నగర జీవితం మీ ఆరోగ్యం, సంతోషం మీద ఎలా ప్రభావం చూపుతోంది?

కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విలియం పార్క్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నగరంలో వాయు కాలుష్యం ప్రభావం.. ప్రతి రోజూ ఒక సిగరెట్ ప్యాకెట్ చొప్పున 29 సంవత్సరాల పాటు తాగినంత ఉంటుందని ఇటీవలి ఒక అధ్యయనం విశ్లేషించింది.

మన ఊపిరితిత్తుల మీద దీని ప్రభావం చాలా ఆందోళనకరమైనదనే విషయంలో సందేహం లేదు. అయితే.. మనం పీలుస్తున్న గాలి మన శరీరంలోని ఇతర భాగాలపై కూడా చూపుతున్న ప్రభావం కూడా ఆందోళన కలిగించేదే.

ఈ కొత్త అధ్యయనంలో అమెరికా వ్యాప్తంగా నగరాల్లో భూతల స్థాయి ఓజోన్‌కు గురవుతున్న 7,000 మంది వయోజనులను పరిశీలించారు. పట్టణవాసులు సాధారణంగా 10 నుంచి 25 పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్ - వంద కోట్ల భాగాల్లో) వరకూ ఓజోన్‌కు గురవుతుంటారు. ఇలా ఓజోన్‌కు గురవటం మూడు పీపీబీ పెరిగితే.. ప్రతి రోజూ అదనంగా ఇంకొక ప్యాకెట్ సిగరెట్లు తాగటంతో సమానమవుతుంది.

కాబట్టి.. తక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతం నుంచి ఇంకా శుభ్రమైన నగరానికి మారినా కూడా.. ఊపిరితిత్తుల్లో వాయుగోళాల వాపు వంటి శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం పెరగవచ్చు. ఈ వ్యాధి సాధారణంగా ధూమపానం చేసే వారిలో ఎక్కువగా ఉంటుంది.

పట్టణ కాలుష్య స్థాయి 'ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. ఎందుకంటే.. ఆ ప్రాంతాల్లో వాయు కాలుష్యం డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలను మించిపోయాయి. మనలో 91 శాతం మంది అటువంటి ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 55 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. ఈ సంఖ్య 2050 నాటికి 68 శాతానికి పెరుగుతందని ఐక్యరాజ్యసమితి అంచనా.

మన ఆరోగ్యానికి, మానసిక సంక్షేమం, దృక్కోణాలకు పట్టణ జీవితం చాలా ఆందోళనకారకంగా తయారైంది. కాలం గడిచేకొద్దీ ఈ ప్రమాద తీవ్రత మరింత పెరుగుతోంది.

కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

మానసిక ఆరోగ్యం

పట్టణ ప్రాంతాల్లో నివసించే జనంలో మానసిక రుగ్మతలు అధికంగా ఉన్నాయని గత 35 ఏళ్లలో నిర్వహించిన 20 పరిశోధనల వివరాల విశ్లేషణ వెల్లడిస్తోంది. ముఖ్యంగా నగర జనాభా మానసిక అశాంతి, వ్యాకులతలతో బాధపడుతుండటం చాలా అధిక స్థాయిలో ఉంది.

కెస్లర్ సైకలాజికల్ డిజార్డర్ స్కేల్ ప్రకారం.. సముద్రాన్ని ఎంత ఎక్కువగా చూడగలిగితే.. ఇటువంటి మానసిక రుగ్మతల రేటు అంత తక్కువగా ఉంటాయి. నీలి ఆకాశం కనిపించటం 20 నుంచి 30 శాతం పెరిగితే.. ఒక వ్యక్తిలో కుంగుబాటు స్థాయి ఒక మోస్తరు నుంచి తక్కువ స్థాయికి తగ్గుతుందని పరిశోధకులు చెప్తున్నారు.

విద్య

చిత్రంగా.. నగరాలు మనపై చూపే మరో దుష్ప్రభావం మన తెలివితేటలను హరించటం. విద్యార్థుల పరీక్ష ఫలితాలను పోల్చిచూసినపుడు.. కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలు చెత్తగా ఉండటం ఎక్కువగా ఉందని వెల్లడైంది.

అవే నగరాల్లో అవే పరీక్షలను వేరే రోజుల్లో రాసినపుడు వచ్చిన ఫలితాలను.. ఆయా రోజుల్లోని కాలుష్య స్థాయిలతో పోల్చిచూశారు. కాలుష్య స్థాయిల్లో చిన్న తేడా కూడా ఈ ఫలితాల్లో పెద్ద తేడా ఉండేలా ప్రభావం చూపినట్లు తేలింది.

