మీరు ఏ లక్ష్యాన్ని అయినా సాధించేందుకు కావల్సిన ‘మైండ్ సెట్’ ఇదీ..

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, డేవిడ్ రాబ్‌సన్
- హోదా, బీబీసీ వర్క్‌లైఫ్
విజయానికి కావల్సిందేమిటి? "పది శాతం ప్రేరణ, తొంభై శాతం కఠోర శ్రమ" అన్నారు థామస్ అల్వా ఎడిసన్.
ఎడిసన్ బల్బ్ కనిపెట్టడానికి ముందు 3000 సార్లు విఫలమయ్యారట. ఇది మనకి గొప్ప స్ఫూర్తినిస్తుందన్నమాట నిజమేగానీ.. కఠోర శ్రమ మాత్రమే లక్ష్యాలకు దగ్గర చేస్తుంది.
బలమైన కోరిక, దృఢ నిశ్చయం మాత్రమే లక్ష్యానికి చేరువయ్యేలా చేస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ తన లక్ష్యాలను చేరుకునే దిశలో ఎడిసన్ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నది కూడా పరిశీలించవలసిన ముఖ్య విషయం.
ఆయన ఒక ప్రయోగం విఫలమవ్వగానే మరో ప్రయోగానికి గాలివాటంగా మళ్లలేదు. విఫలమైన ప్రతీసారి తన ఆలోచనలను తానే విశ్లేషించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగారు.
"ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకుని, అది విఫలమయ్యేవరకూ దాని మీదే పని చేస్తాను. అది విఫలం అయ్యిందని తెలిసాక మరో కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాను" అని ఎడిసన్ 1890లో హార్పర్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
ఎడిసన్ తన వైఫల్యాలనుంచి నేర్చుకుంటూ, చిన్న చిన్న విజయాలబాటగా లక్ష్యాన్ని చేరుకున్నారు.
ఈ 'వ్యూహాత్మక ఆలోచనా విధానం' చాలా ముఖ్యమైనది. నిరంతరం మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ, మన ఆలోచనలను మనమే విశ్లేషించుకుంటూ, తప్పులు దిద్దుకుంటూ ముందుకి వెళ్తే లక్ష్యాలను సులువుగా చేరుకోగలుగుతాం.
"వ్యూహాత్మక ఆలోచనా విధానం ఒక పనిని మరింత సమర్థవంతంగా చెయ్యడానికి ఉపయోగపడుతుంది" అని నేషనల్ యూనివర్సిటీ సింగపూర్‌కు చెందిన పాట్రిషా చెన్ అన్నారు. ఆమె చేస్తున్న సరికొత్త పరిశోధన ప్రకారం విజయానికి, వైఫల్యానికి మధ్య తేడా వ్యూహాత్మక ఆలోచనా విధానమే కావొచ్చు.

ఫొటో సోర్స్, Alamy
ఆలోచనల గురించి ఆలోచించడం
చెన్ పరిశోధనా ఫలితాలు మెటాకాగ్నిషన్ మీద ఆధారపడినవి. మెటాకాగ్నిషన్ అంటే మన సొంత ఆలోచనా ప్రక్రియ గురించి మనకున్న అవగాహన. మన ఆలోచనల గురించి మనమే ఆలోచించుకోవడం.
మెటాకాగ్నిటివ్ వ్యూహం అంటే లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఎంత ముందుకు వెళుతున్నామో సమీక్షించుకోవడం, వైఫల్యాలనుంచీ నేర్చుకుంటూ, సవాళ్లను అధిగమిస్తూ ముందు సాగడం.
ఉదాహరణకు మీరు ఫ్రెంచ్ నేర్చుకుంటున్నారనుకోండి. పుస్తకం పట్టుకుని ఫ్రెంచ్ పదాలన్నీ అలా చదువుకుంటూ వెళిపోవడం కంటే మెటాకాగ్నిషన్ పద్ధతి లేదా వ్యూహాత్మక ఆలోచనావిధానాన్ని అనుసరించి నేర్చుకున్నవాటిని మీకు మీరే ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉంటే ఆ భాషను త్వరగా నేర్చుకోగలుగుతారు. గ్రామర్ పుస్తకాలు చదువుతూ దానిమీద మాత్రమే దృష్టి పెట్టేకంటే ఫ్రెంచ్ సినిమాలు చూస్తూ డైలాగులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ భాష త్వరగా పట్టుబడుతుంది. అలాగే తప్పులొచ్చినా సరే జంకకుండా ఫ్రెంచ్‌లో మాట్లాడుతూ ఉంటే భాష త్వరగా నేర్చుకోగలరు.
