థాయ్‌లాండ్ షాపింగ్ సెంటర్‌లో సైనికుడి కాల్పులు... 20 మంది మృతి

ఫొటో సోర్స్, facebook
థాయ్‌లాండ్‌లోని నఖోన్ రట్చసీమా (కోరాట్) నగరంలో ఒక థాయ్ సైనికుడు జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు.
బీబీసీ థాయ్ ఈ ఘటన గురించి ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధితో మాట్లాడింది.


"జక్రఫంత్ థోమా అనే ఒక జూనియర్ ఆఫీసర్ మిలిటరీ క్యాంప్ నుంచి తుపాకీ, బుల్లెట్లు దొంగిలించి తన కమాండింగ్ ఆఫీసర్‌పై దాడి చేశారని" ఆయన చెప్పారు.
సోషల్ మీడియాలో తన దాడి ఫొటోలను పోస్ట్ చేసిన అనుమానితుడి ఉద్దేశం ఏంటనేది ఇంక స్పష్టం కాలేదు.

ఫొటో సోర్స్, AFP
దాడి గురించి ఎలా తెలిసింది?
నాఖోన్ రట్చసిమా, దీన్నే కోరట్ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న సౌథమ్ ఫిథక్ మిలిటరీ క్యాంపులో మధ్యాహ్నం తర్వాత ఇది ప్రారంభమైంది.
అక్కడ ఉన్న కల్నల్ అనంతరోట్ క్రాసే అనే కమాండింగ్ ఆఫీసర్‌ను కాల్చి చంపారని బాంకాక్ పోస్ట్ చెప్పింది. అక్కడ 63 ఏళ్ల మహిళ, మరో సైనికుడు కూడా కాల్పుల్లో చనిపోయినట్లు వార్త సంస్థ తెలిపింది.
ఒక వాహనంలో వచ్చిన అనుమానితుడు క్యాంప్ నుంచి ఆయుధాలు, మందుగుండు ఎత్తుకెళ్లాడని చెప్పారు. తర్వాత అతడు షాపింగ్ సెంటర్‌లోని టెర్మినల్ 21కి వచ్చేముందు చాలా ప్రాంతాల్లో కాల్పులు జరిపాడు.
స్థానిక మీడియా చూపిస్తున్న దృశ్యాల్లో మువాంగ్ జిల్లాలోని ఒక షాపింగ్ సెంటర్ టెర్మినల్ 21లో కారు దిగిన అనుమానితుడు, భయంతో పారిపోతున్న జనాలపై కాల్పులు జరపడం కనిపిస్తోంది.
సీసీటీవీ ఫుటేజిలో అతడు ఒక రైఫిల్‌లో షాపింగ్ సెంటర్‌లోకి వెళ్లడం కనిపించింది. మిగతా దృశ్యాల్లో భవనం బయట బుల్లెట్ తగిలినపుడు ఒక గాస్ సిలిండర్ పేలినట్లు చూపిస్తున్నాయి.
అనుమానితుడు సోషల్ మీడియా అకౌంట్‌లో తన వెనక మంటలు వస్తున్న ఒక ఫొటోను పోస్ట్ చేశాడు.
"అతడు అమాయకులపై కాల్పులు జరిపేందుకు మెషిన్‌గన్ ఉపయోగించాడు. చాలామంది చనిపోయారు, గాయపడ్డారు" అని ప్రభుత్వ ప్రతినిధి క్రిస్సన్న పట్టనచరోన్ ఫ్రాన్స్-ప్రెస్ ఏజెన్సీకి చెప్పారు.
రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ కాంగ్‌చీప్ తంత్రవానిచ్ ఈ దాడిలో 20 మంది మృతి చెందారని చెప్పారు.

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?
షాపింగ్ సెంటర్‌ను దిగ్బంధం చేసిన అధికారులు లోపల ఉన్న అనుమానితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అతడు ఇంకా ఆ భవనంలోనే ఉన్నట్టు చెబుతున్నారు. చుట్టుపక్కలవారు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
అనుమానితుడికి 32 ఏళ్లు ఉంటాయని, అతడు కొందరిని బంధీలుగా పట్టుకున్నాడన బ్యాంకాక్ పోస్ట్ చెప్పింది.
కానీ దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. సెంటర్ లోపల నుంచి మరిన్ని కాల్పుల శబ్దాలు వినిపించినట్లు చెబుతున్నారు.
అనుమానితుడిని లొంగిపోయేలా చేసేందుకు, అధికారులు అతడి తల్లిని కూడా షాపింగ్ సెంటర్ దగ్గరికి తీసుకొచ్చారు.
"థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్-ఓచా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు" అని ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు.
ఆరోగ్యశాఖ మంత్రి తమ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో రక్తదానం చేయాలని ప్రజలకు అపీల్ చేశారు.
సోషల్ మీడియాలో అనుమానితుడి హంగామా
దాడి తర్వాత అనుమానితుడు తన సోషల్ మీడియా అకౌంట్ ఫేస్‌బుక్‌లో "నేను లొంగిపోవచ్చా" అని అడిగాడు
అంతకు ముందు అతడు ఒక పిస్టల్, మూడు సెట్ల బుల్లెట్లు ఉన్న ఫొటోలు పోస్ట్ చేశాడు. వాటితోపాటూ "ఇది ఉత్సాహ సమయం, చావును ఎవరూ తప్పించలేరు" అని రాశాడు.
ఫేస్‌బుక్ ప్రస్తుతం అతడి పేజ్ తొలగించింది.
"బాధితులకు మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ విషాధం వల్ల వారి కుటుంబాలు, సమాజంపై ప్రభావం పడింది. ఇలాంటి హింసకు పాల్పడేవారికి ఫేస్‌బుక్‌లో ఎలాంటి స్థానం లేదు. ఈ దాడిని ప్రజలు ప్రశంసించడాన్ని, మద్దతివ్వడాన్ని మేం అనుమతించం" అని తెలిపింది.

ఇవి కూడా చదవండి:
- ఐఫోన్ పాత మోడళ్ళ వేగం తగ్గిస్తున్నందుకు యాపిల్‌కు 193 కోట్ల జరిమానా
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
- విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








