అఫ్గానిస్తాన్ యుద్ధం: షెబెర్గాన్ తమ వశమైందని ప్రకటించిన తాలిబన్లు

షెబెర్గాన్ తాలిబన్ల వశం

ఫొటో సోర్స్, EPA

ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని జాజాన్ ప్రావిన్స్ రాజధాని షెబర్గాన్‌ను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు చెప్పారు.

బీబీసీతో మాట్లాడిన అఫ్గాన్ రక్షణ శాఖ ప్రతినిధి మాత్రం ప్రభుత్వ దళాలు ఇంకా నగరంలో ఉన్నాయని, తాలిబన్లను త్వరలోనే తరిమికొడతామని చెప్పారు.

తాలిబన్లు శుక్రవారం నిమ్రోజ్ ప్రావిన్స్ రాజధాని జరంజ్‌ను ఆక్రమించారు. అఫ్గానిస్తాన్‌లో మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్న రెండో ప్రాంతీయ రాజధాని షెబెర్గాన్.

దేశవ్యాప్తంగా యుద్ధం తీవ్రమవుతుండడంతో ప్రభుత్వ భద్రతా దళాలకు దీనిని పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

ఉత్తరంగా కుందుజ్, దక్షిణంగా లష్కర్ గాహ్‌లో కూడా బీకర యుద్ధం జరుగుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి.

అఫ్గానిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తోమ్‌కు షెబెర్గాన్ కంచుకోట లాంటిది. ఇక్కడ ఆయన మద్దతుదారులు భద్రతా బలగాలతో కలిసి తాలిబన్లపై పోరాడుతున్నారు.

చొరబాటుదారులతో జరుగుతున్న పోరాటానికి ఆయన మద్దతుదారులు నాయకత్వం వహిస్తున్నారు

అఫ్గాన్ భద్రతా బలగాలకు సాయం చేసేందుకు మరో 150 మంది నగరానికి చేరుకున్నారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

మొదట ఇక్కడి ప్రాంతీయ గవర్నర్ కార్యాలయాన్ని తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే, భీకర ఘర్షణల అనంతరం మళ్లీ భద్రతా బలగాలు ఈ ప్రాంతంపై పట్టు సాధించాయి.

వైమానిక స్థావరాలు మినహా నగరంలోని అన్ని ప్రాంతాలపై తాలిబన్లు పట్టు సాధించారని సీనియర్ ప్రభుత్వ అధికారి బాబుర్ ఎస్చి బీబీసీతో చెప్పారు. వైమానిక స్థావరాల వద్ద ఇంకా ఘర్షణలు కొనసాగుతున్నాయని వివరించారు.

అధికారులంతా స్థానిక విమానాశ్రయానికి పరుగులు తీశారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో జవ్జాన్ డిప్యూటీ గవర్నర్ ఖాదెర్ మలియా తెలిపారు.

హెరాత్, కాందహార్, లష్కర్‌గాహ్ తదితర ప్రాంతీయ రాజధానుల్లోనూ ఘర్షణలు భీకరంగా జరుగుతున్నాయి.

పరిస్థితులు దిగజారుతుండటంతో వెంటనే వెనక్కి వచ్చేయాలని తమ దేశ పౌరులను అమెరికా, బ్రిటన్ అభ్యర్థించాయి.

నగరంలో ఎయిర్ పోర్ట్ సహా ఎక్కువ ప్రాంతం ఇంకా ప్రభుత్వ దళాల అధీనంలోనే ఉందని, తీవ్రవాదులను త్వరలో తరిమికొడతామని అఫ్గాన్ రక్షణ శాఖ ప్రతినిధి ఫవాద్ అమన్ బీబీసీతో చెప్పారు.

కానీ, తాలిబన్లు నగరంలో కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారని, పౌరులకు ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వ దళాలు వెనక్కు తగ్గినట్లు ఆయన అంగీకరించారు.

అమెరికా బీ-52 బాంబర్స్ తాలిబన్ల పొజిషన్లపై దాడులు చేసినట్లు కూడా అఫ్గాన్ రక్షణ శాఖ చెప్పింది.

అఫ్గానిస్తాన్ యుద్ధం

ఫొటో సోర్స్, EPA

జైలు స్వాధీనం, పారిపోయిన ఖైదీలు

మరోవైపు, షెబెర్గాన్‌లోని ఒక జైలును తమ అధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్ అధికారులు చెప్పారు.

తాలిబన్ల దాడి అనంతరం, షెబెర్గాన్‌లోని జైలు నుంచి వందలాది ఖైదీలు పారిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాలిబన్లు చొచ్చుకొస్తుండడంతో పశ్చిమాన హీరత్ సహా దక్షిణాన కాందహార్, లష్కర్ గాహ్ లాంటి మిగతా ప్రావిన్సుల రాజధానుల్లో కూడా ఒత్తిడి పెరుగుతోంది.

లష్కర్ గాహ్‌లో తాలిబన్ల సీనియర్ కమాండర్లతోపాటూ పదుల సంఖ్యలో ఇస్లామిస్ట్ ఫైటర్స్‌ను చంపినట్లు అఫ్గాన్ సైన్యం చెబుతోంది. కానీ, తాలిబన్లు వారి వాదనను కొట్టిపారేశారు.

అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ మాజీ ప్రతినిధిని తాలిబన్లు కాల్చి చంపారు. తాత్కాలిక రక్షణ మంత్రి నివాసంపై బాంబు దాడి చేశారు.

పాకిస్తాన్‌తో సరిహద్దులను కూడా తాలిబన్లు మూసివేశారు. దీంతో పాకిస్తాన్ వైపు చిక్కుకుపోయిన చాలామంది అఫ్గానిస్తాన్ ప్రజలు తిరిగి తమ కుటుంబాలను చేరుకోలేకపోతున్నారు.

"మూడో రోజుల క్రితం అంత్యక్రియల కోసం పాకిస్తాన్ వచ్చాం. ఇప్పుడు సరిహద్దు మూసేశారు. మేం ఇక్కడే ఉండిపోయాం. మా దగ్గర తిండి, డబ్బు కూడా లేదు" అని కాందహార్‌లోని ఇంటికి చేరాలని తపిస్తున్న ఒక వ్యక్తి రాయిటర్స్‌కు చెప్పాడు.

దేశంలో భద్రతా పరిస్థితులు అంతకంతకూ ఘోరంగా మారుతుండడంతో తక్షణం అఫ్గానిస్తాన్‌ను వదిలి స్వదేశానికి రావాలని బ్రిటన్ తమ పౌరులను కోరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)