సముద్రపు ముసుగు దొంగలు తుపాకుల మోతతో దాడి చేసి కిడ్నాప్ చేసిన రోజు...

సముద్రపు దొంగలు
    • రచయిత, కెవిన్ పొన్నయ్య
    • హోదా, బీబీసీ న్యూస్

మర్చంట్ నౌకలో ఉద్యోగం అంటే కాస్త సాహసంతో కూడుకున్నదని, జీవితం మెరుగవుతుందని భావించారు సుదీప్ చౌదరి.

సొంత ఊరికి సుదూరంగా, పశ్చిమ ఆఫ్రికా సముద్ర జలాల మీద ఒక చమురు ట్యాంకర్‌ నౌకలో చేసే ప్రయాణం తన జీవితాన్నే తల కిందులు చేస్తుందని ఈ యువ పట్టభద్రుడు ఊహించలేదు.

మాదక ద్రవ్యాలే జీవితంగా బతికే అడవి దొంగలు, వారి రహస్య నాయకుడు 'ది కింగ్' చేతుల్లో తన బతుకు చిక్కుకుంటుందని కలలోనైనా అనుకుని ఉండరు.

నౌక

అప్పుడే సూర్యోదయం అవుతోంది. ఎం టి అపికస్ నౌక నైజీరియాలోని బోని ద్వీపం దగ్గర ఆ రోజుకి లంగరు వేసి విశ్రమించింది. ఆ రోజు సుదీప్ చౌదరి షిఫ్ట్ పూర్తి చేసుకుని తీరం వెంబడి చూసినప్పుడు డజన్ల కొద్దీ నౌకలు తీరంలో కనిపించాయి. తీరానికి అవతల తెల్లని ఆయిల్ ట్యాంకర్లు బారులు తీరి ఉన్నాయి.

పొద్దున్న అల్పాహారం తీసుకుని సుదీప్ తన తల్లి తండ్రులకి, తన కాబోయే భార్య భాగ్య శ్రీకి ఫోన్లు చేశారు. సుదీప్ ఒకే ఒక్క కొడుకు. ఇంటి దగ్గర తన గురించి తల్లి తండ్రులు ఎదురు చూస్తుంటారని సుదీప్ కి తెలుసు. వారితో కాసేపు ముచ్చటించిన తర్వాత సాయంత్రం తిరిగి ఫోన్ చేస్తానని చెప్పి ఆ రోజుకి విశ్రమించారు.

ఆ రోజు ఏప్రిల్ 19, 2019. సుదీప్ పని చేస్తున్న నౌకలో తనతో పాటు మరో 15 మంది ఉన్నారు. వారి నౌక పోర్ట్ అఫ్ లాగోస్ నుంచి దక్షిణ దిక్కుగా ప్రయాణించి నైజర్ డెల్టా వైపుగా ప్రయాణించింది. ఈ ప్రాంతంలో 1950 లలో డచ్, బ్రిటిష్ వ్యాపారులు ఆయిల్ ని కనుగొన్నారు.

ఈ ప్రాంతంలో కరడుగట్టిన సముద్ర దొంగలు ఉంటారని సుదీప్‌కు తెలుసు కానీ, నైజీరియా నౌకా దళ సిబ్బంది తీరంలో గస్తీ కాస్తుండటంతో తనకేమి ప్రమాదం లేదని భావించారు.

అపికస్ నౌక బోనీ ద్వీపానికి 7 నాటికల్ మైళ్ళ దూరంలో ఓడ రేవు చేరేందుకు అనుమతి కోసం ఎదురు చూస్తోంది.

సముద్రపు దొంగలు

ఏడు పశ్చిమ ఆఫ్రికా దేశాల తీరాలని తాకే గల్ఫ్ అఫ్ గునియా జలాలు ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైనవి. ఒకప్పుడు సోమాలియా ప్రమాదకరంగా ఉండేది. కానీ, ప్రస్తుతం గల్ఫ్ అఫ్ గునియా సముద్ర దోపిడీలకు ఆవాసంగా మారింది.

గత సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 90 శాతం సముద్రపు దోపిడీలు ఈ ప్రాంతం నుంచే చోటు చేసుకున్నాయి.

2019లో మూడు నెలల్లో మొత్తం ఆరు నౌకలు నుంచి 64 మందిని సముద్రపు దొంగలు ఎత్తుకుని వెళ్లినట్లు ఇంటర్నేషనల్ మారిటైం బ్యూరో తెలిపింది. చాలా ఘటనలు అసలు నమోదు కూడా కాకపోయి ఉండవచ్చు.

