ఇరాన్: జర్నలిస్టులు, కవులను వెంటాడిన మృత్యువు.. 1998లో దేశాన్ని వణికించిన సీరియల్ హత్యలు

1998 నాటి హత్యాకాండలో కొందరు బాధితులు
ఫొటో క్యాప్షన్, 1998 నాటి హత్యాకాండలో కొందరు బాధితులు
    • రచయిత, సారా ఫౌలర్
    • హోదా, బీబీసీ న్యూస్

ఆ ఘటన గురించి ఎప్పుడూ మాట్లాడవద్దని వారిని హెచ్చరించారు. వారు ఏళ్ల పాటు ఆ హెచ్చరికను పాటించారు. ఇరాన్ కవులు, రచయితలు, జర్నలిస్టులతో కూడిన 21 మంది బృందం.. 1996 ఆగస్టులో పొరుగు దేశమైన అర్మేనియాలో సాహిత్య సదస్సుకు వెళుతున్నామనుకున్నారు. మామూలు పర్యటనలాగా ముగియాల్సిన ఆ ప్రయాణం.. వారి జీవితాల్లోనే అత్యంత భయానక అనుభవంగా మారింది.

మంచు తెర కప్పేసిన హేరాన్ కనుమల గుండా ప్రయాణించటానికి వారు ఒక బస్సును అద్దెకు తీసుకున్నారు. పర్వత సానువుల్లో ఎత్తు పల్లాల్లో మెలికలు తిరుగుతూ సాగే ఈ మార్గం ఇరాన్‌లోని రెండు ఉత్తర రాష్ట్రాలను కలుపుతుంది. ఆ ప్రయాణం పూర్తికావటానికి 18 గంటలు పడుతుంది. రాత్రి అయ్యేసరికి బస్సులో ఒక్కొక్కరూ నిద్రలోకి జారుకున్నారు. కానీ తెల్లవారుజామున బస్సు అనూహ్యంగా వేగం పెరగటంతో పెద్ద కుదుపుకు లోనయింది. ప్రయాణికులు ఉలిక్కిపడి లేచారు.

చూస్తే.. బస్సు పర్వత శిఖరం అంచుకు వేగంగా దూసుకెళుతోంది. అదృష్టవశాత్తూ ఓ భారీ రాయిని ఢీకొని బస్సు ఆగిపోయింది. వేల అడుగుల లోతున్న లోయలో బస్సు పడిపోకుండా ఆ రాయి అడ్డుకుంది.

ఆ ప్రయాణికిల్లో ఫరాజ్ సర్కోహి ఒకరు. ఆయన వయసు 49 ఏళ్లు. జర్నలిస్టు. ప్రగతిశీల సాంస్కృతిక పత్రిక ‘అదినే’ సంపాదకుడు.

‘‘మాకు ఏమీ అర్థంకాలేదు. బస్సు ఆగిన తర్వాత అయోమయంగా ఒకరి తర్వాత ఒకరిగా బయటకు వచ్చాం. డ్రైవర్ మా దగ్గరికి వచ్చాడు. నిద్రలోకి జారానంటూ క్షమాపణ కోరాడు’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

హేరాన్ పర్వతాలు

ఫొటో సోర్స్, MEHRNEWS

ఫొటో క్యాప్షన్, రచయితలు ప్రయాణిస్తున్న ఆ బస్సును రెండుసార్లు లోయలో దూకించటానికి ప్రయత్నించారు

ఆ ప్రయాణికులు షాక్ నుంచి కోలుకున్న తర్వాత.. డ్రైవర్‌తో కలిసి ప్రయాణం కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు.

కానీ.. ఆ ప్రమాదకర ప్రయాణం అక్కడితో ముగియలేదు. కొన్ని నిమిషాల తర్వాత ఆ డ్రైవర్ బస్సును మళ్లీ శిఖరం అంచువైపు మళ్లించాడు. అవతిలవైపు 1,000 అడుగుల లోయ ఉంది. ఆ లోయను సమీపించే కొద్దీ బస్సు వేగం పెంచాడు.

అప్రమత్తంగా ఉన్న ఒక ప్రయాణికుడు.. డ్రైర్ సీటలోకి దూకి హ్యాండ్‌బ్రేక్‌ను లాగటంతో.. శిఖరం అంచువరకూ వెళ్లిన బస్సు లోయలో పడిపోకుండా ఆగింది. బస్సులోని 21 మంది ప్రయాణికుల ప్రాణాలూ రెండోసారి ప్రమాదం నుంచి బయటపడ్డాయి.

