కరోనావైరస్: 'నా భర్తకు గర్ల్‌ఫ్రెండ్ ఉందని లాక్‌డౌన్‌లో ఎలా తెలిసిందంటే...'

ఫొటో సోర్స్, Getty Images
భారత్ నుంచి బ్రెజిల్ వరకు.. ఆసియా నుంచి అమెరికా వరకు.. ఎంతో సంతోషంగా ఉండే జంటలు ఇప్పుడు విడాకులను ఆశ్రయిస్తున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి నడుమ విధించిన లాక్‌డౌన్‌లే దీనికి కారణమని కొందరు చెబుతుంటే.. పాత సమస్యల వల్లే విడిపోతున్నామని మరికొందరు వివరిస్తున్నారు.
''నా భర్తకు గర్ల్‌ఫ్రెండ్ ఉందని లాక్‌డౌన్ సమయంలోనే నాకు తెలిసింది''అని నైజీరియాకు చెందిన రేణి నెమ్మదిగా ఫోన్‌లో చెప్పారు. పక్కగదిలో నుంచి ఎవరో గట్టిగా మాట్లాడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. భోజనం కోసం గిన్నెలను కదుపుతున్న శబ్దాలూ వస్తున్నాయి.
''ఆ విషయం ఆయన్ను అడిగాను. అయితే, నా ఫోన్ నువ్వు ఎందుకు తీసుకున్నావు?''అని గట్టిగా అరిచాడు. ''బహుశా ఆయన విడాకులు తీసుకోవాలని భావిస్తూ ఉండొచ్చు. నేను మీతో మాట్లాడుతున్నట్లు ఆయనకు తెలియదు. అందుకే నా వివరాలు బయటపెట్టాలని అనుకోవట్లేదు''అని ఆమె చెప్పారు.
లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితం కావడంతో.. చాలా మంది బంధాలు సంక్షోభ పరిస్థితిలో పడ్డాయి. పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులు, ఆఫీసులు పనులు, ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా చాలా సమస్యలు లాక్‌డౌన్‌లో ఒకేసారి వచ్చిపడ్డాయి.
రేణి లాంటి కొందరు లాక్‌డౌన్ సమయంలో కొన్ని సీక్రెట్‌లు కూడా తెలుసుకోగలిగారు. అదే సమయంలో వాటి పర్యావసానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
విడాకుల కేసులు పెరిగాయి
లాక్‌డౌన్ సమయంలో రిలేషన్‌షిప్ కౌన్సెలింగ్ కోసం ఆశ్రయించిన జంటల కేసులు పెరిగాయి.
''ఇదివరకు మా దగ్గరకు వచ్చేవారిలో ఎక్కువ మంది ఒంటరిగానే వచ్చేవారు''అని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్స్ అధ్యక్షురాలు డాక్టర్ రెబెకా పెండెర్ బామ్ చెప్పారు. ''లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచీ ఈ కేసుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఎక్కువ కేసులు జంటలుగా వస్తున్నారు''అని ఆమె వివరించారు.
''లాక్‌డౌన్‌లో మొదటి కొన్నివారాలు పెద్దగా కేసులు రాలేదు. కానీ తర్వాత కేసులు చాలా ఎక్కువగా పెరిగాయి''అని ఫ్లోరిడాకు చెందిన సైకోథెరపిస్ట్ మార్ని ఫ్యూర్మాన్ చెప్పారు.
''ముఖ్యంగా ఇంటిలో పనిని పంచుకోవడంపై జంటలు ఎక్కువగా గొడపడుతున్నట్లు మేం గుర్తించాం''.
''పని చేసుకోవడం ఒకవైపు.. పిల్లల్ని చూసుకోవడం మరోవైపు.. ఇలా అన్నీ పరిస్థితులను తీవ్రం చేశాయి''.

ఫొటో సోర్స్, Getty Images
బ్రెజిల్‌లోని ఫ్లోరియానోపోలిస్‌లో నివసించే 41ఏళ్ల రిచర్డ్ కున్హా స్మిడ్ట్, 31ఏళ్ల రఫేలా కరోలినా ఫెరారియా స్మిడ్ట్ విషయంలో ఇదే జరిగింది. లాక్‌డౌన్ వల్లే తాము విడిపోతున్నట్లు గత నెలలో విడాకుల సమయంలో వారు చెప్పారు.
''మేం 12 ఏళ్లు సంతోషంగా కలిసి జీవించాం. కానీ, కరోనావైరస్ మహమ్మారి మమ్మల్ని విడదీసింది. 24 గంటలూ ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే చాలా విషయాల్లో భేదాభిప్రాయాలు వస్తున్నట్లు తెలిసింది''అని సామాజిక కార్యకర్త రఫేలా చెప్పారు.