ఈ ప్రాంతంలో లభ్యమయ్యే చమురు నిక్షేపాలు చాలా మందిని ధనికుల్ని చేశాయి. కానీ, అదే కొందరికి శాపంగా మారింది. ఈ ఆయిల్ వలన సముద్ర తీరం, చుట్టు పక్కల ఉండే భూమి కలుషితంగా మారింది. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని నేర సామ్రాజ్యాలు కూడా తమ పెత్తనాన్ని చాటుకున్నాయి. నైజీరియా ప్రభుత్వానికి, అంతర్జాతీయ ఆయిల్ కంపెనీలకి భారీగా ఆదాయాన్ని చేకూర్చే ఈ ప్రాంతం చుట్టూ ఉండే ప్రజల ఆయుః ప్రమాణం మాత్రం 45 సంవత్సరాలే.

కామిక్ పుస్తకాల పేరుతో ఉండే నైజర్ డెల్టా అవెంజర్స్ లాంటి కొన్ని మిలిటెంట్ గ్రూప్లు అక్కడ ఆయిల్ పైప్ లైన్లని ధ్వంసం చేసి ఉత్పత్తి సామర్ధ్యానికి కూడా గండి పెట్టారు. ఇక్కడ లభ్యమయ్యే నిధుల్ని, నీటిని అన్ని వర్గాల వారికి సమానంగా పంచాలని డిమాండ్ చేశారు. కొంత మంది ఆయిల్ దొంగలు ఇక్కడ లభించే క్రూడ్ ఆయిల్ని అడవుల్లో ఉండే కర్మాగారాల్లో శుద్ధి చేస్తారు. ఈ ప్రాంతంలో హింస ఒక్కొక్కసారి తగ్గుతూ ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది. అయితే, ప్రమాదం మాత్రం ఎప్పుడూ పొంచే ఉంటుంది.

దబ దబా బాదుతున్న చప్పుడు కి, అరుపులకి సుదీప్ కి తెలివి వచ్చింది. నౌక కమాండ్ గదిలో ఉండే వాచ్ మాన్ ఆయుధాలు ధరించి తమ నౌక వైపు దూసుకుని వస్తున్న 9 మందిని చూసారు. అతని అరుపులు 80 మీటర్ల షిప్లో ప్రతి ధ్వనించాయి. ఎవరూ ఆ దొంగల్ని తమ దగ్గరకి రాకుండా అడ్డుకోలేరు. వారు చేయగలిగిందల్లా కేవలం అప్పటికి ఎవరికీ కనపడకుండా దాక్కోవడమే.

అపికస్ లో పని చేస్తున్న మరో ఐదుగురు భారతీయులకి 28 సంవత్సరాల సుదీప్ మూడవ ఆఫీసర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. తామున్న నౌకలో ఆయిల్ లేదు అంటే ఆ సముద్రపు దొంగలు తమ కోసం కానీ, భారీగా దొరికే మూల్యం కోసం కానీ వస్తున్నారని సుదీప్ కి అర్ధం యింది. సాధారణంగా అమెరికా, యూరోపియన్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం భారీగా మూల్యం చెల్లిస్తాయి. అందుకు వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ, అత్యధికంగా నావికులు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వస్తారు. అపికస్ లో ఉన్న ఐదుగురు భారతీయలు తప్ప మిగిలిన అందరూ ఆఫ్రికన్లే.

సముద్రపు దొంగలు

ఫొటో సోర్స్, BBC

సముద్రపు దొంగలు తమ నౌకని కబళించడానికి ఇంకొక 5 నిమిషాలు ఉందనగా సుదీప్ ఇంజిన్ గదిలో ఉన్న తన సిబ్బందికి సమాచారం అందించి, నౌక పైకి వెళ్లి అత్యవసర అలారం ని ఆన్ చేశారు. తను కేవలం పడుకునే ముందు వేసుకున్న షార్ట్స్ లో ఉన్నానని ఆయనకి కిందకి దిగుతుండగా అర్ధం అయింది

అప్పుడే టీ షర్ట్ లు ధరించి, చేతిలో ఆయుధాలు పట్టుకుని , నల్లని వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్న దొంగలని చూసారు. అప్పటికే వారు తమ నౌక దగ్గరకి వచ్చి నౌకలోకి రావడానికి నిచ్చెన తగిలిస్తున్నారు.