ఆ రచయితలు బస్సు నుంచి దిగేశారు. ఈ పరిణామాలతో వారికి మతిపోయింది. శిఖరం అంచునుంచి కొంచెం కిందకు వెళాడుతున్న బస్సు ముందరి భాగం వారికి కనిపిస్తోంది. ముందు చక్రాలు గాలిలో వేలాడుతున్నాయి. బస్సు డ్రైవర్ ఎలాగో తప్పించుకున్నాడు. ఎక్కడా కనిపించలేదు.

ఈసారి బస్సును లోయలోకి పడేయాలని ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నించారన్నది ఫరాజ్‌కు అర్థమైంది.

ప్రయాణికులు ఆ శిఖరం మీద చిక్కుకుపోయారు.

ఫరాజ్
ఫొటో క్యాప్షన్, 1996లో బస్సు ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ రచయితల్లో ఫరాజ్ ఒకరు

అర్థరాత్రి సమయంలో మామూలుగా నిర్మానుష్యంగా ఉండే ఆ పర్వత మార్గంలో.. సాధారణ దుస్తుల్లో ఉన్న భద్రతా అధికారులు కొందరు ఒక కారు మీద కూర్చుని ఉండటం ఆయన చూశారు.

ఆ ఏజెంట్లు.. ఈ సాహిత్య బృందాన్ని దగ్గర్లోని పట్టణంలో ఉన్న తమ స్థానిక కార్యాలయానికి తరలించారు. వారందరినీ ఒక రోజంతా అక్కడే నిర్బంధించారు.

‘‘ఈ సంఘటన గురించి ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటానికి మేం ఒప్పుకుంటున్నట్లు మాతో బలవంతంగా ఒక లేఖ రాయించారు. దీంతో మమ్మల్నందరినీ చంపేయాలని వారు భావించారన్నది మాకు అర్థమైంది’’ అని ఫరాజ్ చెప్పారు.

‘‘మేం దిగ్భ్రాంతి చెందాం. ఇంతటి ద్వేషాన్ని, క్రూరత్వాన్ని మేం అర్థం చేసుకోలేకపోయాం. మేం ఒకరితో ఒకరం కూడా మాట్లాడుకోలేనంతగా షాక్‌లో ఉన్నాం’’ అని వివరించారు.

ఈ నాటకీయ ఉదంతానికి సంబంధించిన వివరాలు చాలా ఏళ్ల పాటు రహస్యంగానే ఉండిపోయాయి. 1998లో జరిగిన వరుస సంఘటనల తర్వాతే ఇవి వెలుగులోకి వచ్చాయి.

దారియుష్ ఫారోర్, పర్వానే ఫారోర్‌

ఫొటో సోర్స్, SUPPLIED

ఫొటో క్యాప్షన్, వృద్ధ దంపతులైన దారియుష్ ఫారోర్, పర్వానే ఫారోర్‌లను అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపారు

భార్యాభర్తలు.. క్రియాశీల రాజకీయ కార్యకర్తలు

ఆ ఏడాది నంబర్‌లో ఒక ఆదివారం నాడు.. 36 ఏళ్ల పరాస్తో ఫొరోర్ జర్మనీలోని తన ఇంటి బయట కూర్చుని ఉన్నారు. వేల మైళ్ల దూరంలో ఉన్న తన స్వదేశం ఇరాన్‌లో తమ కుటుంబ సభ్యుల సంగతులు మాట్లాడుకోవటానికి.. ప్రతి వారం చేసినట్లుగానే తన తల్లిదండ్రులు ఫోన్ కోసం ఆమె ఎదురుచూస్తున్నారు. కానీ ఆమె ఎదురుచూపులు ఫలించలేదు.

ఆమెకు ఒక బీబీసీ జర్నలిస్టు నుంచి ఫోన్ వచ్చింది.. ఆమె తల్లిదండ్రుల వివరాలు అడుగుతూ. దీంతో ఆమెలో ఆందోళన పెరిగిపోయింది.

‘‘వారిపై దాడి జరిగిందని టెలెక్స్ న్యూస్‌లో చూసినట్లు ఆ రిపోర్టర్ నాకు చెప్పారు. కానీ ఆమె నాకు పూర్తి నిజం చెప్పలేకపోయారు’’ అని పరాస్తో గుర్తుచేసుకున్నారు.

