పాకిస్తాన్‌లో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి అనుమతి

పూజ

ఫొటో సోర్స్, SHIRAZ HASSAN

    • రచయిత, రియాజ్ సొహైల్
    • హోదా, బీబీసీ ఉర్దూ

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తొలిసారిగా శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణానికి అనుమతి లభించింది.

హిందూ సమాజం అభ్యర్థన మేరకు నగరంలో కృష్ణ మందిరానికి గోడలు నిర్మించేందుకు, హిందూ స్మశానవాటిక నిర్మాణానికి క్యాపిటల్ డెవలప్‌మెంట్ అధారిటీ (సీడీఏ) అనుమతి ఇచ్చింది.

పాకిస్తాన్ పాలక ప్రభుత్వం తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీలో ఉన్న మైనారిటీ సభ్యులు సీడీఏ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇస్లామాబాద్‌లోని సెక్టార్ హెచ్-9-2లో ఆలయ నిర్మాణం జరుగుతుంది.

అయితే, ఆలయం, కమ్యూనిటీ హాల్, శ్మశానవాటిక నిర్మించడానికి కొన్ని షరతులతో కూడిన అనుమతినిచ్చినట్లు హిందూ పంచాయితీ అధ్యక్షుడికి సీడీఏ లేఖ రాసింది.

ఈ లేఖ ప్రకారం...మందిరానికి నిర్మించే గోడలు ఏడు అడుగుల ఎత్తు మించరాదు. కాంక్రీట్ గోడలు కట్టుకోవచ్చు లేదా ఒక అడుగు ఎత్తు ఉన్న రాతి కంచె వేసుకోవచ్చు.

మందిర నిర్మాణం ప్రారంభమయ్యింది
ఫొటో క్యాప్షన్, మందిర నిర్మాణం ప్రారంభమయ్యింది

గతంలో శ్రీకృష్ణ ఆలయంపై నిషేధం

2017లో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ ఆలయ నిర్మాణం కోసం ఇస్లామాబాద్‌లోని చార్ మార్లాలో భూమిని మంజూరు చేసింది.

ఇక్కడ కృష్ణ ఆలయాన్ని నిర్మించాలని హిందూ సమాజం నిర్ణయించింది.

అయితే, ప్రారంభంనుంచే కొన్ని ధార్మిక సంస్థలు హిందూ ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించాయి.

లాహోర్‌లోని జామియా అష్రాఫియా మదరసాకు చెందిన ముఫ్తీ మహమ్మద్ జకారియా ఈ ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఫత్వా జారీ చేసింది.

ఇస్లాం ప్రకారం, మైనారిటీ ప్రార్థనా స్థలాలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించవచ్చుగానీ, కొత్త ప్రార్థనా మందిరాలు నిర్మించడానికి అనుమతి ఇవ్వరాదని ఈ ఫత్వాలో పేర్కొన్నారు.

ఈ మందిర నిర్మాణం ఇస్లామాబాద్ మాస్టర్ ప్లాన్‌లో లేదని, ఆలయ నిర్మాణ ప్రయత్నాలు నిలిపివేయాలంటూ ఇస్లామాబాద్ హై కోర్టులో మూడు పిటీషన్లు దాఖలు చేశారు. అయితే హై కోర్టు ఈ పిటీషన్లను కొట్టివేసింది.

ఇస్లామిక్ సైద్ధాంతిక మండలి సూచనలుఈ అంశంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామిక్ సైద్ధాంతిక మండలి (కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ) సహాయం కోరింది.

హిందూ సమాజానికి తమ ఆచార వ్యవహారాలను పాటించే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని పేర్కొంటూ ఈ కౌన్సిల్ లిఖిత పూర్వక అంగీకారాన్ని తెలిపింది.

తమ మత సంప్రదాయాలను అనుసరించి వివాహాలు జరిపించడమే కాకుండా, అంత్యక్రియలు జరిపించడానికి, ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి సరైన స్థలాన్ని కేటాయించేందుకు రాజ్యాంగం అనుమతి ఇస్తుందని ఈ కౌన్సిల్ స్పష్టం చేసింది.

మైనారిటీలకోసం కేటాయించిన నిధులను ఆలయ నిర్మాణానికి ఉపయోగించవచ్చని కౌన్సిల్ స్పష్టం చేసినట్లు పీటీఐ సభ్యుడు లాల్ చంద్ మల్హీ తెలిపారు.

ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించే బాధ్యతను లాల్ చంద్ మల్హీకి అప్పగించారు.

సైద్‌పూర్‌లోని మందిరం
ఫొటో క్యాప్షన్, సైద్‌పూర్‌లోని మందిరం

పాకిస్తాన్‌లో ఉన్న పురాతన హిందూ దేవాలయాలు

ఇస్లామాబాద్ సమీపంలోని రావల్పిండి నగరంలోనూ, కటాస్ రాజ్, తక్షశిలలోని పురావస్తు ప్రదేశాల్లోనూ ప్రముఖ హిందూ దేవాలయాలున్నాయి.

పాకిస్తాన్‌లో సుమారు 80 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. దక్షిణ సింధు ప్రావిన్స్‌లోని ఉమర్‌కోట్, మీర్పూర్ ఖాస్, తార్పార్కర్‌లో పెద్ద సంఖ్యలో హిందూ జానాభా నివసిస్తున్నారు. ఇస్లామాబాద్‌లో 3000 మంది హిందువులు ఉన్నారు.

1973లో తార్పార్కర్‌నుంచీ ఇస్లామాబాద్ తరలివచ్చిన వారిలో ఇస్లామాబార్ హిందూ పంచాయితీ మాజీ అధ్యక్షుడు ప్రీతం దాస్ కూడా ఉన్నారు.

ఇస్లామాబాద్ సైద్‌పూర్ గ్రామంలో ఒక చిన్న కృష్ణ విగ్రహం ఉందని, ఆ గ్రామాన్ని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించినప్పుడు ఈ విగ్రహాన్ని భద్రపరిచారని ప్రీతం దాస్ తెలిపారు. అయితే ఈ చిన్న విగ్రహం ఇస్లామాబాద్‌లో వేలల్లో ఉన్న హిందువులు పూజించేందుకు సరిపోకపోవచ్చని, దీన్ని ఉత్సవ విగ్రహంగా ఉంచొచ్చని ప్రీతం దాస్ అన్నారు.

"ఇస్లామాబాద్‌లో హిందూ ఆచార వ్యవహారాలు పాటించడం చాలా కష్టం. హిందూ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక ప్రత్యేక స్థలం లేదు. దీపావళి, హోళీలాంటొ పండుగలు జరుపుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ లేదు. ఎట్టకేలకు ప్రభుత్వం మా అభ్యర్థనను అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది" అని ప్రీతం దాస్ తెలిపారు.

ఇప్పటికే ఇస్లామాబాద్‌లో కేటాయించిన స్థలంలో హిందూ పద్ధతిలో దహన సంస్కారాలు చెయ్యడం మొదలుపెట్టామని లాల్ చంద్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)