భారతీయ సిబ్బంది అంతా లైట్లు, వైర్లు, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలు దాచి పెట్టిన స్టోర్ రూమ్ లో దాగి ఉండాలని నిర్ణయించుకున్నారు. వారి ఊపిరిని బిగ పెట్టుకుని ఉండటానికి ప్రయత్నించారు. ఇంతలో దొంగలు నౌక చుట్టూ తిరుగుతున్న అడుగుల చప్పుడు, హాహాకారాలు వినిపించడం మొదలయింది. నావికులంతా వణికిపోతున్నారు. సాధారణంగా గల్ఫ్ ఆఫ్ గునియాలో ప్రయాణించే నౌకల్లో బులెట్ ప్రూఫ్ గోడలతో ఉండే సురక్షిత గదులు ఉంటాయి. కానీ, అపికస్ లో ఈ గదులు లేవు. అడుగులు చప్పుడు వినిపిస్తుండగానే, తలుపు బోల్ట్ తీస్తున్న శబ్దం వినిపించింది.

'లేవండి.'

దొంగలు నేల మీదకు కాల్పులు జరిపారు. సుదీప్ ఎడమ కాలి లోకి, నరానికి ఒక్క అంగుళం దూరంలో ఒక చిన్న బులెట్ తాకింది. నావికులనందరిని వారు అదుపులోకి తీసుకుని, నౌక పై భాగానికి తీసుకుని వచ్చారు. అప్పటికే నౌక కెప్టెన్ ఆపదలో ఉన్నట్లు సందేశాన్ని పంపించారు. దీంతో చుట్టు పక్కల ఉండే నౌకల వారికి ఈ సమాచారం అందే ఉంటుంది.

భారతీయులందరిని పక్కనే ఉంచిన స్పీడ్ బోట్ లోకి వెళ్ళమని దాడి చేసిన వారు ఆదేశించారు. ఆ బోట్ కి వేగంగా ప్రయాణించడం కోసం రెండు ఇంజన్లు ఉన్నాయి. మొదటి సారి ఉద్యోగంలో చేరిన 22 సంవత్సరాల చిరాగ్ మొదట వారి ఆదేశాలకి తల వంచారు. దొంగలు తమ వైపు తుపాకీలని గురి పెట్టగా మిగిలిన సిబ్బంది కూడా వారిని అనుసరించారు.

ఐదుగురు భారతీయులు, ఒక నైజీరియా దేశస్థుడుని వారు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక్క భారతీయ సిబ్బంది తప్పించుకోగలిగారు. తమ తోటి సిబ్బందిని కళ్ళకి గంతలు కట్టి దొంగలు ఎత్తుకుని వెళుతుండగా మిగిలిన వారు చూస్తూ ఉండిపోయారు.

నౌక

అర్ధ రాత్రి షిప్పింగ్ ఏజెంట్ నుంచి ఒక సందేశం వచ్చింది.

సుదీప్ ప్రయాణిస్తున్న నౌకను సముద్ర దొంగలు కబళించారు. ఆ నౌక గ్రీక్ యజమాని అధికారులతో మాట్లాడుతున్నారు. భయపడవద్దు. సుదీప్ క్షేమంగానే ఉంటారు. ఓపిక పట్టండి.

ఈ సందేశాన్ని చూసిన ప్రదీప్ చౌదరి అతని భార్యకు ఒక్క క్షణం ప్రపంచం తలకిందులయినట్లు అనిపించింది. అంతకు కొన్ని గంటల ముందే వారు తమ కొడుకుతో మాట్లాడారు. ప్రదీప్ తన కుటుంబ సభ్యులకి, స్నేహితులకి ఈ విషయం గురించి సందేశం పంపించారు. ఇది నిజమో కాదో వారికి అర్ధం కాలేదు.

సుదీప్ చిన్నప్పటి నుంచి తెలిసిన వారెవరైనా అల్లరి పిల్లవాడని చెబుతారు. ఎప్పుడూ ఏదో సాహసం చేయాలనే తపనతో ఉండేవారు.

సుదీప్ గురించి అతని తల్లికి ఎప్పుడూ బెంగ ఉండేది. వారు ఎక్కువ కాలం ఒడిశా లోని భువనేశ్వర్ లో నివసించారు. సుదీప్ తండ్రి తమ ఇంటి ముందే ఫోటో కాపీ షాప్ ని నడిపేవారు.

సుదీప్ కి దేవుడిపై నమ్మకం లేదు. తాను, తన ప్రియురాలు భాగ్యశ్రీ తో కలిసి జీవించే జీవితం గురించి మాత్రమే కలలు కన్నారు. ఆమె ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.

సాధారణ భారతీయ యువత లాగే వీరు కూడా ఒక సుస్థిర జీవితం ఏర్పరుచుకోవాలని కలలు కన్నారు.

