హాంగ్‌కాంగ్ నిరసనలకు బ్రేక్ పడబోతుందా

కేరీ లాం
ఫొటో క్యాప్షన్, కేరీ లాం

హాంగ్‌కాంగ్‌లో అత్యంత వివాదాస్పదంగా మారిన ‘చైనాకు నేరస్థుల అప్పగింత’ బిల్లును ఉపసంహరించుకుంటామని ఆ దేశ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేరీ లామ్ ప్రకటించారు.

ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం నేరస్థులన్న అనుమానమున్నవారిని చైనాకు అప్పగించే వీలుంటుంది.

దీనిపై వివాదం తలెత్తడంతో పాటు భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో జూన్‌లోనే దీన్ని పక్కనపెట్టారు. కానీ, ఇంతవరకు ఉపసంహరించలేదు.

ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించాలన్నది నిరసనకారుల అయిదు ప్రధాన డిమాండ్లలో ఒకటి.

బుధవారం టీవీ చానల్‌లో ప్రజలనుద్దేశించిన మాట్లాడిన లామ్.. శాంతి నెలకొల్పే దిశగా పలు చర్యలను ప్రకటించారు.

నిరసనల సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విచారణ జరిపేందుకు ఇప్పటికే నియమించిన కమిటీలో మరో ఇద్దరు సీనియర్ అధికారులు కూడా చేరనున్నారని ఆమె తెలిపారు.

నిరసనకారుల మీద పోలీసుల అకృత్యాలపై స్వతంత్ర విచారణ జరిపించాలన్నది కూడా ఆందోళనకారుల డిమాండ్లలో ఒకటి.

నిరసనలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, హాంగ్‌కాంగ్ పార్లమెంటు ముందు నిరసనలు

ఏమిటీ బిల్లు.. ఎందుకీ నిరసనలు?

హాంగ్ కాంగ్ నుండి నేరస్తులను చైనాకు అప్పగించేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది. దీనిపై నిరసనలు వెల్లువెత్తినప్పటికీ హాంగ్‌కాంగ్ ఆ బిల్లును ఆమోదించేందుకే ఇంతకుముందు ప్రయత్నించింది.

ఈ ప్రతిపాదిత చట్టాన్ని చైనాలో తీవ్ర లోపభూయిష్టమైన పోలీసు, న్యాయ వ్యవస్థ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చైనా రాజకీయంగా తమకు వ్యతిరేకం అనుకున్నవారిని ఈ చట్టం ప్రకారం ఇరికించే ప్రమాదం ఉందన్నది వారి ఆందోళన. అంతేకాదు.. దానివల్ల హాంగ్ కాంగ్ న్యాయ వ్వవస్థ స్వాతంత్ర్యం ఇంకా తరిగిపోతుందని వాదిస్తున్నారు.

హాంగ్‌కాంగ్

ఫొటో సోర్స్, Reuters

అసలు హాంగ్‌కాంగ్ కథేమిటి?

హాంగ్‌కాంగ్ ఒకప్పుడు బ్రిటిష్ వలస ప్రాంతం. 1997లో చైనా దీన్ని తన పాలనలోకి తీసుకుంది. 'ఒక దేశం - రెండు వ్యవస్థ'ల సూత్రం ప్రకారం పాక్షిక స్వయం ప్రతిపత్తి హాంగ్‌కాంగ్‌కు ఉంది.

ఈ నగరానికి తన సొంత చట్టాలు ఉన్నాయి. చైనా పౌరులకు లేని పౌర స్వాతంత్య్రాలు హాంగ్ కాంగ్ వాసులకు ఉన్నాయి.

బ్రిటన్, అమెరికా సహా 20 దేశాలతో 'నిందితుల అప్పగింత' ఒప్పందాలు కుదుర్చుకుంది హాంగ్ కాంగ్. కానీ.. ప్రధాన చైనాతో అటువంటి ఒప్పందం ఏదీ ఖరారు కాలేదు. దీని కోసం రెండు దశాబ్దాలుగా సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి.

చైనా చట్టం కింద నిందితులకు సరైన న్యాయ రక్షణ లేకపోవటమే దీనికి కారణమని విమర్శకులు చెప్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)