కె-పాప్ స్టార్ 'గూ హారా' మరణం: సెక్స్‌లో పాల్గొన్న వీడియోను బయటపెడతానంటూ బెదిరించిన బాయ్‌ఫ్రెండ్.. దక్షిణ కొరియాలో వెల్లువెత్తిన 'స్పై-కామ్ పోర్న్' బాధితుల ఆక్రోశం

ఫొటో సోర్స్, Getty Images
''కె-పాప్ స్టార్ గూ హారా గత వారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ తమ శారీరక కలయిక రహస్యంగా వీడియో తీశాడు. ఆమె న్యాయం కోసం బహిరంగంగా పోరాడారు. అందుకుగాను ఆమె మీద సోషల్ మీడియాలో విషపూరిత దాడి జరిగింది. దక్షిణ కొరియాలో ఈ 'స్పై-కామ్ పోర్న్'కు విధించే శిక్షలు చాలా స్వల్పం. కానీ, ఆ స్పై కామ్ బాధితులు వేరే రకం శిక్షను ఎదుర్కొంటున్నారని సియోల్‌లో బీబీసీ ప్రతినిధి లారా బికర్ చెప్తున్నారు.

''అతడు ఇంకా నన్ను చూస్తున్నట్లే అనిపిస్తోంది'' యూన్-జు లీ తన తండ్రితో చెప్పారు.
అప్పుడు అర్థరాత్రి ఒంటి గంట. మరో పీడకల నుంచి భయపడుతూ నిద్రలేచి ఆమె తన తండ్రికి ఫోన్ చేశారు.
కొన్ని రోజుల తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.
యూన్-జు - ఆమె అసలు పేరు కాదు - దక్షిణ కొరియాలో స్పై కెమెరా మహమ్మారికి బలైన మరో బాధితురాలు. ఆమె దేశంలోని దక్షిణ ప్రాంతంలో గల ఒక ప్రముఖ ఆస్పత్రిలో పనిచేసేది. ఆమె సహోద్యోగి ఒకరు.. ఆస్పత్రిలో మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో ఒక కన్నం వేసి అందులో ఒక చిన్న కెమెరా అమర్చాడు. అతడు ఒక మహిళ స్కర్టు కింద ఫోన్‌తో వీడియో తీస్తుండగా పోలీసులు పట్టుకుని అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు అందులో నలుగురు బాధితుల అశ్లీల వీడియోలను గుర్తించారు.
ఇది తమ కుమార్తె మానసిక ఆరోగ్యంపై చూపిన ప్రభావం ఎంతగా ఉందనేది చెప్పటానికి, యూన్-జు తన చివరి రోజుల్లో చేసిన ఫోన్ కాల్స్‌లో ఒక దానిని ఆమె తల్లిదండ్రులు నాకు వినిపించారు.

ఆమె ఆస్పత్రికి వెళ్లే దారిలో యాధృచ్ఛికంగా ఆ నిందితుడికి ఎదురుపడ్డారు. ఒక్కసారిగా భయపడిపోయి ఆస్పత్రి యూనియన్ ప్రతినిధికి ఫోన్ చేశారు. అతడు ఆ ఫోన్ కాల్‌ను రికార్డు చేశాడు. ఆమె శ్వాసతీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆమె గొంతు కూడా పెగలటం లేదు.
''బయటకు వచ్చేయండి... వెంటనే ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేయండి'' అని ఆ యూనియన్ ప్రతినిధి సూచించాడు.
ఆమెలో భయం స్పష్టంగా కనిపిస్తోంది.
''నేను రాలేను. రాలేను. మళ్లీ అతడికి ఎదురవుతానేమోనని భయంగా ఉంది'' అని మాత్రం అనగలిగారు. ఆ తర్వాత ఫోన్‌ను మరో నర్సుకు అందించారు.
