జపాన్‌లో మహిళల ఆత్మహత్యలు ఎందుకు విపరీతంగా పెరుగుతున్నాయి?

మహిళలు
    • రచయిత, రూపర్ట్ వింగ్ ఫీల్డ్ హేస్
    • హోదా, బీబీసీ న్యూస్ టోక్యో

జపాన్‌లో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య 2020లో విపరీతంగా పెరిగిపోయింది. గత 11 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. అయితే, ఆత్మహత్యలు చేసుకునే వారిలో పురుషుల సంఖ్య తగ్గిపోగా, మహిళల సంఖ్య 15 శాతం పెరిగింది.

గత అక్టోబర్ నెలలో నమోదైన మహిళల ఆత్మహత్యలు 2019 అక్టోబర్ నెలతో నమోదైనవాటితో పోల్చితే 70 శాతం ఎక్కువ.

అసలు ఏం జరుగుతోంది? కోవిడ్ సంక్షోభం పురుషుల కన్నా మహిళలపై ఎక్కువ ప్రభావం చూపిస్తోందా?

హెచ్చరిక: ఈ కథనంలోని వివరాలు పాఠకులను కలచివేసే విధంగా ఉండవచ్చు.

పదే పదే తనను తాను హతమార్చుకోవాలని ప్రయత్నించిన వ్యక్తిని నేరుగా కలవడం కాస్త కష్టమైన అనుభవమే. ఇలా కలవడం ఆత్మహత్యలను అదుపు చేసేందుకు పని చేసే వారి గురించి నాకొక కొత్త అభిప్రాయాన్ని కలుగచేసింది.

నేను యోకోహమాలోని రెడ్ లైట్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఒక వాక్ ఇన్ సెంటర్లో కూర్చున్నాను. ఈ కేంద్రాన్ని ఆత్మహత్యలను నివారించడానికి పని చేస్తున్న బాండ్ ప్రాజెక్ట్ అనే ఒక స్వచ్చంద సంస్థ నిర్వహిస్తోంది.

జూన్ తాచిబాన
ఫొటో క్యాప్షన్, జూన్ తాచిబాన

నాతో పాటు టేబుల్‌కి ఎదురుగా పొట్టి జుట్టుతో ఉన్న ఒక 19 ఏళ్ల అమ్మాయి కదలకుండా కూర్చున్నారు.

ఆమె ముఖంలో ఎటువంటి భావాలు లేకుండా ఆమె కథను చెప్పడం ప్రారంభించారు. ఆమెకు 15 సంవత్సరాలు ఉండగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన మొదలయినట్లు ఆమె చెప్పారు. సొంత అన్న తనను చాలా హింసించేవాడని ఆమె వివరించారు.

వేధింపులు భరించలేక ఇంటి నుంచి పారిపోయారు.

కానీ, ఆమెకు ఒంటరితనం, బాధ దూరం కాలేదు. ఆ పరిస్థితుల్లో ప్రాణం తీసుకోవడం ఒక్కటే ఆమెకు మార్గంగా కనిపించింది.

"గత సంవత్సరం ఈ పాటికి నేను హాస్పిటల్‌కు చాలా సార్లు వెళ్లొచ్చాను. చాలా సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. కానీ, నా ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆఖరికి ఇక చావు ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నాను" అని చెప్పారు.

అయితే, ఆమె ఈ ప్రయత్నాన్ని విరమించుకోవడానికి బాండ్ ప్రాజెక్ట్ చేసిన సహాయం కారణం. ఆమెకు ఉండటానికి వారొక సురక్షితమైన ప్రదేశాన్ని ఇచ్చారు. దానితో పాటు ఆమెకు బాగా కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు.

జూన్ తాచిబాన ఈ బాండ్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు. ఆమె వయసు 40ల్లో ఉంటుంది.

ఆశావాదంతో, దృఢమైన వ్యక్తిత్వంతో ఉన్నట్లు ఆమె కనిపిస్తారు.

"అమ్మాయిలు కష్టంలో కానీ, బాధలో కానీ ఉన్నప్పుడు వారికేం చేయాలో తెలియదు. మేం వారు చెప్పేది విని, వారితో మాట్లాడతాం. మేం మీతో ఉన్నాం అనే ధైర్యాన్ని కల్పిస్తాం" అని జూన్ తాచిబాన చెప్పారు.

ఇప్పటికే ప్రమాదకర స్థితిలో ఉన్న వారిని ఈ కోవిడ్ మహమ్మారి మరింత పాతాళంలోకి నెట్టేస్తోందని ఆమె అంటున్నారు.

ఇటీవల కాలంలో తమ సిబ్బందికి వచ్చిన భయానకమైన ఫోన్ కాల్స్ గురించి ఆమె వివరించారు.

"నాకు చనిపోవాలని ఉంది. నాకంటూ వెళ్లడానికి ఏ చోటూ లేదు. చాలా బాధగా ఉంది. ఒంటరిగా అనిపిస్తోంది. మాయమైపోవాలని ఉంది" లాంటి మాటలతో కాల్స్ వస్తుంటాయని చెప్పారు.

శారీరక, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితి కోవిడ్ సంక్షోభ సమయంలో మరింత దారుణంగా తయారైందని ఆమె అన్నారు.

‘‘తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఓ అమ్మాయి... కోవిడ్ సంక్షోభం కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేక యాతన అనుభవించారు" అని ఆమె చెప్పారు.

