ఫూమీ: జపనీస్ క్రైస్తవులతో ఏసుక్రీస్తు విగ్రహాలను బలవంతంగా కాలితో తొక్కించిన ఈ ఆచారం ఏంటి?

ఫొటో సోర్స్, Image copyrightNATIONAAL MUSEUM VAN WERELDCULTUREN
- రచయిత, య్వెట్టె టాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబు వేసినపుడు నాగసాకిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడానికి పోప్ ఫ్రాన్సిస్ శనివారం జపాన్ వచ్చారు.
వందల ఏళ్ల క్రితం హింసకు గురై, మత విశ్వాసాల కోసం బలవంతంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన చాలా కొద్ది మందికే తెలిసిన వారి కోసం కూడా ఆయన ప్రార్థనలు చేశారు.
ఒక వ్యక్తి వరుసలో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. తన పేరు వినగానే ముందుకు వచ్చారు. రాజధాని నుంచి ప్రత్యేకంగా ఆ పని కోసమే వచ్చిన ప్రభుత్వ అధికారులు అతడిని గుచ్చిగుచ్చి చూస్తున్నారు.
ఆ వ్యక్తి ముందు ఏసుక్రీస్తు శిలువపై ఉన్న ఒక కంచు బొమ్మ ఉంది. దానిని కాలితో తొక్కమని అధికారులు అతడిని ఆదేశించారు.
అతడు అలా చేస్తే, బహిరంగంగా తన మత విశ్వాసాలను వదులుకున్నట్లు ఒక ప్రకటన అవుతుంది. దానిని కాలితో తొక్కితే అతడి ప్రాణాలు మిగులుతాయి. లేదంటే అతడికి మరణశిక్ష, శిలువ వేయడం, హింస ఏదైనా జరగచ్చు. అతడిని వేడి నీటి బుగ్గల్లో పడేస్తారు. లేదా మలవిసర్జన గుంతల్లో తలకిందులుగా వేలాడదీస్తారు.
ఆ పని చేయడానికి వారు ఏమాత్రం వెనకాడినా ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుంది.
ఏసుక్రీస్తు విగ్రహాలను కాలితో తొక్కడం అనే ఈ ఆచారాన్ని ఫూమీ అంటారు. ఇది 17వ శతాబ్దంలో నాగసాకీ అంతటా వ్యాపించింది.

ఫొటో సోర్స్, Getty Images
'దుష్ట' మతం
1560లో పోర్చుగల్ నుంచి జెసూట్ మిషనరీలు జపాన్ వచ్చినపుడు కీలక రేవు నగరమైన నాగసాకిలో మొట్టమొదట క్రైస్తవ మతం అడుగుపెట్టింది. ఆఫ్రికా నుంచి ఆసియా వరకూ అన్నిచోట్లా ఉన్న పోర్చుగీసు సామ్రాజ్యం అప్పట్లో ప్రపంచంలోని అతిపెద్ద సముద్రతీర సామ్రాజ్యాల్లో ఒకటిగా ఉండేది.
జెసూట్ మిషనరీలు ఆయా ప్రాంతాల్లోని భూస్వాముల మతం మార్చేందుకు పనిచేసేవి. భూస్వాముల్లో కొందరు ఇలా విదేశీ మతానికి మారడం వల్ల పోర్చుగీసు వారి నుంచి వాణిజ్య సహకారం అందుతుందని గుర్తించారు. తమ కింద ఉన్న చాలామంది రైతులను కూడా మతం మారేలా ప్రభావితం చేశారు. దాంతో 17వ శతాబ్దం మొదట్లో నాగసాకి 'రోమ్ ఆఫ్ జపాన్'గా మారింది.
నాగసాకిని మొదట పారిష్(చిన్న చర్చిలు)లతో ఒక క్రైస్తవ నగరంగా చేశారని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఐర్లాండ్ ప్రొఫెసర్ కిరీ పరామోర్ చెప్పారు. బీబీసీతో మాట్లాడిన ఆయన "అప్పుడు నాగసాకిలో(జపాన్‌లో) ఎక్కడా లేనంత మంది క్రైస్తవులు ఉండేవారు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మతమార్పిడులు తీవ్రంగా ఉన్నప్పుడు నాగసాకిలో 5 లక్షల మంది క్రైస్తవులుగా ఉండేవారని గుర్తించారు.
