ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా సన్నాహాలు చేస్తోందా.. గల్ఫ్‌లో అమెరికా యుద్ధనౌకను ఎందుకు మోహరిస్తోంది?

ఫొటో సోర్స్, AFP
ఇరాన్‌కు ''విస్పష్టమైన, నిస్సందేహమైన సందేశం'' పంపించటానికి మధ్య ఆసియాలో అమెరికా తన యుద్ధ విమాన వాహక నౌకను మోహరించింది.
''అనేక ఇబ్బందికర, రెచ్చగొట్టే సంకేతాలు, హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఈ చర్య'' చేపట్టినట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ పేర్కొన్నారు.
అమెరికా దళాల మీద దాడులు జరిగే అవకాశం ఉందన్న వార్తల ప్రాతిపదికగా ఈ యుద్ధనౌకను మోహరించినట్లు పేరు చెప్పని అమెరికా అధికారి ఒకరిని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఎటువంటి దాడినైనా తాము ''భీకరమైన బలం''తో తిప్పికొడతామని బోల్టన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
''అమెరికా ప్రయోజనాల మీద కానీ, మా మిత్రుల మీద కానీ ఎటువంటి దాడినైనా క్రూరమైన బలంతో ఎదుర్కొంటామని ఇరాన్ ప్రభుత్వానికి స్పష్టమైన, పొరపాటుకు తావులేని సందేశం పంపించటానికి అమెరికా సెంట్రల్ కమాండ్ రీజియన్‌లో యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ కారియర్ స్ట్రైక్ గ్రూప్, బాంబర్ టాస్క్ ఫోర్స్‌ను మోహరిస్తున్నాం'' అని బోల్టన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
''ఇరాన్ ప్రభుత్వంతో అమెరికా యుద్ధం కోరుకోవటం లేదు. కానీ ఎటువంటి దాడినైనా, ప్రచ్ఛన్న దాడినైనా సరే.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ కానీ ఇరాన్ సైనిక బలగాలను కానీ.. ఎదుర్కోవటానికి మేం పూర్తి సన్నద్ధంగా ఉన్నాం'' అని కూడా వ్యాఖ్యానించారు.
అమెరికా యుద్ధనౌక అమెరికా మిత్రదేశాలతో కలిసి ఏప్రిల్ చివరి నుంచి నిర్వహిస్తున్న యుద్ధ క్రీడల్లో పాల్గొనటానికి ఇప్పటికే యూరప్‌లో ఉంది.

ఫొటో సోర్స్, Huw Evans picture agency
యుద్ధానికి సన్నాహాలా?
జొనాథన్ మార్కస్, బీబీసీ రక్షణ రంగ ప్రతినిధి
ఈ యుద్ధనౌకను మోహరించటానికి ప్రేరేపించినట్లుగా ఆరోపిస్తున్న ఇరాన్ చర్యల గురించి కానీ, అమెరికా చేపట్టిన మోహరింపుల గురించి కానీ ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు.
అయితే.. యుద్ధనౌకను, అందులోని యుద్ధ బృందాన్ని గల్ఫ్‌కు పంపించటం అసాధారణ పరిణామేమీ కాదు. అయితే.. ఈ ప్రాంతంలోని అమెరికా భూతల వైమానిక బలగాలను తాత్కాలికంగా మరింత బలోపేతం చేస్తుండటం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది.
ఇరాన్ మీద అమెరికా ఇటీవలి నెలలో ఒత్తిడి పెంచుతోంది. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కోర్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించటం, చమురు ఆంక్షలను కఠినతరం చేయటం వంటి చర్యలు ఇందులో భాగమే.
కానీ ట్రంప్ సర్కారు లక్ష్యమేమిటనేది అస్పష్టంగా ఉంది. ఇరాన్‌తో తాము యుద్ధం కోరుకోవటం లేదని ట్రంప్ ప్రభుత్వ అధికార ప్రతినిధులు గట్టిగా చెప్తారు. కానీ ఇరాన్‌లో ప్రభుత్వం మారటానికి సంబంధించిన తమ ఆతృతని ఏమాత్రం దాచుకోలేకపోతున్నారు.

ఫొటో సోర్స్, AFP
ఈ యుద్ధనౌక మోహరింపు, హెచ్చరికలు.. ప్రస్తుతమున్న ఉద్రిక్త పరిస్థితులను యధాతథంగా కొనసాగేలా చూడటానికి అమెరికా చేస్తున్న ప్రయత్నమా? లేక ఇరాన్ మీద ఒత్తిడిని మరింత పెంచేందుకు చేస్తున్న ప్రయత్నమా?
ఈ పరిణామాలు.. యాదృచ్ఛికంగా కానీ, ఉద్దేశపూర్వకంగా కానీ యుద్ధంగా బద్దలు కావచ్చునని ట్రంప్ ప్రభుత్వ విమర్శకులు చాలా మంది భయపడుతున్నారు.
గల్ఫ్‌లో యూఎస్ఎస్ అబ్రహాం లింకన్‌ను మోహరించటం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి అమెరికా, ఇరాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఈ యుద్ధనౌకను మోహరించటం జరుగుతోంది.
ఇరాన్‌తో 2015లో అమెరికా, ఇతర దేశాలు చేసుకున్న చరిత్రాత్మక అణు ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఏకపక్షంగా ఉపసంహరించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ఒప్పందం కింద.. ఆంక్షలను సడలించినట్లయితే తన సున్నిత అణు కార్యక్రమాలను పరిమితం చేయటానికి, అంతర్జాతీయ పరిశీలకులను తనిఖీకి అనుమతించటానికి ఇరాన్ అంగీకరించింది.
ఇరాన్ నుంచి ఇంకా చమురు కొనుగోలు చేస్తున్న ఐదు దేశాలు - ఇండియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, టర్కీలకు ఆంక్షల నుంచి ఇచ్చిన మినహాయింపులను రద్దు చేస్తానని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ గత నెలలో ప్రకటించింది.
అదే సమయంలో.. ఇరాన్‌కు చెందిన అత్యున్నత సాయుధ బలగాల సంస్థ రివల్యూషనరీ గార్డ్ కోర్‌ను విదేశీ ఉగ్రవాద బృందంగా అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.
ఆ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమవుతోంది. ఆ దేశ కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. దేశ వార్షిక ద్రవ్యోల్బణ రేటు నాలుగు రెట్లు పెరిగిపోయింది. విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. దేశంలో నిరసనలు చెలరేగాయి.
- హైదరాబాద్‌కు బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది?
- భారతదేశమే భూగోళం మీద అత్యంత వేడి ప్రాంతమా...
- యతి వాస్తవంగా ఉందా? హిమాలయాల్లో తిరుగుతోందా?
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- శిల్పినే కబళించబోయిన ఆల్చిప్పల ఆడమ్ శిల్పం
- స్కూలు నుంచి ఇంటికెళ్లాలంటే.. రెండు విమానాలు మారాలి, 5 రోజులు కొండలు ఎక్కాలి
- ఇరాన్: జర్నలిస్టులు, కవులను వెంటాడిన మృత్యువు.. దేశాన్ని వణికించిన సీరియల్ హత్యలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








