అవిభక్త కవలలు: 19 ఏళ్ల కిందట సర్జరీతో విడిపోయిన ఈ సయామీ కవలలు... ఇప్పుడు ఎలా ఉన్నారంటే...

ఫొటో సోర్స్, MOWATT FAMILY
- రచయిత, రెబెక్కా వుడ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రిటన్‌లోని బర్హింగ్హమ్‌లో 19 ఏళ్ల క్రితం ఓ అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. అవిభక్త కవలలు (శరీరాలు అతుక్కుని పుట్టిన సయామీ కవలలు) సంచియా, ఎమాన్ మోవాట్‌లను వైద్యులు కష్టపడి విడదీశారు.
అప్పటికి ఆ చిన్నారుల వయసు మూడు నెలలే. వాళ్లద్దరి శరీరాలు వెన్నెముక మొదలు భాగంలో అతుక్కుని ఉన్నాయి.
2001 డిసెంబర్‌లో 16 గంటల పాటు వైద్యులు శ్రమించి వారిని వేరు చేశారు. బ్రిటన్‌లో అలాంటి శస్త్ర చికిత్స జరగడం అదే మొదటిసారి. ప్రపంచంలో మూడోసారి.
వైద్యులు చిన్న పొరపాటు చేసినా, వాళ్ల కాళ్ల చేతులు పడిపోయి ఉండేవి. ఆ శస్త్ర చికిత్సలో వాళ్లు బతికి బయటపడే అవకాశాలు 5 నుంచి 25 శాతం వరకే ఉన్నాయి.
కానీ, ఆ శస్త్ర చికిత్స విజయవంతమైంది. సంచియా, ఎమాన్‌లను తొలిసారిగా వారి తల్లిదండ్రులు విడివిడిగా ఎత్తుకోగలిగారు.

ఫొటో సోర్స్, PA Media
సంచియా, ఎమాన్‌లకు ఇప్పుడు 19 ఏళ్లు. యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వారికి డమారిస్ అనే ఓ చెల్లెలు కూడా ఉంది. సంచియా, ఎమాన్‌లకు... డమారిస్‌కు మధ్య 11 నెలలే తేడా.
సంచియా, ఎమాన్‌లను విజయవంతంగా వేరు చేయగలిగితే వాళ్లు సాధారణ జీవితం గడిపేందుకు ఆస్కారం ఉంటుందని వైద్యులు అంచనా వేశారు.
అయితే, ఇద్దరికీ స్పైనా బిఫిడా అనే సమస్య ఉంది. చెరో కాలు బలహీనంగా ఉన్నాయి. వాళ్లు అందరిలా నడవగలుగుతారో, లేదో అన్నది అనుమానంగా మారింది.
‘‘మేం నడిచినప్పుడు, అందరూ దాన్నొక అద్భుతమని వర్ణించారు’’ అని చెప్పారు సంచియా.
ఈ కవలల్లో మొదటగా బుడిబుడి అడుగులు వేసింది సంచియానే. రెండేళ్ల వయసులో ఆమె నడవడం మొదలుపెట్టారు. ఐదు వారాల తర్వాత ఎమాన్ కూడా అడుగులు వేయడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, PA Media
అరుదైన శస్త్ర చికిత్స కావడంతో సంచియా, ఎమాన్‌లపై మీడియా దృష్టి కూడా ఎక్కువగా ఉండేది.
స్కూల్, ఆసుపత్రులు, టీవీ కార్యక్రమాలు... వీటి చుట్టూనే వారి బల్యం తిరిగింది.
‘‘మిగతావారి కన్నా మేం భిన్నమైనవాళ్లమని చిన్నప్పటి నుంచే మాకు తెలుసు. ఆసుపత్రికి వెళ్లడాలు, ఆపరేషన్లు... వీటన్నింటి వల్ల మిగతా స్నేహితులు చేసేవన్నీ మేం చేయలేకపోయేవాళ్లం. కానీ, మాతో చదువుకున్నవాళ్లందరూ మాతో చాలా బాగా ఉన్నారు. అప్పటివాళ్లు ఇంకా మాకు స్నేహితులుగా ఉన్నారు’’ అని ఎమాన్ చెప్పారు.
ఒక కాలు బలహీనంగా ఉండటంతో సాధారణంగా ఐదు నిమిషాలు పట్టే నడకకు సంచియా, ఎమాన్‌లకు 20 నిమిషాలు పట్టేది. వీల్ చైర్, ఊత కర్రలు కూడా వాళ్లు వాడేవాళ్లు.
‘‘చిన్నప్పుడే మేం మా వైకల్యాన్ని స్వీకరించేశాం. ‘మీరు ఇది చేయలేరు’ అని ఎవర్నీ అననిచ్చేవాళ్లం కాదు. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఎవరైనా ‘మీరు ఇది ఆడలేరు’ అని అంటే, దాని వల్ల పట్టుదల మరింత పెరిగేది’’ అని సంచియా చెప్పారు.