సుదీప్ తల్లితండ్రులు

మర్చంట్ నౌకలో ఉద్యోగం సుదీప్ కి జీవితం పై ఆశలు కల్పించింది. ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బు, ప్రపంచాన్ని చుట్టి వచ్చే అవకాశం సుదీప్ ని ఆకర్షించాయి. వ్యాపార ఓడల్లో ఉద్యోగం చేసేవారిలో, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ కి చెందినవారు కూడా ఉంటారు. 2019 లో కనీసం ఈ నౌకల్లో వివిధ ఉద్యోగాల్లో పని చేసిన వారు 234000 మంది ఉన్నారు.

కానీ, ఇందులో ఉద్యోగంలో చేరడానికి తగిన అర్హతలు కూడా ఉండాలి. అందుకోసం సుదీప్ ఐదేళ్ల పాటు చదివారు. చదువు కోసం ఆయన కుటుంబానికి కూడా చాలా ఖర్చయింది. 27 సంవత్సరాల వయసులో థర్డ్ ఆఫీసర్ గా నైపుణ్యం సంపాదించుకుని ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన తన కుడి చేయి మీద సముద్రం, నౌకతో కూడిన టాటూ ని కూడా వేయించుకున్నారు.

నావికులు కిడ్నాప్ అయిన మరుసటి రోజు అడవి లోంచి కొన్ని డజన్ల కొద్దీ మనుషులు వచ్చి అరగంట సేపు వారి విజయానికి గుర్తుగా తుపాకీలతో గాలిలోకి కాల్పులు జరిపారు. పడవ మీదే ఉండిపోయిన ఐదుగురు భారతీయులు ఆశని కోల్పోయి అక్కడే ఉన్న మట్టి రంగు నీటి వైపు చూస్తూ ఉండిపోయారు.

అదే నీటిలో మెలికలు తిరుగుతూ అడవిలో ఉన్న జైలుకి తమని తీసుకుని వెళ్లారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాం అనే సందేశాన్ని మాత్రం మాకు పదే పదే ఇస్తుండేవారు.

సుదీప్ ముందు రోజు రాత్రి ధరించిన షార్ట్స్ లోనే ఉన్నారు. ఒక వైపు తనని దోమలు కుడుతూనే ఉన్నాయి. కాలికి తగిలిన బులెట్ గాయానికి మందు లేదు. దాంతో, అతను గాయానికి మట్టి పూత వేసుకున్నారు. అందరూ కలిపి ఒక మాసిపోయిన చాపని కొన్ని నిమిషాల పాటు పడుకోవడానికి వాడేవారు.

దోపిడీదారులు గతంలో అదుపులోకి తీసుకున్న వ్యక్తుల యజమానులు తమకి అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే వారి గతి ఏమైందో వివరిస్తూ ఒక ఆస్థి పంజరాన్ని తెచ్చి చూపించేవారు. అదొక్కటే కాదు.

ఇంకొక రోజు కాంక్రీట్ దిమ్మలని చూపించి వాటికి కట్టి సముద్రంలోకి విసిరేస్తామని బెదిరించేవారు.

వీరున్న చోటు నుంచి 10 మీటర్ల దూరంలో దొంగలు వీరికి కాపలా కాసేవారు. వారు చేపలు వేటాడుతూ, గంజాయి తాగుతూ, నాటు సారా తాగుతూ ఉండేవారు. కానీ, అదుపులోకి తీసుకున్న వారి పై వారి దృష్టి ఉండేది. అప్పుడప్పుడూ తుపాకీ చూపిస్తూ, అరుస్తూ ఉండేవారు.

సుదీప్ వారిలో కొంత మందితో మాట్లాడటానికి ప్రయత్నించేవారు. వారు ఎలా ఉన్నారని, వాళ్లకి పిల్లలు ఉన్నారా లాంటి ప్రశ్నలు వేసేవారు. అయితే, వారి దగ్గర నుంచి మాత్రం ఎప్పుడూ ఎటువంటి సమాధానం వచ్చేది కాదు. అయితే నిశ్శబ్దంగా ఉండేవారు, లేదా మాతో మాట్లాడకు అని బెదిరించేవారు. వారికి చాలా కఠినమైన ఆదేశాలు ఉన్నట్లు కనిపించింది. అదే అడవిలో వేరే చోట 'ది కింగ్' అనే పేరుతో వారి నాయకుడు ఉంటాడని అర్ధం అయింది.

సుదీప్

సుదీప్ తో పాటు చిరాగ్ (22), అంకిత్ (21), అవినాష్ (22), మూడు (34) - ఓపిక నశించి ఏదో మాయ జరగాలని ఎదురు చూస్తున్నారు.

వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఒక్కొక్కసారి వారికి ఒక కప్ నూడుల్స్ ఇచ్చేవారు. దానినే ఐదుగురూ పంచుకుని తినేవారు.

తాగడానికి మురికి నీరు మాత్రమే ఇచ్చేవారు. ఒక్కొక్కసారి అందులో పెట్రోల్ కలిపి ఇచ్చేవారు. ఒక్కొక్కసారి దాహానికి నదిలో ఉండే ఉప్పు నీరు తాగేవారు. నైజీరియా కెప్టెన్ ని మాత్రం దగ్గర్లో ఉన్న గుడిసెలో పెట్టారు. అతనిని కొంచెం మెరుగుగా చూసేవారు.

సమయం గడపడానికి ఇంటి దగ్గర తాము గడిపిన జీవితం గురించి, కన్న కలల గురించి మాట్లాడుకునే వారు. చుట్టూ ఉన్న ప్రకృతిని చూసేవారు. పాములు చెట్ల పైకి పాకడం, పక్షులు ఎగరడం కనిపించేవి. ఒక వేళ కోతి కనిపిస్తే దొంగలు దానిని కాల్చుకుని తినేవారు. వీరికి ఎప్పుడూ మాంసం ఇచ్చేవారు కాదు.

వారిలో కొంత మందికి డైయేరియా వచ్చింది. కొంత మంది మలేరియా కి గురయ్యారు. ఒక వేల దొంగలు తమని చంపడానికి వస్తే ఎలా అని ఊహించుకుంటూ భయంతో గడిపేవారు.

ఆశని వదులుకోకుండా ఉండటానికి నిత్యం యుద్ధం చేయవలసి వచ్చేది. సుదీప్ ఈ కష్టం నుంచి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తూనే ఉండేవారు. ఒక వేళ భారతీయ హై కమిషన్ కానీ, తన కుటుంబ సభ్యులు కానీ కాల్ చేస్తే ఏమి మాట్లాడాలో ఆలోచించుకుంటూ ఉండేవారు. తన పెళ్లి గురించి కలలు కంటూ ఉండేవారు.

దొంగలు మొదట్లో కొన్ని కోట్ల డాలర్లలని డిమాండ్ చేశారు. అది చాలా ఎక్కువ మొత్తం. అంత మొత్తం ఎవరూ ఇవ్వరు. కానీ, ఇలాంటి కిడ్నాపులు జరిగినప్పుడు చాలా క్లిష్టమైన చర్చలతో కూడుకుని ఉంటాయి. సమయం, అవకాశం ఎప్పుడూ దొంగల వైపే ఉంటుంది.

దాడి జరిగిన 15 రోజులకి, దొంగలు సుదీప్ ని పడవలో అడవిలో ఇంకొక వైపుకు తీసుకుని వెళ్లారు. అక్కడ నుంచి ఒక సాటిలైట్ ఫోన్ ఇచ్చి నౌక యజమానితో మాట్లాడమన్నారు. ఆ నౌక యజమాని ఒక గ్రీక్ వ్యాపారి. పెట్రోగ్రెస్ ఇన్క్ పేరుతో నడిచే అతని కంపెనీకి చాలా ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయి.

సుదీప్ కి అతని యజమాని కెప్టెన్ క్రిస్టోస్ గురించి పెద్దగా తెలియదు. కానీ, అతను చాలా కోపిష్టి వ్యక్తి అని విని ఉన్నారు. సర్, మేము చాలా దీన స్థితిలో ఉన్నాం. మీరు సత్వరమే ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మేము మరణించేలా ఉన్నామని చెప్పారు.

అతను సుదీప్ మాటలకి ఏమీ చలించలేదు. "మాకు డబ్బు మాత్రమే కావాలి. డబ్బు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాం” అని పదే పదే దొంగలు మరో వైపు అరిచేవారు.

కొన్ని వారాల పాటు సంప్రదింపులు జరిపిన తర్వాత నౌకల యజమానులు ఇచ్చే సొమ్ము మీదే ఈ దొంగల వ్యాపారం ఆధార పడి ఉంటుంది. కానీ, ఇక్కడ నౌక యజమాని కూడా మొండిగా ఉన్నారు. దాంతో, బందీల కుటుంబ సభ్యుల తో మాట్లాడటం ఒక్కటే మార్గం.

మరో వైపు సుదీప్ తల్లి తండ్రులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. తమ కొడుకు వస్తాడో రాడో అనే భయం వారిని వెంటాడుతోంది.

దొంగలు అడిగిన మొత్తం ఇవ్వడం కుటుంబాలకి సాధ్యం అయ్యే పని కాదు.