కానీ కాలక్రమేణా క్రైస్తవ మతం వేగంగా పెరగడం అక్కడి ప్రభుత్వానికి ముప్పు ఉందని జపాన్ రాజకీయ నేతలు భావించారు. దానిని అణచివేయాలని నిర్ణయించారు.
"వాళ్లు క్రైస్తవ మతంని వదిలించుకోవాలని చూస్తున్నారు. కానీ దేశ భద్రతకు ముప్పుగా మారిన విదేశీయులను కూడా తొలగించాలని అనుకుంటున్నారు. అంటే ఆ రెండింటికీ సంబంధం ఉంది" అని పరమోర్ చెప్పారు.
16వ శతాబ్దం మధ్యలో నాగసాకిలోని 26 విదేశీ మిషనరీల్లో వారికి శిలువ వేసి మరణశిక్ష విధించారు. క్రైస్తవులపై సుదీర్ఘకాలం పాటు జరగబోయే హింస ప్రారంభానికి ఇది సంకేతం.
1614లో క్రైస్తవ మతంపై దేశవ్యాప్తంగా కఠిన నిషేధం విధించారు. విదేశీ మిషనరీలను వెంటనే దేశం నుంచి బహిష్కరించారు. తిరిగి వెళ్లడానికి నిరాకరించినవారిని అరెస్టు చేయడం, చంపేయం, లేదంటే బలవంతంగా మతం వదులుకునేలా చేశారు. టొకుగవా షొగునటే పాలనలో జపాన్ పూర్తిగా ఒంటరితనంలోకి ప్రవేశించింది. దాదాపు అన్ని దేశాలతో సంబంధాలు తెంచుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
బహిరంగంగా కాలితో తొక్కే ఆచారం
1620లో అధికారులు మత పెద్దలను తరిమేయడానికి ఇవి సరిపోవని భావించారు. ఆ మతాన్ని ప్రజల మనసుల్లోంచి తుడిచిపెట్టేయడానికి వాళ్లు ఒక బహిరంగ పద్ధతిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
అదే ఫూమీ. వాటిని కంచుతో చేస్తారు. కొన్నిసార్లు అవి చెక్క పలకలపై ఉంటాయి. ఆ బొమ్మల్లో ఏసుక్రీస్తు లేదా మేరీ ఉంటారు. నాగసాకిలో నివసించే ప్రతిఒక్కరూ ఫూమీని కాలితో తొక్కాలని ఆదేశించారు. ఆ తర్వాత అది ప్రతి ఏడాది ప్రారంభంలో ఒక వార్షిక ఆచారంగా మారిపోయింది.
"ఇది ఒక బాధ్యత. సామాన్యులు, సమురాయ్‌లు, బౌద్ధ సన్యాసులు, అనారోగ్యంతో ఉన్న వారు కూడా దానిని చేయాల్సిందే. అధికారులు క్రీస్తు బొమ్మ ఉన్న ఆ చెక్క పలకలను ఇళ్ల దగ్గరికే తీసుకొచ్చేవారు. ప్రతి ఒక్కరూ దాన్ని తొక్కాల్సిందే" అని ఎకోలె ఫ్రాన్‌కైస్ డిఎక్స్‌ట్రీమ్ ఓరియెంట్ ప్రొఫెసర్ మార్టిన్ రామోస్ చెప్పారు.
"అప్పట్లో వారిది చాలా మంచి ఆలోచన, ఎందుకంటే ఆ కాలంలో క్రైస్తవులు ఎక్కువగా అలాంటి చిత్రాలపై ఆధారపడేవారు. వాటిలోని క్రీస్తు, మేరీ బొమ్మల ముందు ప్రార్థనలు చేసేవారు. అది భక్తికి సంబంధించినది. అలాంటి వాటిమీద నడవడం అనేది వారికి చాలా దారుణంగా అనిపించేది.
కానీ చాలా మంది చివరకు ఫూమీపై అడుగు పెట్టాల్సి వచ్చింది.