మిషికొ యుఎడా
ఫొటో క్యాప్షన్, మిషికొ యుఎడా

అసాధారణ రీతిలో ఆత్మహత్యలు

జపాన్‌లో గతంలో తలెత్తిన 2008 బ్యాంకింగ్ సంక్షోభం, జపాన్ స్టాక్ మార్కెట్ పతనమైనప్పటి పరిస్థితులు, 1990ల్లో తలెత్తిన ప్రాపర్టీ బబుల్ లాంటి సంక్షోభ సమయాలను పరిశీలిస్తే వాటి ప్రభావం ముఖ్యంగా నడి వయసు పురుషులపై పడింది. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకునే పురుషుల సంఖ్య పెరిగింది.

కానీ, కోవిడ్ సమయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇది యువతపైన, ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలపైనా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. వీటికి కారణాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి.

అభివృద్ధి చెందిన దేశాల్లోకెల్లా జపాన్‌లోనే ఒకప్పుడు ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. గత దశాబ్దంలో ఈ ఆత్మహత్యల రేటును తగ్గించడంలో జపాన్ విజయవంతం అయింది.

అయితే, ఇది మళ్లీ తిరగబెట్టడం చాలా దిగ్భ్రాంతిని కలుగచేస్తోందని జపాన్‌కు చెందిన ఆత్మహత్యల నివారణ నిపుణులు ప్రొఫెసర్ మిషికొ యుఎడా అన్నారు.

"ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్న మహిళల సంఖ్య పెరగడం నా కెరీర్‌లోనే నేను ఎప్పుడూ చూడలేదు. ఈ కరోనా వైరస్ వలన మూతపడిన పరిశ్రమల్లో చాలా వరకూ మహిళలు పని చేస్తున్నవే ఉన్నాయి. ముఖ్యంగా, పర్యటకం, రిటైల్ రంగం, ఆహార పరిశ్రమల్లో మహిళలు ఎక్కువగా పని చేస్తారు’’ అని ఆమె చెప్పారు.

‘‘జపాన్‌లో ఒంటరిగా నివసించే మహిళల సంఖ్య కూడా పెరిగింది. వివాహం చేసుకుంటే నిర్వహించాల్సిన పాత్ర కంటే ఒంటరిగా ఉండటం మేలని చాలా మంది అనుకుంటున్నారు. అలాగే, చాలా మంది యుక్త వయసు మహిళలకు స్థిరమైన ఉద్యోగాలు ఉండవు. అందుకే, ఇలాంటి సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు అది వారి పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గత 8 నెలల్లో తాత్కాలిక ఉద్యోగాలలో ఉన్నవారిలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు" అని ఆమె చెప్పారు.

వార్తా పత్రికలలో వచ్చిన పతాక శీర్షికలు ఒక హెచ్చరికను జారీ చేశాయి. జపాన్‌లో అక్టోబరు నెలలో కరోనావైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 2,087గా ఉంటే ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య 2,199గా ఉంది.

ఏదో తెలియని పరిణామం అయితే జరుగుతోంది.

యూకో టకూచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూకో టకూచ్

గత సంవత్సరం ఒక ప్రముఖ నటి యూకో టకూచ్ ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

‘‘ఒక సెలెబ్రిటీ ఆత్మహత్యను పత్రికలూ ప్రచురించినప్పటి నుంచీ, ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగి, అదే తీరు ఒక 10 రోజుల పాటు కొనసాగుతోంది" అని మాజీ జర్నలిస్టు యసుయుకి చెప్పారు.

ప్రస్తుతం ఆయన జపాన్‌లో ఆత్మహత్యల సమస్యను నివారించడానికి ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.

"సెప్టెంబరు 27న చోటు చేసుకున్నసెలెబ్రిటీ ఆత్మహత్య తర్వాత 10 రోజుల్లో మరో 207 మంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించాం" అని యసుయుకి చెప్పారు.

యూకో టకూచ్‌కు దగ్గరి వయసులో ఉన్న మహిళల ఆత్మహత్యల డేటాను పరిశీలిస్తే గణాంకాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అన్ని వయసుల వారి కంటే 40ల్లో ఉన్న మహిళలు ఎక్కువగా ప్రభావితులవుతున్నట్లు షిమిజు చెప్పారు. ఈ వయసు వారిలో ఆత్మహత్యల రేటు రెండింతలకు పైగా పెరిగిందని వివరించారు.

ప్రముఖుల ఆత్మహత్యలకు, సాధారణ ప్రజల ఆత్మహత్యలు పెరగడానికి మధ్య చాలా దృఢమైన సంబంధం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రముఖుల ఆత్మహత్యల ప్రభావం తీరు ఒక్క జపాన్ దేశానికే ప్రత్యేకం కాదు.

ప్రముఖుల ఆత్మహత్యల గురించి మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా చర్చించడం వలన అది బలహీను మనస్కులపై ప్రభావాన్ని చూపిస్తుందని మయి సుగనుమ అన్నారు.

మయి టీనేజ్లో ఉన్నప్పుడు ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె కూడా ఇదివరకు ఆత్మహత్యకు ప్రయత్నించారు. కానీ, ఇప్పుడు ఒక స్వచ్చంద సంస్థలో అధ్యయనకర్తగా పని చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలకు సహాయం అందిస్తున్నారు.

‘‘నా తండ్రిని కాపాడుకోలేకపోయినందుకు నన్ను నేను చాలా సార్లు నిందించుకున్నాను’’ అని మయి అన్నారు.

జపాన్‌లో ప్రస్తుతం మూడో విడత కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం రెండో దశ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇది ఫిబ్రవరి అంతా కొనసాగవచ్చు. చాలా రెస్టారెంట్లు, బార్లు మూసేస్తున్నారు. చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు.

కోవిడ్ మరణాలు, లాక్‌డౌన్‌లు తక్కువగా ఉన్న జపాన్ లాంటి దేశంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న దేశాల్లో పరిస్థితి ఏమిటోనని ప్రొఫెసర్ ఉయెడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)