అతడు ఎదురవటం ఆమెకు తీవ్ర ఆక్రోశం కలిగించిందని, ఆ దుండగుడి నుంచి తనకు ఎన్నటికీ విముక్తి లభించదనే భావన ఆమెలో కలిగిందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.
''ఎవరినైనా ఆయుధాలు వాడకుండా చంపొచ్చు. గాయం తీవ్రత ఒకే స్థాయిలో ఉండొచ్చు కానీ, దాని ప్రభావం ఒక్కక్కరి మీద ఒక్కోలా ఉండొచ్చు. కొందరు తట్టుకుని ముందుకు సాగగలరు. నా కూతురు వంటి వాళ్లు అలా తట్టుకోలేరు'' అని ఆమె తండ్రి నాతో పేర్కొన్నారు.
''నా కూతురుకు తెలిసిన చాలా మంది ఆ దుండగుడికి కూడా తెలుసు. అతడు ఆ వీడియోను తనకు తెలిసిన వారికి చూపించి ఉండొచ్చని ఆమె అంతగా భయపడింది. అతడు ఆన్‌లైన్‌లో షేర్ చేయకపోయినప్పటికీ, ఇతరులకు చూపించి ఉండొచ్చు. దాని గురించి ఆమె చాలా భయపడింది'' అని చెప్పారు.
ఈ నెల ఆరంభంలో సదరు పురుషుడిని - చట్టపరమైన కారణాల రీత్యా అతడి పేరు ప్రస్తావించలేం - పది నెలల పాటు జైలుకు పంపించారు. అతడికి రెండేళ్లు జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. అక్రమంగా వీడియో తీసినందుకు గరిష్టంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు.
ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలు చేయాలని యూన్-జు తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.
''ఈ విషయాన్ని జనం పెద్దగా పట్టించుకోవటం లేదు. చాలా తక్కువ శిక్ష విధించారు'' అని లీ నాతో వ్యాఖ్యానించారు.
''రెండేళ్ల శిక్ష కూడా తక్కువే అవుతుంది. అతడి వికృత చర్యలకు బలైన బాధితురాలి తండ్రిగా పది నెలల జైలు శిక్ష తగిన శిక్ష కాదని నేను అనకుంటున్నా'' అని చెప్పారు.

'సీరియస్‌గా పట్టించుకోవటం లేదు'
లైంగిక నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించాలని సియోల్‌లోని రాష్ట్రపతి కార్యాలయాన్ని డిమాండ్ చేస్తూ ఒక ఆన్‌లైన్ పిటిషన్ మీద వీరు సంతకాలు చేశారు. అక్రమంగా వీడియోలు తీయటం దక్షిణ కొరియాలో లైంగిక నేరాల్లో అత్యధిక భాగంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
కె-పాప్ స్టార్ గూ హారా అనుమానిత ఆత్మహత్య అనంతరం.. కఠిన శిక్షల కోసం డిమాండ్ ఓ పెను కేకగా మారింది.
గూ హారా అగ్రస్థాయి కె-పాప్ స్టార్. అందరూ మహిళా సభ్యులే ఉన్న పాప్ స్టార్ బృందం కారాలో అమె అత్యంత ప్రముఖమైన తార. కానీ.. ఆమె జీవితపు చివరి సంవత్సరమంతా స్టేజీ వెలుపలి సంఘటనలతో చీకటిగా మారింది.
ఆమె గత ఏడాది సెప్టెంబర్‌లో తన మాజీ బాయ్‌ఫ్రెండ్ చోయి జాంగ్-బమ్ మీద ఒక కేసు పెట్టారు. తామిద్దరం కలిసి సెక్స్‌లో పాల్గొన్న వీడియోను బయటపెట్టి తన కెరీర్‌ను నాశనం చేస్తానంటూ అతడు తనను బెదిరించాడని ఆమె ఆరోపించారు.
