ఎల్‌జీబీటీ: "వెనక్కి తిరిగి రావొద్దు.. నిన్ను చంపేస్తారు"

"మిగతా అబ్బాయిల్లా కాకుండా నా కోరికలు, ఆలోచనలు వేరుగా ఉండేవి"

"మహమ్మద్‌‌ను మామూలు మగవాడిలా మార్చేందుకు అతడి కుటుంబం చేయని ప్రయత్నం లేదు. అత‌డిలోని అమ్మాయిల‌ ల‌క్ష‌ణాలు పోగొట్టడానికి మందులు కూడా వాడారు. చివరికి అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నారు'' అని లైలా మహమూద్ చెప్పారు.

అది 2019.. హర్గెయిసా న‌గ‌రంలో మధ్యాహ్న భోజనం తరువాత చాలామంది కునుకు తీసే సమయం. జన సంచారం తక్కువగా ఉండ‌టంతో ఎవరి కంటా పడకుండా వెళ్లడానికి అనువైన సమయం.

20 ఏళ్ల మహమ్మద్, తన ప్రియుడు అహ్మద్ ఇంటికి వెళ్లాడు. ఎవరూ చూడకుండా ఇద్దరూ ఒక గదిలోకెళ్లి తలుపులు వేసుకున్నారు. అనుకోకుండా అహ్మద్ సోదరి ఆ తలుపులు తోసుకుని లోపలికొచ్చారు. వారిద్దరినీ అక్కడ అలా చూసి కెవ్వుమని కేక పెట్టారు.

ఇంట్లో అందరూ నిద్ర లేచారు. మహమ్మద్ వెంటనే తలుపు చాటున దాక్కున్నాడు.

అప్పుడు అతనికి ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది. "ఇంటికి రావొద్దు, నిన్ను చంపేస్తారు" అని ఫోన్‌లో ఓ వ్యక్తి చెప్పారు.

30 ఏళ్ల క్రితం సోమాలియా నుంచి విడిపోయిన సోమాలీ ల్యాండ్ రాజధాని హర్గెయిసా. అక్కడ కఠినమైన ఇస్లామిక్ షరియా చట్టాలు అమలవుతాయి. స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావిస్తారు. ఎల్జీబీటీ స‌భ్యులు తమ ఇష్టాయిష్టాల‌ను త‌మ‌లోనే దాచుకోవాల్సి ఉంటుంది.

త‌మ గురించి ఎవ‌రికైనా తెలిసిపోతుందేమోన‌ని భయంతోనే వారు బతుకుతుంటారు.

తనలోని స్త్రీ త‌త్వాన్ని దాచుకోవడానికి మహమ్మద్ చాలా కష్టపడేవారు.

"నాకు నాలుగైదేళ్లు ఉన్నప్పుడే గందరగోళం మొదలైంది. మిగతా అబ్బాయిల్లా కాకుండా నా కోరికలు, ఆలోచనలు వేరుగా ఉండేవి" అని మహమ్మద్ వివరించారు.

ఇంట్లో మహమ్మద్ తన సోదరులతోపాటూ పడుకునేవారు. నిద్రపోయే ముందు అబ్బాయిలంతా చేరి అమ్మాయిల గురించి మాట్లాడుకునేవారు. నీకెలాంటి అమ్మాయిలు ఇష్టం అని తనని అడిగేవారు.

"అప్పుడే నాకు అర్థ‌మయ్యింది. నేను అంద‌రిలా కాకుండా భిన్నంగా ఉన్నానని అనిపించింది."

మహమ్మద్ అమ్మాయిల్లా అందంగా కనిపించాలని తహతహలాడేవాడు. మేకప్ మీద ఎక్కువ‌ దృష్టి ఉండేది. ఇంట్లో తోటి అబ్బాయిలతో కాకుండా అమ్మాయిలతో స్నేహం చేసేవాడు. వారి బట్టలు వేసుకుని చూసుకునేవాడు. మూడుసార్లు వాళ్లమ్మకు అలానే దొరికిపోయాడు. ఏదో ఒకటి చేస్తే గానీ.. మహమ్మద్ దారికి రాడని ఆమె భావించారు.

మహమ్మద్‌‌ను తన పెద్దన్నయ్యకు అప్పజెప్పి రోజూ ఖురాన్‌లో పాఠాలు చదివించమని చెప్పారు.

‘అమ్మాయిల్లా కనిపించాలని ఆతృతపడే మగవారిని, అబ్బాయిల్లా కనిపించాలని సరదాపడే అమ్మాయిలను దేవుడు శిక్షిస్తాడు’అని రాసి ఉన్న ఒక వాక్యాన్ని రోజుకు పదిసార్లు చదివించేవారు.

"నేను దేవుడికి కోపం తెప్పిస్తున్నానని, నన్ను శపిస్తాడని, మరణానంతరం నన్ను నరకానికి పంపిస్తాడని మా అన్నయ్య నాతో అనేవారు."

