బంగారం నిక్షేపాలు భూమిలో తరిగిపోతున్నాయా... ఇక చంద్రుడిపై తవ్వాల్సిందేనా?

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జస్టిన్ హార్పర్
    • హోదా, బీబీసీ న్యూస్

ఆగస్టులో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2000 డాలర్లకు (సుమారు 1,47, 658 రూపాయిలు) వరకు చేరింది.

ఈ ధరల పెరుగుదలకు మార్కెట్ కారణమైనప్పటికీ ఈ విలువైన లోహం ఇంకా ఎంత అందుబాటులో ఉంది? ఇది నెమ్మదిగా కరవవుతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బంగారాన్ని పెట్టుబడిగా, హోదాకి చిహ్నంగా, అనేక రకాల ఎలక్ట్రానిక్ పరికరాల్లో చిన్న భాగాలుగా వాడుతుంటారు.

కానీ, ఇది పరిమితంగా లభించే వనరు కావడంతో ఏదో ఒక రోజు నిక్షేపాలు పూర్తిగా అడుగంటిపోవచ్చు.

పీక్ గోల్డ్

గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే ఏడాదిలో బంగారాన్ని తవ్వితే ఆ పరిస్థితిని పీక్ గోల్డ్ అని అంటారు. ఇప్పటికే ఆ దశకు చేరి ఉంటామని ఈ రంగానికి చెందిన కొందరు నిపుణులు భావిస్తున్నారు.

2019లో 3,531 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ఇది 2018 కంటే 1 శాతం తక్కువ. 2008 నుంచి పరిశీలించి చూస్తే ఉత్పత్తిలో తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి.

"ప్రస్తుతం ఉన్న వనరులు తగ్గిపోవడం, కొత్తగా గనులను కనుగొనే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తుండటంతో , రానున్న సంవత్సరాల్లో ఈ ఉత్పత్తి మరింత తగ్గే అవకాశం ఉంది” అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రతినిధి హన్నా బ్రాండ్స్‌టాటర్ అన్నారు.

పీక్ గోల్డ్ పరిస్థితి తలెత్తిన వెంటనే బంగారం ఉత్పత్తి అమాంతం పడిపోదు కానీ, కొన్ని దశాబ్దాలకి నిల్వలు నెమ్మదిగా తరిగిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బంగారం గని

ఫొటో సోర్స్, Getty Images

ఇంకా ఎంత మిగిలుంది?

మైనింగ్ కంపెనీలు భూగర్భంలో నిక్షిప్తమైన బంగారం లెక్కలను అంచనా వేస్తాయి.

బంగారు నిక్షేపాల పరిమాణాన్ని కచ్చితంగా అంచనా వేయగలిగినా అదంత సులభమైన పనేమీ కాదు.

ఇప్పటికే 1,90,000 టన్నుల బంగారాన్ని తవ్వి తీయగా ఇంకా ఇంకా 50,000 టన్నుల వరకు ఉండవచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది.

ఈ అంచనాల ప్రకారం భూమిలో ఇంకా 20 శాతం నిల్వలు మాత్రమే తవ్వడానికి మిగిలి ఉన్నాయి. అయితే ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉండవచ్చు.

ఆర్ధిక కారణాల రీత్యా అందుబాటులో లేని మరిన్ని వనరులను కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ డేటా మైనింగ్ విధానాల ద్వారా గనుల తవ్వకం విధానాలను సులభతరంగా మారితే ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే చాలా చోట్ల రోబోటిక్స్ వాడడం మొదలుపెట్టారు. ఇవి గనుల తవ్వకాలకు సంబంధించి ప్రామాణికమైన సాంకేతిక పరిజ్ఞానంగా మారే అవకాశం ఉంది.

ఇప్పటివరకు అత్యధికంగా అక్కడే

చరిత్రలో భారీ స్థాయిలో బంగారు ఖనిజాలు నిక్షిప్తమైన ప్రాంతంగా దక్షిణ ఆఫ్రికాలో విట్‌వాటర్ శాండ్ బేసిన్‌ను చెబుతారు. ఇప్పటి వరకు తవ్వి తీసిన బంగారంలో 30 శాతం ఇక్కడిదే.

ఇది కాకుండా, దక్షిణ ఆఫ్రికాలో ఉన్న పొనెంగ్ గని, ఆస్ట్రేలియాలో సూపర్ పిట్, న్యూ మోంట్ బాడింగ్టన్ గనులు, ఇండోనేసియాలో గ్రాస్బెర్గ్, అమెరికాలో నెవాడ కూడా బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు.

బంగారాన్ని అత్యధికంగా తవ్వుతున్న దేశాలలో చైనా ముందుండగా, కెనడా, రష్యా, పెరూ కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.