‘‘ఆ తర్వాత నేను నా తల్లిదండ్రుల సన్నిహిత మిత్రులకు ఫోన్ చేశాను. వారు దేశం వదిలిపెట్టి పారిస్‌లో ప్రవాసం ఉంటున్నారు. నా తల్లిదండ్రులను చంపేశారని వారు నాకు చెప్పారు’’ అని ఆమె తెలిపారు.

దారియుష్ ఫారోర్, పర్వానే ఫారోర్‌లు 1998 నవంబర్ 22వ తేదీన దక్షిణ టెహ్రాన్‌లోని వారి ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. దారియుష్ (70)ను 11 సార్లు కత్తితో పొడిచారు. అతడికన్నా 12 సంవత్సరాల తక్కువ వయసున్న అతడి భార్యని 24 సార్లు పొడిచారు.

వీరిద్దరూ ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌లో అధికార యంత్రాగాన్ని బాహాటంగా విమర్శించేవారు. ఒక చిన్న లౌకిక పార్టీని కూడా వారు నడిపేవారు. అప్పటివరకూ ఆ పార్టీని ప్రభుత్వం సహించింది.

ఈ వృద్ధ దంపతులను కిరాతకంగా హత్య చేయటం.. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేకాదు.. ‘ఇరాన్ హత్యల పరంపర’గా ఇప్పుడు వ్యవహరించే హత్యాకాండ వీరి హత్యలతో ఆరంభమైంది.

మొహమ్మద్ మొఖ్తారీ

ఫొటో సోర్స్, SUPPLIED

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ మొఖ్తారి అదృశ్యమైన వారం రోజుల వరకూ సొహ్రాబ్ కుటుంబానికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు

రచయిత.. అనువాదకుడు...

ఈ హత్యలు జరిగిన రెండు వారాల తర్వాత.. టెహ్రాన్‌లో నివసించే మొహమ్మద్ మొఖ్తారి తన 12 ఏళ్ల కొడుకికి వీడ్కోలు చెప్తూ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాడు.

‘‘ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లిన క్షణం.. ఆయనకు సంబంధించిన నా జ్ఞాపకాల్లో చివరిది. ఆయన తలుపు ముందు నిల్చుని ఉన్నారు. పాలు కొని తెమ్మని నేను చెప్పాను. కానీ ఆయన కొంచెం భిన్నంగా కనిపించారు. ఏదో సరిగ్గా లేదని ఆయన అనుకుంటున్నట్లు కనిపించింది’’ అని ఆయన కుమారుడు సొహ్రాబ్ చెప్పారు. అతడికిప్పుడు 32 ఏళ్లు. జర్మనీలో నివసిస్తున్నాడు.

మొహమ్మద్ మొఖ్తారి (56) ఒక రచయిత. కవి. ఇరాన్‌లో ప్రెస్ సెన్సార్‌షిప్‌ను తీవ్రంగా విమర్శించేవారు. ఆ రోజు బయటకు వెళ్లిన ఆయన మళ్లీ తిరిగిరాలేదు.

అదృశ్యమైన తమ తండ్రి కోసం సొహ్రాబ్ అన్న.. వారం రోజుల పాటు టెహ్రాన్‌లోని ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్లు అన్నీ వెతికాడు. డిసెంబర్ 3న మొహమ్మద్ మాయమైన ఒక రోజు తర్వాత.. నగర శివార్లలోని ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక మృతదేహం లభించిందన్న విషయం అతడికి తెలియదు.

వారం రోజులు గడిచే వరకూ ఆయన కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు.

‘‘వైద్య అధికారుల నుంచి మా అన్నకు ఒక ఫోన్ వచ్చింది.. వచ్చి మృతదేహాన్ని గుర్తించాలని. మృతుడి వద్ద గుర్తింపు పత్రాలేవీ లేవని.. అందుకే వెంటనే ఫోన్ చేయలేదని మాకు చెప్పారు’’ అని సోహ్రాబ్ తెలిపారు. మొహమ్మద్ శరీరంతో పాటు లభించింది కేవలం ఒక పెన్ను, ఒక కాగితమేనని అధికారులు చెప్తారు. ఆయనను గొంతు నులిమి చంపారు. అతడి మెడ చుట్టూ కమిలిపోయిందని పేర్కొన్నారు.

మొహమ్మద్ మొఖ్తారి హత్యకు గురైన విషయం అతడి కుమారులకు తెలిసిన రోజునే.. వారి కుటుంబ స్నేహితుడు, మరొక రచయిత కూడా అదృశ్యమయ్యారు.