మెటాకాగ్నిషన్ పద్ధతి కొన్ని ప్రత్యేకమైన విభాగాల్లో మంచి ఫలితాలనిస్తుందని గత పరిశోధనల ద్వారా తేలింది.
అయితే కొందరికి సహజంగా వ్యూహాత్మక ఆలోచనావిధానం అలవడుతుందా? అనేది పరిశోధించాల్సిన విషయమని చెన్ భావించారు. వ్యూహాత్మకా ఆలోచనా విధానాన్ని నేర్పించగలమా అనేది కూడా పరిశీలించవలసిన విషయం.

ఫొటో సోర్స్, Alamy
ఈ అంశాలను పరిశీలించేందుకు చెన్ బృందం ఒక ప్రశ్నాపత్రాన్ని తయారుచేసింది.
ఈ కింది ప్రశ్నాప్రత్రాన్ని నింపడం ద్వారా మీలోని వ్యూహాత్మక ఆలోచనా విధానాన్ని మీరే స్వయంగా పరీక్షించుకోవచ్చు. కిందనున్న అంశాలను 1 (ఎప్పుడూ కాదు) నుంచి 5 (ఎల్లప్పుడూ) స్కేలు మీద కొలవండి.
- మీరు చేస్తున్న పని మధ్యలో ఆగిపోయి ముందుకు కదలనప్పుడు "ఈ చిక్కునుంచి బయటపడి ముందుకు వెళ్లడానికి నేనేం చెయ్యగలను?" అని మిమ్మల్ని మీరు ఎంత తరుచుగా ప్రశ్నించుకుంటారు?
- మీరు చేస్తున్న పనిలో పురోగతి లేనప్పుడు ఇంతకన్నా మెరుగైన పద్ధతి ఏమైనా ఉందా అని మిమ్మల్ని మీరు తరచి చూసుకుంటారా?
- మీరు ఏదైనా పనిలో నిరాశ, నిస్ఫృహలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఈ పని ఇంతకన్నా బాగా చేయ్యగలిగే పద్ధతులేమైనా ఉన్నాయా అని అన్వేషిస్తారా?
- మీరు ఏదైనా సవాలు ఎదుర్కొన్నప్పుడు దాన్ని సాధించడానికి అవసరమైన సాధనాలేమిటో అన్వేషిస్తారా?
- ఏదైనా కష్టం ఎదురైనప్పుడు, ఇందులోంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారా?
మీ స్కోరు ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువ వ్యూహాత్మక ఆలోచనా విధానం మీకున్నట్టు లెక్క.
వ్యూహాత్మక ఆలోచనా విధానం అంటే చేస్తున్న ప్రతీ పనిలోనూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ, మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటూ, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడమన్నమాట.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రయోగం మొదటి దశలో 365 మంది విద్యార్థులనుపై ప్రశ్నాపత్రం నింపమని కోరారు. వారికొచ్చిన స్కోరు ఆధారంగా రాబోయే సెమిస్టర్లో వారు ఏ యే కోర్సులను ఎలా నేర్చుకుంటారనే విషయాన్ని అంచనా వేశారు. తద్వారా వారికి ఆ కోర్సులలో రాబోయే మార్కులను కూడా అంచనా వేశారు.
తరువాతి దశలో ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్నవారు లేదా ఏదైనా లక్ష్యం దిశగా సాధన చేస్తున్నవారు (ఉదా: కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నవారు, బరువు తగ్గే దిశగా లక్ష్యాన్ని ఏర్పరచుకున్నవారు) 365 మందిని ఈ ప్రశ్నపత్రం నింపమని అడిగారు. వచ్చిన స్కోరుల ద్వారా వ్యూహాత్మక ఆలోచనా విధానం లక్ష్య సాధన దిశగా మెరుగైన ఫలితాలను అందిస్తుందని రుజువు అయ్యింది.
చివరి దశలో వ్యూహాత్మక ఆలోచనా విధానాన్ని నేర్పించవచ్చో లేదో పరీక్షించారు.
కొంతమందికి మెటాకాగ్నిషన్‌ను వివరించే ఆర్టికల్స్ ఇచ్చి చదవమని చెప్పారు. చదివాక అందులోని సారాంశాన్ని రాయమన్నారు. తరువాత వాళ్లని ల్యాబ్ కి తీసుకెళ్లి ఒక పరీక్ష పెట్టారు. అక్కడ కొన్ని గుడ్లు పెట్టి గుడ్డులోని తెల్లసొనను, పసుపు సొనను వేరు చెయ్యమన్నారు. తెల్ల సొనల డబ్బాలో పసుపు సొన పడిపోతే మార్కులు తగ్గించేస్తారు.
