కరోనావైరస్‌ను మించిన ‘సైలెంట్ కిల్లర్’... 50 ఏళ్లుగా పోరాడుతున్నా దేశంలో అంతం కాని క్షయ

క్షయ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నితిన్‌ శ్రీవాస్తవ్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఏడాది కిందటి వరకు ముంబైకి చెందిన పంకజ్ భవ్నానీ జీవితం హాయిగా గడిచింది.

మంచి ఉద్యోగం, భార్య రాఖీ, ఇద్దరు కవల పిల్లలతో జీవితం ఆనందమయంగా ఉండేది. కానీ 2019లో అతనికి క్షయ (టీబీ) ఉన్నట్టు తెలిసింది.

పంకజ్ ఊపిరితిత్తులను టీబీ దెబ్బతీసింది. ఆరు నెలల చికిత్స తరువాత ఆయన 80 శాతం కోలుకున్నారు. అయితే అసలు ఇబ్బందులు తరువాత వచ్చాయి.

ఆరు నెలల తరువాత ఫిబ్రవరిలో జరిపిన పరీక్షల్లో టీబీ బ్యాక్టీరియా ఆయన మెదడుకు కూడా పాకినట్టు తెలిసింది. మరో మూడు నెలలకు కంటి చూపు మందగించింది. తరువాత కాళ్లు చచ్చుబడిపోయాయి.

"లాక్‌డౌన్ ముగిసిన తరువాత జూలై 16న నాకు 6 గంటల పాటు బ్రెయిన్ సర్జరీ చేసారు. పది రోజులు ఆస్పత్రిలో ఉన్నాను. బలాన్నిచ్చే మందులు చాలా ఇచ్చారు. ఇప్పుడు నా శరీరంలో ఇన్‌ఫెక్షన్ పూర్తిగా తొలగిపోయింది. కానీ ఈ మందులు మరో ఏడాదిపాటూ వాడవలసి ఉంటుంది" అని పంకజ్ వివరించారు.

లాక్ డౌన్ కారణంగా జపాన్ నుంచి దిగుమతి కావాల్సిన మందులు నిలిచిపోయాయి
ఫొటో క్యాప్షన్, లాక్ డౌన్ కారణంగా జపాన్ నుంచి దిగుమతి కావాల్సిన మందులు నిలిచిపోయాయి

అయితే పంకజ్‌కు మళ్లీ సమస్యలు తలెత్తాయి. డాక్టర్లు రాసిచ్చిన మందులు ఆయన డిశ్చార్జ్ అయిన వారం తరువాత నుంచి ఆసుపత్రిలో గానీ, బయట గానీ దొరకలేదు.

"చికిత్స మధ్యలో ఆగిపోతే టీబీ తిరగబెట్టొచ్చు. ఒక్కోసారి రోగి మరణించవచ్చు. మందులు అయిపోవస్తున్నకొద్దీ, అవి బయట బజార్లో దొరక్క పోయేసరికి మా అందరికీ మళ్లీ టెన్షన్ మొదలయ్యింది. ఐదు రోజులు ఎవరూ నిద్రపోలేదు. నా నుంచి నా పిల్లలకు సోకుతుందేమోనని భయం పట్టుకుంది" అని చెప్పారు పంకజ్.

పంకజ్ కుటుంబం, అతడి సహోద్యోగులు అందరూ కలిసి ప్రధాని కార్యాలయానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని పెద్దపెద్ద ఆస్పత్రులకు, మెడికల్ షాపులకు ‘మందు దొరికితే పంపించండి’ అని విజ్ఞప్తి చేశారు.

సమస్య ఏమిటంటే ఈ మందులు జపాన్‌లో తయారై భారతదేశానికి దిగుమతి అవుతాయి. లాక్‌డౌన్ కారణంగా అన్ని రవాణాలు నిలిచిపోవడంతో అక్కడి నుంచి మందుల సరఫరా ఆగిపోయింది.