"నాకప్పుడు పదేళ్లు. చాలా భయపడేవాడిని. రాత్రి పిచ్చి కలలు వచ్చేవి. నిద్రలో అరుస్తూ లేచి కూర్చునేవాడిని. నన్ను దేవుడినుంచి కాపాడండి, నరకంలో నన్ను మంటల్లో కాల్చేస్తున్నారు అని అరిచేవాడిని."

తన కుటుంబ సభ్యులను సంతృప్తి పరచడానికి కొంతకాలం అబ్బాయిలా ఉండడానికి మహమ్మద్‌‌ ప్రయత్నించారు.

“కానీ నన్ను నేను దాచిపెట్టుకోవడం సాధ్యమయ్యేది కాదు. అప్పటికి నేను చాలా చిన్నవాడిని. చెప్పినవన్నీ తొందరగా మర్చిపోయేవాడిని” అని మహమ్మద్‌‌ చెప్పారు.

చిరవకు మహమ్మద్‌కు 12 ఏళ్లు ఉన్నప్పుడు ఒక పునరావాస కేంద్రానికి పంపించారు.

''సోమాలీ విలువలకు వ్యతిరేకంగా నడుచుకునే పిల్లల్ని, యువకులను బాగు చెయ్యడానికి ఇలాంటి కేంద్రాలు దేశమంతటా విస్తరించి ఉన్నాయి. ఈ సంస్థల్లో చేరిన వారు వారి ఇష్టాలకు వ్యతిరేకంగా చాలా కఠినమైన పరిస్థితుల్లో కాలం గడుపుతుంటారు. కొన్నిచోట్ల డబ్బు కోసం ఖురాన్‌ను వక్రీకరించి కూడా చెప్తుంటారు'' అని మహమ్మద్‌‌ అన్నారు.

"నా దృష్టిలో ఇంతకన్నా దరిద్రమైన ప్రదేశం మరొకటి ఉండదు"

మహమ్మద్‌‌ను ఆడ దెయ్యం ఆవహించిందని, అందుకే అతని ప్రవర్తన అలా ఉందని, అతని కుటుంబ సభ్యులు భావించారు. ఆ పున‌రావాస కేంద్రంలో ఆడ దెయ్యాన్ని తరిమేస్తామన్నారు. ఆ సెంటర్‌లో వాళ్లు తమని తాము ‘జీవితాలను కాపాడేవారు’గా పిలుచుకుంటారు. తమ దగ్గరికి వచ్చిన వారిని నరకానికి వెళ్లకుండా అడ్డుకుంటామని ప్రచారం చేసుకుంటారు.

"నా దృష్టిలో ఇంతకన్నా దరిద్రమైన ప్రదేశం మరొకటి ఉండదు" అని మహమ్మద్‌‌ అన్నారు.

అక్కడ మహమ్మద్‌కు సంప్రదాయ పురుషుడిలా ఎలా ప్రవర్తించాలో పాఠాలు చెప్పేవారు. మగవాడిలా ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో చెప్పేవారు. తమ దగ్గరికొచ్చిన మిగతా రోగులతో ఫుట్‌బాల్ ఆడమని బలవంత పెట్టేవారు. అది మహమ్మద్‌కు ఇష్టం ఉండేది కాదు. ఇస్లామిక్ పాఠాలూ చెప్పేవారు.

నాలుగో రోజు నుంచీ మహమ్మద్‌‌పై లైంగిక దాడి చెయ్యడం మొదలుపెట్టారు.

"రాత్రి పూట నాపై అత్యాచారం చేసేవారు. కొన్నిసార్లు గుంపులుగా వచ్చేవారు."

అత్యాచారం చెయ్యడం అక్కడ చాలా మామూలు విషయం. ఆ సంస్థను నిర్వహించేవారు, అక్కడికి వచ్చిన రోగులు కూడా అత్యాచారాలకు పాల్పడేవారు.

ఆ కేంద్రంలో 10 నుంచి 30ఏళ్ల‌ వయసు గలవాళ్లు ఉండేవారు. అందరూ ఒక పెద్ద హాల్‌లో వరుసగా పడుకునేవారు. అక్కడ ఎవరికీ రక్షణ ఉండేది కాదు. ఉదయం పాఠాల్లో చెప్పేది వేరు, రాత్రిపూట చేసేది వేరు.

"‌మేం ఎవరికీ చెప్పం అనే నమ్మకంతోనే ఇవన్నీ చేసేవారు."

మనుషులకు పట్టిన దెయ్యాలను తరిమేయడానికి ఆ సంస్థలో హర్మల అనే మూలికల మందు ఇస్తారు. అది తీసుకుంటే మత్తుగా ఉండి ఒక విధమైన భ్రాంతి కలుగుతుంది. వాంతులు అవుతాయి. ఇది దెయ్యాలను తరిమేయడానికి సహకరిస్తుందని చెప్తారు. కానీ ఆ మందు ఇవ్వాల్సిన డోసు కన్నా ఎక్కువ ఇస్తున్నారు. ఇది ప్రాణాంతకమైనది. ముఖ్యంగా పిల్లలకు చాలా హాని చేస్తుందని పరిశోధ‌నలో తేలింది.