మొహమ్మద్ జాఫర్ పోయాన్దే (44) ఒక అనువాదకుడు. సాహిత్య ప్రపంచంలో అందరికీ తెలిసినవాడు. కానీ ప్రజాబాహుళ్యానికి అంతగా తెలియదు. డిసెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం.. దిగువ టెహ్రాన్‌లోని అతడి ఆఫీస్ నుంచి అతడిని అపహరించుకెళ్లారు.

మూడు రోజుల తర్వాత అతడి మృతదేహం కనిపించింది. అతడి స్నేహితుడి లాగానే అతడిని కూడా గొంతు నులిమి చంపేసిన గుర్తులున్నాయి.

భార్య, కుమార్తెతో పోయాన్దే

ఫొటో సోర్స్, SUPPLIED

ఫొటో క్యాప్షన్, మొఖ్తారి హత్య జరిగిన కొన్ని రోజులకే మొహమ్మద్ జాఫర్ పోయాన్దే కూడా హత్యకు గురయ్యారు

ప్రాణాంతక సంబంధం

మొఖ్తారికి, పోయాన్దేకి ఉన్న ఉమ్మడి సంబంధం... వారిద్దరూ ఇరానియన్ రైటర్స్ అసోసియేషన్ (ఐడబ్ల్యూఏ)కు చెందిన వారు. రెండేళ్ల కిందట.. అర్మేనియాలో సాహిత్య సదస్సులో పాల్గొనటానికి బస్సు ప్రయాణం చేపట్టిన బృందం కూడా ఇదే. వీరు ఒకప్పుడు ఇరాన్ అధికార యంత్రాంగాన్ని బాహాటంగా విమర్శించే వారు.

సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి భావసారూప్యం గల ప్రగతిశీల రచయితలు, కవులు, పాత్రికేయులు, అనువాదకులను ఒక వేదిక మీదకు తీసుకువచ్చిందీ రచయితల సంఘం. అయితే.. ఈ సంస్థ కార్యకలాపాలను వరుస ప్రభుత్వాలు కత్తిరించాయి. 1979లో ఇస్లామిక్ రివల్యూషన్ అనంతరం ఈ సంస్థను నిషేధించారు.

ఆ నిషేధాన్ని తాము ఎలా అధిగమించామనేది.. 1990ల్లో ఆ సంఘం ముఖ్య సభ్యుల్లో ఒకరిగా ఉన్న ఫరాజ్ సర్కోహి వివరిస్తారు.

‘‘ఆ సంస్థకు పెద్ద ఎత్తున మద్దతు ఉండేది కాబట్టి అది మనుగడ సాగించింది. మా ఆలోచనలను చర్చించుకోవటానికి మేం రహస్యంగా డిన్నర్ పార్టీలు నిర్వహించేవాళ్లం. కొన్ని పార్టీలను మా సొంత ఇంట్లోనే జరిపాం. మా చర్చలను వింటున్నారని మాకు తెలుసు. కానీ మాకు మరో మార్గం లేదు’’ అని ఆయన చెప్తారు.

1994లో ఐడబ్ల్యూఏలో కొత్త జీవం నింపటానికి 134 మంది సభ్యులు ప్రయత్నించినపుడు కథ మలుపు తిరిగింది. ఇరాన్‌లో భావ ప్రకటనా స్వేఛ్చను డిమాండ్ చేస్తూ వీరందరి సంతకాలతో ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆ లేఖ ఇరాన్‌లో ఇప్పటికీ ప్రచురణ కాలేదు. కానీ.. దేశంలోనూ, వెలుపలా దానికి భారీ మద్దతు లభించింది.

దారియుష్ ఫారోర్ హత్యకు గురైన కుర్చీ

ఫొటో సోర్స్, SUPPLIED

ఫొటో క్యాప్షన్, దారియుష్ ఫారోర్‌ను కుర్చీలో హత్య చేశారని.. హంతకులు ఆ కుర్చీని కావాలనే మక్కా దిశగా తిప్పి ఉంచారని ఆయన కుటుంబం చెప్తోంది

ఆ లేఖలోని మాటల కూర్పులో ఫరాజ్, మొఖ్తారి, పోయాన్దేలతో పాటు మరికొందరు రచయితలు ప్రధాన పాత్ర పోషించారు. వీరందరూ రెండేళ్ల తర్వాత బస్సులో అర్మేనియా ప్రయాణమై.. రెండు సార్లు ప్రాణాలతో బయటపడ్డారు.