పంకజ్ భార్య రాఖీ ఈ విషయం గురించి ట్వీట్ చెయ్యడంతో ఇది చర్చనీయాంశమయ్యింది. ఎట్టకేలకు వాళ్లకు మందులు లభించాయి.

పంకజ్ ఆ గడ్డు రోజుల్ని తలుచుకుంటూ "ఈ టీబీ ఏదో ఒక రోజు నా ప్రాణాన్ని హరిస్తుంది అనుకున్నాను" అని భావోద్వేగంతో చెప్పారు.

క్షయ

ఫొటో సోర్స్, AFP

సైలెంట్ కిల్లర్ ట్యూబర్‌క్యులోసిస్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం ప్రపంచంలో మూడొంతుల మంది క్షయ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారు.

టీబీ కారణంగా ఇండియాలో ఏటా 4,80,000 మరణాలు సంభవిస్తున్నాయి.

భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం క్షయ కారణంగా దేశంలో రోజుకి 1,300 మంది చనిపోతున్నారు.

గత 50 ఏళ్లుగా టీబీని నివారించేందుకు ఇండియా పోరాటం చేస్తున్నప్పటికీ అది అంతం కావడం లేదు. అందుకే ఇప్పటికీ దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తున్నారు.

క్షయ

ఫొటో సోర్స్, COPYRIGHTTHINKSTOCK

ఫొటో క్యాప్షన్, క్షయ వ్యాధి ఊపిరితిత్తులను దెబ్బతీయగలదు

ఇవన్నీ కరోనావైరస్ వ్యాప్తికి ముందు సేకరించిన గణాంకాలు. జనవరి చివరివారంలో ఇండియాలో కోవిడ్-19 రావడం మొదలై, మార్చినాటికి లాక్‌డౌన్ ప్రకటించడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ టీబీ వ్యాధికి సంబంధించిన గణాంకాలు సగానికి సగం పడిపోయాయి.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్‌, బీహార్‌లలో క్షయవ్యాధి అధికంగా ఉంది. అయినప్పటికీ ఇప్పుడు మొత్తం దృష్టిని కోవిడ్-19 కేసుల వైపు మరలించవలసి వచ్చిందని బీహార్ ప్రధాన టీబీ అధికారి డాక్టర్ కేఎన్ సహాయ్ అంటున్నారు.

"ముందే సిబ్బంది కొరత ఉంది. ఉన్నవారికి కూడా కోవిడ్-19 కేర్ సెంటర్లలో బాధ్యతలు అప్పగించారు. కొందరికి ఇంటింటికెళ్లి నమూనాలు సేకరించే పని ఇచ్చారు. ఇదీ ప్రభుత్వ కేంద్రాల పరిస్థితి. దాదాపు అన్ని ప్రైవేట్ టీబీ క్లినిక్‌లు మూసివేశారు. దీంతో క్షయ కేసుల నోటిఫికేషన్ 30 శాతం కన్నా ఎక్కువగా పడిపోయింది" అని డా. సహాయ్ తెలిపారు.

పంకజ్ భవ్నానీలాగే ఎంతోమంది క్షయ బాధితులు లాక్‌డౌన్ సమయంలో వైద్యం అందక, మందులు లేక అవస్థలు పడ్డారు. చాలామందికి చికిత్స మధ్యలోనే ఆగిపోయింది.

క్షయ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ట్యూబర్‌క్యులోసిస్ (క్షయ) బ్యాక్టీరియా

వ్యాధి పెరుగుతుందనే భయం ఉంది

క్షయ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూ కేసులు పెరుగుతాయనే భయం కూడా నెలకొంది.

ఘజియాబాద్-నోయిడా సరిహద్దులోని ఖోడా గ్రామంలో షాకిబ్‌ఖాన్‌ కుటుంబం (పేరు మార్చాం) మూడేళ్లుగా నివసిస్తుస్తోంది. అతని 71 ఏళ్ల తండ్రి దిల్లీలోని పటేల్ చెస్ట్ ఆస్పత్రిలో టీబీకి చికిత్స పొందుతున్నారు.