చోయి తనపై దాడికి పాల్పడ్డాడని, శారీరక హాని కలిగించాడని, బెదిరించాడని, బలవంతం చేశాడని, ఆస్తులను ధ్వంసం చేశాడని కోర్టు గత ఆగస్టులో దోషిగా నిర్ధారించింది. అయితే, అతడికి విధించిన ఏడాదిన్నర జైలు శిక్షను నిలిపివేసింది.
ఆమె అనుమతి లేకుండా అతడు వీడియో తీశాడని కోర్టు అంగీకరించింది. అయితే, ఆమె అతడితో సంబంధంలోనే ఉండింది కనుక అతడు వీడియో తీయటం చట్టవ్యతిరేకం కాదని పేర్కొంది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చోయి, గూ హారా ఇద్దరూ అప్పీలు చేశారు. తనపై అభియోగాలను చోయి తిరస్కరిస్తూనే ఉన్నారు.
అయితే, కోర్టులు గూ హారాకు తగిన న్యాయం చేయలేదని ఆమె అభిమానులు నమ్ముతారు.
''మనం హారాను రక్షించటంలో ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఆమెకు, అకృత్యాలకు గురైన మహిళలందరికీ కనీసం న్యాయం సాధించటానికి మనం తోడ్పడవగలం. హ్యాష్‌ట్యాగ్ #최종범_처벌 (చోయిని శిక్షించాలి) వాడండి'' అని @bpteaparty అనే యూజర్ రాశారు.
''ఆమె (హారా) ఈ జీవితంలో ఇంత బాధలు అనుభవించాల్సి రావటం నా గుండె ముక్కలయింది. ఆగ్రహం పెల్లుబుకుతోంది. అతడు జైలులో లేకపోవటం అనేదే ఒక నేరం. #RIPGooHara #최종범_처벌'' అని @elizabethashw12 అనే మరో యూజర్ ఆవేదన వ్యక్తంచేశారు.
దక్షిణ కొరియాలో స్పై కెమెరా ఒక భారీ సమస్య అనేది వార్త కూడా కాదు. పోలీసులకు గత రెండేళ్లలో 11,200 పైగా స్పై కెమెరా ఫిర్యాదులు వచ్చాయి. నిజానికి ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని.. ఎందుకంటే చాలా మంది పోలీసుల దగ్గరకు రావటానికి భయపడుతుంటారని, డిజిటల్ లైంగిక నేరాల ఉద్యమకారులు భావిస్తున్నారు. ఇక దోషులుగా తేలిన వారిలో చాలా మందికి కేవలం జరిమానాలు విధించి వదిలేస్తుంటారు.



ఈ భారీ సంఖ్యను చూస్తేనే, అత్యంత తీవ్రమైన కేసులుగా పరిగణించిన ఉదంతాల్లోనే కఠిన శిక్షలు విధించాలని కోర్టులు భావిస్తుంటాయన్నది తెలుస్తోందని న్యాయవాది ఆన్ సో-యోన్ బీబీసీతో అన్నారు.
''రోడ్ల మీద, సబ్‌వేల్లో, పార్కుల్లో... సమాజంలోని మూల మూలలకూ స్పై కెమెరాలు ఎంతగా విస్తరించాయనేది చూసి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను'' అంటారామె.
''అక్రమంగా వీడియోలు చిత్రీకరించటానికి శిక్షలు చాలా స్వల్పంగా ఉన్నాయనేది నిజం. దీనికి కారణం, అటువంటి కేసులు చాలా అధికంగా ఉండటమే. ఇవి ఎంత విస్తారంగా ఉన్నాయంటే.. వీటిని అంత సీరియస్‌గా పట్టించుకోవటం లేదు. పైగా మగవాళ్లకు ఇది అనుభవంలోకి రాదు కాబట్టి దీనిని సీరియస్‌గా పరిగణించరు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్రమ వీడియో చిత్రీకరణ బాధితుల్లో అత్యధికులు మహిళలే. కోర్టుల్లోని న్యాయమూర్తుల్లో అత్యధికులు పురుషులు.
