అమెరికా: ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంబంధాలు తెంచుకుంటున్నాం - ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికాకు ఉన్న బంధాన్ని తెంచేస్తున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
కరోనావైరస్ మహమ్మారికి చైనా బాధ్యత వహించేలా చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందన్నారు..
చైనాను శిక్షించే లక్ష్యంతో తీసుకుంటున్న చర్యలను ప్రకటిస్తున్న సమయంలో “ప్రపంచ ఆరోగ్య సంస్థ పూర్తిగా చైనా గుప్పిట్లో ఉంది” అని ట్రంప్ ఆరోపించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించే తమ నిధులను వేరే సంస్థలకు మళ్లించనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యధిక నిధులు అందించే ఏకైక దేశం అమెరికా. ఇది 2019లో ఆ సంస్థకు 400 మిలియన్ డాలర్లకు పైగా నిధులు అందించింది.
ఈ ఏడాది తిరిగి అధ్యక్షుడుగా ఎన్నికయ్యేందుకు ప్రచారం చేస్తున్న ట్రంప్ ఈ మహమ్మారిని నియంత్రించలేక, దానిని కవర్ చేసుకోడానికే చైనాపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
కరోనా వల్ల అమెరికాలో అత్యధికంగా లక్షా 2 వేల మందికి పైగా చనిపోయారు.

ఫొటో సోర్స్, REUTERS/GETTY
ట్రంప్ ఏమేం అన్నారు?
“మేం ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఉన్న బంధాన్ని రద్దు చేస్తున్నాం. ఆ నిధులను ఇతర అంతర్జాతీయ ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థలకు మళ్లిస్తున్నాం” అని ట్రంప్ వైట్ హౌస్‌లో చెప్పారు.
“చైనా ప్రభుత్వం దురాగతం ఫలితంగా ఇప్పుడు ప్రపంచమంతా బాధపడుతోంది. లక్ష మందికి పైగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోయేలా చైనా ఈ విశ్వ మహమ్మారిని ఉసిగొల్పింది” అన్నారు..
“వైరస్ గురించి ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థపై చైనా ఒత్తిడి తెచ్చింది” అని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు.

ఫొటో సోర్స్, AFP
నేపథ్యం ఏమిటి?
‘ప్రాథమిక విధి’ని నిర్వహించడంలో విఫలమైందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించే నిధులను శాశ్వతంగా నిలిపివేస్తామని గత నెలలో బెదిరించిన ట్రంప్, కరోనా మహమ్మారి పట్ల డబ్ల్యుహెచ్ఓ చేపడుతున్న చర్యలను విమర్శించారు.
మే 18న డబ్ల్యుహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్‌కు లేఖ రాసిన ట్రంప్, అందులో “ప్రపంచం తీవ్రంగా నష్టపోయేలా చేసిన ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో మీరు, మీ సంస్థ పదే పదే తప్పటడుగులు వేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది” అన్నారు.
తర్వాత అమెరికా అధ్యక్షుడు డబ్ల్యుహెచ్ఓను చైనా చేతిలో ‘కీలుబొమ్మ’గా వర్ణించారు.
ఇటు, అమెరికాలో కరోనా వైరస్ వ్యాపించడానికి ఆ దేశమే కారణం అని చైనా ఆరోపించింది. "అబద్ధాలు చెప్పే అమెరికా రాజకీయ నాయకులే" కరోనా వ్యాప్తికి కారణం అంది.
“ట్రంప్ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు.కరోనాను ఎదుర్కోవడంలో అమెరికా అసమర్థతకు మేమే కారణమని, మాపై బురదజల్లాలని ప్రయత్నిస్తున్నారు” అని ఏప్రిల్ ప్రారంభంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ ఆరోపించారు.
కరోనా మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న స్పందనపై స్వతంత్ర దర్యాప్తు చేసేందుకు డబ్ల్యుహెచ్ఓ సభ్య దేశాలు అంగీకరించాయి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- భారత్‌లో పరిస్థితులు చేయిదాటిపోతాయా? ‘కళ్లకు గంతలు కట్టుకుని’ యుద్ధం చేయగలమా?
- కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లాక్డౌన్ ప్రభావం ఎలా ఉంది.. లాక్డౌన్లలో కేసులు ఎలా పెరిగాయి
- కరోనావైరస్: మృతుల సంఖ్యలు చైనాను దాటేసిన భారత్.. దక్షిణ కొరియాలో మళ్లీ పాఠశాలల మూసివేత
- భారత్‌లో పరిస్థితులు చేయిదాటిపోతాయా? ‘కళ్లకు గంతలు కట్టుకుని’ యుద్ధం చేయగలమా?
- ‘నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా.. లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది’
- పాకిస్తాన్ నుంచి మిడతల దండు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వైపు వచ్చేస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








