మహాత్మా గాంధీ మతం ఏమిటి? గాంధీ దృష్టిలో దేవుడు ఎవరు?

ఫొటో సోర్స్, CENTRAL PRESS/GETTY IMAGES
- రచయిత, కుమార్ ప్రశాంత్
- హోదా, గాంధేయవాది, బీబీసీ కోసం
ప్రజల మనసులో చెరగని ముద్రవేసిన, సమాజం మొత్తానికీ ప్రాతినిధ్యం వహించిన మహాత్మా గాంధీని ఓ వర్గానికి ప్రతినిధిగా చూపించేందుకు నేడు చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఆనాడు కూడా ఇలాంటి ప్రయత్నాలకు తక్కువేమీ లేదు.
తూర్పు, పడమరలా ఉండేవారంతా ఈ విషయంపై మాత్రం ఏకతాటిపైకి వస్తారు.
ఇటు సనాతన హిందువులు, అటు కరడుగట్టిన ముస్లింలు తమ మతాలకు సంబంధించిన విషయాల్లో గాంధీ జోక్యం అవసరంలేదని ఆనాడు తెగేసి చెప్పారు.
తమ గురించి మాట్లాడే హక్కు దళితుడుకాని గాంధీకి ఎలా ఉంటుందని దళితులు భావించేవారు. మతమార్పిడి విషయంలో ఆయన్ను క్రైస్తవులు బహిరంగంగానే తప్పుపట్టేవారు.
ఈ అంశంలో గాంధీపై చివరి అస్త్రాన్ని బాబా సాహెబ్ అంబేడ్కర్ సంధించారు. మీరు భంగీ (అంటరాని వారిలో అతితక్కువ కులం) కానప్పుడు మా గురించి ఎలా మాట్లాడతారని గాంధీని ఆయన ప్రశ్నించారు.
దీనిపై గాంధీ స్పందిస్తూ.. ''ఈ అంశంపై నాకు ఎలాంటి హక్కూ లేదు. కానీ భంగీల గురించి మాట్లాడేందుకు భంగీగానే పుట్టాలన్నదే తప్పనిసరైతే.. వచ్చే జన్మలో భంగీ ఇంట్లో పుట్టాలని కోరుకుంటాను''అని సమాధానం ఇచ్చారు.

ఫొటో సోర్స్, KEYSTONE/GETTY IMAGES
అంతకుముందు కూడా గాంధీ చేసిన ఓ వ్యాఖ్యకు అంబేడ్కర్ మౌనమే సమాధానమైంది. ''నేనూ అంటరాని వాణ్నే. అందరినీ ఏకతాటిపై కలుపుకుంటూ వెళ్లడమే నా లక్ష్యం''అని నాడు గాంధీ చెప్పడంతో అంబేడ్కర్ నోట మాట రాలేదు.
''నేను అత్యంత నిబద్ధత, నిజాయితీగల అంటరాని వాణ్ని. ఎందుకంటే మిమ్మల్ని సమాజం అంటరానివారిగా పరిగణిస్తోంది. నా విషయానికి వస్తే.. అంటరాని వాడిగా బతకాలని నాకు నేనుగా నిర్ణయించుకున్నాను''అని ఆనాడు గాంధీ చెప్పారు.
రామరాజ్యాన్ని తీసుకురావాలని తాను భావిస్తున్నట్లు గాంధీ చెప్పినప్పుడు హిందూత్వ నాయకులు మీసాలు మెలేశారు. ఓ మెట్టు దిగివచ్చి మరీ ఆనాడు వారు గాంధీని సమర్థించారు.
అయితే ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రామ్ అంటే దశరథుడి తనయుడు కాదని గాంధీజీ ఆనాడే స్పష్టంచేశారు.
ఆదర్శ పాలనంటే రామరాజ్యమని ప్రజల్లో ఓ భావన ఉందని, అలాంటి రాజ్యాన్నే తాను రావాలని కోరుకుంటున్నట్లు గాంధీజీ చెప్పారు.
ప్రజల మనసులో బలంగా నాటుకుపోయిన విషయాలకు ప్రతి విప్లవకారుడు కొత్త భాష్యం చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. ఆ కొత్త భాష్యం ఈ సమాజానికి సరిపడేలా చూసేందుకు ప్రయత్నిస్తాడు.
తనను తాను సనాతన హిందువునని గాంధీ చెప్పుకొన్నా.. ఓ హిందువుకు ఉండాల్సిన లక్షణాలను ఆయన స్పష్టంగా వెల్లడించారు. కరడుగట్టిన వారెవరూ తన వెనుకరావొద్దని ఆయన స్పష్టీకరించారు.
ఎవరు నిజమైన హిందువు? ఈ ప్రశ్నకు నరసింహ మెహతా కీర్తనలను గాంధీ ఉదహరిస్తుంటారు.
‘‘విష్ణు జనులు (హిందువులు) ఎవరంటే.. ఎవరైతే పరుల బాధలను దూరం చేస్తారో వారే. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసినా వీళ్లు మానాభిమానాలను (గర్వాన్ని) దరిచేరనీయరు.’’
ఇక గాంధీ వద్దకు వచ్చే హిందుత్వ వాదులు ఎవరున్నారు?

