కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా టార్గెట్ మావోయిస్టులేనా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
జమ్ము-కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా దృష్టి ఇప్పుడు మధ్య, తూర్పు భారతదేశంలో చురుగ్గా ఉన్న మావోయిస్టు గెరిల్లాలపై పడిందా?
రాజకీయ, సామాజిక వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి ఒక కారణం ఉంది.
హోం మంత్రిత్వశాఖ గణాంకాలను బట్టి 2014 నుంచి 2018 వరకూ జమ్ము-కశ్మీర్‌లో సామాన్యులు, భద్రత దళాల జవాన్లు, మిలిటెంట్లు మొత్తం కలిపి 1315 మంది చనిపోయారు.
అదే సమయంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 2056 మంది మృతి చెందారు.
ఈ గణాంకాలు చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అందరి దృష్టి జమ్ము-కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు మీదే ఉంది.
అమిత్ షా హోంమంత్రి అయిన తర్వాత ఇటీవల నిర్వహించిన తన మొట్టమొదటి సమావేశంలో కేవలం నక్సల్స్ సమస్య, దాని పరిష్కారం మీదనే చర్చించారు.
ఈ సమావేశానికి పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర భద్రతా బలగాల డైరెక్టర్ జనరల్స్‌ను కూడా ఆహ్వానించారు.
అయితే, పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ సమావేశానికి హాజరు కాలేదు.
వారి తరఫున హోంమంత్రులు, ఆయా రాష్ట్రాల డీజీపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, CPI (MAOIST)
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు
కీలకమైన ఈ సమావేశానికి ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడంపై అంతర్గత భద్రతకు సంబంధించిన నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర గడ్చిరోలిలో ఇటీవల ఒక భారీ నక్సల్స్ దాడి జరిగింది. తెలంగాణ ఎప్పుడూ మావోయిస్టులకు కంచుకోటలా నిలిచింది.
కానీ, ఈ రాష్ట్రాల సీఎంలు ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి రాకపోవడం స్వయంగా ఆందోళన కలిగించే విషయం.
ప్రభుత్వ వర్గాల ప్రకారం ఫడణవీస్ మహారాష్ట్రలో జరగనున్న ఎన్నికల పనుల్లో చాలా బిజీగా ఉన్నారు.
సమావేశం గురించి వెంటనే అధికారిక ప్రకటనను జారీ చేయకపోయినా, దానికి హాజరైన కొందరు అధికారుల వివరాల ప్రకారం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయడం, మావోయిస్టుల గెరిల్లా వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై ప్రధానంగా చర్చించారు.
కేంద్ర రిజర్వ్ పోలీసు దళాల డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన ప్రకాశ్ సింగ్ దీనిపై బీబీసీతో మాట్లాడుతూ "ఇంతకు ముందు కూడా ఇలాంటి సమావేశాలు జరుగాయి. కానీ హోంమంత్రిత్వ శాఖ గణాంకాలను చూస్తుంటే కచ్చితంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో హింస ఎక్కువైనట్లు అనిపిస్తోంది" అన్నారు.
కానీ మనం అవే గణాంకాలను గమనిస్తే నక్సల్స్ దాడులు కచ్చితంగా తగ్గినట్టు కూడా కనిపిస్తుంది అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, AFP
వామపక్ష భావజాలం
జులైలో పార్లమెంటులో ఒక ఎంపీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భౌగోళికంగా మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలు తగ్గిపోతున్నాయని అన్నారు.
"ఇప్పుడు మావోయిస్టు ప్రభావం ఉన్న జిల్లాలు 60 శాతం మాత్రమే మిగిలాయి. కేవలం 10 జిల్లాల్లో అత్యధిక హింస నమోదైంది" అని ఆయన తెలిపారు.
కానీ మావోయిస్టులను అణచివేశామని, వారి ప్రభావాన్ని తగ్గించడంలో విజయవంతం అయ్యామని ప్రభుత్వం అనుకోవడం సరికాదని ప్రకాశ్ సింగ్ చెబుతున్నారు.