కంపెనీల విషయానికి వస్తే బారిక్ గోల్డ్ ఆధిపత్యంలో ఉన్న నెవాడా గనులు ప్రపంచంలోనే అతి పెద్ద బంగారాన్ని తవ్వే కాంప్లెక్స్ అంటారు.

ఇక్కడ ప్రతి ఏటా 3. 5 మిలియన్ ఔన్స్‌ల బంగారం ఉత్పత్తి అవుతోంది.

కొత్తగా బంగారం దొరికే గనులను కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ , భారీ నిక్షేపాలు దొరికే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు.

దీంతో, ప్రపంచంలో అత్యధిక భాగం బంగారం దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న పాత గనుల నుంచే వస్తోంది.

భారీ స్థాయిలో గనులను తవ్వడం చాలా పెట్టుబడితో కూడుకున్న పని. దీనికి చాలా యంత్రాలు, నైపుణ్యం అవసరం.

ప్రపంచంలో 60 శాతం గోల్డ్ మైన్స్ ఉపరితర గనులు కాగా మిగతావి భూగర్భ గనులు.

"దక్షిణ ఆఫ్రికాలో ఉన్న తక్కువ ఖర్చుతో కూడుకున్న అతి పెద్ద గనులలో నిక్షేపాలు అంతమవుతుండటంతో నిక్షేపాలు లభించడం కష్టంగా మారుతోందని మెటల్స్ డైలీకి చెందిన రాస్ నార్మన్ చెప్పారు.

"చైనాలో ఉన్న బంగారు గనులు చిన్నవి కావడంతో ఖర్చు ఎక్కువవుతోంది" అని ఆయన అన్నారు. .

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

రికార్డు స్థాయిలో ధరలు

ఈ సంవత్సరం ఆగస్టులో బంగారం ధరలు తారస్థాయికి చేరినప్పటికీ, ధరల పెరుగుదలకు అనుగుణంగా గనుల తవ్వకం ఏమీ పెరగలేదు.

నిజానికి చాలాసార్లు బంగారం ఉత్పత్తిలో చోటుచేసుకున్న మార్పులు ధరపై ప్రభావం చూపడానికి కొంత సమయం పడుతుంది.

"బంగారం ధర పెరుగుదల లాంటి బాహ్య కారకాలతో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా గనుల తవ్వకం ప్రణాళికను మార్చుకోవాలంటే అది చాలా సమయంతో కూడుకున్న పని" అని బ్రాండ్స్‌టాటర్ అన్నారు.

ఒక వైపు కోవిడ్ నిబంధనలు అమలులో ఉండగా బంగారం ధరలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో చాలా గనులలో పనులను నిలిపివేయడం వలన గనుల తవ్వకం చేపట్టడం సాధ్యమయ్యే పని కాదు.

చంద్రుని పై కూడా బంగారు నిల్వలు ఉన్నాయని అంటారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చంద్రుని పై కూడా బంగారు నిల్వలు ఉన్నాయని అంటారు.

ఆర్ధిక అస్థిరత తీవ్రంగా ఉన్న సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని స్థిరమైన ఆస్తిగా భావించడం వల్ల ధరలు పెరిగి ఉండవచ్చు.

భూగర్భంలో బంగారు నిల్వలు ఏ మేరకు ఉన్నాయో లెక్క కట్టడం కష్టమైనప్పటికీ, చంద్రునిపైనా బంగారం నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు.

అయితే, అక్కడ గనులు తవ్వి, భూమి మీదకు తీసుకు రావడం విపరీతమైన ఖర్చుతో కూడిన పని.

“చంద్రుని పై బంగారాన్ని తవ్వడం ఆర్థికంగా అర్థవంతం కాదు" అని రోదసి నిపుణుడు సినీడ్ ఓ సల్లివన్ అన్నారు. "దానిని అమ్మితే వచ్చే లాభం కంటే దానిని తవ్వడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది" అని ఆయన అన్నారు.

అంటార్కిటికాలో కూడా కొన్ని బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెబుతారు కానీ, అక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని.

అక్కడ సముద్ర గర్భంలోనూ బంగారం పరుచుకుని ఉంటుంది, కానీ అది వెలికి తీయడం సాధ్యమయ్యే పని కాదు.

అయితే, బంగారాన్ని రీసైకిల్ చేసే అవకాశం ఉంది. దాని వల్ల కొత్తగా గనులను తవ్వలేకపోయినా కొరత ఏర్పడకుండా ఉంటుంది.

ఎలక్ట్రానిక్ పరికరాల్లో కూడా బంగారాన్ని అత్యధికంగా వాడతారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో వాడే బంగారం కూడా కొన్ని వేల రూపాయిల ఖరీదు చేస్తుంది.

ఇప్పటికే ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నుంచి బంగారాన్ని వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)