"మనం ఒక ఫూమీని దగ్గర నుంచి పరిశీలనగా చూస్తే, అందులో ఒకటి గమనించవచ్చు. వాటిలో క్రీస్తు ముఖం పూర్తిగా అరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే, దానిమీద లెక్కలేనంత మంది అడుగులు పడి ఉంటాయి" అని నాగసాకి జన్షిన్ కాథలిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సైమన్ హల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నిరాకరించిన వారికి చిత్రహింసలు
ఫూమీ మీద నడిచేందుకు నిరాకరించిన క్రైస్తవులను చంపేసేవారు లేదంటే తీవ్రంగా హింసించేవారు.
"వాళ్లను కొన్నిసార్లు మలం నిండిన గుంతల మీద తలకిందులుగా వేలాడదీసి హింసించేవారు. వారికి మెదడులో ఒత్తిడి పెరిగి చనిపోకుండా ఉండేందుకు, వారి కణతల దగ్గర కత్తితో గాట్లు పెట్టేవారు" అని పారమోర్ చెప్పారు.
ఈ హింస వెనుక ప్రధాన ఉద్దేశం నిరాకరించిన వారిని చంపడం కాదు, వారిలో మతవిశ్వాసాన్ని విచ్చిన్నం చేయడం.
కొన్నిసార్లు క్రైస్తవులను హింసిస్తుంటే వారు మృత్యువు అంచులవరకూ వెళ్లినా తెలుసుకోడానికి అక్కడ ఒక డాక్టరును నియమించేవారు. వారికి వైద్య చికిత్సలు అందించి బతికించిన తర్వాత మళ్లీ హింసించేవారు.
నాగసాకిలో మత విశ్వాసాలను వదులుకోడానికి నిరాకరించి, అలా ప్రాణాలు కోల్పోయిన దాదాపు 2 వేల మందిని అమరవీరులుగా భావిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
రహస్యంగా మత ఆచారాలు
మతం వదులుకున్నట్లు నటించిన కొందరు మాత్రం, రహస్యంగా క్రైస్తవులుగానే కొనసాగేవారు.
"వాళ్లు తిరిగి ఇంటికి వచ్చాక తమను క్షమించమని దేవుడిని వేడుకునేవారు. కొన్ని సమాజాల్లో ఫూమీని తొక్కినందుకు ప్రాయశ్చిత్తంగా అప్పుడు కాలికి వేసుకున్న చెప్పును కాల్చి, ఆ బూడిదను నీళ్లలో కలిపి తాగేసేవారు. అలాంటి వారిని కకురే కిరిస్టియన్ లేదా రహస్య క్రైస్తవులని అంటారు" అని హల్ చెప్పారు.
"వాళ్లు ఇప్పటికి రహస్యంగా బాప్టిజం లాంటివి అనుసరిస్తుంటారు. వాళ్లు తమ పిల్లలకు రహస్యంగా పావొలో, మారియో, ఇసబెల్లా లాంటి పోర్టుగీసు క్రిస్టియన్ పేర్లు పెట్టుకుంటారు. వాళ్లు ఈస్టర్ లాంటివి కూడా జరుపుకుంటారు" అని రామోస్ చెప్పారు.
తమను క్రైస్తవులుగా గుర్తించకుండా ఉండడానికి, వారు జపనీస్ ఆచారాలను కూడా పాటిస్తుంటారు.
కొందరు క్రైస్తవులు బౌద్ధ దేవత కనోన్ ప్రతిమనే మేరీ మాతగా భావించి ప్రార్థనలు చేసేవారు.
"వారికి 200 ఏళ్లకు పైగా విదేశీ మిషనరీలతో ఎలాంటి సంబంధాలు లేకుండా పోయాయి. అయినా అది చాలా వరకూ స్థానిక మతంలా అయిపోయింది. కొంతమంది దానిని తమ తర్వాత వారికి కూడా అందించారు" అని రామోస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అస్తిత్వ నిర్ణయం
19వ శతాబ్దం చివరి నాటికి జపాన్ మళ్లీ తన సరిహద్దులను తెరిచింది. 1858లో నాగసాకిలో ఫూమీ ఆచారాన్ని తొలగించారు. జపాన్లో క్రైస్తవ మతం అడుగుపెట్టిన తర్వాత, దానిపై 2 శతాబ్దాలకుపైగా ఉన్న నిషేధాన్ని చివరికి 1873లో ఎత్తివేశారు.