''ముందు మనం పురుషాధిక్య కోర్టు వ్యవస్థలో ఉన్నాం'' అని ఆన్ చెప్పారు. అయితే ఇది క్రమంగా మారుతోందన్నారు.
మనకు తెలిసిన వాళ్లు మనల్ని రహస్యంగా వీడియో తీస్తున్నారని తెలిస్తే అది ''తీవ్ర మనోవేదన''కు గురిచేస్తుందని కొరియన్ సూయిసైడ్ ప్రివెన్షన్ సెంటర్ డైరెక్టర్ చెప్పారు.
''స్పై కెమెరా నేరాలు ఒక లైంగిక హింస రూపం. అది వ్యక్తిగత సమాచారం, గోప్యతను తీవ్రంగా ఉల్లంఘించటమే. బాధితురాలు మరణించే పరిస్థితి ఉండే సమాజం మనకు ఉండకూడదు'' అని పైక్ జాంగ్-వూ మాతో పేర్కొన్నారు.
స్పై కెమెరా బాధితుల గురించి తెలిసిన వారు వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అక్రమంగా వీడియోలు తీయటం, ఇతర లైంగిక నేరాల బాధితులు 2,000 మందిని కొరియన్ ఉమన్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఇంటర్వ్యూ చేసింది. వారిలో 23 శాతం మంది ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించారు. వారిలో 16 శాతం మంది ఆత్మహత్యకు ప్రణాళిక కూడా రచించారు. ఇక 23 మంది ఆత్మహత్యాయత్నం కూడా చేశారు.
''బాధితురాలికి మద్దతు అవసరం. వారికి సాంత్వన అవసరం. ఒక నేరానికి పాల్పడిన దుండగుడికి తగిన స్థాయి శిక్ష విధించటం.. జీవితాన్ని గౌరవించే ఆరోగ్యవంతమైన సమాజానికి ఒక ప్రాతిపదిక'' అంటారు పైక్.

గూ హారా కేసు నేపథ్యంలో చట్టాన్ని సవరించామని దక్షిణ కొరియా న్యాయ మంత్రిత్వశాఖ బీబీసీకి చెప్పింది. అత్యంత తీవ్రమైన కేసుల్లో గరిష్ట శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లకు పిలుపునిచ్చినట్లు తెలిపింది. కానీ, ఇది కోర్టుకు సంబంధించిన విషయమని, మంత్రిత్వశాఖకు సంబంధించినది కాదని వాళ్లు చెబుతున్నారు.
దీనిపై వ్యాఖ్యానించటానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది.

బాహాటంగా మాట్లాడే మహిళకు ముప్పు
ఇక న్యాయం పొందే ప్రక్రియ కూడా చాలా దారుణంగా ఉండొచ్చు. గూ హారా అనేక సార్లు కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. ఆమె గుర్తింపును కానీ, ఆ కేసు స్వభావాన్ని కానీ గోప్యంగా ఉంచలేదు. ఆ సమయంలో ''గూ హారా సెక్స్ వీడియో'' అనేది ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్ అయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆమె అభిమానులు ఆమెను అంటిపెట్టుకునే ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఆమెను చాలా అవమానించారు. కె-పాప్ వ్యాఖ్యాత తామార్ హెర్మాన్ బిల్‌బోర్డ్ మేగజీన్‌లో సంస్మరణ రాస్తూ, ''ఆమె మరణ విషాదం ఆమె ఎదుర్కొన్న ప్రపంచం కన్నా దయ గల ప్రపంచానికి స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం'' అని పేర్కొన్నారు.
గూ హారా మరణం గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. అందులో చాలా వరకూ ''కె-పాప్ చీకటి కోణం'' అనే అభివర్ణణలతో సాగాయి. తీవ్ర పోటీ ఉండే దక్షిణ కొరియా పాప్ రంగంలో.. తారలు తమ వ్యక్తిగత జీవితాల్లోనూ సామాజిక ఆదర్శాలను పాటించాల్సిన కఠిన స్వభావాన్ని చూపుతున్నాయి.
