కరోనావైరస్: కోవిడ్ మరణాలు ఏప్రిల్‌తో పోల్చితే నిజంగానే తగ్గుముఖం పట్టాయా?

కోవిడ్-19

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రేచల్ స్క్రేయెర్
    • హోదా, బీబీసీ హెల్త్ రిపోర్టర్

ఏప్రిల్‌లో మొదట కరోనావైరస్ కేసులు పతాక స్థాయికి చేరినప్పుడు ఆసుపత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్‌లో చేరినవారితో పోల్చినప్పుడు ప్రస్తుతం చేరుతున్నవారు కోలుకునే అవకాశం ఎక్కువని ద ఫ్యాకల్టీ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ మెడిసన్ డీన్ చెప్పారు.

అయితే, కేసులు విపరీతంగా పెరగడం వల్ల ఈ తగ్గుతున్న మరణ ముప్పు కనిపించడంలేదని డాక్టర్ అలిసన్ పిటార్డ్ వ్యాఖ్యానించారు.

ఏప్రిల్‌ నాటి ఇంటెన్సివ్ కేర్ మరణాలతో పోల్చినప్పుడు నాలుగో వంతు వరకూ మరణాల సంఖ్య ప్రస్తుతం తగ్గినట్లు కనిపిస్తోంది.

అయితే, రాబోతున్న చలికాలంలో మరణాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటి అంచనాల ద్వారా స్పష్టంగా చెప్పలేం.

కరోనావైరస్ గురించి వైద్యుల్లో అవగాహన పెరగడం, స్టెరాయిడ్ డెక్సామెథాసోన్ చికిత్స, తెలిగ్గా కృత్రిమ శ్వాస అందించేందుకు తోడ్పడుతున్న వెంటిలేటర్లు.. రోగులకు మెరుగైన చికిత్స అందించడంలో తోడ్పడుతున్నాయి.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

స్పష్టంగా తెలుస్తోంది

సెప్టెంబరు 1 తర్వాత ఆసుపత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ విభాగాల్లో చేరిన కరోనావైరస్ రోగుల వివరాలను ద ఇంటెన్సివ్ కేర్ నేషనల్ ఆడిట్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐసీఎన్‌ఏఆర్‌సీ) విశ్లేషించింది.

కరోనావైరస్ మొదటి దశ (ఆగస్టు చివరి వరకు) ఇన్ఫెక్షన్లతో పోల్చినప్పుడు, రెండో దశ(సెప్టెంబరు 1 తర్వాత కేసులు)లో మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మొదట దశలో క్రిటికల్ కేర్‌ విభాగాల్లో చేరిన వారిలో సగటున 39 శాతం మంది మరణించారు. ఇప్పుడు ఇది 12 శాతానికి పడిపోయింది.

అయితే, సెప్టెంబరు 1 తర్వాత ఆసుపత్రుల్లో చేరిన రోగులపై సమగ్ర అంచనా వేయడానికి ఇంకా సమయం పండుతుందని, అందుకే ఇలా తగ్గినట్లు అనిపిస్తూ ఉండొచ్చని పిటార్డ్ వ్యాఖ్యానించారు.

సెప్టెంబరు 1 తర్వాత చేరిన వారిలో చాలా మంది ఇంకా ఇంటెన్సివ్ కేర్‌లోనే ఉన్నారు. మరణించడం లేదా కోలుకోవడం జరిగితేనే వీరి సమాచారం పరిగణలోకి తీసుకుంటారు.

రెండో దశలో మరణ ముప్పును ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటే అయినప్పటికీ.. మొదట దశతో పోల్చినప్పుడు కచ్చితంగా ఇప్పుడు మరణాలు తగ్గుతున్నాయని ఆమె వివరించారు.

కోవిడ్-19

ఫొటో సోర్స్, Getty Images

వేసవి అంతా ఇలానే..

ఏప్రిల్‌లో కరోనావైరస్‌తో ఆసుపత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ విభాగాల్లో చేరిన వారిలో సగం కంటే ఎక్కువ మందే మరణించారు.

జులై మొదటివారం నాటికి ఈ మరణాలు 40 శాతానికి పడిపోయాయి. వేసవి చివరి వరకూ ఈ మరణాలు ఇలానే కొనసాగాయి.

అయితే, సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు మొదటి వారం వరకు ఇంటెన్సివ్ కేర్‌ విభాగాల్లో చేరుతున్న వారి సంఖ్య తగ్గింది. మరణాలు కూడా ఇదివకరటి సంఖ్యతో పోలిస్తే నాలుగో వంతుకు పడిపోయాయి.

అయితే, మరణాలు నిజంగా తగ్గాయా లేదా అనే అంశాన్ని ఇప్పుడే అంచనావేస్తే తొందరపాటు అవుతుందని ఆమె అన్నారు.

మరోవైపు ఏప్రిల్‌తో పోల్చినప్పుడు జూన్‌లో కరోనావైరస్‌తో ఇంగ్లండ్ ఆసుపత్రుల్లో రోజూ మరణించిన వారి సంఖ్య 6 నుంచి 1.5 శాతానికి పడిపోయిందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇదివరకు అంచనావేసింది.

ఆసుపత్రుల్లో చేరినవారితో మృతుల వివరాలను పోల్చడం కొంచెం కష్టం. అయితే క్రిటికల్ కేర్ విభాగాల్లో మరణాలు మాత్రం అలాకాదు. ఇవి ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదవుతూ ఉంటాయి.

కోవిడ్-19

ఫొటో సోర్స్, Reuters

అవగాహన వల్లే..

''క్రమంగా మరణాల రేటు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో అన్నింటి కంటే ముఖ్యమైనది ఏమిటంటే.. ఇన్ఫెక్షన్‌ గురించి మనకు కొంతవరకు అవగాహన వచ్చింది''అని పిటార్డ్ చెప్పారు.

''తొలినాళ్లలో ఆసుపత్రుల్లో చేరిన వారిని వెంటనే ఐసీయూలో చేర్పించడం, ఔషధాలు ఇవ్వడం, వెంటీలేటర్‌పై పెట్టడం చేసేవారు''

''ఇప్పుడు శరీరం లోపలకు ఎలాంటి వైద్య పరికరాలూ చొప్పించకుండా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. దీంతో రోగులు కూడా మెరుగ్గా కోలుకుంటున్నారు''

అంటే గాలిని నియంత్రించే మాస్క్‌లాంటి పరికరంతో పనిచేసే సీపీఏపీ మెషీన్ లాంటి యాంత్రాల సాయంతో ఎక్కువ మందికి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా మత్తుమందులు ఇచ్చి ముక్కు లేదా నోటిలోకి గొట్టాలు పంపించే విధానాలు చాలావరకు తగ్గాయి.

''రక్తం గడ్డకట్టడంపై కరోనావైరస్ ప్రభావాన్ని మనం గుర్తించ గలుగుతున్నాం. తొలి దశల్లోనే ఇలాంటి కేసులను అంచనా వేయగలుగుతున్నాం''

ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే స్టెరాయిడ్ డెక్సామెథాసెన్ కూడా మరణ రేటు తగ్గడానికి కొంతవరకు కారణం. అయితే దీని పాత్ర ఎంత వరకు ఉందని అనేది ఇప్పుడే అంచనా వేయలేం.

ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల వయసు కూడా మరొక కారణం. ఇదివరకటితో పోల్చినప్పుడు ప్రస్తుతం 30 నుంచి59 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

అయితే, ఒకవేళ మళ్లీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు కిక్కిరిసిపోతే మరణ రేటు కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)