శ్రీదేవి తోడుగా జియా ఉల్ హక్ నియంతృత్వాన్ని దాటేశాం - అభిప్రాయం

శ్రీదేవి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వుసతుల్లా ఖాన్
    • హోదా, బీబీసీ కోసం

ఈరోజు ప్రముఖ సినీ నటి శ్రీదేవి జయంతి. 1963లో ఇదే రోజున ఆమె జన్మించారు. భారత్‌లోనే కాదు పాకిస్తాన్‌లో కూడా ఎంతోమందికి ఆమె అభిమాన నటి.

శ్రీదేవి జయంతి సందర్భంగా కరాచీకి చెందిన మాజీ జర్నలిస్ట్ వసతుల్లా ఖాన్ రాసిన బ్లాగ్ ఇది.

అది నేను కరాచీ యూనివర్సిటీలో చదువుతున్న కాలం. ఏడాది తరవాత నాకు యూనివర్సిటీ హాస్టల్లో రూమ్ దొరికింది.

ఆ రూమ్‌లోకి వెళ్లగానే నేను చేసిన మొదటి పనేంటంటే, బజారు కెళ్లి రెండు శ్రీదేవి పోస్టర్లు కొనుక్కొచ్చి గది గోడలపై అతికించడం.

అప్పట్లో భారత్ సినిమాలను వీసీఆర్‌లో చూడడం నేరంగా భావించేవారు. పట్టుబడితే వారికి మూడు నుంచి ఆరు నెలల జైలు శిక్ష పడేది.

కానీ మేం కుర్రాళ్లం ఆగుతామా.. అందరం కలిసి డబ్బులు వేసుకుని వీసీఆర్ అద్దెకు తెచ్చుకునేవాళ్లం. వరసగా ఆరు సినిమాలు చూసేసేవాళ్లం. అయితే, వాటిలో కనీసం ఒకటి రెండైనా శ్రీదేవి సినిమాలు ఉండాల్సిందే.

శ్రీదేవి

ఫొటో సోర్స్, SRIDEVI/INSTAGRAM

జనరల్ జియా కాలం

శ్రీదేవి నటించిన జస్టిస్ చౌదరి, జానీ దోస్త్, నయా కదమ్ నుంచి నగీనా, మిస్టర్ ఇండియా, చాందినీ వరకూ ఎన్నో సినిమాలను దొంగతనంగా చూసేశాం.

భారత సినిమాలు చూడడం చట్టవిరుద్ధమే అయినా శ్రీదేవి సినిమాలను మేం హాస్టల్ రూం తలుపులు కిటికీలు అన్నీ తెరిచేసి ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని, ఆ శబ్దాలు బయట ఏర్పాటు చేసిన పోలీస్ పోస్ట్ వరకూ వినిపించేలా చూసేవాళ్లం.

ఆ విధంగా జనరల్ జియా-ఉల్ హక్ నియంతృత్వంపై మేమంతా నిరసన వ్యక్తం చేసేవాళ్లం.

అప్పుడప్పుడూ పోలీసులు వచ్చి చూసి గుంభనంగా నవ్వుకునేవారు. "మీ భావాలను మేం అర్థం చేసుకోగలం. కానీ సౌండ్ కాస్త తక్కువ పెట్టుకోండి. ఎప్పుడైనా ఎవరైనా తలతిక్క ఆఫీసర్ వచ్చి, మా ఉద్యోగాలు పోతే అప్పుడు మీకు బాగుంటుందా చెప్పండి" అనేవాళ్లు.

శ్రీదేవి

ఫొటో సోర్స్, SADMA FILM POSTER

శ్రీదేవి సినిమా ఏదైనా చూపించవా

ఆ పోలీసుల ప్లేస్‌లో ప్రతి మూడు నెలలకూ కొత్త పోలీసులు వచ్చేవాళ్లు. కానీ ఒక పోలీస్ మాత్రం మాకు బాగా గుర్తుండిపోయారు. ఆయన పేరు జమీల్ అనుకుంటా.

ఆయన స్పెషల్ బ్రాంచ్ పోలీస్. అందుకే యూనిఫాం వేసుకునేవారు కాదు. హాస్టల్ పోస్ట్ దగ్గర ఆయన ఏడాదికి పైనే పనిచేశారు.

ఆయన తనకు ట్రాన్స్‌ఫర్ అయిందని మాకు చెప్పినపుడు మా ఐదారుగురు కుర్రాళ్లం కలిసి, "జమీల్ మేం ఈరోజు మీకు హాస్టల్ క్యాంటీన్లో మంచి విందు ఇస్తాం" అన్నాం.

ఆయన నాతో "విందు వద్దు గానీ, ఏదైనా శ్రీదేవి సినిమా చూపించండి చాలు" అన్నారు.

ఆ పోలీస్ జమీల్‌కు గౌరవంగా మేం ఆరోజు రాత్రి మేం 'జస్టిస్ చౌదరి' సినిమా తీసుకొచ్చి ఆయనకు చూపించాం.

శ్రీదేవి

ఫొటో సోర్స్, JUSTICE CHAUDHARY/MOVIE POSTER

90వ దశకంలో

ఆ రోజుల్లో ఆ శ్రీదేవే లేకుంటే పదేళ్ల పాటు కొనసాగిన జియా ఉల్ హక్ నియంతృత్వాన్ని మాలాంటి వారు ఎలా భరించి గలిగేవారా అని ఇప్పుడు నేను దశాబ్దాల తర్వాత ఆలోచిస్తున్నా.

నేను చూసిన శ్రీదేవి చివరి సినిమా 'చాందిని'. తర్వాత జీవితం నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోయింది.

బహుశా ఆ విషయం శ్రీదేవికి కూడా తెలిసినట్టుంది. అందుకే 90వ దశకం తర్వాత అస్తమించే సూర్యుడిలా మెల్లమెల్లగా ఆమె వెలుగు కూడా తగ్గిపోతూ వచ్చింది.

ఇంగ్లిష్-వింగ్లిష్ చాలా మంచి సినిమా అని నేను విన్నాను. తర్వాత వచ్చిన మామ్‌లో శ్రీదేవి అద్భుతంగా నటించారని కూడా తెలిసింది.

కానీ, అంతకు ముందే శ్రీదేవి అద్భుతాలు చేశారు. అందుకే ఆమె లేరని తెలిసినప్పుడు నాకు పెద్దగా బాధగా అనిపించలేదు.

నేను వాన్ గాంగ్ అనే ఒక ఆర్టిస్ట్ గురించి విన్నా. తన పెయింటింగ్స్‌లో ఏవైనా చాలా బాగా నచ్చితే, ఆయన వాటిని ముక్కలు ముక్కలుగా చింపేసేవారట.

శ్రీదేవి విషయంలో కూడా అదే జరిగిందని అనిపిస్తోంది. బహుశా ఆమె పెయింటింగ్ వేసిన ఎవరికో అది చాలా బాగా నచ్చేసుంటుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)