Beirut: అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, టామ్ ఎడ్జింగ్టన్
- హోదా, బీబీసీ న్యూస్
లెబనాన్‌లోని బేరూత్ పోర్ట్‌లో ఆరేళ్ల కిందట ఒక ఓడ నుంచి దింపిన సుమారు 3,000 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను రేవు సమీపంలోని ఓ గోదాంలో ఉంచారు. మంగళవారం జరిగిన భారీ పేలుడుకు ఇదే కారణమని చెబుతున్నారు.
ఇంతకీ అమ్మోనియం నైట్రేట్ అంటే ఏంటి? అది ఎంత ప్రమాదకరం ?
అమ్మోనియం నైట్రేట్ తెలుపు రంగులో స్ఫటికాల రూపంలో ఉంటుంది. పరిశ్రమలలో దీన్ని భారీ ఎత్తున తయారు చేస్తారు. ప్రధానంగా దీన్ని పంటలకు ఎరువుగా వాడుతుంటారు. అయితే పేలుడు పదార్థంగానూ దీన్ని ఉపయోగిస్తుంటారు.
"అమ్మోనియాను, నైట్రిక్ యాసిడ్‌ను కలపడం వల్ల ఏర్పడిన సింథటిక్ పదార్ధమే అమ్మోనియం నైట్రేట్'' అని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆండ్రియా సెల్లా చెప్పారు.
అమ్మోనియం నైట్రేట్‌ను తయారు చేయడం చాలా సులభం. చాలా తక్కువ ఖర్చుతో ప్రపంచంలో ఎక్కడైనా దీన్ని తయారు చేసే అవకాశం ఉంది. కానీ నిలవ చేయడం పెద్ద సమస్య. పేలుళ్లకు దారి తీస్తుంది. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి.

ఫొటో సోర్స్, EPA
ఎంత ప్రమాదకరం
కొద్ది మొత్తంలో ఉన్నప్పుడు దీనితో సమస్య లేదు. కానీ పెద్ద మొత్తంలో తయారు చేసినప్పుడు నిల్వ చేయడం కష్టం. ఎక్కువకాలం అలాగే వదిలేస్తే పాడైపోతుంది. " చాలా రోజులు నిల్వ ఉంచినప్పుడు అది గాలితో తేమను పీల్చుకుని గట్టి రాయిలా తయారవుతుంది. ఇది ఇంకా ప్రమాదకరం. ఈ పరిస్థితిలో అది అంటుకుంటే వేగంగా విస్తరిస్తుంది'' అని ప్రొఫెసర్ సెల్లా చెప్పారు.
"నిల్వ ఉంచడం వల్ల అది ఆయిల్‌లాంటి పదార్ధాలు తగిలినప్పుడు చెడిపోవడం మొదలు పెడుతుంది. అలా చెడిపోవడం మొదలు పెట్టిన తర్వాత అనేక మార్పులు చెందుతుంది. ఒక్కసారి వేడెక్కడం మొదలు పెడితే, అలా వేడెక్కుతూనే ఉంటుంది. ఒక్కోసారి భారీ పేలుడుకు దారి తీస్తుంది. ఇప్పుడు బేరూత్‌లో జరిగిన ప్రమాదం అలాంటిదే" అని మాజీ మిలిటరీ అధికారి ఫిలిప్ ఇంగ్రామ్ బీబీసీ రేడియో 4తో అన్నారు.
పుట్టగొడుగుల్లాంటి మేఘాలెందుకు ఏర్పడ్డాయి?
బేరూత్ ప్రమాదం వీడియోలో పేలుడు సమయంలో పుట్టుగొడుగులా ఒక మేఘంలాంటి ఆకారం కనిపించింది.
అది ఎలా వచ్చిందన్నది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
"ఒక భారీ పేలుడు సంభవించినప్పుడు ఆకాశంవైపు ప్రయాణిస్తూ ఒక పొగమేఘంలాంటి ఆకారం కనిపించింది. గాలి ఒక్కసారిగావ్యాప్తి చెందినప్పుడు అందులో ఉన్న నీటి ఆవిరి అలాంటి మేఘాలను సృష్టిస్తుంది'' అని ప్రొఫెసర్ సెల్లా వెల్లడించారు.

ఫొటో సోర్స్, Reuters
పేలుడు సమయంలో వెలువడ్డ వాయువులు ఎంత ప్రమాదకరం?
అమ్మోనియం నైట్రేట్ పదార్ధం పేలినప్పుడు దాని నుంచి అమ్మోనియా గ్యాస్ విడుదలయ్యే అవకాశం ఉంది.
నారింజ రంగు పొగలు నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల ఏర్పడతాయి. ఇవి వాయు కాలుష్యానికి కారణమవుతాయి.
"ఎక్కువ గాలి లేకపోతే ఇది స్థానికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది'' అని ప్రొఫెసర్ సెల్లా అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
బాంబుల్లా వాడతారా ?
అమ్మోనియం నైట్రేట్ తో తయారు చేసిన పేలుడు పదార్ధాలను సైనిక దళాలు ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నాయి. తీవ్రవాదులు కూడా దీన్ని పేలుళ్ల కోసం వాడుతుంటారు.
1995లో ఓక్లహమా సిటీలో ఇలాంటి పేలుడు ఒకటి జరిగింది. ఈ ఘటనలో సుమారు 2 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించి పేలుళ్లు జరపగా, ఒక పెద్ద ప్రభుత్వ భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. 168మంది మరణించారు.
గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయా ?
•1921లో జర్మనీలోని ఒప్పావ్ అనే ప్రాంతంలో 4,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలింది. ఈ ఘటనలో 500మందికి పైగా మరణించారు.
•1947లో అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదంలో టెక్సాస్ నగరంలో సుమారు 581మంది దుర్మరణం పాలయ్యారు. ఒక పోర్టు దగ్గర దింపడానికి సిద్ధంగా ఉంచిన 2,000 టన్నుల రసాయనం ఓడలో ఉండగానే పేలింది.
•ఇటీవల చైనాలోని తియాన్జిన్ ప్రావిన్స్‌లో అమ్మోనియం నైట్రేట్ పదార్ధం పేలి 173మంది చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- ‘ఉద్యోగం పోయింది.. అందుకే నా సెక్సీ ఫోటోలు అమ్ముకుంటున్నా’
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- 2 వేల సంవత్సరాల పురాతన అస్థిపంజరం.. మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్రవేత్తలు
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








