కరోనావైరస్: ఇరాన్‌లో ఎన్ని వేల మంది చనిపోయారు... వాస్తవాలను ఈ దేశం ఎందుకు దాచిపెడుతోంది?

ఫొటో సోర్స్, AFP
ఇరాన్ ప్రభుత్వం చెబుతున్న దానికంటే కరోనావైరస్ మరణాలు మూడు రెట్లు ఎక్కువగా ఉండొచ్చని బీబీసీ పర్షియన్ సర్వీస్ చేపట్టిన పరిశోధనలో తేలింది.
జులై 20నాటికి కోవిడ్-19తో 45.000 మంది మరణించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ దేశ ఆరోగ్య శాఖ మాత్రం 14,405 మంది మాత్రమే మృతి చెందినట్లు చెబుతోంది.
మరోవైపు కరోనావైరస్ సోకినవారి సంఖ్య కూడా ఆరోగ్య శాఖ చెబుతున్న లెక్కల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. 2,78,827 మందికి వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ చెబుతుండగా.. నిజానికి 4,51,024 మందికి వైరస్ సోకినట్లు రికార్డుల్లో ఉంది.
ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూసినా.. పశ్చిమాసిలో కరోనావైరస్‌కు అత్యధికంగా ప్రభావితమైన మొదటి దేశం ఇరానే.
గత కొన్ని వారాల సమాచారం చూస్తే రెండోసారి మళ్లీ ఇక్కడ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌లో కోవిడ్-19తో తొలి మరణం జనవరి 22న సంభవించినట్లు బీబీసీకి అందిన ఆరోగ్య శాఖ రికార్డులో ఉంది. ఇక్కడ తొలి కేసు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించిన దాదాపు నెల రోజులకు ముందే ఈ కరోనా మృతి సంభవించినట్లు రికార్డుల్లో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌లో కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ చాలా మంది ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో విడుదల చేస్తున్న గణాంకాల్లో స్పష్టంగా తేడాలు కనిపిస్తున్నాయి. దీనిపై కొందరు నోరు విప్పి మాట్లాడారు కూడా. కొందరు గణాంక నిపుణులు తమ పరిశోధనల ఆధారంగా అంచనాలు కూడా వేశారు.
పరీక్షలు సరిగా నిర్వహించకపోవడంతో చాలా దేశాల్లో మరణాలు సరిగా నమోదు కావడం లేదు. కానీ బీబీసీకి అందిక సమాచారం ప్రకారం.. ఇరాన్‌లో గణనీయంగా మరణాలు నమోదైనా ప్రభుత్వం కావాలనే వాటిని తక్కువచేసి చూపించింది.
డేటా ఎక్కడి నుంచి వచ్చింది?
తమ గుర్తింపును బయట పెట్టడానికి ఇష్టపడని కొందరు బీబీసీకి ఈ డేటాను పంపించారు.
దేశ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనావైరస్ కేసులతోపాటు రోగుల వయసు, లక్షణాలు, ఆసుపత్రిలో ఎన్నిరోజులు గడిపారు? ఇంతకుముందు వారికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా? లాంటి అన్ని వివరాలు ఈ పత్రాల్లో ఉన్నాయి.
ఇప్పటికే మరణించినట్లు ప్రభుత్వం చెప్పిన కొందరి వివరాలు దీనిలో ఉన్నాయి. మృతులు, కేసులపై బీబీసీ పరిశోధించిన సమాచారం దీనితో సరిపోతోంది.
కరోనావైరస్‌తో కొందరు రాజకీయ నాటకాలు ఆడుతున్నారని, నిజాన్ని తాము అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నామని వివరిస్తూ ఈ డేటాను కొందరు షేర్ చేశారు.
ప్రభుత్వం విడుదలచేసిన గణాంకాలు, ఈ రికార్డుల్లో ఉన్న వివరాల మధ్య తేడా.. పరిశోధకులు ఇక్కడ కేసులపై వేసిన అంచనాలతో సరిపోతోంది.

డేటాలో ఏముంది?
దేశ రాజధాని టెహ్రాన్‌లో కోవిడ్-19 సోకి లేదా కరోనావైరస్ లక్షణాలతో అత్యధికంగా 8,120 మంది మరణించారు.
ఇక్కడ మొదటగా ప్రభావితమైన కోమ్ నగరంలో మరణ రేటు ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యి మందిలో ఒకరు కోవిడ్-19తో చనిపోయారు. ఇక్కడ సంభవించిన మొత్తం మృతులు 1,419.
