కంప్యూటర్ గేమ్ ఆడితే ఆ కుర్రాడికి రూ. 20 కోట్లు వచ్చాయి

ఫొటో సోర్స్, EPIC GAMES
కంప్యూటర్ గేమ్ 'ఫోర్ట్‌నైట్'లో విజయం సాధించిన ఓ అమెరికా యువకుడు 3 మిలియన్ డాలర్లను (దాదాపు 20 కోట్ల రూపాయలు) గెలుచుకున్నాడు.
ఆన్‌లైన్ గేముల్లో ఓ వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో నగదు బహుమతిని గెలుచుకోవడం ఇదే మొదటిసారి.
న్యూయార్క్ లోని ఆర్ధర్ ఆషే స్టేడియంలో జరిగిన పోటీల్లో సోలో ఈవెంట్‌లో విజయం సాధించిన 16 ఏళ్ల కైలీ గీర్స్‌డార్ఫ్ ఈ భారీ నగదును సొంతం చేసుకున్నాడు. ఈ స్టేడియంలోనే యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుంది.
బ్రిటన్‌కు చెందిన మరో యువకుడు జాడెన్ ఆష్మాన్ ఈ పోటీలో రెండో స్థానంలో నిలిచాడు. అతడికి 1 మిలియన్ పౌండ్లు (దాదాపు 8.5 కోట్ల రూపాయలు) బహుమతిగా దక్కాయి.
ఆన్‌లైన్‌లో బుఘా అనే పేరుతో ఉన్న గీర్స్‌డార్ఫ్... విజేతగా తన పేరును ప్రకటించి, అక్కడున్నవారంతా తన చుట్టూ చేరేసరికి నవ్వుతూ ఉండిపోయాడు.
"ఈ మొత్తంలో చాలావరకూ దాచుకోవాలి. ముందు ఈ ట్రోఫీని ఉంచడానికి ఓ టేబుల్ కొనాలి" అని అతడు బీబీసీతో అన్నాడు.
టోర్నమెంట్ జరుగుతున్నంతసేపూ గీర్స్‌డార్ఫ్ చిరునవ్వుతో ఆడుతూ, ప్రత్యర్థులను ఓడించాడని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
2019లో ఈ-స్పోర్ట్స్ బిలియన్ డాలర్ల వ్యాపారంగా మారుతుందనడానికి ఈ పోటీనే ఓ ఉదాహరణ అని భావిస్తున్నారు.
అయితే, ప్రస్తుత విజయంతో నెలకొల్పిన భారీ ప్రైజ్ మనీ రికార్డు త్వరలోనే బద్దలుకాబోతోంది. ది ఇంటర్నేషనల్ అనే పేరుతో ఆగస్టులో జరిగే ఈవెంట్ దీనికి వేదిక కానుంది.
భారీ కంప్యూటర్ తెరలపై 100 మంది ఆటగాళ్లు ఫోర్ట్‌నైట్ ఫైనల్స్‌లో ఆడారు. దీనికి అర్హత సాధించడానికి 10 వారాల వ్యవధిలో ఆన్‌లైన్ పోటీల్లో 4 కోట్లమంది ఆటగాళ్లు పోటీ పడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
30కి పైగా దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో అమెరికా నుంచి 70 మంది, ఫ్రాన్స్ నుంచి 14మంది, యూకే నుంచి 11మంది పోటీపడ్డారు.
"100 మంది ఆటగాళ్లను ఓ దీవిలో వదిలేస్తారు. అక్కడ వారు ఆయుధాలను వెతికి పట్టుకుంటూ, ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేసుకుంటూ ముందుకుసాగాలి. చివరికి మిగిలిన ఒక్కరూ విజేతగా నిలుస్తారు".. ఇదే ఫోర్ట్‌నైట్ గేమ్ ఫైనల్.
ఈ గేమ్‌కు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఒక్కొక్కరుగానూ దీన్ని ఆడొచ్చు, నలుగురు లేదా 20 మంది బృందంలో సభ్యుడిగా ఉంటూ కూడా దీన్ని ఆడొచ్చు. స్నేహితులతోనూ, లేదా పరిచయం లేని ఇతర వ్యక్తులతో కూడా ఈ ఆట ఆడవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఆటగాళ్ల వయసును ధ్రువీకరించుకోవడానికి, ఆట మధ్యలో విరామం తీసుకోవడానికి ఈ గేమ్‌ను రూపొందించిన 'ఎపిక్ గేమ్స్' ఏం జాగ్రత్తలు తీసుకుందని గత నెలలో యూకే ఎంపీలు ప్రశ్నించారు.
ఫోర్ట్‌నైట్ ఓ వ్యసనంలా మారుతోందని, ఈ గేమ్‌ను నిషేధించాలని ఏప్రిల్‌లో డ్యూక్ ఆఫ్ ససెక్స్ పిలుపునిచ్చారు.
ప్రిన్స్ హ్యారీ వ్యాఖ్యలపై ఎపిక్స్ గేమ్స్ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారని ఆ కంపెనీ న్యాయవాది కేనన్ పెన్స్ ఎంపీలతో అన్నారు.
ఇవి కూడా చదవండి.
- PUBG: ఈ ఆటకు ఎందుకంత క్రేజ్? ఎలా ఆడతారు? ఇందులో గెలుపు ఓటములు ఏమిటి?
- ప్రాణాలు తీస్తున్న 'మోమో' చాలెంజ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..
- మొబైల్ గేమ్స్: ఇది వ్యసనమే కాదు.. ఓ వ్యాధి
- సెక్స్ డాల్స్: ఏది నైతికత?
- "కార్గిల్‌లో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్
- "యోగి ఆదిత్యనాథ్‌ని యూపీ సీఎం చేస్తామంటే అంతా వద్దన్నారు, కానీ..."
- ఓడలపై ఎగిరే జెండా ఏం చెబుతుంది
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