కానీ, ఇక్కడ అంతకన్నా విస్తృతమైన సమస్య ఉంది.
గూ హారా సన్నిహిత మిత్రుల్లో ఒకరు, సహచర కె-పాప్ స్టార్ సల్లీ అక్టోబరులో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సల్లీకి చాలా బాహాటంగా మాట్లాడుతుందని పేరుంది. కె-పాప్ స్టార్లలో ఈ వైఖరి సాధారణంగా కనిపించదు. ఆమె లింగపరమైన మూసలో ఇమడలేకపోయింది. దానివల్ల ఆన్‌లైన్ తిట్లకు, వేధింపులకు లక్ష్యంగా మారింది.

దక్షిణ కొరియా ఇప్పటికీ సంప్రదాయవాద, పితృస్వామ్య సమాజంగానే కొనసాగుతోంది. దృక్పథాలు మారటం మొదలైనప్పటికీ మార్పు చాలా నెమ్మదిగా వస్తోంది. దీని అర్థం.. సమాజంలోని కొన్ని భాగాల్లో మహిళల మీద అకృత్యాలను పట్టించుకోవాల్సినంత తీవ్రంగా పట్టించుకోరు. గూ హారా వంటి కె-పాప్ స్టార్లు సహా ఉన్నత స్థాయిలో గల మహిళలు నేర బాధితులుగా మారిన తర్వాత సోషల్ మీడియాలో వేధించినపుడు.. అది ఇతరులకు ఇచ్చే సందేశం ఏమిటి?
దక్షిణ కొరియాలో లైంగిక నేరాల బాధితులను తరచుగా కళంకితులుగా చూస్తారని చుంగ్-ఆంగ్ యూనవిర్సిటీలో సోషియాలజిస్ట్ లా నా-యంగ్ చెప్పారు.
''ఆమె చెడిపోయింది, పాడైంది, పనికిమాలింది. ఒకసారి చెడిపోయిందని ముద్రవేశాక ఆమె జీవితాంతం చెడిపోయిందిగానే మిగిలిపోతుంది. ఈ భారాన్ని ఒక వ్యక్తి ఎలా మోయగలరు?'' అని ప్రశ్నించారు.
అయితే, పరిస్థితులు మారటం మొదలైందనే ఒక ఆశ ఉంది.
ముఖ్యంగా యువతులు తాము గొంతెత్తి మాట్లాడవచ్చునని తెలుసుకుంటున్నారు. స్పై కెమెరా నేరాలను అణచివేయాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది లక్షలాది మంది ''నా జీవితం మీ పోర్న్ కాదు'' అనే నినాదంతో వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. దీనివల్ల ప్రత్యేకించి చట్టంలో పెద్దగా మార్పు రాలేదు కానీ.. దక్షిణ కొరియా మహిళలు తమకు మద్దతు ఉందని తెలుసుకున్నారు.
కోర్టుల్లో మహిళలు మరిన్ని యుద్ధాలు గెలవటం మొదలైందని న్యాయవాది ఆన్ తెలిపారు.
''మేం అంతకంతకూ పెరుగుతున్న బాధలను అనుభవిస్తున్నాం. అయితే యువ కొరియన్లు చాలా సమర్థవంతులు. వారి సామాజిక అవగాహన స్థాయి వేగంగా పెరుగుతోంది. మా న్యాయ వ్యవస్థ కూడా సరిగా స్పందిస్తోంది. కాబట్టి మార్పు వస్తోందని నేను ఆశిస్తున్నా'' అని చెప్పారు.
అతి పెద్ద మార్పు దక్షిణ కొరియా సమాజం అంతర్గతంగా రావాలని ఆమె అంటారు.
''న్యాయ వ్యవస్థను మెరుగుపరచటం తర్వాతి అంశం. అత్యంత ముఖ్యమైన పురోగతి సామాజిక, సాంస్కృతిక అవగాహనలో రావాల్సి ఉంది'' అని అభిప్రాయపడ్డారు.
