'ఇరాన్ అణు ఒప్పంద పరిమితులను దాటి యురేనియం నిల్వలను పెంచుకుంది' - అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఐఏఇఏ) ధ్రువీకరణ

ఫొటో సోర్స్, EPA
ముందు ప్రకంచినట్లుగానే ఇరాన్ 2015-అణు ఒప్పంద పరిమితులను అతిక్రమిస్తూ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంది.
ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఇఏ) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 300 కేజీల పరిమితిని ఇరాన్ అతిక్రమించినట్లు వెల్లడించింది.
శుద్ధి చేసిన యురేనియంను అణు రియాక్టర్లలో ఉపయోగిస్తారు. అణ్వాయుధాల కోసమూ దీన్ని వినియోగించవచ్చు.
అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేస్తామంటూ 2015లో అమెరికా సహా వివిధ దేశాలతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకుంది.
శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై పరిమితులు పాటిస్తామని అంగీకరించింది. దీనికి బదులుగా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఆయా దేశాలు ఎత్తివేశాయి.
అయితే, ఇరాన్ నిబంధనలను పాటించడం లేదని ఆరోపిస్తూ గతేడాది అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలిగారు. ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించారు.
ప్రతిస్పందన చర్యగా, ఆ ఒప్పంద పరిమితులను దాటుతామని ఇరాన్ ప్రకటించింది.
గత మే నెలలో శుద్ధి చేసిన యురేనియం ఉత్పత్తిని బాగా పెంచింది.

ఫొటో సోర్స్, AFP
నిర్ణయం మార్చుకోవాలని ఇరాన్‌కు బ్రిటన్, జర్మనీ విజ్ఞప్తి చేశాయి. ఇరాన్‌పై 'వీలైనంత ఎక్కువ ఒత్తిడి'ని పెట్టే వ్యూహాన్ని కొనసాగిస్తామని అమెరికా పేర్కొంది.
ఒప్పందంపై ఉల్లంఘనలకు తీవ్ర పర్యవసానాలు ఉంటాయని యురోపియన్ దేశాలు ఇరాన్‌ను హెచ్చరించాయి. తిరిగి ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.
అణు ఒప్పందం వీగిపోతే, గతంలో ఎత్తివేసిన ఐరాస ఆంక్షలను ఒప్పందంలో భాగమైన ఏ పక్షమైనా 30 రోజుల తర్వాత ఇరాన్‌పై తిరిగి విధించవచ్చు.
ఇరాన్ చమురు ఓడలపై దాడులకు పాల్పడిందని ఆరోపిస్తూ పశ్చిమాసియాలో అమెరికా సైనిక మోహరింపులను పెంచడం, అమెరికా డ్రోన్‌ను ఇరాన్ కూల్చడం వంటి ఘటనలతో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
అణు విద్యుత్ అవసరాల కోసం 3.67% గాఢత మించని శుద్ధి చేసిన యురేనియంను వినియోగించాలన్న పరిమితి అణు ఒప్పందంలో ఉంది.
సోమవారం మధ్యాహ్నానికి 3.67% గాఢతను చేరుకున్నామని, తదుపరి దీన్ని ఇంకా అధిగమిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావెద్ జారిఫ్ వెల్లడించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.
తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, ఇరాన్ ప్రయోజనాలను కాపాడటంలో యురోపియన్లు విఫలమయ్యారని జారిఫ్ వ్యాఖ్యానించారు.
ఏదైనా పక్షం 'నిష్క్రియాతత్వం' చూపితే, ఒప్పందం హామీల్లో కొన్నింటిని గానీ, మొత్తంగా కానీ మరో పార్టీ ఉల్లంఘించవచ్చని జారిఫ్ గుర్తుచేశారు.
ఇచ్చిన హామీలకు యురోపియన్ దేశాలు కట్టుబడి ఉంటే, తమ చర్యలను ఉపసంహరించుకుంటామని అన్నారు.
అమెరికా ఆంక్షల ప్రభావం నుంచి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యానికి రక్షణ కల్పించే చర్యలు తీసుకోకపోతే, వచ్చే పది రోజుల్లో యురేనియం గాఢత 3.67% దాటి పెంచుతామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
యురేనియం గాఢత పెరిగితే ఏమవుతుంది...
అణు విద్యుత్ ఉత్పత్తిలో, అణ్వాయుధాల్లో అణు విచ్ఛిత్తి అనే కీలకమైన రసాయన ప్రక్రియ ఉంటుంది.
దీనికి యురేనియం ఐసోటోప్ యూ-235 అత్యంత అనుకూలమైన ఇంధనం.
సెంట్రీఫ్యూజ్‌ల్లోకి యురేనియం హెక్సాఫ్లోరైడ్ వాయువును పంపి, ఈ ఐసోటోప్‌ను విడగొడతారు.
సహజంగా యురేనియంలో యూ-235 గాఢత 0.7 శాతం ఉంటుంది.
అణు ఒప్పందం ప్రకారం 3 నుంచి 4 శాతం వరకూ యూ-235 గాఢత ఉండే యురేనియంను మాత్రమే ఇరాన్ వినియోగించాలి. అణు విద్యుత్ కేంద్రాల్లో ఇంధనంగా దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని కూడా 300 కేజీలకు మించి ఇరాన్ నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు.
అణ్వాయుధాలకు 90 శాతం మించి గాఢత ఉండే యురేనియం అవసరం. ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ సమాచారం ప్రకారం ఒక్క అణు బాంబు కోసం 1,050 కేజీల యురేనియం నిల్వ కావాలి.
గాఢతను పెంచే క్రమంలో ప్రారంభంలోనే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గాఢతను 20 శాతానికి పెంచాక, దాన్ని అణ్వాయుధాలకు తగిన స్థాయికి తీసుకువెళ్లడం చాలా సులభమని వారు అంటున్నారు.
తమ అణు కార్యక్రమాలు శాంతియుతమైనవే అని ఇరాన్ చెబుతున్నా, ఇది ఆందోళన కలిగించే పరిణామమే.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