ఫొటో సోర్స్, CENTRAL PRESS/GETTY IMAGES
మరోవైపు వేదాలను అనుసరించే పండితులు సైతం గాంధీజీపై విరుచుకుపడేవారు. ''మీరు హిందువునని చెప్పుకొంటే.. వేదాల్లో చెప్పినవి అనుసరించాల్సిందే. కుల వ్యవస్థకు వేదాలు మద్దతు పలుకుతున్నాయి''అని వారు చెప్పేవారు.
వారికి గాంధీజీ నిర్మొహమాటంగా సమాధానాలు ఇచ్చేవారు. ''నా వేదాధ్యయనం ప్రకారం.. కుల వ్యవస్థకు వేదాలు మద్దతు పలికినట్టు అనిపించడంలేదు. ఒకవేళ ఎవరైనా కుల వ్యవస్థకు వేదాలు మద్దతు పలికినట్టు నిరూపిస్తే.. ఆ వేదాలను నేను అనుసరించను''అని గాంధీ స్పష్టంచేశారు.
హిందు, ముస్లింల మధ్య పెరిగిన రాజకీయ అగాథాన్ని పూడ్చడమే లక్ష్యంగా మొదలుపెట్టిన జిన్నా, గాంధీ ముంబయి చర్చలు ఓ చోట ఆగిపోయాయి. ''నేను ముస్లింల ప్రతినిధిగా మీతో చర్చలు జరిపేందుకు వచ్చాను. మీరు కూడా హిందువుల ప్రతినిధిగా మాట్లాడండి. మనం సమస్యను పరిష్కరిద్దాం''అని గాంధీతో జిన్నా అన్నారు. ''అయితే అటు హిందువులు, ఇటు ముస్లింల ప్రతినిధిగా మీరు చర్చలు జరుపుతానని అంటున్నారు. దీనికి నేను అంగీకరించను'' అని జిన్నా ఆనాడు చెప్పారు.
''ఏదో ఒక వర్గం లేదా ప్రత్యేక కులానికి ప్రతినిధిగా చర్చలు జరపడానికి నా మనసు అంగీకరించదు. అలాంటి చర్చలు నేను జరపలేను'' అని ఆనాడు గాంధీ తెగేసి చెప్పారు.
అక్కడి నుంచి వచ్చేసిన గాంధీ ఇక జిన్నాతో మాట్లాడనేలేదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES ARCHIVAL
కొందరు తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా పుణె ఒప్పందానికి నీళ్లు వదిలేశారు. అప్పుడు దేశ వ్యాప్తంగా హరిజన్ యాత్ర పేరుతో యాత్ర మొదలుపెట్టింది గాంధీజీనే. అంత వయసులోనూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ''ఆ ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు భావిస్తున్నాను. ఎలా ప్రశాంతంగా కూర్చోగలను''అని ఆనాడు గాంధీ చెప్పారు.
కుల వ్యవస్థ, అంటరానితనం రూపుమాపాలని కోరుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన ర్యాలీనే హరిజన్ యాత్ర.
ఇది ''వన్ మ్యాన్ ఆర్మీ''నే కానీ.. అన్ని యుద్ధాల్లోనూ ఇది గట్టి పోరాటం చేస్తుందని గుర్తించేందుకు లార్డ్ మౌంట్ బ్యాటన్ గుర్తించేందుకు చాలా సమయమే పట్టింది.
హరిజన్ యాత్ర లాంటి భారీ యాత్ర అనంతరం రోజురోజుకూ పెరుగుతున్న గాంధీ ప్రభావాన్ని గుర్తించి చాలా అతివాద హిందూత్వ సంస్థలు కిమ్మనకుండా ఉండిపోయాయి.

ఫొటో సోర్స్, KEYSTONE/GETTY IMAGES
గాంధీజీ దక్షిణ భారత్ యాత్రలో అందరూ ఆయన వెనకేవచ్చారు. దేవాలయాల్లోకి హరిజనుల ప్రవేశంపై నేరుగానే ప్రశ్నలు సంధించారు. ఇలాంటి చర్యలతో హిందుత్వం భావన ధ్వంసమవుతుందని వాదించారు.
''నేను చేస్తున్న పనులతో హిందూత్వం దెబ్బతిన్నా పట్టించుకోను. నేను ఇక్కడికి వచ్చింది హిందూత్వాన్ని కాపాడేందుకు కాదు. నేను ఈ ధర్మాన్ని సంస్కరించాలని అనుకుంటున్నా''అని అక్కడకు వచ్చిన లక్షలాది మందికి గాంధీ చెప్పారు. అనంతరం హరిజనుల కోసం ఎన్నో దేవాలయాలు తెరచుకున్నాయి. ఎన్నో దురాచారాలు, సంకుచిత విధానాలు, భావనలు కనుమరుగు అయ్యాయి.
బుద్ధుడి తర్వాత సామాజిక-మత దురాచారాలపై ఎవరైనా గట్టి, లోతైన ప్రభావం చూపారా అంటే.. వెంటనే గాంధీజీ పేరే చెప్పాలి. ఇలాంటి సామాజిక భూతాలను తరిమే క్రమంలో గాంధీ ఓ కొత్త మత వర్గాన్నీ సృష్టించలేదు. ఎలాంటి కొత్త అభిప్రాయాలనూ లేవనెత్తలేదు. భారత స్వాతంత్ర్య ఉద్యమం బలహీన పడకుండా ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్లారు.