''కొన్నిసార్లు కోపం వచ్చేది. కొన్నిసార్లు భేదాభిప్రాయాలు వచ్చేవి. ఒకరిపై మరొకరం ఆరోపణలు చేసుకునే వాళ్లం''అని ఆమె చెప్పారు.
''బయటకు వెళ్లినప్పుడు మాస్క్ పెట్టుకోవడం. ఇంటికి రాగానే బట్టలన్నీ మార్చుకోవడం, స్నానం చేయడం లాంటివన్నీ నేను తప్పకుండా పాటించేదాన్ని. కానీ, ఆయన చేసే పనులు భిన్నంగా ఉండేవి. ఇప్పుడు తలచుకుంటే ఏదో హాస్యాస్పదంగా అనిపిస్తోంది. కానీ, అప్పుడు మాత్రం అన్నీ చాలా తీవ్రంగా ఉండేవి''అని ఆమె చెప్పారు.
''చిన్న విషయాలు, ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరంలేని సంగతుల కోసమూ మేం గొడవపడే వాళ్లం''అని రిచర్డ్ చెప్పారు.
''లాక్‌డౌన్ చాలా కఠినంగా విధించారు. మేం కాలు కూడా బయట పెట్టలేక పోయేవాళ్లం. దీన్ని నేను అసలు భరించలేకపోయా''అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
విపరీతమైన ఒత్తిడి
లాక్‌డౌన్‌తో తమ బంధాల్లో చాలా తీవ్రమైన ఒత్తిడి పడిందని 25 శాతం మంది అంగీకరించినట్లు బ్రిటన్‌లోని స్వచ్ఛంద సంస్థ రిలేట్ ఏప్రిల్‌లో చేపట్టిన సర్వేలో తేలింది. తమ భాగస్వామి చాలా చిరాకు తెప్పించేవాడని చాలా మంది ఒప్పుకున్నారు. ఎక్కువగా మహిళలే ఇలా ఫిర్యాదుచేశారు.
''లాక్‌డౌన్‌తో ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. లాంటి పరిస్థితులు తలెత్తాయి. చాలా మంది జీవితాల్లో ఒడిదొడుకులు కనిపించాయి. 8 శాతం మంది అయితే, తమ సంబంధానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, 43 శాతం మంది మాత్రం లాక్‌డౌన్‌తో భాగస్వామికి మరింత దగ్గర అయ్యామని చెప్పారు''అని రిలేట్ పేర్కొంది.
సంబంధాల్లో సమస్యలను లాక్‌డౌన్ మరింత తీవ్రం చేసిందని డాక్టర్ ఫ్యూర్మాన్ చెప్పారు. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో చాలా మందికి జూమ్ యాప్‌లో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఆమె వివరించారు.
''లాక్‌డౌన్‌తో అందరిపైనా ఒత్తిడి పెరిగింది. దీన్ని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలి''.
''ఇదివరకు చాలా దృఢంగా ఉండే కొందరి బంధాలు లాక్‌డౌన్‌లో మరింత బలపడ్డాయి. ఈ సమయాన్ని మరింత అర్థం చేసుకోవడం కోసం వారు ఉపయోగించుకున్నారు. అయితే, ముందునుంచే సమస్యలున్న జంటలు లాక్‌డౌన్‌లో చాలా ఎక్కువగా ప్రభావితం అయ్యాయి''అని ఆమె చెప్పారు.
రేణి లాంటివారికి మాత్రం లాక్‌డౌన్ తన జీవితంలో వాస్తవాలను కళ్లకు కట్టింది. తన భర్త ప్రవర్తనను సాధారణంగా అయితే తను అంతగా పట్టించుకొనేంత సమయం ఉండేది కాదు. అసలు ఫోన్ చూడాలనే ఆలోచన కూడా తనకు వచ్చేది కాదు.
ఇలాంటి విషయం బయటపడినా, తను విడాకుల గురించి ఆలోచించడంలేదని ఆమె తెలిపారు. ''మా అమ్మా, నాన్నలకు పోన్ చేసి ఏడ్చాను. కానీ వారు క్రైస్తవులు. విడాకులపై వారికి నమ్మకం లేదు. ఏదేమైనా భర్తతోనే కలిసి ఉండమని చెప్పారు''అని ఆమె వివరించారు.
''నేను అతణ్ని ఇంకా ప్రేమిస్తానా? కచ్చితంగా ప్రేమించలేను. కానీ, అంతా మంచికే జరిగింది. లేదంటే అతణ్ని అనవసరంగా తప్పు పడుతున్నానని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఇప్పుడు నా తప్పేమీ లేదని తేలిపోయింది''అని ఆమె అన్నారు.
