రక్తపు వరద: ఇండోనేసియా గ్రామాన్ని ముంచెత్తిన రక్తం రంగు నీరు.. కారణమేంటంటే

రక్తం రంగులోని వరద నీరు

ఫొటో సోర్స్, Reuters

ఇండోనేసియాలో ఒక గ్రామాన్ని రక్తం రంగులోని వరదనీరు ముంచెత్తింది. తొలుత స్థానిక బాతిక్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలోకి చేరిన వరద నీరు ఎరుపు రంగులోకి మారిపోయి గ్రామంలోకి పోటెత్తింది.

ఫ్యాక్టరీలో దుస్తులకు రంగులు వేయటానికి ఉపయోగించే రక్తవర్ణ (క్రిమ్సన్ డై) వరద నీటిలో కలవడంతో.. సెంట్రల్ జావాలోని జెన్‌గాట్ గ్రామం వీధులన్నీ ఎర్రటి నీటితో నిండిపోయాయి.

సంప్రదాయ మైనం, అద్దకం బాతిక్ టైక్స్‌టైల్స్‌కు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.

గ్రామం అంతటా పొంగిపారుతున్న రక్తవర్ణ నీటిలో మునిగిపోయిన రహదారులు, ఇళ్ల చిత్రాలను సోషల్ మీడియాలో వేలాది మంది షేర్ చేశారు.

ఈ చిత్రాలు నిజమైనవేనని స్థానికంగా సహాయ చర్యల్లో పాల్గొంటున్న అధికారి ఒకరు నిర్ధారించారు.

రక్తం రంగులోని వరద నీరు

ఫొటో సోర్స్, Reuters

‘‘బాతిక్ డై కారణంగా ఎరుపు వరద ఎరుపు రంగులోకి మారింది. కొంత కాలం తర్వాత వర్షపు నీటితో కలిసినపుడు ఈ రంగు వెలసిపోతుంది’’ అని డిమాస్ ఆర్గా యుధా అనే సదరు అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు వివరించారు.

పెకాలోన్‌గాన్ ప్రాంతంలోని నదులు గతంలోనూ బాతిక్ డిజైన్లకు ఉపయోగించే డై వల్ల రంగులు మారాయని, గత నెలలో మరో గ్రామాన్ని ముదురు ఆకుపచ్చ రంగు వరద నీరు ముంచెత్తిందని రాయిటర్స్ తెలిపింది.

రక్తం రంగులోని వరద నీరు

ఫొటో సోర్స్, AFP

ఇండోనేసియాలో తరచుగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో రాజధాని నగరం జకార్తాలో తుపాను వల్ల 43 మంది చనిపోయారు.

2013 నుంచి ఈ ప్రాంతంలో భారీ వరదలు వస్తుండటంతో.. వర్షాలను తగ్గించడానికి స్థానిక అధికారులు క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను కూడా ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)