అమెరికా: గంజాయి వాడకం చట్టబద్ధం చేసే కొత్త చట్టానికి ప్రతినిధుల సభ ఆమోదం

అమెరికాలో గంజాయి

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో జాతీయ స్థాయిలో తొలిసారిగా గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేసే బిల్లుకు కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు) లోని ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ నియంత్రిత పదార్థాల జాబితా నుంచి గంజాయిని తొలగించాలని పేర్కొంది.

దశాబ్దాలుగా కొనసాగుతున్న మాదకద్రవ్యాలపై పోరాటం (వార్ ఆన్ డ్రగ్స్) వలన ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొన్న సమాజాలలో దీన్ని తిరిగి ప్రవేశపెట్టడానికి మద్దతు పలికింది.

అయితే, అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ ఈ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

మారివానా ఆపర్చ్యూనిటీ రీఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పంజ్మెంట్ (మోర్) చట్టానికి శుక్రవారం అమెరికా పార్లమెంటు దిగువ సభ 228 - 164లో ఆమోదం లభించింది.

ఈ చట్టం అమలులోకి రావాలంటే ఎగువ సభ సెనేట్ ఆమోద ముద్ర లభించాలి. తరువాత దీనిపై అమెరికా అధ్యక్షుడు సంతకం చెయ్యాల్సి ఉంటుంది.

అది జరిగితే, యూఎస్‌లో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో.. మాదకద్రవ్యాల విధానాల మధ్య గల అంతరం తగ్గుతుంది.

గంజాయి

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రాల్లో విధానాలు ఎలా ఉన్నాయి?

అమెరికాలో 1970లో వచ్చిన ఫెడరల్ డ్రగ్ పాలసీని అనుసరించి గంజాయి వాడకం చట్టబద్ధం కాదు. ఈ చట్టంలో దీన్ని షెడ్యూల్ I నార్కోటిక్ డ్రగ్‌గా గుర్తించారు. అంటే గంజాయిలో ఔషధ గుణాలు లేవని, దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

అయితే, రాష్ట్ర స్థాయిలో గంజాయి వాడకంపై భిన్నమైన చట్టాలు అమలులో ఉన్నాయి.

జాతీయ స్థాయిలో నిషేధం ఉన్నప్పటికీ అమెరికాలోని 15 రాష్ట్రాల్లోనూ, కొలంబియాలోని ఒక జిల్లాలోనూ గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేశారు. 21 ఏళ్లు పైబడిన వ్యక్తులు గంజాయిని వినోదం కోసం ఉపయోగించవచ్చని ఈ రాష్ట్రాల్లోని చట్టాలు పేర్కొన్నాయి.

అదనంగా, 38 రాష్ట్రాలు గంజాయిని ఔషధాల తయారీలో వాడడానికి అనుమతిచ్చాయి.

గంజాయి

ఫొటో సోర్స్, Alamy

గత నెల అరిజోనా, మొంటానా, న్యూజెర్సీ రాష్ట్రాలలోని వోటర్లు.. వినోదానికి గంజాయిని వాడొచ్చనే ప్రతిపాదనకు ఓటు వేసారు. దీనిలో ఔషధ గుణాలున్నాయంటూ మిస్సిస్సిపీ, సౌత్ డకోటా రాష్ట్రాల్లో ప్రజలు గంజాయి వాడకానికి మద్దతు పలికారు.

జాతీయ స్థాయిలో గంజాయి వాడకాన్ని చట్టబద్దం చేసేందుకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. గత నెల జరిగిన గ్యాలప్ పోల్‌లో మూడింట రెండొంతుల మంది అమెరికన్లు గంజాయి వాడకానికి మద్దతు పలికారు.

అంతే కాకుండా, గంజాయి వాడకాన్ని చట్టవిరుద్ధం చెయ్యడమనేది జాత్యహంకారానికి అద్దం పడుతుందని, నల్లజాతీయులకు తీరని నష్టం కలిగిస్తోందని, గంజాయిని చట్టబద్దం చేసి తీరాలని అనేకమంది శాసనసభ సభ్యులు వాదిస్తున్నారు.

వైట్ అమెరికన్లకన్నా బ్లాక్ అమెరికన్లు మూడు రెట్లు ఎక్కువగా గంజాయి సంబంధిత వ్యవహారాల్లో అరెస్ట్ అవుతున్నారని, రెండు జాతులవారూ ఒకే స్థాయిలో గంజాయిని వినియోగిస్తున్నప్పటికీ నల్లజాతీయులు ఎక్కువగా శిక్షలకు గురవుతున్నారని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ గత ఏడాది చేసిన అధ్యయనంలో తేలింది.

