాంతో కేఎస్ఎం సంబంధాలు పెంచుకున్నట్లు, అతడి కార్యకలాపాలు చురుగ్గా కొనసాగుతున్నట్లు అర్థమైంది.
ఆ రోజుల్లోనే షేక్ మహమ్మద్ 9/11 దాడుల ఆలోచనతో ఒసామా బిన్ లాడెన్ దగ్గరకు వెళ్లారు.
తీవ్రవాదులకు విమానం నడిపే శిక్షణ ఇస్తే, వారు విమానాలను అమెరికాలో భవనాలను ఢీకొట్టే లక్ష్యంతో తీసుకెళ్లాలని అనుకున్నారు. సెప్టెంబర్ 11న ఆ దాడులు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సీఐఏ బ్లాక్ సైట్
"9/11 దాడుల పథకం అమలు చేసింది కేఎస్ఎం మనుషులే అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుస్తోంది. అది అతడి పనేనని మాకు తెలిసిన సమయానికి, అక్కడ నా పరిస్థితి అందరికంటే ఘోరంగా ఉంది" అని పెల్లెగ్రినో చెప్పారు.
2003లో కేఎస్ఎం పాకిస్తాన్‌లో ఉన్నట్టు సమాచారం అందడంతో అతడిని అరెస్ట్ చేశారు. ఇక తను అప్పటికే సేకరించిన ఆధారాలను బట్టి విచారణ కొనసాగుతుందని ఫ్రాంక్ ఆశించారు. కానీ, కేఎస్ఎం మళ్లీ కనిపించకుండా పోయాడు.
కేఎస్ఎంను సీఐఏ తమ కస్టడీలోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించింది.
'9/11 దాడుల గురించి అతడికి ఏమేం తెలుసో, అదంతా వీలైనంత త్వరగా తెలుసుకోవాలని మేం అనుకుంటున్నాం" అని సీఐఏ అధికారి ఒకరు అప్పట్లో చెప్పారు.
సీఐఏ తమ అదుపులో ఉన్న కేఎస్ఎంను విచారించడంలో భాగంగా అనేక పద్ధతులను ప్రయోగించింది. 183 సార్లకు పైగా ఊపిరాడకుండా నీళ్లలో ముంచింది, రెక్టల్ రీహైడ్రేషన్, నిద్రపోనీకుండా చేయడం, నగ్నంగా ఉంచడం, పిల్లలను చంపేస్తామని బెదిరించడం లాంటి టార్చర్ పద్ధతులనూ అతడిపై ప్రయోగించింది.
కేఎస్ఎం కూడా అవన్నీ భరించాడు. చివరికి ఆ సమయంలో జరిగిన తీవ్రవాద దాడుల కుట్రలో తన పాత్ర ఉందని అంగీకరించాడు.
కానీ, ఈ సమాచారం ఎక్కువగా తమ అదుపులో ఉన్న వ్యక్తుల ద్వారా తెలుసుకున్నట్లు సెనేట్ ఒక రిపోర్టులో చెప్పింది.

ఫొటో సోర్స్, Pool
కేఎస్ఎంను కలిసే అవకాశం
సీఐఏ చేస్తున్నదంతా బయటపడిన తర్వాత, 2006లో కేఎస్ఎంను గ్వాంటనామో బేకు తరలించారు. ఆ తర్వాత అతడి కేసును విచారించడానికి ఎఫ్‌బీఐకి అనుమతి లభించింది.
కొన్నేళ్ల పాటు కేఎస్ఎం మీద నిఘా పెట్టిన ఫ్రాంక్ పెల్లెగ్రినోకు చివరికి 2007 జనవరిలో అతడిని కలిసే అవకాశం లభించింది.
"90ల నుంచీ నువ్వు నా రాడార్‌లో ఉన్నావని నేను అతడికి చెప్పాలనుకున్నా. సెప్టెంబర్ 11 దాడుల గురించి పూర్తి సమాచారం రాబట్టాలనుకున్నా" అని ఫ్రాంక్ చెప్పారు.
అయితే కేఎస్ఎంతో తాను జరిపిన సంభాషణ గురించి ఫ్రాంక్ ఎక్కువ వివరాలేవీ ఇవ్వలేదు.
"మీరు నమ్మలేకపోవచ్చు, అతడి సెన్సాఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. తను చాలా ఓపెన్‌గా మాట్లాడాడు" అని మాత్రం చెప్పాడు.
గ్వాంటనామో బేలో కోర్టు విచారణ సమయంలో కేఎస్ఎం చాలాసార్లు కనిపించారు.
ప్రపంచంలో అపఖ్యాతి మూటగట్టుకున్న తీవ్రవాదుల్లో ఒకడైన కేఎస్ఎంకు తాను చేసిన పనులపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఫ్రాంక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
9/11 ఘటనకు 20 ఏళ్లు
"ఆరు రోజులపాటు నాతో మాట్లాడిన తర్వాత కేఎస్ఎం చివరికి నాతో మాట్లాడనని చెప్పేశాడు" అని ఫ్రాంక్ తెలిపారు.
9/11 దోషులకు న్యాయం అందించాలనే ప్రయత్నాలు వరుసగా విఫలమవుతూ వచ్చాయి.