ఫొటో సోర్స్, STR/AFP/GETTY IMAGES
సత్యమే గాంధీ మతం
''సత్య నిష్ఠ'' విషయంలోనూ ప్రపంచంలో ఏ రాజకీయ తత్వవేత్త లేదా ఆధ్యాత్మిక గురువు, లేదా మత నాయకుడు ఇవ్వలేని తార్కాణాన్ని గాంధీజీ ప్రపంచం ముందుంచారు.
గాంధీ పాటించిన ఈ ధర్మం.. ప్రపంచంలోని ఏళ్లనాటి ఆచారాలను అనుసరిస్తున్న మతాల గోడలను బద్దలుకొట్టింది. అన్ని మత, ఆధ్యాత్మిక విశ్వాసాలనూ కుదిపింది.
మొదట ''దేవుడు.. అంటే సత్యం''అని గాంధీ చెప్పారు.
''ఎవరికి వారు సొంత దేవుణ్ని సృష్టించుకోవడంతో గందరగోళం ఏర్పడింది. మనుషుల్ని చంపడం, అగౌరవ పరచడం, ఆత్మన్యూనత భావానికి గురిచేయడం లాంటివి దేవుడి పేరుతో చేస్తున్నారు"అనే గాంధీజీ భావించారు.
దీంతో గాంధీజీ సత్యంపై ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. ''దేవుడే సత్యం’ అన్నది సరికాదు.. ‘సత్యమే దేవుడు''అని చెప్పారు.
''మతం లేదా గ్రంథం లేదా విశ్వాసాలు, సంప్రదాయాలు లేదా స్వామి, గురు, మహంత్, మహాత్మ ఇవేమీ దేవుడు కాదు.. కేవలం సత్యం మాత్రమే.. కేవలం సత్యం''అని ఆయన అన్నారు.
సత్యాన్వేషణ, సత్యాన్ని గుర్తించడం, సత్యాన్ని ప్రజల ముందుకు తీసుకు వచ్చేందుకు కృషి చేయడం.. ఇవే గాంధీ మతం.. ఇవే ప్రపంచ మతం.. ఇవే మానవత్వ మతం..
ఇలాంటి గాంధీజీ నేటి ప్రపంచానికి అత్యంత అవసరం.
ఇవి కూడా చదవండి:
- గాంధీకి దగ్గరైన ఈ ఎనిమిది మంది మహిళల గురించి మీకు తెలుసా?
- మహాత్మా గాంధీ: ‘ఏసుక్రీస్తును అలా భావించలేను.. మీ స్టాంపును వాడలేను’
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: అస్పృశ్యత వ్యతిరేక ఉద్యమానికి ఎదురవుతున్న సవాళ్లపై గాంధీజీ స్వదస్తూరితో ఇచ్చిన జవాబు ఏంటి?
- సైకోలే సరైన నాయకులా?
- మోదీ విమానానికి పాకిస్తాన్ అనుమతివ్వకపోవడం సరైన చర్యేనా? నిషేధించే హక్కు పాక్‌కు ఉందా?
- గాడిద పాలతో చేస్తారు.. కేజీ రూ.78 వేలు.. తినడానికి విదేశాల నుంచి వస్తారు
- గోదావరిలో పడవ ప్రమాదం: బోటును బయటకు తీయడంలో ఆలస్యం ఎందుకు?
- కమలీ: ఆస్కార్ 2020 బరిలో నిలిచిన ఈ అమ్మాయి జీవిత కథేంటంటే..
- హౌడీ మోదీ: ఈ సభతో మోదీ, ట్రంప్‌ల్లో ఎవరికేంటి లాభం? అమెరికాలోని భారతీయుల ఓట్లన్నీ ట్రంప్‌కేనా?
- ‘POK భారత్‌లో భాగమే. ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటాం’ - భారత విదేశాంగ మంత్రి
- అమెరికా, కెనడాల్లో 300 కోట్ల పక్షుల మాయం
- కశ్మీర్‌పై భారత్-పాకిస్తాన్ల హెచ్చరిక ప్రకటనలను ఎలా అర్థం చేసుకోవచ్చు
- ఏరియా 51: 'గ్రహాంతరవాసులను' చూడ్డానికి ఎంతమంది వచ్చారు? వచ్చినవారికి ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