రోజు కూలీగా పనిచేస్తున్న షాకిబ్‌కు లాక్‌డౌన్ సమయంలో కుటుంబ పోషణ కష్టమయ్యింది. ఇరుగు పొరుగులాగే తను కూడా కుటుంబంతో సహా ప్రయాణమై తన సొంత గ్రామం బిజ్నోర్ చేరుకున్నారు.

"లాక్‌డౌన్‌లో మా నాన్న మందులు అయిపోయాయి. మళ్లీ వైద్యం ప్రారంభించడానికి మూడు వారాలు ఆలస్యం అయ్యింది. 12 నెలల కోర్సు తిరిగి ప్రారంభించాలని డాక్టర్లు అంటున్నారు" అని షాకిబ్ వివరించారు.

క్షయవ్యాధిని సకాలంలో గుర్తించడం చికిత్సలో ముఖ్యమైన భాగం. వ్యాధిని గుర్తించిన తరువాత రోగికి ప్రభుత్వం నుంచీ మందులు, పౌష్ఠిక ఆహారం తీసుకోవడానికి 500 రూపాయల నగదు లభ్యమవుతుంది.

2025 నాటికి దేశంలో టీబీని అంతం చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసింది. అయితే కరోనావైరస్ ప్రబలడంతో టీబీకి చికిత్స వెనుకబడి పోయింది.

డాక్టర్‌ మధుకర్‌ పాయ్‌ మెక్‌గిల్ ఇంటర్నేషనల్ టీబీ సెంటర్‌లో కెనడా రీసెర్చ్ చైర్ ఇన్ ట్రాన్సిషనల్ ఎపిడెమాలజీ అండ్ గ్లోబల్ హెల్త్ డైరక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన భారతదేశంలో టీబీ గురించి మాట్లాడారు.

"2025కి భారతదేశంలో టీబీ అంతం చెయ్యాలనే లక్ష్యాన్ని కనీసం మరో ఐదు సంవత్సరాలకు పొడిగించవలసి ఉంటుంది" అంటున్నారాయన.

"లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. వారిలో లక్షల మంది టీబీ బాధితులున్నారు. వీరిలో అనేకమందికి తమకు క్షయ సోకిందనే విషయం కూడా తెలియకపోవచ్చు. టీబీ నోటిఫికేషన్లలో డేటా 40 శాతం తగ్గిపోయింది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది" అని మధు పాయ్‌ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

రియా లోబో
ఫొటో క్యాప్షన్, రియా లోబో

టీబీ వ్యాధికి కొన్నేళ్లపాటు చికిత్స తీసుకున్న రియా లోబో ఇటీవలే యూరప్‌కు వెళ్లొచ్చారు. "ఈ ప్రాణాంతకమైన వ్యాధి మీద కూడా కోవిడ్-19 తరహాలో దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. మంచి చికిత్స, మంచి ఆరోగ్యం అందరికీ దక్కాలి. ఇన్నేళ్ల తరువాత కూడా టీబీకి ఒక వాక్సిన్ కనిపెట్టలేదు" అని రియా ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే లాక్‌డౌన్ ముగిసిన తరువాత మళ్లీ క్షయవ్యాధిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచించింది. ఈ దిశగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణను వేగవంతం చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

కానీ భారతదేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మిగతా రోగుల్లాగే క్షయ బాధితులకు కూడా కోవిడ్-19 వల్ల ప్రాణాంతకమైన ముప్పు పొంచి ఉంది.

"కరోనావైరస్ విజృంభిస్తే మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించే అవకాశం ఉంది. అలాంటప్పుడు టీబీ రోగులకు మూడు నెలలకు సరిపడా మందులను ప్రభుత్వం ముందే సరఫరా చెయ్యడం ఒక పరిష్కారమవుతుంది. అలాగే కోవిడ్-19 కారణంగా బయటకు రాకుండా ఉండిపోయిన క్షయ బాధితులను గుర్తించి వారికి వెంటనే చికిత్స ప్రారంభించాలి" అని మధుకర్ పాయ్ సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)