ఫొటో సోర్స్, EMMA MOWATT
సంచియా, ఎమాన్‌ల శరీరాలను విడదీసే శస్త్రచికిత్సను న్యూరో సర్జన్ టోనీ హోక్లీ నేతృత్వంలోని వైద్య బృందం చేసింది. అతుక్కుపోయిన వెన్నెముక, మూత్రాశయం సహా కొన్ని అవయవాలను విడదీసింది.
సంచియా, ఎమాన్‌లకు అవయవాలు పూర్తిగా ఏర్పడ్డా, అవి అతుక్కుని ఉన్నాయి.
వెన్నెముకలు వేరు చేసిన తర్వాత పీడీయాట్రిక్ సర్జన్ పీటర్ గోర్నల్, అవిభక్త కవలల వైద్యంలో బాగా పేరు తెచ్చుకున్న లూయిస్ స్పిట్జ్ కలిసి మిగతా అవయవాలను వేరు చేసే ప్రక్రియలు పూర్తి చేశారు.
‘‘ఆ ఇద్దరు పాపలకూ వెన్నెముకలు ఉండేలా మేం కోత పెట్టాలి. దాని చుట్టూ కవచం కూడా ఏర్పాటు చేయాలి. కోత పెట్టడం పాత పద్ధతే. కానీ, ఎక్కడ కోత పెట్టాలన్నది తెలుసుకోవడమే సవాలు’’ అని ఆ శస్త్ర చికిత్స చేసిన తర్వాత హాక్లీ వ్యాఖ్యానించినట్లు ‘ద గార్డియన్’ పత్రిక రాసింది.
సంచియా, ఎమాన్‌ల కుటుంబానికి హోక్లీ మంచి స్నేహితుడైపోయారు. వారికి ప్రతి పుట్టినరోజుకూ హాక్లీ శుభాకాంక్షలు తెలియజేసేవారు. 2009లో హోక్లీ చనిపోయినప్పుడు, ఆయన స్మారకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంచియా, ఎమాన్ కూడా వెళ్లారు.

ఫొటో సోర్స్, MOWATT FAMILY
‘‘మా గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపించేవారు. మీరు నిజంగా కలిసే పుట్టారా అని అడిగేవారు. మేం ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని అనుకునేవాళ్లం. కానీ, వాళ్లు గూగుల్‌లో వెతికిచూసేవాళ్లు. కొన్నాళ్ల తర్వాత మా గురించి ఇలా మాట్లాడటం ఆగిపోతుందని అనుకున్నా. కానీ, అది ఎప్పుడూ ఆగలేదు’’ అని సంచియా అన్నారు.
సంచియా, ఎమాన్‌లు బర్మింగ్హమ్ చిల్డ్రెన్ హాస్పిటల్‌లో పుట్టారు. వారికి అక్కడే శస్త్ర చికిత్స జరిగింది.
హైస్కూల్‌లో ఉన్నప్పుడు ‘వర్క్ ఎక్స్‌పీరియన్స్’ కోసం వాళ్లు అదే ఆసుపత్రిలో పనిచేశారు. చిన్నప్పుడు తమకు చికిత్స చేసిన వైద్య సిబ్బందిని కూడా కలిశారు.

ఫొటో సోర్స్, MOWATT FAMILY
సంచియాకు కోడింగ్ అంటే ఇష్టం. ఆమె ఈ రంగంలోకే వెళ్తానని అంటున్నారు. మరోవైపు ఎమాన్ మాత్రం రాజకీయాల్లో అడుగుపెట్టాలని అనుకుంటోంది.
ఆరంభంలో జాగ్రత్తలు పాటించడం వల్లే ఇప్పుడు తమ జీవితాలు ఇలా ఉన్నాయని సాంచియా, ఎమాన్ అంటున్నారు. తమలా జీవించే అవకాశం దక్కని అవిభక్త కవలల గురించి తెలిసినప్పుడు, చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందని చెప్పారు.

ఫొటో సోర్స్, BIRMINGHAM CHILDREN'S HOSPITAL
అవిభక్త కవలల గురించి ఆసక్తికర విషయాలు:
- ఒకే పిండం నుంచి ఏర్పడతారు కాబట్టి వారు చూడటానికి ఒకేలా ఉంటారు.
- అవిభక్త కవలలు పుట్టడం చాలా అరుదు. ప్రతి రెండు లక్షల జననాలకు ఒకసారి ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి.
- ఎక్కువగా ఛాతీ, ఉదరం, పొత్తి కడుపు దగ్గర అతుక్కుని పుడుతుంటారు.
- అవిభక్త కవలల్లో దాదాపు 70 శాతం ఆడపిల్లలే.
- అవిభక్త కవలలు ఎలా పుడతారన్నదానికి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి.. పిండం రెండుగా విడిపోయే ప్రక్రియ ఆలస్యంగా జరిగి అతుక్కుని పుడతారు. మరొకటి.. పిండం రెండుగా విడిపోయినా, ఆనుకుని ఉండటంతో అవయవాలు పెరుగుతున్న కొద్దీ కలిసిపోతాయి.
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- చాందసవాద ఇస్లాంను మార్చేందుకు ఫ్రాన్స్ ఏం చేస్తోంది?
- "నేనొక అబ్బాయిని... పదహారేళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








