బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తున్నారా? అసలు వివాదం ఏమిటి? ఏపీ ప్రభుత్వ మౌనం ఎందుకు?

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం సమీపంలో నిర్మించతలపెట్టిన ఓడరేవు వ్యవహారం విస్తృత చర్చకు తెరలేపింది.
ఏపీ ప్రభుత్వం ఈ ఓడరేవుని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తున్నట్టు సాగుతున్న ప్రచారం ఆసక్తి కలిగిస్తోంది.
దీనిపై ఏపీ విపక్ష నేతలు సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నా, జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తోంది.
ఏపీ సముద్రతీరంలో ఇప్పటికే చాలా ఓడ రేవులు ఉన్నాయి. వాటికి తోడుగా కొత్తగా దుగ్గరాజపట్నం ఓడరేవు నిర్మాణానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది.
దీనితోపాటు వైఎస్ హయంలో శంకుస్థాపన చేసిన బందరు పోర్టు పనులకు కూడా శ్రీకారం చుడుతున్నట్టు శిలాఫలకం వేశారు.
ఈ రేవు కోసం నాలుగేళ్ల క్రితమే భూసేకరణకు శ్రీకారం చుట్టారు. అది పెద్ద వివాదంగా మారింది. భూ సమీకరణను స్థానికులు వ్యతిరేకించారు. మచిలీపట్నంలో ఆందోళనలు కూడా నిర్వహించారు.
దాంతో బందరు పోర్టు నిర్మాణం ఆశించినంత వేగంగా జరగడం లేదు.

బందరు పోర్టుకు ఘన చరిత్ర
ప్రస్తుతం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ఒకప్పుడు బ్రిటిష్ హయంలో పెద్ద తీర ప్రాంత పట్టణం. ఇక్కడనుంచి ఎన్నో ఎగుమతులు, దిగుమతులు జరిగేవి.
దాంతో ఏపీలో ఈ పట్టణం కీలకంగా మారింది. అయితే ఆ తర్వాత 1830ల నుంచి బ్రిటిష్ వారి వ్యవహారాలు క్రమంగా బందరు నుంచి చెన్నపట్నం చేరాయి.
బందరు పోర్టు కన్నా చెన్నై నుంచి నౌకల్లో వెళ్లడం సులభంగా ఉంటుందని బ్రిటిష్ వారు అప్పుడే భావించినట్టు మచిలీపట్నంలోని చరిత్ర అధ్యాపకుడు ఎస్ వెంకటేశ్వర రావు అభిప్రాయపడ్డారు.
"బందరు పోర్ట్ నిర్వహణ వల్ల పెద్దగా లాభం ఉండదని బ్రిటిష్ వారు భావించారు. ముఖ్యంగా సముద్రంలో ఇసుక పేరుకుపోతుండడంతో పదే పదే డ్రెడ్జింగ్ చేయడానికి చాలా ఖర్చవుతుంది. భౌగోళికంగా బందరు తీరంలో ఇసుక పేరుకోవడం పెద్ద సమస్యగా ఉంటుంది. అందుకే వారు అటు చెన్నై, ఇటు కాకినాడ, విశాఖలను తమ రేవులుగా ఎంచుకున్నారు. ఆ పోర్టుల అభివృద్ది జరిగితే, మచిలీపట్నం పోర్ట్ మాత్రం ప్రాభవం కోల్పోతూ వచ్చింది. అయినా 1970 వరకూ అరకొరగా సాగిన పోర్ట్ ఆ తర్వాత దాదాపుగా మూతపడిపోయింది" అని ఆయన బీబీసీకి చెప్పారు.
కానీ 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోర్ట్ నిర్మాణానికి మరోసారి శంకుస్థాపన చేశారు. నవయుగ ఆధ్వర్యంలో బిఓటి పద్ధతిలో ఈ రేవును నిర్మిస్తామని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణకు రేవు అవసరమేంటి
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సొంతంగా ఓడ రేవు లేని రాష్ట్రం కాబట్టి డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పాలకులు భావించారు.
దానికి అనుగుణంగా కరీంనగర్‌లోని సుల్తానాబాద్ , రంగారెడ్డి జిల్లాలోని నాగులాపల్లిలో భూసేకరణ చేసి డ్రైపోర్ట్ నిర్మించేందుకు తెలంగాణ సర్కారు 2016లోనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతోపాటు, తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ డ్రైపోర్ట్ నిర్మిస్తామని చెప్పారు.
అగ్రికల్చర్ అండ్ ప్రోసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ కూడా దానికి అంగీకరించింది.
ఈ డ్రైపోర్టు వల్ల రైతులకు గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌసింగ్ లాంటి సదుపాయాలు అందబాటులోకి వస్తాయని అంచనా వేశారు.
తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని, డ్రైపోర్ట్ ఏర్పాటుకి అవసరమైన సహకారం కేంద్రం నుంచి ఉంటుందని అప్పటి వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించారు.
కానీ, తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు ప్రక్రియ ప్రతిపాదనల దశను దాటలేదు.