దాంతో, జపాన్‌లోని దాదాపు 20 వేలమంది క్రైస్తవులు రహస్య జీవితం నుంచి బయటికి వచ్చారు. అంటే ఫూమీ విధానాలు చాలా కఠినంగా ఉండడంతో అక్కడ 5 లక్షల మంది క్రైస్తవుల్లో 20 వేల మంది మిగిలారు.
నాగసాకి పర్యటనకు వచ్చిన పోప్, హింస ప్రారంభమైన కొత్తల్లో అమరవీరులైన 26 మంది కోసం నిర్మించిన ఒక స్మారకం దగ్గర ఆగారు. ఇప్పుడు జపాన్ జనాభాలో ఒక్క శాతం అంటే 126 మిలియన్ల మంది క్రైస్తవులు మాత్రమే ఉన్నారు. దేశంలో క్రైస్తవ జనాభా అత్యధికంగా ఉన్న నగరాల్లో నాగసాకి ఒకటిగా నిలిచింది.
జపాన్ క్రైస్తవ చరిత్రలో ఒక వైరుధ్యం ఏంటంటే, జపనీస్ కాథలిక్కులందరూ ఫూమీని కాలితో తొక్కడానికి నిరాకరించి, అమరవీరులు కావడానికే సిద్ధపడి ఉంటే, వారితోపాటూ అక్కడ క్రైస్తవ మతం కూడా అంతమైపోయేది" అని హల్ చెప్పారు.
మత విశ్వాసాలు ఉన్నప్పటికీ, ఇలా చేయడం చాలా పాపమని భావించినప్పటికీ, ఫూమీని కాలితో తొక్కాలని కొంతమంది అస్తిత్వ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే జపాన్‌లో క్రైస్తవ మతం మనగలగింది.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో మొబైల్ డాటా ధరలు ఎక్కువగా ఉంది ఈ దేశంలోనే.. డాటా కోసం తిండి మానేస్తున్నారు
- క్రిస్మస్: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
- గర్భిణిని కరిచి చంపిన కుక్కలు.. 93 శునకాలకు డీఎన్ఏ పరీక్షలు
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఫాలోవర్లు: లైకులు, ఫాలోవర్లు, కామెంట్లు ఎలా కొంటున్నారు
- కృత్రిమ దీవులు నిర్మిస్తామన్న చైనా కంపెనీలు.. అక్కర్లేదన్న పసిఫిక్ దేశం తువాలు
- చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్‌సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
- అమ్మకానికి గ్రామాలు.. ధర రూ.39 లక్షల నుంచి ప్రారంభం
- అమెరికాలో 15 రాష్ట్రాలను వణికిస్తున్న చేప
- అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు అలెక్సీ లియోనోవ్ కన్నుమూత.. ఆ నడకలో జరిగిన ప్రమాదం ఏంటంటే..
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి...
- మహాత్మా గాంధీ: ‘ఏసుక్రీస్తును అలా భావించలేను.. మీ స్టాంపును వాడలేను’
- జీసస్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది?
- నాట్రడామ్ చర్చి: ఏసుక్రీస్తు ముళ్ల కిరీటం, శిలువ అవశేషం, జీసస్ గోరు ఇక్కడే ఉన్నాయి
- ‘స్మార్ట్ ఫోన్ వాడితే క్రీస్తు విరోధి పుట్టుకొస్తాడు జాగ్రత్త’ - రష్యా క్రైస్తవ మతాధికారి హెచ్చరిక
- మహాత్మా గాంధీ మతం ఏమిటి? గాంధీ దృష్టిలో దేవుడు ఎవరు?
- వియత్నాం హిందువులు : ఒకప్పుడు రాజ్యాలు ఏలారు.. ఇప్పుడు కనుమరుగవుతున్నారు
- చాలా మతాలు అంతరించినా క్రైస్తవం ఎలా విస్తరించింది...
- ‘క్రైస్తవ మత ప్రచారకుడిని చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు’
- ‘‘వాటికన్ ఒక గే సంస్థ’’: క్రైస్తవ పూజారుల ‘రహస్య జీవితాలు బట్టబయలు చేసిన’ జర్నలిస్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








