కోవిడ్ వ్యాక్సినేషన్: రెండు రకాల టీకాలు వేసుకున్నవారిలో 'మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్' పెరిగాయి: ఆస్ట్రాజెనెకా అధ్యయనం

రెండు టీకాలు వేసుకుంటే స్వల్ప దుష్ప్రభావాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జిమ్ రీడ్
    • హోదా, బీబీసీ హెల్త్ రిపోర్టర్

కోవిడ్‌ టీకా రెండు డోసులుగా ఆస్ట్రాజెనెకా, పైజర్ వ్యాక్సీన్లను కలిపి వేసుకున్న పెద్దవారిలో స్వల్ప, ఒక మోస్తరు సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లు ఒక అధ్యయనంలో తేలిందని నివేదికలు చెబుతున్నాయి.

రెండు రకాల టీకాలను కలిపి వేసుకున్న వారిలో ఎక్కువమంది తమకు చలి, తలనొప్పి, కండరాల నొప్పులు లాంటివి ఉన్నట్లు చెప్పారు.

కానీ, ఆ దుష్ప్రభావాలు కాసేపే ఉన్నాయి. వారికి మిగతా తీవ్ర సమస్యలు ఏవీ రాలేదు

"ఈ విషయం గుర్తించడం నిజంగా చిత్రంగా ఉంది. ఇలాంటి దాన్ని మేం కచ్చితంగా ఊహించలేదు" అని ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ గ్రూప్‌ ప్రొఫెసర్ మాథ్యూ స్నేప్ చెప్పారు.

మొదటి డోసుగా ఒక టీకా, రెండో డోసుగా వేరే రకం టీకా వేసుకుంటే, దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి ఏర్పడుతుందా, కొత్త వేరియంట్లకు వ్యతిరేకంగా అవి మరింత రక్షణను అందిస్తాయా అనేది గుర్తించడానికి ఫిబ్రవరిలో ది కామ్-కోవ్ అధ్యయనం ప్రారంభించారు.

ఒకవేళ, టీకా డోసుల సరఫరాలో అంతరాయం ఏర్పడినా, వాటి బదులు వేరే డోసు మార్చి వేయడానికి ఆస్పత్రులకు అనుమతులు ఇవ్వచ్చా అనేది పరిశీలించారు.

భవిష్యత్తులో రెండు డోసులకు రెండు రకాల వ్యాక్సీన్లు కలిపి వేయాలని అనుకుంటున్నట్లు కెనెడాలోని ఆంటారియో, క్యూబెక్ ప్రావిన్సులు చెప్పాయి.

ఆస్ట్రాజెనెకా టీకాల ఎగుమతుల్లో అనిశ్చితి ఉండడం, ఆ టీకా వేసుకుంటే రక్తం గడ్డకడుతుందనే ఆందోళనలు వ్యక్తం కావడంతో రెండు రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో 50 ఏళ్లు దాటిన 830 మంది వలంటీర్లపై ప్రయోగాలు చేశారు.

ఈ అధ్యయనం మొదటి పూర్తి ఫలితాలు జూన్‌లో ప్రచురిస్తారని భావిస్తున్నారు. కానీ, దీని ప్రాథమిక డేటాను ఇప్పుడు మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో ప్రచురించారు.

జ్వరం లక్షణాలు

నాలుగు వారాల వ్యవధిలో రెండు ఆస్ట్రాజెనెకా టీకాలు వేసినపుడు, 10 మంది వలంటీర్లలో ఒకరు(10 శాతం) తమకు జ్వరం వచ్చినట్లు ఉందన్నారు.

తలనొప్పి

కానీ, ఆస్ట్రాజెనెకా, పైజర్ టీకాలను ముందూ వెనుకా ఎలా వేసుకున్నా ఈ నిష్పత్తి దాదాపు 34 శాతానికి పెరిగింది. అంటే వంద మంది వలంటీర్లలో 34 మంది తమకు జ్వరం ఉందని చెప్పారు.

"చలి, అలసట, తలనొప్పి, ఆయాసం, కండరాల నొప్పులు లాంటి మిగతా లక్షణాల్లో కూడా ఇలాంటి తేడాలే కనిపిచాయి" ఈ ట్రయల్స్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ స్నేప్ చెప్పారు.

అంటే ఒకే రకం టీకాలు వేసుకున్న వారిలో తక్కువమందికి ఈ లక్షణాలు ఉండగా, వేరు వేరు రకం టీకాలు వేసుకున్నవారిలో ఎక్కువమందిలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి.

అలసట

"అది మాకు ఒక విషయాన్ని చెప్పింది. మనం ఒకేసారి పూర్తిగా నర్సులు నిండిన ఒక వార్డులో వేరు వేరు వాక్సీన్లు వేసుకోవాలని అనుకోకూడదు. ఎందుకంటే, టీకా వేసుకున్న వారిలో ఎక్కువమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి, తర్వాత రోజు ఆ నర్సుల్లో ఎక్కువ మంది అక్కడకు రాకపోవచ్చు" అన్నారు.

ఏప్రిల్‌లో ఈ అధ్యనాన్ని విస్తృతం చేశారు. ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌లతోపాటూ మరో 1,050 మంది వలంటీర్లకు మోడెర్నా, నోవావాక్స్ టీకాలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)