క్రికెట్ వరల్డ్ కప్ 2019: మాంచెస్టర్ నగరానికి భారత పత్తి పరిశ్రమతో చారిత్రక బంధం

మాంచెస్టర్ కాటన్ మిల్లులు
    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి, మాంచెస్టర్ నుంచి

భారత్ - న్యూజీలాండ్ జట్ల మధ్య ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌ మాంచెస్టర్‌ నగరంలో ఈరోజు జరగబోతోంది. ఈ నగరం ఫుట్‌బాల్ క్రీడకు ప్రఖ్యాతి గాంచింది.

కానీ.. ఇంగ్లండ్‌లోని ఈ మాంచెస్టర్ ఒకప్పుడు 'పత్తి నగరం'గా వెలుగొందిన విషయం మీకు తెలుసా?

అవును.. 1853లో మాంచెస్టర్ పరిసరాల్లో పత్తి మిల్లుల సంఖ్య 107 వరకూ ఉండేది.

మాంచెస్టర్ నుంచి చెషైర్, డెర్బీషైర్‌ల వైపు వెళ్లే దిశలో 40 మైళ్ల పరిధిలో ప్రతి గ్రామంలోనూ పెద్దదో, చిన్నదో కనీసం ఒక కాటన్ మిల్లు ఉండేదని చెప్తారు.

ఆ కాలంలో.. ఈ మిల్లులను నడపటంలో బ్రిటిష్ పాలనలోని ఇండియా చాలా కీలక పాత్ర పోషించింది. ఇక్కడికి ముడి పత్తి నాటి బ్రిటిష్ ఇండియా నుంచే సరఫరా అయ్యేది.

ఇండియాలోని కాన్పూర్‌లో గల పత్తి మిల్లులకు, మాంచెస్టర్ పత్తి పరిశ్రమకు ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలు ఉండేవి. అందుకే కాన్పూర్‌ నగరానికి 'మాంచెస్టర్ ఆఫ్ ద ఈస్ట్' అని పేరొచ్చింది.

కాటన్ మిల్ అనే పేరు.. వాస్తవంగా ల్యాంక్‌షైర్‌లో పుట్టింది. దానిని న్యూ ఇంగ్లండ్‌, ఆ తర్వాత అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలు కాపీ చేశాయి.

అయితే.. 20వ శతాబ్దంలో వాయవ్య ఇంగ్లండ్‌ తన ఆధిక్యం కోల్పోగా.. అమెరికా అగ్రస్థానంలోకి వచ్చింది. ఆ తర్వాత జపాన్, అనంతర కాలంలో చైనా అగ్రస్థానంలోకి వెళ్లాయి.

కాటన్ మిల్లులకు నెలవైన అద్భుతమైన చాలా నిర్మాణాలు కనుమరుగై.. వాటి స్థానంలో ఆధునిక భవంతులు నిర్మించినప్పటికీ.. కొన్ని ఇప్పటికీ మిగిలే ఉన్నాయి.

కానీ అవన్నీ దృఢంగా లేవు. ఇటువంటి చారిత్రక వారసత్వ భవనాలు క్షీణదశలో ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు.

మాంచెస్టర్ చైనా టౌన్

చైనా టౌన్

ప్రపంచంలోని చాలా బహుళజాతులు నివసించే నగరాల్లాగానే మాంచెస్టర్‌లో కూడా తనకంటూ ఒక చైనా టౌన్ ఉంది.

నగరం నడిబొడ్డున పోర్ట్‌ల్యాండ్ స్ట్రీట్ పక్కన ఉన్న ఈ ప్రాంతం.. మధ్యాహ్నం నాలుగు గంటలకు మొదలుకుని అర్థరాత్రి దాటేవరకూ జనంతో కిటకిటలాడుతూనే ఉంటుంది.

ఈ ఇరుకు మార్గంలో బ్రిటిష్ వాస్తుశిల్ప కళతో నిర్మించిన ఇళ్లు ఇంకా చెక్కుచెదరకుండా ఉన్నాయి.

అయితే.. ఈ భవనాల కింది అంతస్తులు, బేస్‌మెంట్లలో చైనీయుల ఆహార పదార్థాలను విక్రయించే చైనీస్ రెస్టారెంట్లు చాలా పుట్టుకొచ్చాయి. ఆ రెస్టారెంట్లు 'వాల్యూ ఫర్ మనీ' ఆఫర్లు అందిస్తున్నాయి.

ఇక్కడ లభించే ఒక చైనా ఆహారం 'ఇండియన్ థాలీ'ని పోలివుంటుంది. నూడుల్స్, సూప్స్, అన్నం, ఓ కూర కలిపిన ఆహారం ధర 15 పౌండ్లు.

దూర ప్రాంతమైన స్టోక్-ఆన్-ట్రెంట్ నుంచి ప్రతి ఆదివారం తమకు ఇష్టమైన డిమ్-సుమ్స్, రోస్టెడ్ డక్ ఆరగించటానికి ఇక్కడికి వచ్చే వృద్ధ ఇంగ్లిష్ దంపతులను నేను కలిశాను.

ఈ ప్రాంతంలో అద్దెలు తరచుగా పెరుగుతుంటాయని ఎక్కువగా చైనీయులే అయిన ఈ షాప్ ఓనర్లు ఫిర్యాదు చేస్తున్నారు.

