సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులతో పెరిగిన ఆయిల్ ధరలు... మీపై ప్రభావం పడుతుందా?

ఫొటో సోర్స్, Reuters
సౌదే అరేబియాలోని రెండు చమురు క్షేత్రాలపై ఈ నెల 14న జరిగిన దాడుల వల్ల ఇప్పుడు చమురు ధరలు దాదాపు 20 శాతం పెరిగి, నాలుగు నెలల గరిష్ఠానికి చేరాయి.
సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు. నిత్యం 70 లక్షల బ్యారెళ్లకు పైగా చమురును ఎగుమతి చేస్తుంది.
14 నాటి డ్రోన్ దాడులు సౌదీ అరేబియా చమురు పరిశ్రమకు గుండెకాయ లాంటి ప్రాంతంలో జరిగాయి. అబ్కాయిక్, ఖురైస్‌లలో ఈ దాడులు జరిగాయి.
దాడులు జరిగిన లక్ష్యాల్లో ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం. ఈ రెండింటినీ ఇంధన రంగ దిగ్గజం అర్మాకో నిర్వహిస్తుంది.
సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిలో సుమారు 50 శాతం ఈ రెండు చమురు క్షేత్రాల నుంచే వస్తుంది. అంతర్జాతీయ రోజువారీ చమురు ఉత్పత్తిలో వీటి వాటా ఐదు శాతం.
14 నాటి దాడులతో అంతర్జాతీయ చమురు సరఫరా ఐదు శాతానికి పైగా తగ్గిపోయింది. ఈ ప్రభావంతో ధరలు పెరిగాయి.

ఫొటో సోర్స్, Reuters
సోమవారం ఒక దశలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.95 డాలర్లకు చేరింది. అమెరికాలో చమురు ధరలు కూడా పెరిగాయి.
అమెరికా నిల్వల నుంచి ఆయిల్ విడుదలకు అధికార యంత్రాంగానికి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అనుమతి ఇచ్చిన తర్వాత, పెరిగిన ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఉన్న సమాచారం ప్రకారం- బ్రెంట్ క్రూడ్ ధర మొత్తమ్మీద దాదాపు 10 శాతం పెరిగింది. బ్యారెల్ 66.64 డాలర్లకు చేరింది.
మరో ప్రధాన బెంచ్ మార్క్ 'వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ)' తొలుత 15 శాతం పెరిగింది. ఇప్పుడు పెరుగుదల 9.5 శాతంగా ఉంది. బ్యారెల్ ధర 60.06 డాలర్లకు చేరింది.
దెబ్బతిన్న చమురు క్షేత్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి, చమురు సరఫరా సాధారణ స్థితికి రావడానికి కొన్ని వారాలు పట్టే అవకాశముంది.
ముడిచమురు ధరల పెరుగుదలపై ఫండ్ మేనేజర్ 'విజ్డమ్ ట్రీ'కి చెందిన కమోడిటీస్ వ్యూహకర్త అనీకా గుప్తా స్పందిస్తూ- ఈ ప్రభావం వినియోగదారులపై వెంటనే ఉండదని స్పష్టం చేశారు.
చమురు క్షేత్రాలు ఆరు వారాలకు పైగా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోతే, బ్యారెల్ ముడిచమురు ధర 75 డాలర్లకు చేరుకోవచ్చని ఆమె అంచనా వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
చమురు పరిశ్రమపై ప్రభావం?
చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడుల్లో ఎవరూ చనిపోలేదని సౌదీ అరేబియా చెప్పింది. ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. చమురు ఉత్పత్తి గురించి మాత్రం కొన్ని సంకేతాలు ఇచ్చింది.
భారీ నిల్వ కేంద్రాల నుంచి చమురును వాడుకొని, కొంత లోటును అధిగమిస్తామని ఇంధనశాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులజీజ్ బిన్ సల్మాన్ చెప్పారు.
అబ్కాయక్, ఖురైస్‌లలోని చమురు క్షేత్రాలకు డ్రోన్ దాడులతో భారీ నష్టమే వాటిల్లిందని లండన్‌లోని 'ఇంటర్‌ఫాక్స్ ఎనర్జీ' అనలిటిక్స్ విభాగ సారథి అభిషేక్ కుమార్ చెప్పారు.
సౌదీ అరేబియా ఇప్పుడు నిల్వ ఉంచిన చమురును ఉపయోగించుకొనే అవకాశముంది. అందువల్ల ఈ వారం సౌదీ అరేబియా నుంచి చమురు ఎగుమతులు సాధారణంగానే ఉండొచ్చు.

