పాకిస్తాన్ విమాన ప్ర‌మాదం:‘‘విమానం ఎక్కేముందు ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్న ఫోటో అన్న‌య్య నాకు పంపించారు.. అందులో ఆయన డ్రెస్ ఆధారంగా మృతదేహాన్ని గుర్తించాం’’

అంబులెన్సులోకి చేర్చుతున్న మృతదేహాలు
    • రచయిత, రియాజ్ సొహైల్
    • హోదా, బీబీసీ ఉర్దూ

క‌రాచీ విమాన ప్ర‌మాద మృతుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 66 మంది మృత‌దేహాల‌ను గుర్తుప‌ట్టారు. పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం శుక్ర‌వారం కుప్ప‌కూలింది.‌

మిగిలిన మృత‌దేహాల‌ను గుర్తుప‌ట్టేందుకు వేలిముద్ర‌లు, డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

కొన్ని మృత‌దేహాలు గుర్తుప‌ట్ట‌డానికి వీలు లేనంత‌గా కాలిపోయాయ‌ని త‌న మేన‌ల్లుడి మృత‌దేహాన్ని గుర్తుపట్టేందుకు క‌రాచీలోని ఈధి మార్చురీకి వ‌చ్చిన స‌య్య‌ద్ ఇమ్రాన్ అలీ.. బీబీసీ ప్ర‌తినిధి రియాజ్ సొహైల్‌కు వివ‌రించారు.

కరాచీలోని మార్చురీ బయట మృతదేహాల కోసం పెట్టెలు
ఫొటో క్యాప్షన్, కరాచీలోని మార్చురీ బయట మృతదేహాల కోసం పెట్టెలు

త‌న మేన‌ల్లుడిని గుర్తుప‌ట్టేందుకు త‌న డీఎన్ఏ న‌మూనాను ఆయ‌న క‌రాచీ యూనివ‌ర్సిటీలో ఇచ్చారు. ప‌రీక్ష‌ల‌ ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నారు.

త‌మ బంధువుల‌ను గుర్తుప‌ట్టేందుకు వ‌చ్చిన 47 మంది నుంచి డీఎన్ఏ న‌మూనాల‌ను సేక‌రించామ‌ని సింధ్ ఆరోగ్య మంత్రి తెలిపారు.

బాధితుల స‌మాచారం ఒక‌చోట లేక‌పోవ‌డంతో త‌న మేన‌ల్లుడు స‌య్య‌ద్ ఆర్మ‌గ‌న్ అలీని వెతుక్కుంటూ నాలుగు ఆసుప‌త్రులు తిర‌గాల్సి వ‌చ్చింద‌ని స‌య్య‌ద్ ఇమ్రాన్ అలీ వివ‌రించారు.

ఎక్క‌డా స‌మాచారం ల‌భించ‌క‌పోవ‌డంతో ఆయ‌న ఈధి మార్చురీకి వ‌చ్చారు.

కూలిన విమానం

ఫొటో సోర్స్, EPA/SHAHZAIB AKBER

మొద‌టి ద‌శ‌లో వేలిముద్ర‌ల సాయంతో మృత‌దేహాల‌ను గుర్తుప‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీని కోసం నేష‌న‌ల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేష‌న్ అథారిటీ (ఎన్ఏడీఆర్ఏ) బృందాలు ఇప్ప‌టికే క‌రాచీ చేరుకున్నాయి.

ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన దిల్ష‌ద్ అహ్మ‌ద్ మృ‌త‌దేహాన్ని ఆయ‌న‌ త‌మ్ముడు సులువుగానే గుర్తుప‌ట్టారు. అయితే ఆ మృ‌త‌దేహాన్ని తీసుకెళ్ల‌డంలో ఇబ్బందులు త‌లెత్తాయి. ఆసుప‌త్రులకు మృ‌తుల బంధువులు పోటెత్త‌డ‌మే దీనికి కార‌ణం.

బ‌ట్ట‌లు, వాచీ సాయంతో ఆయ‌న త‌న సోద‌రుడి మృ‌త‌దేహాన్ని గుర్తుప‌ట్టారు.

“విమానం ఎక్కేముందు ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్న ఫోటో ఒక‌టి మా అన్న‌య్య నాకు పంపించారు. దాని ఆధారంగా ఆయ‌న వేసుకున్న బ‌ట్ట‌లేంటో గుర్తించ‌గ‌లిగాం”

విమానం ఎక్కేముందు దిల్ష‌ద్ అ‌హ్మ‌ద్‌.. త‌ల్లి, భార్య‌తోనూ ఫోన్‌లో మాట్లాడారు.

మార్చురీ దగ్గర

"విమానం కూలిపోయింద‌ని వార్త రాగానే.. దానిలో మా అన్న‌య్య ఉన్నార‌ని స్ప‌ష్ట‌మైంది. వెంట‌నే ఆయ‌న ఆచూకీ కోసం వెత‌కు‌తూ ఘ‌ట‌న స్థ‌లానికి వ‌చ్చాం. కొద్దిసేప‌టికే విమానంలో ప్ర‌యాణించినవారి జాబితాను అధికారులు విడుద‌ల‌చేశారు. అందులో మా అన్న‌య్య పేరుంది. జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంట‌ర్‌లో గుర్తుప‌ట్టిన అనంత‌రం మృత‌దేహాన్ని మాకు అప్ప‌గించారు"అని దిల్ష‌ద్ సోద‌రుడు వివ‌రించారు.

వేలి ముద్ర‌ల‌తో గుర్తుప‌ట్ట‌డం సాధ్యంకాని మృత‌దేహాల‌కు డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్ర‌క్రియ కొంత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశ‌ముంద‌ని వివ‌రించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)