మృతుల్లో 1,916 మంది విదేశీయులూ ఉన్నారు. అంటే వలసదారులు, శరణార్థుల్లోనూ మృతులు భారీగా మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఇక్కడి శరణార్థుల్లో ఎక్కువ మంది అఫ్గానిస్తాన్ వాసులే ఉంటారు.
ప్రాంతాల వారీగా కేసులు, మరణాలు పెరుగుతున్న తీరు ప్రభుత్వం వెల్లడించిన వివరాలతో పత్రాల్లో లెక్కలు సరిపోతున్నాయి. అయితే ప్రతిచోట కావాలనే కొన్ని కేసులు, మృతులను తక్కువచేసిన చూపించారు.
మార్చి రెండో వారంలో మృతులు విపరీతంగా పెరిగినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. అయితే నిజానికి అప్పటికే అక్కడ మృతులు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పత్రాలు చెబుతున్నాయి.
మార్చి మూడో వారంలో ఇరాన్ కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించేటప్పటికీ లాక్‌డౌన్ విధించారు. దీంతో కేసులు, మృతుల సంఖ్యలు తగ్గాయి.
అయితే, మే చివర్లో ప్రభుత్వ నిబంధనలు సడలించిన వెంటనే కేసులు మళ్లీ విపరీతంగా పెరిగాయి.
పత్రాల ప్రకారం.. ఇరాన్‌లో తొలి కరోనా మరణం జనవరి 22న సంభవించింది. ఇది ప్రభుత్వం విడుదలచేసిన తొలి మరణం కంటే ఇది నెల రోజుల ముందు.
ఆ సమయంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఇక్కడి ఆరోగ్య అధికారులు చెప్పేవారు. మరోవైపు ఇక్కడ కేసులు అప్పటికే ఉన్నాయని ఇరాన్‌లోని పాత్రికేయులు వెల్లడించారు.
తొలి మరణం నమోదైనట్లు ఫిబ్రవరి 19న ప్రభుత్వం ప్రకటించింది. అయితే అప్పటికే ఇక్కడ 52 మంది మృతి చెందారు.
మొదట చెప్పింది ఎవరు?
నిఘా సంస్థలు, భద్రతా సంస్థల నుంచి ఆరోగ్య శాఖపై విపరీతమైన ఒత్తిడి ఉందని ఇక్కడి వైద్యులు బీబీసీతో చెప్పారు.
వారు చెప్పినట్లు చేయడం కుదరదని చెప్పలేని పరిస్థితిలో ఆరోగ్య శాఖ ఉందని డాక్టర్ పౌలాడీ (పేరు మార్చాం) వివరించారు.
''మొదట్లో వారి దగ్గర టెస్టింగ్ కిట్లు లేవు. అవి వచ్చిన తర్వాత.. విపరీతంగా పరీక్షలు చేశారు. అయితే కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుందని బయటకు చెప్పేందుకు భద్రతా సంస్థలు అంగీకరించలేదు అని డాక్టర్ పౌలాడీ చెప్పారు.
కోమ్‌కు చెందిన ఇద్దరు వైద్యుల కేసుతో ఇక్కడ తొలి కేసు నమోదైందని ఆరోగ్య శాఖ ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
డాక్టర్ అలీ మొల్యాయీ చనిపోవడంతో అతడి సోదరుడు, వైద్యుడైన డాక్టర్ మొహమమ్మద్ మొల్యాయీ తనకు కోవిడ్-19 పరీక్ష చేయాలని పట్టుబట్టారు. ఫలితంగా ఆయనకు కోవిడ్-19 సోకినట్లు తేలింది.
తన సోదరుడు మరణించిన కామాకార్ ఆసుపత్రిలో చాలా మంది కోవిడ్-19 తరహా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. వారిపై మామూలు చికిత్సలేవీ పనిచేయలేదు. అయినా వారికి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించలేదు.
''వారు దురదృష్టవంతులు. పెద్దపెద్ద వారు తెలిసినా డాక్టర్ మొహమ్మద్ తన సోదరుణ్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఆయన ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు''అని పౌలాడీ వ్యాఖ్యానించారు.
తన సోదరుడి మృతికి సంబంధించిన దృశ్యాలను జతచేస్తూ మొహమ్మద్ ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన విడుదలచేశారు. దీంతో తొలి కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ఒప్పుకోవాల్సి వచ్చింది.