"60, 70వ దశకంలో వామపక్ష భావజాలం ఉన్న కొందరు వారి నుంచి విడిపోయి సొంత పార్టీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇలా ఇంతకు ముందు రెండు సార్లు జరిగింది. కానీ, అప్పుడు కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పాటు చేశారు" అన్నారు.
2004లో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్, పీడబ్ల్యుజీ విలీనం అయినపుడు మావోయిస్టుల్లో అంతకు ముందు కంటే ఎక్కువ మిలిటరైజేషన్ జరిగింది.
మావోయిస్టులు పూర్తిగా వెనకడుగు వేయలేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అడవులు, సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులు వారిని మరింత బలోపేతం చేస్తున్నాయని చెప్పారు.

ఆదివాసీలకు రాజ్యాంగం నుంచి హక్కులు
కానీ, అఖిల భారతీయ ఆదివాసీ మహాసభ అధ్యక్షుడు మనీశ్ కుంజామ్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఆదివాసీలకు రాజ్యాంగం ద్వారా అందిన హక్కులను లాక్కోవాలని చూస్తుందని అంటున్నారు.
మావోయిస్టుల పేరుతో తమ హక్కులను ఎక్కడ లాగేసుకుంటారో అని ఆగస్టు 8న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున అందరూ ఆందోళన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.
ఆయన రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్, 'పంచాయతీ రాజ్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియా యాక్ట్' గురించి చెబుతున్నారు.
"ఈ నిబంధనల వల్ల ఆదివాసీల గ్రామ సభలు, పంచాయతీలకు చాలా హక్కులు లభించాయి. వాటి వల్ల ఈ ప్రాంతాల్లో ఖనిజ సంపదను దోచుకోవాలనుకుంటున్న పెద్ద పెద్ద కంపెనీలకు చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి" అని చెప్పారు.
అటవీ హక్కుల చట్టాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారని, అలా చేసి ఆదివాసీలను భారీగా ఇతర ప్రాంతాలకు పంపించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, Alok Putul
అదనపు భద్రతా బలగాలు
నియంగిరి, బైలాడీలాలో ఇనుప ఖనిజం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆదివాసీల నిరసన ప్రదర్శనలు చేయడం గురించి మనీష్ కుంజామ్ ప్రస్తావించారు.
కానీ చర్చల పురోగతి, పోలీసుల ఆధునికీకరణ జరగాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రస్తుత చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ భావిస్తున్నారు.
దానితోపాటు మావోయిస్టు ప్రభావిత జిల్లాల అభివృద్ధి కోసం అదనపు నిధులు కేటాయించడంపై కూడా చర్చ జరిగింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయం మరింత మెరుగ్గా ఎలా చేయడం అనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
సమావేశంలో చాలా రాష్ట్రాలు కేంద్రం నుంచి అదనపు భద్రతా బలగాలను డిమాండ్ చేశాయని ఆయన చెప్పారు.
ఇక మావోయిస్టుల గెరిల్లా యుద్ధం విషయానికి వస్తే కేంద్ర భద్రతా బలగాలకు దానిపై సరైన శిక్షణ లేదని బఘేల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- 'కశ్మీర్ పరిణామాలపై ధైర్యంగా మాట్లాడాలనే ఐఏఎస్ పదవికి రాజీనామా చేశాను' -కన్నన్
- లైంగిక వేధింపులకు గురైన కొడుకు కోసం ఓ తల్లి న్యాయ పోరాటం
- కశ్మీర్‌లో ఇళ్లకు భారత సైన్యం నిప్పు పెట్టిందనే సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత...
- కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఏమిటి.. యూటీలు ఎన్ని రకాలు.. వాటి అధికారాలేమిటి?
- 'కశ్మీర్‌లో యథాతథ స్థితిని కొనసాగించాలి... లద్దాఖ్‌ను యూటీ చేయడాన్ని మేం ఆమోదించం' - చైనా
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








