వాతావరణ మార్పు అంటే ఏమిటి? భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?

గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి పెనువిపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి.
ఇంతకీ వాతావరణ మార్పుల గురించి మనకేం తెలుసు?
వాతావరణ మార్పు అంటే..
భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువగా, తక్కువగా కూడా ఉంది.
ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ దీనికి కారణమని వారు చెబుతున్నారు.
గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం.
భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్ హౌజ్ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి.
ఫలితంగా వాతావరణం, భూ ఉపరితంల వేడెక్కుతున్నాయి. ఈ ఎఫెక్ట్ లేకపోతే భూమి ఇంకో 30 డిగ్రీ సెంటీగ్రేడ్స్ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమయ్యేది.

అయితే, ఈ గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయం వల్ల వెలువడే వాయువులు తోడై మరింత శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
దీన్నే గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం) , వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్ హౌజ్ వాయువులు ఇవే...
గ్రీన్ హౌజ్ వాయువుల్లో అత్యంత ప్రభావవంతమైంది నీటి ఆవిరి. కానీ, అది వాతావరణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది.
కార్బన్ డై ఆక్సైడ్ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రామికీకరణ కన్నా ముందు ఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవనరులు దాన్ని పీల్చుకోగలవు.

శిలాజ ఇంధనాలను మండించడం వల్లే అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతోంది. కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులను నరికి, కాల్చేయడం వల్ల కూడా కార్బన్ వెలువడుతోంది. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువవుతోంది.
1750లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు 30 శాతం పెరిగాయి. గత 8 లక్షల ఏళ్లలో వాతావరణంలో ఈ స్థాయిలో కార్బన్ డై ఆక్సైడ్ ఎప్పుడూ లేదు.
మనుషుల చర్యల వల్ల మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి ఇతర గ్రీన్ హౌజ్ వాయువులు కూడా వెలువడుతున్నాయి. అయితే, కార్బన్ డై ఆక్సైడ్ అంతటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందునాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది.
అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20 ఏళ్లు.. గత 22 ఏళ్లలోనే ఉన్నాయి.
2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది.
ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది.

కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి.
ఆర్కిటిక్ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌పై పరుచుకున్న మంచు కూడా కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో కరుగుతోంది.
పశ్చిమ అంటార్కిటికాపై ఉన్న మంచు ద్రవ్యరాశి కూడా తగ్గుతోంది. తూర్పు అంటార్కిటికాలోనూ ఈ పరిణామం మొదలవ్వొచ్చని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది.
పంటలు, జంతువులపైనా వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. మొక్కల్లో పూలు పూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. జంతువులు వలస వెళ్తున్నాయి.
ఉష్ణోగ్రత ఎంత పెరగవచ్చు?
భూ ఉపరితల ఉష్ణోగ్రత 1850తో పోల్చితే 21వ శతాబ్దం చివరినాటికి 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగొచ్చు. చాలా వరకూ అంచనాలు ఇదే సూచిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే ఇకపైనా కొనసాగితే పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీ సెంటీగ్రేడ్‌లు కూడా ఉండొచ్చని డబ్ల్యూఎంఓ అంటోంది.
ఉష్ణోగ్రతలో 2 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల పెరుగుదల ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్చని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు కట్టడి చేసుకోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు, నాయకులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు అదుపు చేయాలంటే సమాజం అన్ని విధాలుగా త్వరితగతిన మారాల్సి ఉంటుందని ఇంటర్‌గవర్న్‌మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) నివేదిక అభిప్రాయపడింది.
గ్రీన్ హౌజ్ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగుతున్న కృషికి ఐరాస నేతృత్వం వహిస్తోంది.
చైనా నుంచే అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు వెలువడుతున్నాయి.
ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, యురోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఉన్నాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే, వీటిలో ఉద్గారాలు చాలా ఎక్కువ.
ఇప్పటికిప్పుడు గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్గారాలు గణనీయంగా తగ్గించుకున్నా, వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుదన్నదానిపై స్పష్టత లేదు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహార ఉత్పత్తిపైనా తీవ్ర ప్రభావం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలుల వల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు.
భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచుపడుతుంది.
తీరాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో వేసవుల్లో కరవు ముప్పు ఎక్కువవుతుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు.
ఈ మార్పులను తట్టుకునే సామర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీతంగా ఉండొచ్చు.
పరిస్థితులకు అంత త్వరగా అలవాటుపడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోవచ్చు.
మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేసింది.
వాతావరణంలో పెరిగిన కార్బన్ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడం వల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు.
వాతావరణ మార్పులపై స్పందించడమే ఈ శతాబ్దంలో మానవాళికి అతిపెద్ద సవాలు కాబోతోంది.
ఇవి కూడా చదవండి:
- భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం... ఈ లోయ లోతు 11,500 అడుగులు
- ధోనీ కెరీర్ ముగిసినట్లేనా.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో దక్కని చోటు
- ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...
- విశాఖ రైల్వే జోన్ ప్రకటించి ఏడాదవుతోంది... అది ఎక్కడి దాక వచ్చింది
- చనిపోయిన జింక కడుపులో 7 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు
- ‘21వ శతాబ్దం భారత్‌దే.. ఇక్కడ రూ.7వేల కోట్ల పెట్టుబడులు పెడతాం’
- ఇసుక కొరత ప్రపంచమంతటా ఎందుకు ఏర్పడింది
- పెరిగిన ద్రవ్యోల్బణం ప్రభావం సామాన్య ప్రజలపై ఎలా ఉంటుంది?
- అంతుచిక్కని మరణాలు... వేల పక్షులు అక్కడే ఎందుకు చనిపోయాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