భారత ప్రభుత్వం అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరికీ ఇవ్వదు. కానీ, ప్రభుత్వం తమని దాచి పెట్టిన స్థలాన్ని కనిపెట్టడం కానీ, నౌక యజమాని అడిగిన డబ్బుల్ని చెల్లించేలా చేయడం కానీ చేస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.

సుదీప్

మరో వైపు సుదీప్ కాబోయే భార్య భాగ్యశ్రీ, దూరపు బంధువు స్వప్న కిడ్నాప్ అయిన వారందరి కుటుంబ సభ్యులతో కలిసిన వాట్సాప్ గ్రూప్ ని చేశారు. అందరూ కలిసి వారిని విడిపించగలరేమో అనే ఆశ.

వీళ్ళని చంపడం వలన దొంగలకి కలిగే లాభం ఏమీ లేదని భాగ్యశ్రీ కి అర్ధం అయింది. కానీ, వారు ఎంత వరకు ఓపిక పడతారో అనే భయం మాత్రం వెంటాడుతోంది.

ఆ నౌక యజమానిని అన్ని వైపుల నుంచి ఒత్తిడి చేయడం ఒక్కటే మార్గంగా కనిపించింది. ఇక తన రోజులన్నీ అందరికీ సందేశాలు పెట్టడంలోనూ, ట్వీట్ చేయడంలోనూ, ఇమెయిల్ రాయడంలోనూ గడిపింది.

ఎవరైనా సహాయం చేస్తారేమో అనే ఆశ .

సరిగ్గా మూడు వారాల తర్వాత బందీ అయిన 17 వ రోజుకి బందీగా ఉన్న అవినాష్ నుంచి వారి చెల్లికి ఫోన్ వచ్చింది. బందీలంతా సజీవంగా ఉన్నారని వారంతా సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

మిగిలిన వారికి కూడా ఫోన్లు రావడం మొదలు పెట్టాయి. కానీ, భాగ్య శ్రీ కి కానీ, సుదీప్ తల్లి తండ్రులకి కానీ ఎటువంటి ఫోన్లు రాలేదు.

ఈ నావికుల్లో ఒకరి బంధువు నేరుగా దొంగలతో మాట్లాడటం ప్రారంభించారు. అతను అంతకు ముందు కెప్టెన్ గా పని చేశారు. అయితే, ఆయన పంపించే ఆడియో రికార్డింగ్ లు బందీల కుటుంబాలకి స్వాన్తన ఇవ్వలేకపోయేవి.

నౌక యజమాని తన సిబ్బంది గురించి పెద్దగా పట్టించుకోలేదని ఒక దొంగ ఒక కాల్ లో చెప్పారు.

మే 17 వ తేదీ, 2019 న - సరిగ్గా 28 వ రోజున సుదీప్ కి కెప్టెన్ నసీబ్ తో మాట్లాడే అవకాశం దొరికింది. నాతో మాట్లాడినట్లు మా ఇంట్లోవాళ్ళకి చెప్పండి అని సుదీప్ చెప్పారు.

సముద్రపు దొంగలు

ఫొటో సోర్స్, Getty Images

వీరిని అడవిలో ఒక చోటు నుంచి మరొక చోటుకి మారుస్తూ ఉండేవారు. నౌక యజమానితో జరుపుతున్న సంప్రదింపులు సఫలం కాకపోవడంతో ఒక రోజు నేరుగా ది కింగ్ వీరిని చూడటానికి వచ్చారు. అతను ఎక్కువ మాట్లాడేవారు కాదు. కానీ అతని ఆకారం, ఎత్తు , నడుముకి చుట్టుకున్న బుల్లెట్లతో కూడిన బెల్ట్ చూస్తే మాత్రం చాలా భయం వేసేది.

అతను ప్రతి నాలుగైదు రోజుల కొకసారి వచ్చి చూసి వెళ్లేవారు. బందీల ముందు గంజాయి పీల్చేవారు. కెప్టెన్ క్రిస్టోస్ మాట వినకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించేవారు. అతను మిగిలిన వారి కంటే మంచి ఇంగ్లీష్లో మాట్లాడేవారు.

నెల రోజుల పాటు బందీలుగా ఉన్న తర్వాత నావికులు సన్నగా అయిపోతున్నారు. కళ్ళు నీరసించిపోయి, పీక్కుపోయారు.

వారి గతి కూడా దొంగలు చూపించిన ఆస్థి పంజరం లానే అయిపొతుందెమో అనే భయం పట్టుకుంది.

కానీ, పరిస్థితులు మరోలా మలుపు తిరిగాయి.