తమ దగ్గరకు వస్తున్న కేసులు పెరుగుతున్నాయని అమెరికా, బ్రిటన్‌లకు చెందిన విడాకుల న్యాయవాదులు చెబుతున్నారు. గతేడాది అక్టోబరుతో పోలిస్తే ప్రస్తుత అక్టోబరులో విడాకుల కేసులు 70 శాతం పెరిగాయని వాషింగ్టన్ డీసీకి చెందిన ఒక న్యాయ సేవల సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అన్నిచోట్లా పెరిగిన కేసులు
సౌదీ అరేబియా, ఇండోనేసియాతోపాటు చైనా నగరాలైన షియాన్, డాంగ్‌ఝౌలలో విడాకుల కోసం వస్తున్న అప్లికేషన్లు పెరుగుతున్నట్లు చెబుతున్నాయి. అయితే, వీటిని చూసి అప్పుడే ఒక అవగాహనకు రాకూడదని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ బ్రాడ్ విల్‌కాక్స్ చెప్పారు.
''అరిజోనా, ఫ్లోరిడా, మిస్సోరీ, రోడ్ ఐలండ్స్, ఆరేగాన్‌లో డేటా విశ్లేషిస్తే.. విడాకుల కేసులు తగ్గినట్లు తెలుస్తోంది. ఎందుకంటే లాక్‌డౌన్ నడుమ చాలా మందికి విడాకులు రావడం కష్టమైంది''అని ఆయన అన్నారు.
పదేళ్ల క్రితం వచ్చిన ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితులను చూసిన చాలామంది.. ప్రస్తుత కల్లోలిత పరిస్థితుల్లో ఎలాంటి కఠినమైన నిర్ణయాలూ తీసుకోకూడదని భావిస్తున్నట్లు విల్‌కాక్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
''2020లో విడాకుల కేసులు తగ్గొచ్చు.. కానీ పరిస్థితులు సాధారణానికి వచ్చిన తర్వాత అంటే 2021లో విడాకుల కేసులు పెరుగుతాయి''అని ఆయన అన్నారు.
లాక్‌డౌన్‌లో విడిపోయిన వారు.. మనసులో బాధను ఎలా తట్టుకోవాలి అనేది మరొక సమస్య.
తొమ్మిదేళ్లపాటు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి జీవించిన ఇంటిలో ఇప్పుడు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన సంగీత కళాకారుడు కేరన్ బ్యాట్ ఒంటరిగా ఉంటున్నారు. చలికాలం సమీపిస్తుండటంతో ఇంటి నుంచి బయటకు కూడా రావడంలేదని ఆయన చెప్పారు.
''అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. లాక్‌డౌన్ వల్ల మా ప్రేమకు వేగంగా కాలం చెల్లింది. మేం ఇల్లు కొనుక్కోవాలని ఈ ఏడాది మొదట్లోనే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆమె లేదు. నాకు చాలా ఒంటరిగా అనిపిస్తోంది''అని ఆయన వివరించారు.
తన రోజువారీ పనులు చేసుకోవడంలో కేరన్ తలమునకలై ఉన్నారు. కానీ భాగస్వామి వేరుపడిన బాధను తను ఇప్పటికీ మరచిపోలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. 112 రోజుల లాక్‌డౌన్ తన బాధను మరింత పెంచిందని వివరించారు.
''నా బ్రేకప్ అయ్యే సమయంలో ఆంక్షలను కొద్దిగా తొలగించారు. ఆ తర్వాత మళ్లీ లాక్‌డౌన్ విధించారు. ఇంకెన్ని దారుణాలు జరుగుతాయా? అనిపించింది. ఒకసారి అయితే, తట్టుకోలేక గట్టిగా ఏడ్చేశాను''అని ఆయన చెప్పారు.
బ్రెజిల్‌లో రిచర్డ్, రఫేలా తమ విడాకుల తర్వాత, జీవితంలో ముందుకు వెళ్లారు. రఫేలా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. వీరిద్దరూ తమ ఇద్దరి కూతుర్లను పెంచడం కోసం రోజూ కలుస్తున్నారు.
''సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. వాటి నుంచి పారిపోకూడదు.. అని లాక్‌డౌన్ నేర్పించింది''అని రిచర్డ్ చెప్పారు.
''వేరుపడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ, నాకు వేరే దారి కనిపించలేదు. మేం ఇద్దరమూ మంచి వాళ్లమే. అందుకే ఇద్దరమూ సంతోషంగా ఉండాలి''అని రఫేలా అన్నారు.
మరోవైపు భవిష్యత్‌పై ఆశతో ముందుకు వెళ్తున్నట్లు కేరన్ అన్నారు. ''రోజురోజుకీ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అయితే, ఇప్పటికీ కొన్నిసార్లు చెత్తరోజులు ఎదురవుతున్నాయి''.
''కొన్ని రోజులు కేసులు తగ్గుతున్నాయి. కానీ ఒక్కోసారి చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి. అయితే, అన్ని సమస్యలూ తీరుతాయని ఆశతో జీవిస్తున్నా''అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