''ప్రజలు, సమాజం విపులంగా ప్రశ్నించకపోతే, మెరుగైన పరిస్థితులను డిమాండ్ చేయకపోతే.. పార్లమెంటు కానీ, పోలీసులు కానీ, కోర్టులు కానీ పెద్దగా చేయగలిగింది ఉండదు'' అని వ్యాఖ్యానించారు.

దక్షిణ కొరియా న్యాయ వ్యవస్థ మెరుగుపడాలని డమాండ్ చేస్తున్న అనేక కుటుంబాల్లో యూన్-జు లీ తల్లిదండ్రులు ఒకరు.
వాళ్లు నన్ను ఆమె అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లారు. అక్కడ జీవించని ఒక యువ జీవితం జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. నిజానికి ఆమె రాబోయే జనవరిలో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. యూన్-జును పెళ్లిచేసుకోవలసిన యువకుడు.. ఆమెతో సాన్నిహిత్య భావన కోసం ఇప్పటికీ వారి ఇంటికి వస్తుంటాడని ఆమె తల్లి చెప్పింది. అక్కడ ఉన్న సామాన్లు అన్నీ షోరూమ్ నుంచి నేరుగా వచ్చాయి.

అది ఓ కొత్త జంట తమ దాంపత్య జీవితాన్ని ప్రారంభించటానికి సిద్ధం చేసుకున్న హనీమూన్ ఇల్లు.
దానికి బదులుగా ఆమె తల్లిదండ్రులు కోర్టు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
మీరు ఎంత దూరం వెళతారని నేను ఆమె తండ్రిని అడిగాను.
''చివరి వరకూ వెళతాను. సుప్రీంకోర్టు వరకూ వెళతాను'' అని ఆయన చెప్పారు.
(తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలపై ఫిర్యాదు చేసేందుకు 100 నెంబర్ అందుబాటులో ఉంది. అలాగే షీ టీం ల్యాండ్ లైన్ నెంబర్ 0402785235 కు గానీ, వాట్సాప్ నెంబర్ 9490616555 కు గానీ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
అలాగే దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ఫ్రీ నెంబర్లు 112, 100, 1090, 1091 లలో ఏదో ఒక దానికి ఫోన్ చేసి తాము ప్రమాదంలో ఉన్న సమాచారాన్ని అందించి, రక్షణ పొందండి.)
ఇవి కూడా చదవండి:
- "ఇక్కడున్న ప్రతి మగవాడు మీతో సెక్స్ కోరుకుంటాడు"
- బీబీసీ రహస్య పరిశోధన: మతం పేరుతో బాలికల లైంగిక దోపిడీ...మత గురువులే మధ్యవర్తులుగా ‘సుఖ వివాహాలు’
- షాద్ నగర్ అత్యాచారం-హత్య: ‘ప్లీజ్ పాపా, కొంచెం సేపు మాట్లాడు, దెయ్యంలా వెంటపడిండు... నాకు భయం అయితాంది’
- రెండేళ్ల చిన్నారి మీద అత్యాచారం... కోర్టులో సాక్ష్యం చెప్పిన పసిపాప
- 'నన్ను రేప్ చేశారు... ఇప్పుడు నా కూతుళ్లనూ అలా చేస్తారేమోనని భయపడుతున్నా'
- రియల్ లైఫ్ అపరిచితురాలు: ఒక్క మహిళలో 2500 మంది..మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌కు లోనైన జెనీ హెయిన్స్ కథ
- లైంగిక వేధింపులు: బస్సులు, రైళ్ళలో అసభ్యంగా వేధించే వాళ్ళను పట్టిచ్చే పరికరం రెడీ
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
- ఉన్నావ్ రేప్ కేసు: బాధితురాలి వ్యధ ఏంటి: గ్రౌండ్ రిపోర్ట్
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