డ్రైపోర్ట్ అంటే ఏంటి
ఓడ రేవు సహజంగా సముద్ర తీరంలోనే ఉంటుంది. సముద్ర తీరం లేని ప్రాంతాల్లో ఓడ రేవులకు అనుబంధంగా భూమిపైనే పోర్టులు ఏర్పాటు చేస్తారు. దీనిని సముద్ర తీరంలో రేవు లాగే నిర్వహిస్తారు.
దగ్గర్లోని రేవులకు కార్గోను తరలించడానికి వీలుగా వీటిని నిర్మిస్తారు. ఇక్కడ కస్టమ్స్ తనిఖీలు, క్వాలిటీ, హెల్త్ చెకప్, ఇతర వ్యవహారాలన్నీ పూర్తి చేయడానికి అనువుగా ఉంటుంది.
ప్రాధమిక వ్యవహారాలన్నీ డ్రైపోర్టులోనే పూర్తి కావడం వల్ల సముద్రం దగ్గర రేవుల్లో ఎగుమతికి ఎలాంటి ఆటంకాలూ ఉండవు.
సముద్ర ఓడ రేవులు లేని రాష్ట్రాల నుంచి వేగంగా ఎగుమతులు, దిగుమతులు చేయడానికి ఈ డ్రైపోర్టు ఉపయోగపడుతుంది.
బందరు రేవుతో తెలంగాణకు లాభమేంటి
హైదరాబాద్ నుంచి గతంలో చాలా ఎగమతులు నేరుగా కృష్ణపట్నం లేదా విశాఖ పోర్టుల నుంచి జరిగేవి కానీ, రాష్ట్ర విభజన తర్వాత సొంతంగా రేవు లేని రాష్ట్రం కావడంతో తెలంగాణ పారిశ్రామిక రంగానికి సమస్యగా మారింది.
సమీపంలోని ఓడరేవులను నిర్వహణకు తీసుకోవాలని భావించిన, అది ఆయా రాష్ట్రాల అంగీకారంతోనే సాధ్యం అవుతుంది. అందుకే గత కొన్నేళ్లుగా తెలంగాణ ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు.
అటు డ్రైపోర్ట్ నిర్మాణం ముందుకు సాగకపోవడం, ఇటు సొంతంగా సీ పోర్ట్ సాధించలేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
దీనికి తగ్గట్టే ఏపీలో అధికారం మారిన తర్వాత కేసీఆర్, జగన్ చాలా మార్పులకు శ్రీకారం చుట్టారు. కృష్ణా-గోదావరి జలాల పంపిణీతో పాటు పోర్టుల విషయంలో కూడా ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తోంది.
అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బందరు రేవు గురించి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, APgovt website
జీవో ఆర్టీ 62 ఎందుకు ఉపసంహరించారు
ఏపీ ప్రభుత్వం జూన్ 28న జీవో ఆర్టీ 62 పేరుతో ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ డిపార్ట్ మెంట్ తరపున పోర్ట్స్ సెక్షన్ కింద జీవో విడుదల చేశారు.
ప్రభుత్వ వెబ్‌సైట్ దానిని మొదట కాన్ఫిడెన్షియల్‌గా ప్రస్తావించారు. తర్వాత రెండ్రోజులకే నాట్ ఇష్యూడ్ అని మార్చేశారు.

ఫొటో సోర్స్, APgovt website
దాంతో ఇప్పుడీ జీవో ఆధారంగా బందరు పోర్టు బదలాయింపు ప్రచారం ఊపందుకుంది. విపక్షాలు దీనిపై విమర్శలు సంధిస్తున్నాయి.
పోర్టుపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు..
సీమాంధ్రకు రేవులు ప్రకృతి ఇచ్చిన వరం అని మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదు. ఇది ఆంధ్రుల హక్కు. ఏపీ పోర్టుల వ్యవహారంలో జీవో ఆర్టీ 62 గుట్టు ఏంటో..ముందు రహస్య జీవో అని చెప్పి, రెండు రోజుల్లో జారీ చేయలేదు అని ఎందుకు మార్చారు. బందరు పోర్టు గురించి ప్రజల్లో అపోహలున్నాయి, ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి" అని డిమాండ్ చేశారు.