''నా యజమాని వారానికి దాదాపు 3,500 పౌండ్లు అద్దె చెల్లిస్తాడు. ఆ అద్దె తగ్గితే మా లాభాలు పెరుగుతాయి కదా'' అని ఇక్కడి ఒక రెస్టారెంట్లో మేనేజర్‌గా పనిచేసే యాంగ్ నే నాతో చెప్పాడు.

దేవాంగ్ గోహిల్
ఫొటో క్యాప్షన్, మాంచెస్టర్‌లో ఒక భారతీయ రెస్టారెంట్‌ను దేవాంగ్ గోహిల్ నడుపుతున్నారు

కర్రీ మైల్

చైనా టౌన్‌కు దగ్గర్లో గల రుషోమ్ కర్రీ మైల్ అనే ప్రాంతం.. ఆహార ప్రియులకు స్వర్గధామంగా ప్రసిద్ధి.

ఇక్కడ దాదాపు 800 మీటర్ల నిడివిలో.. రోడ్డుకు ఇరువైపులా ఉన్న 50 రెస్టారెంట్లు.. తాజా అరబిక్, టర్కిష్, లెబనీస్, పాకిస్తానీ ఆహారాల ఘుమఘుమలతో స్వాగతం పలుకుతుంటాయి. ఇక్కడ ఉన్నంతసేపు ఇంగ్లండ్‌లో ఉన్న విషయం మరచిపోతారు.

ఈ ప్రాంతంలో దక్షిణాసియా, అరబిక్ ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు.

ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. జియా ఏసియన్ దాని పేరు. ఇటీవలి కాలంలో ఇది సంచలనంగా మారింది. 2018లో 'ఉత్తమ ఇండియన్ రెస్టారెంట్' అవార్డును గెలుచుకుంది. ఇండియా నుంచే కాదు, మధ్య ఆసియా నుంచి కూడా ఇది ఆహార ప్రియులను ఆకర్షిస్తోంది.

ఈ రెస్టారెంట్ యజమాని దేవాంగ్ గోహిల్ యువకుడు. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు.

''హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ చేసిన తర్వాత.. ఒక సందర్భంలో నాకు ఉద్యోగాలు దొరకలేదు. డబ్బులు లేవు. హోటళ్లలో ప్లేట్లు, గిన్నెలు కడగాల్సి వచ్చింది. వారం రోజుల పాటు కారులోనే నిద్రపోవాల్సి వచ్చింది. అయినా మళ్లీ నిలదొక్కుకోగలిగాను. అదంత సులభం కాదు. ఇప్పుడు మార్కెట్‌లో ఇండియన్ రెస్టారెంట్లు కూడా తమ ముద్ర వేయగలగటం ఆనందంగా ఉంది'' అని ఆయన చెప్పారు.

పికాడిలీ గార్డెన్స్

వేసవి వేడి 18 డిగ్రీలు

ఇంగ్లండ్‌లో ఉన్నపుడు సూర్యుడు ఎప్పుడు కనిపిస్తాడో చూసుకుంటూ ఉండాలి!

ఈ ప్రాంతంలో వేసవిని చాలా అపురూపంగా పరిగణిస్తారు. వేసవిలో 18 నుంచి 24 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతల్లో జనం ఇళ్ల నుంచి బయటకు వస్తారు. అప్పుడు వీళ్లు సెలవుల మూడ్‌లో ఉంటారు.

మాంచెస్టర్ నడిబొడ్డున పికాడిలీ గార్డెన్స్ ఈ నగరానికి గుండెగా, ఆత్మగా పరిగణించే ఖాళీ ప్రదేశం.

ఎన్నో చారిత్రక, ఆధునిక భవనాల సమ్మిశ్రమం దీని చుట్టూ ఉంటుంది. పికాడిలీ గార్డెన్ స్క్వేర్ చుట్టూ ప్రఖ్యాత ఎల్లో-గ్రీన్ ట్రామ్‌లు చక్కర్లు కొడుతుంటాయి.

ఈ గార్డెన్ మధ్యలోని నీటి కొలనులో ఫౌంటెన్లతో.. వేసవి సెలవుల్లో పిల్లలకు ఆటవిడుపుగా ఉంటుంది.

ఉచిత బస్సులు

క్రికెట్ - ఉచిత ప్రయాణాలు

ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి మాంచెస్టర్‌కు వచ్చే క్రికెట్ అభిమానులకు.. ట్రైన్ స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆనందాశ్చర్యాలు కలుగుతాయి.

స్టేషన్ బయట అందమైన పసుపు రంగు బస్సులు వరుసలో ఆగి కనిపిస్తాయి. వాటి మీద ‘ఉచిత బస్ ప్రయాణం’ అని రాసి ఉంటుంది.

మాంచెస్టర్ కాలేజీల్లో చదువుకునే అనేకమంది విద్యార్థులకు ఈ బస్సు ప్రయాణాలు ఉచితం. పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటపుడు స్పాన్సర్లు కూడా వీటిని ఉపయోగించుకుంటూ ఉంటారు.

ఈసారి వీటితో ప్రయోజనం పొందుతున్నది క్రికెట్టే!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)