గంజాయి ఆకులు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, గంజాయి ఆకులు

ఈ బిల్లులో ఏముంది?

మాదక ద్రవ్యాల వినియోగంలో అరెస్ట్ అయినవారిపై కేసులు కొట్టేయాలని, గంజాయి వ్యాపారులకు ఋణాలు లేదా గ్రాంటులు సులువుగా దొరికేలా చూడాలని ఈ బిల్లులో పేర్కొన్నారు.

గంజాయి రీటైల్ అమ్మకాలపై పన్నులు విధించి, తద్వారా సేకరించిన సొమ్మును వార్ ఆన్ డ్రగ్స్ వలన నష్టపోయిన నల్లజాతీయులకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి, అవసరమైన శిక్షణ ఇప్పించడానికి వినియోగించాలని ప్రతిపాదించారు.

"గంజాయిని చట్టబద్ధం చెయ్యడం కంటే... వార్ ఆన్ డ్రగ్స్ వలన నష్టపోయినవారికి పరిహారం చెల్లించడంలో కాంగ్రెస్ విఫలమైంది కాబట్టి దాన్ని సరిదిద్దే ప్రయత్నాలపైన దృష్టి పెట్టడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని" దీన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్య కారకులైన డెమోక్రట్ పార్టీ సభ్యులు ఎర్ల్ బ్లూమెనార్ తెలిపారు.

ఈ బిల్లు రచనలో గంజాయి విషయంలో న్యాయం కోసం పోరాడుతున్న అనేకమంది న్యాయవాదులు పాలుపంచుకున్నారు.

గంజాయి ఇయర్ రింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి స్పందనలు వచ్చాయి?

ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం వలన అమెరికాలో యువత చెడిపోయే అవకాశం ఉందని రిపబ్లిక్ పార్టీకి చెందిన పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేసారు.

“ఈ గ్రహంపై అధికంగా దుర్వినియోగమైన పదార్థాలలో గంజాయి కూడా ఒకటి" అని నార్త్ కరోలినాకు చెందిన గ్రెగ్ ముర్ఫీ తెలిపారు.

"ఇది అనవసర చర్య అనీ, దీనికి బదులు కోవిడ్ సహాయ కార్యక్రమాలపై దృష్టి పెట్టడం మంచిదని" మిగిలినవారు అంటున్నారు.

అయితే, ఇది ‘చారిత్రాత్మకమైన నిర్ణయం’ అని, ‘సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న’ అంశమని గంజాయి వినియోగ సంస్కరణలను సమర్థిస్తున్నవారి అభిప్రాయం.

2020-21 సీజన్లో తమ ఆటగాళ్లకు యాదృచ్ఛిక గంజాయి పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) ప్రకటించడంతో ఈ మొత్తం వ్యవహారం తెరపైకి వచ్చింది.

గంజాయి

ఫొటో సోర్స్, Getty Images

తరువాత ఏం జరగబోతోంది?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చెయ్యాలన్న ప్రతిపాదనను సమర్థిస్తున్నట్లు తెలిపారు కానీ ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ గానీ, రిపబ్లికన్ నాయకులుగానీ దీనికి మద్దతు తెలుపలేదు.

వచ్చే నెల జార్జియాలో జరగనున్న సెనేట్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలిస్తే ఎగువ సభలో తన మెజారిటీని నిలుపుకుంటుంది.

నేర న్యాయంలో అసమానతలను తొలగించడానికి ఈ బిల్లు పాస్ అవ్వడం ఎంతో ముఖ్యమని చెప్తూ దీనికి మద్దతు ఇవ్వవలసిందిగా సెనేట్ డెమొక్రటిక్ లీడర్ చక్ షూమర్ తన సహోద్యోగులను అభ్యర్థించారు.

అయితే, ఈ బిల్లుకు మద్దతిస్తున్న అతి కొద్దిమంది రిపబ్లికన్లలో ఒకరైన మ్యాట్ గెట్జ్ (ఫ్లోరిడా) మాట్లాడుతూ.. "ఇన్నాళ్లూ ప్రభుత్వం సత్యాన్ని దాచిపెట్టింది. మాదకద్రవ్యాలపై పోరాటంలో మాదకద్రవ్యాలే గెలిచాయి" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)