బందరు పోర్టుతో అభివృద్ధి...
కృష్ణా జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో బందరు పోర్టు వల్లే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ యలమంచలి బాబూ రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
"2009లోనే శంకుస్థాన చేసినప్పటికీ, పనులు ముందుకు సాగకపోవడం అన్యాయం. ఇప్పటికైనా పోర్ట్ నిర్మాణం తక్షణం పూర్తి చేయాలి. స్థానికులకు ఉపాధి కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి తోడ్పడే బందరు పోర్టుని తెలంగాణాకి బదలాయిస్తే సహించం, దానికోసం ఆందోళన చేస్తాం" అన్నారు.
ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు..
బందరు పోర్టుపై రాజకీయంగా విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం గానీ, వైసీపీ నేతలు గానీ దీనిపై ఏం మాట్లాడడం లేదు.
తెలంగాణకు రేవు అప్పగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదటూనే జీవో 62 విషయంలో ఏం జరిగిందనేది ఎవరూ చెప్పడం లేదు.
దీనిపై స్పందించాలని బీబీసీ కొందరు మంత్రులు, పోర్టు అధికారులను కోరగా వారు నిరాకరించారు.
పేరు బయటపెట్టడానికి ఇష్టపడని ఒక పోర్టు ఆఫీసర్ మాత్రం "జీవో ఆర్టీ 62 పూర్తిగా పోర్ట్ పరిధిలోని బదిలీలకు సంబంధించిన విషయం, బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు" అన్నారు.
ప్రభుత్వం ఏమనుకుంటోంది?
బందరు పోర్టు విషయంలో ఏపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉందని మచిలీపట్నం అధ్యాపకుడు వెంకటేశ్వరరావు అన్నారు.
"బందరు పోర్ట్ వల్ల ఏపీకి పెద్దగా ప్రయోజనం లేదు. మచిలీపట్నం అభివృద్ధి జరగాలంటే పోర్టు కన్నా ఆక్వా ఆధారిత పరిశ్రమలు, కలంకారీ, రోల్డ్ గోల్డ్ నగల పరిశ్రమ అభివృద్ధికి మార్గాలు వెతకాలి. మచిలీపట్నంలో రేవు వస్తే తెలంగాణకే అనుకూలంగా ఉంటుంది. అయినా పోర్టు బదలాయించాలనుకుంటే బిడ్డింగ్‌లో ఎక్కువ కోట్ చేసిన వారికి ఇస్తుందా, లేక మరో రూపంలో చేస్తుందా అనేదానిపై స్పష్టత లేదు" అన్నారు.
‘జీఓలు దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు’ - ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
జీఓలు దాచిపెట్టాల్సిన అవసరం తమకు లేదని, కాన్ఫిడెన్షియల్ జీ ఓ విషయం సంబంధిత శాఖ మంత్రి తో మాట్లాడతానని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పూర్తి పారదర్శకంగా పాలన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని, గత ప్రభుత్వం మాదిరి వందల జీ ఓ లు రహస్యంగా ఉంచాల్సిన అవసరం తమకు రాదని.. ఈ జీ ఓ గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడుతా అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సెమీఫైనల్స్ ఆడే ముందు భారత్ ఏం చేయాలి...
- LIVE: INDvSL రో‘హిట్’ శర్మ, కేఎల్ రాహుల్ సెంచరీలు.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం
- #INDvSL మ్యాచ్ చూస్తుంటే విమానం శబ్ధం వినిపిస్తోందా? ఆ విమానం ఇదే
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- నిండుచూలాలిని పొడిచి చంపేశారు.. చనిపోయే క్షణంలో ప్రసవం
- 5జీ టెక్నాలజీతో విమానాల భద్రతకు, సైనిక చర్యలకు పొంచి ఉన్న ప్రమాదమేంటి..
- శాంసంగ్: స్మార్ట్ టీవీలపై వైరస్ దాడులను నివారించేందుకు ఇలా చేయండి
- తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ నగదు బదిలీలపై జూలై 1 నుంచి ఛార్జీలు ఉండవు - ఆర్బీఐ
- శృంగారం సాంకేతిక అభివృద్ధికి ఎలా దోహదపడింది...
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మోనా లీసాకు ప్రాణం పోశారు
- హిందువుల అబ్బాయి ముస్లింల ఇంట్లో.. ముస్లింల పిల్లాడు హిందువుల ఇంట్లో
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