రెండిటినీ ఎలా వేరు చెయ్యాలన్నదానికి ప్రత్యేకమైన పద్ధతి ఏదీ లేదు. ఎవరికి తోచిన విధానాన్ని వాళ్లు అనుసరించవచ్చు. గుడ్డు చిన్నగా పగలగొట్టి మొదట పచ్చ సొనను బయటకి తీసి తరువాత తెల్ల సొనను తీయొచ్చు లేదా వేళ్లతో రెండిటినీ వేరు చెయ్యొచ్చు. ఇలా ఏ పద్ధతైనా పాటించవచ్చు. ఎంత సమర్థవంతంగా ఎన్ని ఎక్కువ గుడ్లలో సొనలను వేరు చెయ్యగలరన్నదే పరీక్ష.
"కొంతమంది చాలా సమర్థవంతంగా, చాలా క్రియేటివ్‌గా ఈ పని చేశారు" అని చెన్ తెలిపారు.
మెటాకాగ్నిషన్ గురించి ఆర్టికల్స్ చదివి తెలుసుకున్నవారు ఈ పరీక్షలో మెరుగైన పనితనం చూపించారు. చిక్కులు వచ్చినప్పుడు అందులోంచి బయటపడడానికి ప్రయత్నించడం, వైఫల్యాలనుంచి నేర్చుకుని ముందుకు వెళ్లడం, ఎప్పటికప్పుడు తమ పనిని విశ్లేషించుకుంటూ ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవడంవంటివన్నీ చేశారు.

ఫొటో సోర్స్, Alamy
దృఢ సంకల్పం కూడా ముఖ్యం
లక్ష్య సాధన దిశలో వ్యూహాత్మక ఆలోచనా విధానం ఎంత ముఖ్యమో దృఢ సంకల్పం కూడా అంతే ముఖ్యం. ఈ రెండిటికీ ఏదైనా సంబంధం ఉందా అని చెన్ బృందం పరిశీలించింది.
మెటాకాగ్నిషన్‌కు, దృఢసంకల్పానికి సంబంధం లేదని, లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ రెండూ కూడా దోహదపడతాయని వారి ప్రయోగ ఫలితాల్లో తేలింది.
యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన సైకాలజిస్ట్ ఏంజిలా డక్వర్త్ వీరి పరిశోధనను మెచ్చుకున్నారు. తను చెప్పబోయే పాఠ్యాంశంలో వీరి పరిశోధనా ఫలితాలను కూడా చేర్చాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
"దృఢసంకల్పం అనేది దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకునేందుకు దోహదపడుతుంది. లక్ష్యాలు దీర్ఘకాలికమైనవి అయినా కాకపోయినా ఒక పనిని సమర్థవంతంగా చేసేందుకు వ్యూహాత్మక ఆలోచనా విధానం తోడ్పడుతుంది" అని ప్రొఫెసర్ డక్వర్త్ అన్నారు.
"ఈ ప్రయోగాల ద్వారా అర్థమైన విషయం ఏమిటంటే కొందరికి సహజంగా వ్యూహాత్మక ఆలోచనా విధానం ఉంటుంది. అది లేనివారికి ఈ విధానాన్ని భోదించే పద్ధతులపై పరిశోధకులు దృష్టి సారించాలి" అని చెన్ అభిప్రాయపడ్డారు.
ఎడిసన్ చెప్పినట్టు "పది శాతం ప్రేరణ, తొంభై శాతం కఠోర శ్రమ" లో కొంత శ్రమ తప్పించుకుని సమర్థవంతంగా లక్ష్యాలను చేరుకోవడానికి ఈ వ్యూహాత్మక ఆలోచన విధానం తోడ్పడుతుందని చెన్ బృందం చేసిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: గాలి ద్వారా వ్యాప్తి చెందడమంటే ఏంటి? దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మందుల కొరతకి దారి తీయవచ్చా?
- కరోనావైరస్ భారత ఫార్మా పరిశ్రమను దెబ్బ తీస్తుందా?
- కరోనావైరస్ లాంటి అంటువ్యాధులు ఇటీవలి కాలంలోనే పుట్టుకొస్తున్నాయి... ఎందుకిలా?
- కరోనావైరస్: అన్ని వైరస్లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా?
- పసుపు, మిరప వంటి మసాలా దినుసుల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