అప్పటివరకూ మొహమ్మద్ చెప్పినవన్నీ తప్పుడు వార్తలని ప్రభుత్వ వార్తా సంస్థ విమర్శస్తూ వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు కప్పిపుచ్చారు?
ఇస్లామిక్ విప్లవం-1978 వార్షికోత్సవంతోపాటు పార్లమెంటు ఎన్నికల నడుమ కోవిడ్-19 కేసులు ఇక్కడ పెరుగుతూ వచ్చాయి.
ప్రజలు తమకు పలుకుతున్న మద్దతును ప్రదర్శించడంలో వార్షికోత్సవంతోపాటు ఎన్నికలూ ఇరాన్‌కు చాలా కీలకం.
ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండేందుకే కరోనావైరస్ వ్యాప్తిని కప్పిపుచ్చేందుకు ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖొమేనీ ప్రయత్నించారని కొందరు ఆరోపించారు.
ప్రభుత్వం ఎంత కప్పిపుచ్చినా.. ఎన్నికల్లో చాలా తక్కువ మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కరోనావైరస్ వ్యాప్తికి ముందే ఇక్కడ వరుస సంక్షోభాలు మొదలయ్యాయి.
నవంబరు 2019లో ప్రభుత్వం ఒక్కరోజే పెట్రోలు ధరలను విపరీతంగా పెంచేసింది. దీంతో ఇక్కడ విధ్వంసకర నిరసనలు చోటుచేసుకున్నాయి. వీటిలో వందల మంది చనిపోయారు.
ఈ ఏడాది జనవరిలో ఇరాన్ జనరల్ ఖసీం సొలేమానీని అమెరికా హతమార్చడంపై ఇరాన్ స్పందించిన తీరూ సమస్యలను తెచ్చిపెట్టింది.
పొరపాటున ఉక్రెయిన్ విమానాన్ని క్షిపణితో ఇరాన్ కూల్చివేసింది. టెహ్రాన్‌లో విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. దీంతో 176 మంది మరణించారు.
ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు మొదట్లో ఇరాన్ అధికారులు ప్రయత్నించారు. కానీ మూడు రోజుల తర్వాత ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఫొటో సోర్స్, Amazon Frontiles y Alianza Ceibo via Reuters
ఈ పరిస్థితుల నడుమ కరోనావైరస్ వ్యాప్తిని ఒప్పుకొనేందుకు ప్రభుత్వం చాలా ఆందోళన పడిందని మాజీ ఎంపీ, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నౌరోల్దిన్ పిర్మావోజెన్ వ్యాఖ్యానించారు.
''పేదలు, నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడతారేమోనని ప్రభుత్వం భయపడింది''
''ఇస్ఫాహాన్ ప్రావిన్స్‌లో కరోనావైరస్ కేసుల చికిత్సలో భాగంగా అంతర్జాతీయ సంస్థ మెడిసిన్స్ శాన్స్ ఫ్రాంటియర్స్ ఇచ్చే సాయాన్ని ప్రభుత్వం ఆపేసేలా భద్రతా సంస్థలు ఒత్తిడి తెచ్చాయి. భద్రతా సంస్థల ఒత్తిడి ఏ మేరకు ఉంటుందో చెప్పేందుకు ఇది నిదర్శనం''
కరోనావైరస్, విమానం కూల్చివేతలకు ముందే ఇరాన్‌లో గడ్డు పరిస్థితులు ఉండేవి.
అణు ఒప్పందం నుంచి వైదొలిగిన అనంతరం 2018 మేలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు ఆర్థిక వ్యవస్థను చాలా ప్రభావితం చేశాయి.
''దేశాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చినవారు ఎలాంటి మూల్యం చెల్లించలేదు. పేదలే భారీగా నష్టపోవాల్సి వచ్చింది'' అని పౌలాడీ వ్యాఖ్యానించారు.
''అమెరికా, ఇరాన్ ప్రభుత్వాల ఘర్షణల నడుమ పేద ప్రజలు రెండు వైపులా నలిగిపోయారు''
ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు తాము సమర్పించిన కరోనావైరస్ కేసులు, మృతుల గణాంకాలు చాలా పారదర్శకంగా ఉన్నాయని ఇరాన్ ఆరోగ్య శాఖ చెబుతోంది. తమ లెక్కల్లో ఎలాంటి తప్పులూ లేవని వివరిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








