మిషన్ టు మూన్: 1969 అపోలో-11 మిషన్ ఏమిటి? చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది?

ఫొటో సోర్స్, Reuters
చంద్రుడి మీదకు మనిషిని పంపించిన తొలి దేశంగా అమెరికా చరిత్ర సృష్టించి 50 సంవత్సరాలు కావస్తోంది.
అమెరికాలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అపోలో-11 మిషన్ ఒక అద్భుతమైన పరిణామం. అయితే.. అసలు ఈ మిషన్‌లో ఏం జరిగింది? దానికి ఎందుకంత ప్రాధాన్యత?
చంద్రుడి మీదకు వెళ్లాలని అమెరికా ఎందుకు భావించింది?
నాటి సోవియట్ యూనియన్ 1957లో తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌ను ప్రయోగించింది. దీంతో.. అప్పటికే ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న సోవియట్ యూనియన్ - అమెరికాల మధ్య అంతరిక్ష రంగంలో పోటీ తీవ్ర రూపం దాల్చింది.
1961లో జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుడైనపుడు.. సాంకేతిక ఆధిక్యతలో ప్రచ్ఛన్న శత్రువైన సోవియట్ యూనియన్ చేతుల్లో అమెరికా ఓడిపోతోందని చాలా మంది అమెరికన్లు భావించారు.
అదే సంవత్సరంలో సోవియట్ యూనియన్ తొలిసారిగా ఒక మనిషిని అంతరిక్షంలోకి పంపించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నేపథ్యంలో తాము చంద్రుడి మీదకు మనిషిని పంపిస్తామని 1962లో కెనడీ ఒక ప్రసంగంలో ప్రకటించారు.
సోవియట్, అమెరికాల మధ్య అంతరిక్ష పరుగు పందెం కొనసాగింది. 1965లో మానవ రహిత అంతరిక్ష వాహనాన్ని చంద్రుడి మీద విజయవంతంగా పంపించింది సోవియట్ రష్యా.
అమెరికా మూన్ మిషన్ ప్రణాళిక ఏమిటి?
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. అపోలో ప్రోగ్రామ్‌కు ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు భారీ మొత్తంలో నిధులు కేటాయించింది.
ఆ కాలంలోనే 2,500 కోట్ల డాలర్లు వ్యయం చేసింది. దాదాపు 4,00,000 మంది జనం ఈ ప్రాజెక్టు కోసం పనిచేశారు.

ఫొటో సోర్స్, NASA
అపోలో 11 మిషన్ కోసం ముగ్గురు వ్యోమగాములను ఎంపిక చేశారు: బజ్ ఆల్డ్రిన్, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మైకేల్ కొలిన్స్.
సాటర్న్-5 పేరుతో తయారు చేసిన అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా.. అపోలో కమాండ్ మాడ్యూల్‌తో పాటు.. చంద్రుడి మీద దిగే లూనార్ మాడ్యూల్‌ను నింగిలోకి పంపించారు.
చంద్రుడి మీదకు పంపించటానికి అవసరమైన పరికరాలన్నిటినీ తొలుత భూమి చుట్టూ ఒక కక్ష్యలోకి పంపించటం.. అక్కడి నుంచి చంద్రుడి మీదకు ప్రయాణం ప్రారంభించటం ప్రణాళిక.
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్‌లు లూనార్ మాడ్యూల్‌లోకి వెళ్లి చంద్రుడి మీద దిగాలని, మైకేల్ కొలిన్స్ కమాండ్ మాడ్యూల్‌లోనే ఉండి పర్యవేక్షిస్తుండాలని కార్యక్రమాన్ని సిద్ధం చేశారు.

ఫొటో సోర్స్, NASA
ఏదైనా పొరపాటు జరిగిందా?
నిజానికి.. చంద్రుడి మీదకి మనిషి ప్రయాణం కోసం కక్ష్యలోకి పంపించటానికి తొలి ప్రాజెక్టు అపోలో-1ను 1967లోనే సిద్ధం చేశారు.
కానీ.. అపోలో-1ను పరీక్షించేటపుడు.. కమాండ్ మాడ్యూల్‌లో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ముగ్గురు వ్యోమగాములూ చనిపోయారు.
ఆ పెను ప్రమాదంతో అంతరిక్షంలోకి మనిషిని పంపించే కార్యక్రమాలను కొన్ని నెలల పాటు నిలిపివేశారు.
అపోలో-11 మిషన్ ప్రయోగం చేసేటపుడు కూడా.. గ్రౌండ్ కంట్రోల్‌తో సమాచార సంబంధాల్లో సమస్యలు తలెత్తాయి. కంప్యూటర్‌లో సైతం అంతకుముందు ఎన్నడూ వినిపించని ఒక అలారం మెసేజ్ వినిపించింది.
ఇక చంద్రుడి మీదకు వెళ్లిన లూనార్ మాడ్యూల్ వాస్తవంగా అనుకున్న ప్రదేశానికి దూరంగా దిగింది.