న్యూయార్క్‌లో అతడి కేసును విచారించాలనే ప్రయత్నాలకు ప్రతిపక్షాలు, సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
"ఖాలిద్ మొహమ్మద్ ఈ నగరంలో ఉండడానికి వీల్లేదు, అతడిని గ్వాంటనామో బేలోనే ఉంచండి.. అని ప్రతి ఒక్కరూ అనేవారు" అని న్యూయార్క్‌లోనే ఉండే ఫ్రాంక్ చెప్పారు.
ఆ తర్వాత గ్వాంటనామో బేలోని మిలిటరీ ట్రైబ్యునల్‌లో కేసు ప్రాథమిక విచారణ మొదలైంది.
కానీ ప్రక్రియలో సమస్యలు, కరోనా మహమ్మారి వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. కేఎస్ఎం కేసులో ఈ వారం తదుపరి విచారణ జరగాల్సి ఉంది. కానీ, తుది తీర్పు కోసం ఇంకా చాలా కాలం వేచిచూడాల్సి రావచ్చు.
"9/11 దాడులకు 20 ఏళ్లవుతున్న సందర్భంగా, మేం ఏదో చేస్తున్నామని మీడియాలో చూపించుకోడానికి, ఈ విచారణ టైమింగ్‌ను పక్కా ప్రణాళిక ప్రకారమే పెట్టారు" అని ఖాలిద్ షేక్ మొహమ్మద్ న్యాయవాది డేవిడ్ నెవిన్ అన్నారు.
"ఈ ప్రక్రియ మరో 20 ఏళ్లైనా ముగిసేలా కనిపించడం లేదు" అని ఆయన బీబీసీకి చెప్పారు.
క్రిమినల్ డిఫెన్స్ లాయర్ డేవిడ్ నివెన్ 2008 నుంచి ఈ కేసు చూస్తున్నారు.
"ఆ సమయంలోనే విచారణ మొదలయ్యేలా చూడాలని అనుకున్నాం. కానీ ఇప్పటికీ, ప్రారంభం కాలేదు" అని నివెన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సుదీర్ఘ, అత్యంత వివాదాస్పద నేర విచారణల్లో ఒకటి
ఈ కేసులో విచారణ కోసం కొత్తగా నియమితులైన జడ్జి ఈ కేసు విచారించిన తొమ్మిదో జడ్జి అవుతారు. ఈ కొత్త జడ్జికి ఈ కేసు విచారణకు సంబంధించిన 35 వేల పేజీల్లో ఏముందో తెలిసుండాలి" అంటారు నెవిన్.
అమెరికా చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన, అత్యంత వివాదాస్పద నేర విచారణల్లో ఇది ఒకటి అని ఆయన చెప్పారు.
ఈ కేసులో ఐదుగురు నిందితులను రహస్య స్థావరాల్లో ఉంచిన సీఐఏ, వారిని టార్చర్ పెట్టి వివరాలు రాబట్టడమే దీనికి ప్రధాన కారణం. అలా సేకరించిన ఆధారాలను నమ్మలేమని లాయర్లు వాదించారు.
అమెరికాలో నిందితులను టార్చర్ చేయడానికి పక్కా ఏర్పాట్లు ఉన్నాయి. దారుణమైన పద్ధతులతో నిందితుడి నుంచి వివరాలు రాబట్టారని అపీల్ కూడా చేయవచ్చు. విచారణను ఏళ్ల పాటు లాగవచ్చు.
9/11 దాడులకు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తిని కాపాడాలనుకోవడం మీకు ఎలా అనిపిస్తోంది అని బీబీసీ డెవిడ్ నివెన్‌ను ప్రశ్నించింది. కానీ ఆయన ఆ ప్రశ్నకు పెద్దగా ఏం చెప్పలేదు.
ఒక అమెరికా లాయర్ తమ తరఫున వాదించడాన్ని తన క్లయింట్లు మొదట్లో సందేహించారని, కానీ తమ మధ్య అదంతా చక్కబడడానికి కాస్త సమయం పట్టిందని ఆయన చెప్పారు.
ఖాలిద్ షేక్ మొహమ్మద్‌ను నేవీకి చెందిన ఒక రహస్య స్థావరంలో ఉంచినపుడు, ఆయన లాయర్లను ఒక వ్యాన్‌లో ఎక్కించి 45 నిమిషాల పాటు తిప్పి అక్కడకు తీసుకెళ్లారు. ఆ వ్యాన్ బయట ఏముందో చూడ్డం కూడా సాధ్యం కాదు.
అయితే, ఇప్పుడు కేఎస్ఎంను క్యాంప్ 5లో ఉంచారని, అదేమంత రహస్య ప్రదేశం కాదని డేవిడ్ చెప్పారు.
సాక్ష్యం ఇవ్వాల్సి రావడంతో, ఈ కేసు విచారణలో భాగంగా ఫ్రాంక్ రిటైర్మెంట్‌ను మూడేళ్లపాటు పొడిగించారు.
"నేను సర్వీసులో ఉన్నప్పుడే అది జరిగి ఉంటే ఎంతో బాగుండేది" అంటారు ఫ్రాంక్. ఆయన ఇటీవలే రిటైరై ఎఫ్‌బీఐ వీడారు.
ఇవి కూడా చదవండి:
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- ‘తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