టాంకర్ కంపెనీ క్రూడ్ ఆయిల్ ని నైజర్ డెల్టా నుంచి ఘనా కి అక్రమంగా తరలిస్తుందనే అభియోగాలని నైజీరియా నావికాదళం చేసింది. రెండు నేర సామ్రాజ్యాల మధ్య ఏర్పడిన కలహమే ఎపికస్ మీద దాడికి దారి తీసిందని నైజీరియా నావికా దళం పేర్కొంది.

అందులో కొంత మందిని అరెస్ట్ కూడా చేశారు. నైజీరియా లో ఉన్న షిప్ కంపెనీ మేనేజర్ తమ కంపెనీ అక్రమ ఆయిల్ వ్యాపారం చేస్తున్నట్లు అంగీకరించారు.

అయితే, షిప్ యజమాని మాత్రం ఈ అభియోగాలని ఖండించారు. బీబీసీ చూసిన ఈ మెయిల్స్లో, మిలిటంట్లతో సంప్రదింపులు జరిపి , అడిగిన మొత్తాన్ని చెల్లించడానికి భారత ప్రభుత్వమే అతని నౌకల్ని స్వాధీనం చేసుకోవడానికి నైజీరియా నావికా దళానికి సహాయం చేసిందని అభియోగం మోపారు. దీని పై నైజీరియా నావికాదళం ఏమీ సమాధానం ఇవ్వలేదు.

ఇది బందీలకి కీలక సమయం. కానీ, నైజీరియాలో నౌక యజమాని వ్యాపార కార్యకలాపాలకి బ్రేక్ పడటంతో దొంగలతో సంప్రదింపులు జరపక తప్పలేదు.

జూన్ 13 వ తేదీన సంప్రదింపులు పూర్తి అయ్యాయని, దొంగలు అడిగిన మొత్తం ఇస్తున్నట్లు భారత ప్రభుత్వం నుంచి సుదీప్ తల్లి తండ్రులకి సందేశం వచ్చింది. ఇక నావికులు బయట పడే సమయం దగ్గర అయినట్లు సూచనలు అందాయి.

జూన్ 29 వ తేదీ 2019: ఆ రోజు మధ్యాహ్నం నూడుల్స్ ఇస్తూ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ రోజే అడవిలో వారికి ఆఖరి రోజని కాపలా దొంగ చెప్పారు.

రెండు గంటల తర్వాత ఆ కాపలాదారుడు వచ్చి డబ్బు పట్టుకుని వస్తున్న వ్యక్తి దారిలో ఉన్నారని చెప్పారు.

ఆ రోజు మధ్యాహ్నం సన్నంగా ఉన్న ఒక ఘనా దేశస్థుడు యు ఎస్ డాలర్లతో నిండిన ఒక ప్లాస్టిక్ బాగ్ పట్టుకుని భయం భయంగా వచ్చారు. అతనికి అంతకు ముందు ఇలాంటి విషయాల్లో అనుభవం ఉన్నట్లు కనిపించలేదు. ఎందుకో అంతా సవ్యంగా జరుగుతున్నట్లు అనిపించలేదు. కొంత సేపటికి దొంగలు అతనిని పట్టుకుని కొట్టడం మొదలు పెట్టారు.

డబ్బులు తక్కువ అయ్యాయని దొంగల నాయకుడు తన నడుం బెల్ట్ లోంచి చిన్న కత్తిని తీసి కాలిలో గాయం చేశారు. అతను మట్టిలో పడిపోయారు.

అప్పుడు కింగ్ మా దగ్గరకి వచ్చి ఘనా దేశస్థుడు తమతోనే ఉంటారని, మిగిలిన అందరినీ వదిలేస్తున్నట్లు ప్రకటించారు.

సుదీప్ కళ్ళలోకి చూసి బై బై అని చెప్పారు.

సుదీప్

ఆ మాట వినగానే అందరూ ఒక్క ఉదుటున ఘనా దేశస్థుడు వచ్చిన ఫిషింగ్ బోట్ దగ్గరకి పరుగు పెట్టి వెళ్లారు.

సుదీప్ డ్రైవర్ ని వెంటనే బోట్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తీసుకుని వెళ్ళమని చెప్పారు.

సుదీప్ ఇంకా తన షార్ట్స్ లోనే ఉన్నారు.

సరిగ్గా నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత బోట్ లో ఆయిల్ అయిపోయిందని డ్రైవర్ దగ్గర్లో ఉన్న ఒక జెట్టీలో బోట్ ని ఆపారు.