అత్యాచారం చెయ్యడం అక్కడ చాలా మామూలు విషయం

"అది తీసుకున్నాక నేను ఎక్కడో ఎగురుతున్నట్టు, నా చుట్టూ నక్షత్రాలు ఉన్నట్టు అనిపించేది. అప్పుడు నాపై అత్యాచారం చేసేవారేమో తెలీదు. నాకు స్పృహ ఉండేది కాదు."

ఒకసారి హర్మల మందు తీసుకున్నాక మహమ్మద్‌కు విపరీతమైన కడుపు నొప్పి వచ్చి ఆస్పత్రిలో చేర్పించాల్సిన ప‌రిస్థితి వచ్చింది. ఆ పునరావాస కేంద్రం నుంచి బయటపడ్డాక మహమ్మద్‌‌ తన లైంగికతను దాచుకోవడానికి ప్రయత్నించాడు.

అహ్మద్‌ను కలిసే వరకూ తన టీనేజ్ అంతా అలాగే గడిచిపోయింది. గే సోమాలీస్ అనే సీక్రెట్ చాట్ గ్రూపులో వారిద్దరూ కలుసుకున్నారు. వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. తరువాత ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒకరినొకరు కలుసుకునేవారు.

ఇంట్లో తనని చంపడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసిన త‌ర్వాత‌ మహమ్మద్‌‌ దేశం నుంచీ పారిపోవడానికి ప్రయత్నాలు చేశారు. కానీ అది అంత సులువు కాదు.

చాలా దేశాల్లో సోమాలీలకు సులువుగా వీసాలు ఇవ్వరు. అనేక ష‌ర‌తులు ఉంటాయి. వేల డాలర్లు బ్యాంక్ అకౌంట్‌లో చూపించాలి. సోమాలీ ల్యాండ్ ప్రజలకు అది చాలా కష్టం. ఇథియోపియా, జిబౌటి, కెన్యా, ద‌క్షిణాఫ్రికా మాత్రమే సోమాలీ ల్యాండ్‌ను స్వతంత్ర్య దేశంగా పరిగణిస్తాయి.

మహమ్మద్‌కు బ్లాక్ మార్కెట్లో పాస్‌పోర్టు కొనుక్కోవడం, ఎల్లో ఫీవర్ వ్యాక్సీన్ వేసుకున్నట్టు ఫేక్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం తప్ప మరో మార్గం క‌నిపించ‌లేదు.

అలా ఆ దేశం నుంచీ మహమ్మద్‌ తప్పించుకున్నారు. పారిపోయినట్టు ఇంట్లో తెలిసే సమయానికే ఆయ‌న విమానం ఎక్కేశారు. అదే మొదటిసారి ఆయ‌న‌ విమానంలో ప్రయాణించ‌డం.

"చాలా కొత్తగా.. వింతగా అనిపించింది. విమానం కిటికీ లోంచి బయటకి చూస్తూ కూర్చున్నాను" అని మహమ్మద్ చెప్పారు.

"ఏదో ఒక రోజు నేను అమెరికా లేదా యూరప్ వెళ్లిపోవాల‌ని అనుకుంటున్నా."

ఆయ‌న‌ మలేసియా విమానం ఎక్కారు. ఆ దేశంలో ప‌ర్య‌ట‌క‌ వీసాలు అక్కడికి చేరుకున్న వెంటనే మంజూరు చేస్తారు. కానీ మలేసియాలో శరణార్థులుగా ఉండే సోమాలీలకు జీవితం అంత సులభం కాదు. అక్కడ కూడా స్వలింగ సంపర్కం నేరమే.

అయితే మహమ్మద్ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగింది. ఆయ‌న‌కు మలేషియాలో పునరావాసానికి ఆమోదం లభించింది. ఇదంతా జరగడానికి ఒక ఏడాది పట్టింది. ఆ ఏడాదంతా ఆయ‌న‌ చాలా కష్టపడ్డారు. జెనీవా ఒప్పందం ప్రకారం శరణార్థిగా వచ్చిన అతనికి మలేషియాలో ఉద్యోగం చేసే అర్హత లేదు.

మరోవైపు తన కుటుంబ స‌భ్యులు తనని వెతుక్కుంటూ వచ్చి మళ్లి వెనక్కి తీసుకెళ్లి చంపేస్తారేమోననే భయం ఆయ‌న్ను వెంటాడింది. తనతోపాటు అక్కడ ఉన్న సోమాలీ శరణార్థులను నమ్మడానికీ లేదు. వారు తన గుట్టు బయటపెట్టి తన కుటుంబానికి పట్టిస్తారేమోనని భయపడేవారు.

"ఏదో ఒక రోజు నేను అమెరికా లేదా యూరప్ వెళ్లిపోవాల‌ని అనుకుంటున్నా."

"అప్పటివరకూ నా జాగ్రత్తల్లో నేనుంటూ, నా కుటుంబానికి దొరక్కుండా ఉండాలి" అని మహమ్మద్ అన్నారు.

తను పారిపోయిన తరువాత అహ్మెద్ పరిస్థితి ఏమిటో మహమ్మద్‌కు తెలీదు. అహ్మెద్‌ని కాంటాక్ట్ చెయ్యడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

చిత్రాలు: సారా ఎల్సా పినన్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)