జపాన్‌లోని ప్రముఖ సుమో క్రీడాకారుడు హకుహోకు కరోనా వైరస్ Newsreel

హకుహో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హకుహో వచ్చే వారం ఒక పోటీలో పాల్గొనాల్సి ఉంది

జపాన్‌లో ప్రముఖ సుమో క్రీడాకారుడు హకుహోకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయింది. హకుహో మంగోలియాలో జన్మించారు.

ఆయన వాసన కోల్పోవడంతో కోవిడ్ పరీక్ష చేయించుకున్నట్లు జపాన్ సుమో అసోసియేషన్ (జెఎస్ఎ) తెలిపింది. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో టోక్యో చుట్టు పక్కల అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని జపాన్ భావిస్తోంది.

ఇప్పటి వరకు ఇక్కడ తేలికపాటి నిబంధనలు మాత్రమే విధించి మహమ్మారిని అదుపులో ఉంచగలిగింది. జపాన్‌లో మహమ్మారి సమయంలో కూడా సుమో రెజ్లింగ్ లాంటి క్రీడా కార్యక్రమాలు కొనసాగాయి. అయితే, ఈ రంగంలో కూడా కొన్ని కేసులు వచ్చాయి. మే నెలలో 28 ఏళ్ల సుమో రెజ్లర్ కోవిడ్ బారిన పడి మరణించారు.

హకుహో జపాన్‌లో ప్రముఖ రెజ్లర్. ఆయన ఆదివారం ప్రారంభం కానున్న గ్రాండ్ సుమో టోర్నమెంట్‌లో ఆడేందుకు సన్నద్ధం అవుతుండగా వైరస్ బారిన పడ్డారు. ఆయన వైద్య నిపుణుల సలహా తీసుకుంటారు. ఆయన స్టేబుల్ లో ఉన్న ఇతర క్రీడాకారులకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జెఎస్ఎ తెలిపింది.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, Andrew Parsons / No10 Downing Street

పరిస్థితులు తీవ్రంగా ఉండబోతున్నాయన్న బ్రిటన్ ప్రధాని... మళ్లీ లాక్‌డౌన్

బ్రిటన్‌లో కొత్త వేరియంట్ కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి రెండో వారం వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

కొత్త కేసులు, రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. రానున్న రెండు మూడు వారాలు పరిస్థితులు తీవ్రంగా ఉండబోతున్నాయని ఆయన హెచ్చరించారు. మనం పోరాటం చివరి దశలోకి అడుగుపెడుతున్నట్లు భావిస్తున్నామని చెప్పారు.

‘‘కరోనావైరస్ కేసులు పతాక స్థాయికి చేరుతున్నట్లు అనిపిస్తోంది. ముందెన్నడూ లేనంత స్థాయిలో ఆసుపత్రులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

వచ్చే నెల రెండో వారం పూర్తయ్యేలోగా తొలి నాలుగు ప్రాధాన్య వర్గాలకు వ్యాక్సీన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వైద్య సిబ్బంది, 70 ఏళ్లకు పైబడిన వృద్ధులు, సామాజిక సేవల సిబ్బంది, తీవ్రమైన అనారోగ్యాలు ఉండేవారిని తొలి నాలుగు ప్రాధాన్య వర్గాలుగా ఆయన పేర్కొన్నారు.

మరోవైపు అందరూ ఇంటికే పరిమితం కావాలని స్కాట్లాండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జనవరి 18 వరకు స్కూళ్లు, కాలేజీలను మూసే ఉంచాలని వేల్స్ కూడా ఆదేశించింది. ఉత్తర ఐర్లాండ్ కూడా ఈ- లెర్నింగ్‌ను మరింత కాలం పొడిగిస్తున్నట్లు పేర్కొంది.

వరుసగా ఏడో రోజు సోమవారం కూడా బ్రిటన్‌లో 50,000కుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)