ఫొటో సోర్స్, FB/POTUS
ఇరాన్‌పై అమెరికా ఆరోపణలు
డ్రోన్ దాడులు తమ పనేనని యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు చెబుతుండగా, ఇవి ఇరాన్ జరిపిన దాడులని అమెరికా ఆరోపిస్తోంది. ఇందులో తమ ప్రమేయం లేదని ఇరాన్ చెబుతోంది.
హౌతీలకు ఇరాన్ మద్దతుంది.
డ్రోన్ దాడి తమ పనేనన్న హౌతీ తిరుగుబాటుదారుల మాటను అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో తోసిపుచ్చారు. దాడుల వెనక ఇరాన్ ఉందని ఆరోపించారు.
దోషి ఎవరో అమెరికాకు తెలుసని, ఇప్పుడేం చేయాలనే విషయంలో సౌదీ అరేబియా స్పందన కోసం సర్వసన్నద్ధంగా ఎదురుచూస్తున్నామని ట్రంప్ ట్విటర్‌లో చెప్పారు. చాలా చమురు అందుబాటులో ఉందని ఆయన మరో ట్వీట్‌లో ధీమా వ్యక్తంచేశారు.
అమెరికా వంచనకు పాల్పడుతోందని ఇరాన్ ప్రత్యారోపణ చేసింది. యెమెన్‌లో విధ్వంసానికి ముగింపు పలకాలంటే తమను నిందిస్తే ప్రయోజనం ఉండదని ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి జావద్ జారిఫ్ తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
2015లో హౌతీల దాడులతో యెమెన్ అధ్యక్షుడు అబ్ద్రాబ్బు మన్సూర్ హాదీ దేశ రాజధాని సనాను వీడి పరారైనప్పటి నుంచి యెమెన్‌లో యుద్ధం జరుగుతోంది.
హాదీకి సౌదీ అరేబియా మద్దతిస్తోంది. హౌతీలకు వ్యతిరేకంగా వివిధ దేశాలతో కూడిన కూటమికి నాయకత్వం వహిస్తోంది.
హౌతీలపై సౌదీ అరేబియా సుదీర్ఘకాలంగా సాగిస్తున్న వైమానిక దాడులకు అమెరికా మద్దతు అందిస్తోంది.
బీబీసీ దౌత్య ప్రతినిధి జొనాథన్ మార్కస్ విశ్లేషణ
గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్తతలు ఉండగా, తాజా దాడులు వీటిని మరింత పెంచాయి.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు కేంద్రాలకు ఎంత తీవ్రమైన ముప్పుందో ఈ దాడులతో స్పష్టమైంది. అలాగే హౌతీలకు ఇరాన్ నుంచి టెక్నాలజీ, తోడ్పాటు ఎంతమేర అందుతున్నాయనే చర్చను ఇవి మరోసారి తెరపైకి తెచ్చాయి.
ఇరాన్‌ను గరిష్ఠ స్థాయిలో ఒత్తిడికి గురిచేస్తామన్న ట్రంప్ ప్రభుత్వ విధానంలోని లోపాలను కూడా ఈ దాడులు బయటపెట్టాయి.
ఈ దాడులు భిన్నమైనవి
సౌదీపై దాడులకు హౌతీలు గతంలోనూ డ్రోన్లు, క్షిపణులు రెండూ ప్రయోగించారు. లోగడ డ్రోన్ దాడులు పరిమితంగా విజయవంతమయ్యాయి.
జరిగిన ప్రాంతం, కచ్చితత్వం, తీవ్రతను బట్టి చూస్తే మొన్నటి దాడులు భిన్నమైనవి.

ఫొటో సోర్స్, Reuters
ఎక్కడి నుంచి జరిపారు?
ఆయుధాలు అమర్చిన మానవ రహిత వైమానిక వాహనాలు (యూఏవీలు)తోనే ఈ దాడులకు పాల్పడ్డారా లేక క్షిపణులను ప్రయోగించారా? ఒకవేళ వాళ్లు క్షిపణులనే ప్రయోగించి ఉంటే, సౌదీ గగనతల రక్షణ వ్యవస్థ ఎందుకు అప్రమత్తం కాలేదు? దాడులను హౌతీ నియంత్రిత భూభాగం నుంచి జరిపారా, మరో ప్రాంతం నుంచి జరిపారా? ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల గ్రూపుల ప్రమేయం ఉందా, లేక నేరుగా ఇరానీలకే పాత్ర ఉందా? ఈ అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
యూఏవీలు లేదా క్షిపణులతో సుదూర లక్ష్యాలపై దాడులు చేయగలిగే సామర్థ్యాన్ని హౌతీలు పెంపొందించుకోవడంలో ఇరాన్ కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.
హౌతీలకు చెందిన ఖాసెఫ్-1 యూఏవీ, ఇరాన్ వాడే అబాబిల్-టీ డ్రోన్ మధ్య చాలా దగ్గరి పోలికలు ఉన్నట్లు 2018 నాటి ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీ నివేదిక ఒకటి వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇరాన్ హౌతీలకు రకరకాల ఆయుధ వ్యవస్థలను సరఫరా చేసిందని చెప్పింది.
ఖాసెఫ్-1 లేదా అబాబిల్-టీ డ్రోన్ల పరిధి దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్లు. యెమెన్ సరిహద్దు, సౌదీ అరేబియాలోని ఖురైస్ చమురు క్షేత్రం మధ్య దూరం సుమారు 770 కిలోమీటర్లు.
14 నాటి దాడులు యూఏవీతో జరిపి ఉంటే, గతంతో పోలిస్తే దాని డిజైన్ పూర్తిగా మారిపోయి ఉండాలి. దాని సామర్థ్యం, పరిధి చాలా పెరిగి ఉండాలి.
ఇరాక్ లేదా ఇరాన్ నుంచి క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారా అనేది కూడా తేలాల్సి ఉంది. కచ్చితమైన నిఘా సమాచారం వెల్లడయ్యాకే ఈ అంశాలపై స్పష్టత వస్తుంది.
ఇవి కూడా చదవండి:
- కోడెల శివప్రసాద్ ఆత్మహత్య
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- చే గువేరా భారత్ గురించి ఏమన్నారంటే..
- జమ్మూకశ్మీర్ పరిస్థితి మెరుగవుతుందా... లేక మరింత దిగజారుతుందా?
- మానవ నివాసయోగ్యమైన ఆ గ్రహం మీద తొలిసారిగా గుర్తించిన నీటి జాడలు
- కేసీఆర్ వ్యక్తిత్వం: మాటే మంత్రం
- ‘ఉద్యోగాల లోటు లేదు, ఉత్తర భారతీయుల్లో వాటికి అర్హులు లేరు’ - కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