ఇది ఆ తర్వాత జీవితంలో నిజంగా ప్రభావం చూపుతుంది. హైస్కూల్ విద్య తుది పరీక్షలు రాసే రోజున గాలిలో కాలుష్య స్థాయి అధికంగా ఉంటే.. ఆ విద్యార్థులు పెద్దయ్యాక వారి వేతనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఇజ్రాయెల్‌లో నిర్వహించిన ఒక అధ్యయనం గుర్తించింది.

కాలుష్యం

ఫొటో సోర్స్, EPA

బరువు

స్థూలకాయానికి వాయు కాలుష్యానికి కూడా సంబంధం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఇది ఖచ్చితంగా ఎలా పనిచేస్తుందనేది ఇంకా చర్చనీయాంశమే అయినప్పటికీ.. శరీర జీవక్రియను కాలుష్యం మార్చేస్తుందని ప్రధానంగా జంతువులపై చేసిన పరిశోధనలను బట్టి భావిస్తున్నారు.

కాలుష్య రేణువుల వల్ల ఊపిరితిత్తుల్లో వాపు రావటం.. అది ఒత్తిడి ప్రతిస్పందనను ప్రారంభించటం.. దీనికి కారణం కావచ్చు.

దీనివల్ల విడుదలయ్యే హార్మోన్లు.. ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గించగలవు. దాంతో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

ఒత్తిడి పరిస్థితుల్లో కొంత శక్తి సంసిద్ధంగా ఉండేలా చూడటం ఈ ప్రతిస్పందన ఉద్దేశం. కానీ.. వాయు కాలుష్యం వల్ల మనం నిరంతరం ఎంతో కొంత ఒత్తిడి స్థితిలో ఉన్నట్లయితే.. అది చక్కెరను మనం ఎలా శుద్ధి చేయగలమనే సామర్థ్యం మీద దీర్ఘకాలిక ప్రభావాలు చూపగలదు. ఇది మధుమేహం రావటానికి మొదటి మెట్టు.

ఈ పరిశోధనను.. కెనడాలో 62,000 మంది పౌరులపై నిర్వహించినటువంటి తరహా భారీ స్థాయి అధ్యయనాలు బలపరుస్తున్నాయి.

మధుమేహం తలెత్తే ప్రమాదం.. ఒక ఘనపు మీటరు గాలిలో ప్రతి పది మైక్రోగ్రాముల సూక్ష్మ రేణువులకు 11 శాతం చొప్పున పెరుగుతుందని ఆ అధ్యయనంలో గుర్తించారు.

కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

మన నగరాలను మెరుగుపరచటానికి ఏం చేయగలం?

ఆకుపచ్చని ప్రాంతం అతి కొంచెం ఉన్నా కూడా చాలా పెద్ద మార్పు కనిపించగలదు. ప్రత్యేకించి దిగువ సామాజికార్థిక వర్గాల ప్రజలకు ఇది మేలు చేస్తుంది. అయితే.. సువాసనలు కూడా నగరాలను మరింత ఆహ్లాదకరమైన నివాస ప్రాంతాలుగా మలచగలవు. నగర రణగొణల నుంచి కాస్త దూరం జరగటానికి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయటం.. ప్రజల మానిసక ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు.

బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ఏడు మీటర్ల 'స్మాగ్ ఫ్రీ టవర్'.. ఒక ఫుట్‌బాల్ పిచ్ మొత్తంలోని గాలిని శుభ్రం చేయగలదని చెప్తున్నారు. ఆ నిర్మాణం ఒక భారీ తేనెతుట్టెను పోలి ఉంటుంది. అందులోని ఎలక్ట్రిక్ చార్జెస్.. గాలిలోని సూక్ష్మ రేణువులను ఈ టవర్‌లోకి పీల్చుకుంటుంది. ఆ రేణువులు.. ఒక డస్ట్ రిమూవల్ ప్లేట్‌లో బందీలవుతాయి.

మెక్సికో నగరంలో హాస్పిటల్ మాన్యువెల్ గీ గొంజాలెజ్ పక్కన ఒక భారీ తేనెతుట్టె వంటి నిర్మాణం ఉంటుంది. ఇది కారు నుంచి విడుదలయ్యే పొగ నుంచి కాలుష్యకాలను వడగట్టే కాటలిటిక్ కన్వర్ట్ తరహాలోనే పని చేస్తుంది. ఇది రోజుకు వేయి కార్లతో సమానంగా పనిచేస్తూ కాలుష్యాన్ని తొలగిస్తుందని దీనిని తయారు చేసిన వారు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)