అమ్మకానికి చే గువేరా పుట్టిన ప్రదేశం

ఫొటో సోర్స్, AFP/Getty Images
20వ శతాబ్దపు వామపక్ష విప్లవకారుడు చే గువేరా స్వస్థలం అర్జెంటీనాలోని రొసారియోలో ఆయన పుట్టిన ప్రదేశాన్ని అమ్మకానికి పెట్టారు. ఈ ఇంటిని 2000 సంవత్సరంలో కొన్నానని ప్రస్తుతం ఆ ఇంటికి యజమానిగా పేర్కొన్న ఫ్రాన్సిస్కో ఫరుగ్గియా వెల్లడించారు. ఈ ఇల్లు 240 చదరపు మీటర్ల (2,580 చదరపు అడుగుల) విస్తీర్ణంలో ఉంది.
దీనిని ఓ సాంస్కృతిక కేంద్రంగా మారుద్దామని తాను భావించానని, కానీ సాధ్యపడలేదని ఫరుగ్గియా చెప్పారు. అయితే ఇంటిని అమ్మకానికి పెట్టిన ఆయన, దాని ధర ఎంతో మాత్రం చెప్పలేదు.
రొసారియా పట్టణంలో ఉన్న ఈ భవనాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పర్యాటకలు గత కొన్నేళ్లుగా సందర్శిస్తున్నారు. ఈ బిల్డింగ్‌ను సందర్శించిన వారిలో ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు జోస్ పీపే ముజికా, క్యూబా మాజీ అధినేత ఫీడెల్ క్యాస్ట్రో సంతానం కూడా ఉన్నారు. ఈ ఇంటిని సందర్శించిన వారిలో మరో ప్రముఖుడు కూడా ఉన్నారు. 1950లలో మోటార్‌సైకిల్‌పై చే గువేరాతో పాటు దక్షిణ అమెరికావ్యాప్తంగా వేల కిలోమీటర్లు ప్రయాణించిన డాక్టర్ ఆల్బర్టో గ్రానడోస్ కూడా సందర్శకులలో ఒకరు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
1928లో ఓ ధనిక-మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన చే గువేరా, దక్షిణ అమెరికాలో పేదరికం, ఆకలిని చూసి విప్లవవాదిగా మారిపోయారు. 1953-59 మధ్య సాగిన క్యూబా విప్లవంలో నియంత బటిస్టాను పదవి నుంచి పడదోయడంలో కీలకపాత్ర పోషించారు చే గువేరా.
ఈ విప్లవాన్ని దక్షిణ అమెరికాతోపాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా విస్తరించాలన్న ఆకాంక్షను చే గువేరా వ్యక్తం చేసేవారు. క్యూబా విప్లవం ముగిసిన తర్వాత ఆయన బొలీవియాలో ఉద్యమానికి నాయకత్వం వహించారు. అప్పటి ఆ దేశ అధ్యక్షుడు రెనీ బారియంటోస్ ఒర్డునోను గద్దె దించాలని ఆయన నినదించారు.
అమెరికా సైన్యం సహకారంతో బొలీవియా సేనలు చే గువేరాను, ఆయన సహచరులను బందీలుగా పట్టుకున్నాయి. 1967 అక్టోబర్ 9న లా హిగేరా అనే గ్రామంలో బొలీవియా దళాలు ఆయనను కాల్చి చంపాయి. ఆ తర్వాత ఆయన శరీరాన్ని గుర్తు తెలియని ప్రదేశంలో ఖననం చేశాయి.
1997లో ఆయన అస్థికలు బైటపడటంతో వాటిని క్యూబాకు తరలించి అక్కడ తిరిగి ఖననం చేశారు. బతికున్నకాలంలోనే కాదు, చనిపోయి దశాబ్దాలయినా ఆయన సిద్ధాంతాలు, ఉద్యమాలపై విస్తృతమైన చర్చ జరుగుతూనే ఉంది.
త్యాగనిరతి, దీక్షాదక్షతలకు మారుపేరుగా చే గువేరాను ఆయన అనుచరులు ఆరాధిస్తారు. అయితే విమర్శకులు మాత్రం ఆయన్ను క్రూరుడిగా అభివర్ణిస్తారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ మూలాలున్న హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను ఇలా స్థాపించారు
- మన దేశానికి సెకండ్ హ్యాండ్ దుస్తులు ఎక్కడి నుంచి వస్తాయి?
- ఎడిటర్స్ కామెంట్: వందేళ్ల రష్యా అక్టోబర్ విప్లవం తెలుగు సమాజానికి ఏం చేసింది?
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- భారతీయ మహారాజు కానుకగా ఇచ్చిన ఆవులు, ఎద్దులు బ్రెజిల్ దశ మార్చాయి. ఇలా..
- బలూచిస్తాన్ స్వతంత్ర దేశ ఉద్యమానికి భారత్ 'రా' సహకారం ఇస్తోందా?.. ఇప్పటికీ ఆ ప్రాంతంతో పాకిస్తాన్‌కు చిక్కులు ఎందుకు?
- కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చిచ్చు పెడుతున్న బెలూన్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








