కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు... ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకే రోజు 34 వేల మందికి వైరస్

భారత్‌లోని కోటిన్నర కేసుల్లో నాలుగోవంతు మహారాష్ట్రలోనే ఉన్నాయి

ఫొటో సోర్స్, European Pressphoto Agency

ఫొటో క్యాప్షన్, భారత్‌లోని కోటిన్నర కేసుల్లో నాలుగోవంతు మహారాష్ట్రలోనే ఉన్నాయి

గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 3,14,835 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా నమోదైన అత్యధిక రోజువారీ కేసుల సంఖ్య ఇదే.

దేశంలో మృతుల సంఖ్య కూడా గత 24 గంటల్లో మున్నెన్నడూ లేనంతగా పెరిగింది. గత 24 గంటల్లో దేశంలో 2,104 కోవిడ్ మరణాలు సంభవించాయి.

దీంతో ఇప్పటివరకూ సుమారు 1.6 కోట్ల కోవిడ్ కేసులు నమోదైనట్టు లెక్క.

కరోనా సంక్రమిత కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారతదేశం రెండో స్థానానికి చేరుకుంది.

ఇక, ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో యూపీలో 34,379 కొత్త కేసులు నమోదయ్యాయి. 195 మంది చనిపోయారు. దాంతో, రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్య 10,541కి చేరింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

దేశంలో ఓ పక్క కోవిడ్ కేసులు నిరవధికంగా పెరుగుతూ ఉంటే, మరో పక్క ఆక్సిజన్ కొరత ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది.

దేశ రాజధాని దిల్లీలో తీవ్ర ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో కోవిడ్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించింది.

"ఇది చాలా దారుణం. భారతదేశం అంతటా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి కేంద్రం ఏమి చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాం" అని జడ్జ్ అన్నారు.

ఆరు ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు ఆక్సిజన్ కొరతకు సంబంధించి కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జ్ పై వ్యాఖ్యలు చేశారు.

దేశంలోని కర్మాగారాల నుంచి అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్

సమయానికి ఆక్సిజన్ అందక దేశవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే, ఆక్సిజన్ కొరత వలన ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తెలుసుకోవడం సాధ్యం కాదు.

ఆక్సిజన్ కావాలంటూ వస్తున్న అభ్యర్థనలతో సోషల్ మీడియా నిండిపోయింది.

దేశంలో పెద్ద పెద్ద నగరాల్లోని ఆస్పత్రులన్నీ కూడా రోగులతో నిండిపోయాయి.

పడకలు దొరకక ఆస్పత్రి వెలుపలే జనం పడిగాపులు కాస్తున్నారు.

కరోనా కేసులు

అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన మహరాష్ట్రలో గురువారం సాయంత్రం నుంచి కోవిడ్ నిబంధనలను కఠినతరం చేశారు.

ఇప్పటికే ఏప్రిల్ 14 నుంచి మహారాష్ట్రలో పాక్షిక లాక్‌డౌన్ అమలులో ఉండగా ప్రస్తుతం అదనపు ఆంక్షలను ప్రకటించారు.

మహమ్మారి ప్రారంభం నుంచి కూడా మహారాష్ట్ర కోవిడ్ హాట్‌స్పాట్‌గానే ఉంది. దేశంలో నాలుగొంతుల కోవిడ్ కేసులు అక్కడినుంచే నమోదవుతున్నాయి.

దేశవ్యాప్తంగా 1,80,000 కోవిడ్ మరణాలు నమోదు కాగా, మహారాష్ట్రలో 67,468 మరణాలు నమోదయ్యాయి.

అయితే దేశంలో మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగానే ఉంది.

దిల్లీ

ఫొటో సోర్స్, Hindustan times

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని ఆస్పత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి, ఆక్సిజన్ కొరత కూడా పెరుగుతోంది.

ఇంతలా కరోనా సంక్రమణలు పెరిగిపోవడానికి కారణమేంటి?

గత నెల రోజులుగా ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది.

కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, హరిద్వార్‌లో వేలాదిమంది కుంభమేళాలో పాల్గొనడం, భారతదేశంలో కనిపిస్తున్న కొత్త వేరియంట్.. కేసుల పెరుగుదలకు కారణాలుగా చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు.

దేశంలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారింది.

మహారాష్ట్రలో 61 శాతం శాంపిల్స్‌లో ఇండియన్ వేరియంట్ కనిపించిందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తెలిపింది.

ఇవే కాకుండా, కొన్ని రాష్ట్రాల్లో భారీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించడం వైరస్ వ్యాప్తికి దోహదమైంది.

కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారాలు ఆపలేదు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా అక్కడ ప్రచారయాత్ర చేశారు.

దేశంలో నెమ్మదిగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కూడా కోవిడ్ వ్యాప్తికి ఒక కారణమని విమర్శకులు అంటున్నారు.

ఇప్పటివరకు ఇండియాలో 130 మిలియన్ వ్యాక్సీన్ డోసులను ఇచ్చారు.

ఫైజర్ వ్యాక్సీన్‌ను ఇండియాలో పంపిణీ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆ సంస్థ గురువారం ప్రకటించింది.

మే 1 నుంచి 18 ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సీన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

కాగా, ఇప్పటికే వ్యాక్సీన్ కొరత ఉండడంతో, రెండో దశ వ్యాక్సినేషన్ ఎంతవరకు సఫలమవుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)