ఫొటో సోర్స్, NASA
చంద్రుడి మీద నడక
ఈ సమస్యలు ఉన్నాకూడా.. జూలై 20వ తేదీన - భూమి నుంచి బయలుదేరిన 110 గంటల తర్వాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి ఉపరితలం మీద పాదం మోపారు. ఆయన వెనుక ఇరవై నిమిషాల తర్వాత బజ్ ఆల్డ్రిన్ కూడా చంద్రుడి మీద అడుగుపెట్టారు.
ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీద దిగటాన్ని ప్రపంచ మంతటా టీవీల్లో ప్రసారం చేశారు. ''ఇది ఒక మనిషికి ఒక చిన్న అడుగు.. మానవాళికి భారీ గెంతు'' అని అతడు అన్న మాటలు చరిత్రకెక్కాయి.
ఈ ఇద్దరు వ్యోమగాములూ కలిసి చంద్రుడి ఉపరితలం మీద దాదాపు రెండు గంటలు గడిపారు. నమూనాలు సేకరిస్తూ, ఫొటోలు తీసుకుంటూ, అనేక పరిశోధనలకు ఏర్పాట్లు చేశారు.
చంద్రుడి మీద తమ అన్వేషణను పూర్తిచేసిన తర్వాత.. వీరిద్దరూ విజయవంతంగా తమ కమాండ్ మాడ్యూల్‌కు చేరుకున్నారు.
భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. జూలై 24వ తేదీన అపోలో మాడ్యూల్ సిబ్బంది క్షేమంగా పసిఫిక్ మహాసముద్రంలోకి వచ్చి పడ్డారు.
మానవుడు చంద్రుడి మీద దిగటాన్ని ప్రపంచ వ్యాప్తంగా 65 కోట్ల మంది వీక్షించినట్లు అంచనా. అమెరికా తన శక్తిని ప్రపంచ ప్రజలకు చాటిచెప్పటానికి ఈ ఘన విజయం దోహదపడింది.

ఫొటో సోర్స్, NASA
ఇది నిజంగా జరిగిందని మనకు ఎలా తెలుసు?
1972 చివరి కల్లా అమెరికా మొత్తం ఆరుసార్లు చంద్రుడి మీదకు విజయవంతంగా మనుషులను పంపించింది. అయినాకూడా.. ఇదంతా బూటకమని.. చంద్రుడి మీద దిగటం అంతా నాటకమని కొట్టిపారేసే కుట్ర సిద్ధాంతాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.
అయితే.. నాసా 2009లో చంద్రుడి దగ్గరకు ఒక అంతరిక్ష నౌకను పంపించింది. అది చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ హై-రిజల్యూషన్ ఫొటోలను భూమికి పంపిస్తుంటుంది. అపోలో మిషన్ల ద్వారా చంద్రుడి మీద సాగిన అన్వేషణకు సంబంధించి.. పాదాల గుర్తులు, చక్రాలు నడిచిన గుర్తులు ఆ ఫొటోల్లో ఉన్నాయి.
చంద్రుడి ఉపరితలం నుంచి తీసుకువచ్చిన రాళ్లు కూడా సాక్ష్యమే.

ఫొటో సోర్స్, Getty Images
చంద్రుడి మీదకు వెళ్లటం వల్ల ఉపయోగం ఏమిటి?
చంద్రుడి ఉపరితలం మీదకు మనిషిని పంపించిన ఏకైక దేశంగా అమెరికా ఇప్పటికీ కొనసాగుతోంది.
అయితే.. రష్యా, జపాన్, చైనా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇజ్రాయెల్, ఇండియాలు.. చంద్రుడి చుట్టూ తిరిగే ప్రోబ్‌లనో, చంద్రుడి మీద దిగిన వాహనాలనో పంపించాయి.
ఒక దేశం ఈ పని చేయగలగటం.. ఆ దేశపు సాంకేతిక శక్తిసామర్థ్యాలకు నిదర్శనం. దానివల్ల అగ్రస్థాయి దేశాల బృందంలో చోటు లభిస్తుంది.
అంతేకాదు.. చంద్రుడి మీద వనరులను పూర్తిగా వినియోగించుకోవాలన్న కాంక్ష కూడా ఒక కారణం.
చంద్రుడి రెండు ధృవాలలోనూ గుర్తించిన మంచులో హైడ్రోజన్, ఆక్సిజన్‌లు ఉండటంతో.. ఆ వనరులను రాకెట్లకు ఇంధనంగా ఉపయోగించుకోవటం ద్వారా అంతరిక్ష నౌకలను విశ్వంలో సుదూర ప్రయాణాలకు పంపించే వీలుంటుంది.
అలాగే.. భూమి మీద అరుదుగా లభించే బంగారం, ప్లాటినం వంటి విలువైన ఖనిజాల కోసం చంద్రుడి మీద తవ్వకాలు జరపాలనే ఆసక్తి కూడా ఉంది. అయితే.. అటువంటి వనరులను చంద్రుడి నుంచి సేకరించటం సులభమేనా అనే అంశం మీద ప్రస్తుతానికి స్పష్టత లేదు.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- సూపర్ ఓవర్ నిబంధనలేంటి? బౌండరీలు కూడా టై అయితే గెలిచే జట్టు ఏది?
- రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- శోభనం రాత్రి బెడ్షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?
- బాలాకోట్ వైమానిక దాడి: ఆ 5 కీలక ప్రశ్నలకు బదులిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