దూరంగా కొంత మంది ఫుట్ బాల్ ఆడుకుంటూ కనిపించారు. వారి దగ్గరకి వెళ్లి తమని బంధించారని బయట పడి వస్తున్నట్లు చెప్పగానే వారు ఒక ఇంటిలోకి వెళ్లి మంచి నీరు తెచ్చి ఇచ్చారు.

వారికి ఆ రాత్రి ఉండటానికి ఆ గ్రామంలో సదుపాయం కల్పించి ముగ్గురు వ్యక్తులు ఆ రాత్రంతా వారికి కాపలా కాసారు. నీరసంగా అనిపించినా సురక్షితంగా ఉన్నట్లు భావించారు. భగవంతుడే వారిని మమ్మల్ని రక్షించడానికి నియమించినట్లు అనిపించింది.

కొంత సేపటికి వీరంతా లాగోస్ నగరం చేరుకున్నారు. హోటల్ గదిలో సుదీప్ తన మీద చల్లని బీర్ చల్లుకుని, స్నానం చేసి తన ఒంటి పై ఉన్న గాయాలన్నిటిని చూసుకున్నారు. ఒక భారతీయ రాయబారి అతనికి సిగరెట్ పెట్టె ఇవ్వగా వరస పెట్టి 12 సిగరెట్లు కాల్చేశారు.

అక్కడి నుంచి ముంబై కి చేరారు.

హోటల్ గదిలో సుదీప్ తన మీద చల్లని బీర్ చల్లుకుని, స్నానం చేసి తన ఒంటి పై ఉన్న గాయాలన్నిటిని చూసుకున్నారు. ఒక భారతీయ రాయబారి అతనికి సిగరెట్ పెట్టె ఇవ్వగా వరస పెట్టి 12 సిగరెట్లు కాల్చేశారు.

సుదీప్

వీరంతా విడుదలై 8 నెలలు అవుతోంది. సునీతి వంట గదిలో రొట్టెలు చేస్తుండగా, ఆమె భర్త టీవీ లో భారత జట్టు న్యూ జీలాండ్ తో ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ ని చూస్తున్నారు.

సుదీప్ అని పై అంతస్థులోఉన్న ఆమె కొడుకుని పిలిచే పిలుపు అతని కోసం వెతుకుతున్నట్లే ఉంటుంది ఇంకా. బందీగా ఉన్న 70 రోజుల్లో సుదీప్ 20 కేజీల బరువు కోల్పోయారు.

సుదీప్ తిరిగి వస్తాడని నాకు తెలుసు. నేను భగవంతుడిని నమ్ముకున్నాను అని భాగ్య శ్రీ అన్నారు.

వీరు, జనవరి లో వివాహం చేసుకున్నారు. సుదీప్ విడుదల కోసం తీవ్రంగా కష్టపడిన స్వప్న అప్పుడప్పుడూ వచ్చి చూసి ఒక బాలీవుడ్ పాట పాడి వెళుతూ ఉంటారు.

సుదీప్ ప్రస్తుతం స్థానికంగా ఉన్న మారిటైం కాలేజీ లో పని చేస్తున్నారు. తన కుటుంబంతో భద్రంగా ఉన్నట్లు అనిపించినా బందీగా ఉన్న జ్ఞాపకాలు సుదీప్ ని వెంటాడుతూనే ఉంటాయి.

బందీలుగా బయట పడ్డారు కానీ, సుదీప్ కానీ, అతని సహా ఉద్యోగులకి కానీ తమకి రావాల్సిన జీతాలు వెనక్కి రాలేదు.

ఇప్పటి వరకు తనకి 754000 రూపాయిలు ( $10000 డాలర్లు) జీతం రావాల్సి ఉందని సుదీప్ చెప్పారు.

వీరి జీతాల గురించి కానీ, బందీగా మిగిలిపోయిన ఘనా దేశస్థుడి గురించి కానీ కెప్టెన్ క్రిస్టోస్ సమాధానం ఇవ్వలేదు. అతను రాసిన ఈ మెయిల్ లో యజమానుల సహాయంతో బందీలంతా సురక్షితంగా వెనక్కి తిరిగి వచ్చారని , తమ కంపెనీకి అక్రమ ఆయిల్ రవాణాతో ఎటువంటి సంబంధం లేదని రాసారు.

ఈ అంశం పై నైజీరియా కోర్ట్ లో కేసు విచారణలో ఉంది.

న్యాయం కోసం పోరాడతానని సుదీప్ అన్నారు. "నాకు పునర్జన్మ లభించిందనిపిస్తోంది."

సుదీప్

డిజైన్; మాన్యుయెల్లా బోనోమి; ఫోటోలు: సంజీత్ పట్నాయక్, గెట్టీ ఇమేజెస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)