1998లో మొఖ్తారీ, పోయాన్దేలు హత్యకు గురవటానికి కేవలం కొన్ని వారాల ముందు.. వారిద్దరితో పాటు మరో నలుగురు రచయితలనూ కోర్టుకు పిలిపించారు. ఐడబ్ల్యూఏ సదస్సు ఏర్పాటు చేయటానికి వీరు చేస్తున్న ప్రయత్నాల గురించి విచారించారు. ఆ ప్రణాళికలను మానుకోవాలని నిక్కచ్చిగా చెప్పారు.

ఇంట్లో వాతావరణం ఎలా భయంగా భయంగా మారిందో.. తన తండ్రి వంటి రచయితలు ఎదుర్కొంటున్న ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందో మొఖ్తారి కుమారుడు సోహ్రబ్ వివరించారు.

‘‘మా నాన్నను చాలాసార్లు బెదిరించారు. ఒకసారి ఈ విషయం మా అమ్మ నాకు చెప్పనప్పుడు ఆమెను నాన్న కోప్పడటం నాకు గుర్తుంది’’ అని చెప్పారు.

ఆయనకు సంబంధించిన అన్ని విషయాలనూ భద్రతా సంస్థలు నియంత్రించేవి. ఆయన ఫోన్ కాల్స్, భావప్రకటనా స్వేచ్ఛ పోరాటంలో భాగస్వాములైన ఇతర రచయితలు, మేధావులతో ఆయన సంప్రదింపులు అన్నిటినీ నియంత్రించేవారు’’ అని తెలిపారు.

సయీద్ ఇమామీ, వీడియోలోని దృశ్యం

ఫొటో సోర్స్, SUPPLIED

ఫొటో క్యాప్షన్, 1988 హత్యల సూత్రధారి సయీద్ ఇమామీ అని ఆరోపణలు వచ్చాయి.. నేరాంగీకారం కోసం నిందితులను హింసించినట్లు వీడియో దృశ్యాల్లో కనిపించింది

ప్రజాగ్రహం.. ‘దర్యాప్తు’

రాజకీయ హత్యలు ఇరాన్‌లో కొత్త కాదు. కానీ ఫారోర్ దంపతులను కిరాతకంగా హత్య చేయటం ప్రజల దృష్టిలో పడింది.

‘‘ఆ హత్యలు కిరాతకంగా జరిగిన తీరు నన్ను కలచివేసింది. మా అమ్మను 24 సార్లు పొడిచారు. నా తండ్రిని ఆయన కుర్చీలోనే చంపారు. ఆ కుర్చీ మక్కా దిశగా తిప్పి ఉంది. అది ఒక రకమైన మతసంబంధ హత్య తరహాలో ఉంది’’ అని పరాస్తో చెప్పారు. ఆమె తల్లిదండ్రులు హత్యకు గురయ్యేటప్పటికి ఇరాన్‌లో ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్న లౌకికవాదులు.

‘‘ఇరాన్‌లో సమాజం దిగ్భ్రాంతికి గురైంది. చాలా ఆగ్రహించింది. అందుకే నా తల్లిదండ్రులను సమాధి చేసేటపుడు భారీ ప్రదర్శన జరిగింది. వేలాది మంది ప్రజలు వచ్చారు’’ అని ఆమె చెప్పారు. ఈ హత్యలు రాజకీయ ప్రేరేతిమైనవని జనం అనుమానించటం మొదలైంది.

నిఘా సంస్థల మీద ఇంకా గణనీయమైన పట్టున్న ఇస్లామిక్ అతివాదులు, అధ్యక్షుడు మొహమ్మద్ ఖతామీతో పొత్తు ఉన్న సంస్కరణవాదులకు మధ్య అధిపత్య పోరాటంలో భాగంగా ఈ హత్యలు జరిగాయని విస్తృతంగా భావించారు. ఇరాన్‌లో మరింత ఎక్కువ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఖతామీ బలంగా మాట్లాడటం 1997 వేసవిలో ఆయనను అధికారంలోకి తీసుకువచ్చింది.

ఒత్తిడి తీవ్రమవటంతో 1998 డిసెంబర్‌లో అధ్యక్షుడు ఖతామీ.. ఫారోర్ దంపతుల హత్యపై, మొఖ్తారీ, పోయాన్దేల మరణాలపై దర్యాప్తుకు ఆదేశించారు.

కేవలం కొన్ని వారాల తర్వాత, 1999 జనవరిలో.. ఈ హత్యలు నిఘా మంత్రిత్వశాఖలోని రోగ్ ఏజెంట్లు (ప్రభుత్వాన్ని ధిక్కరించి స్వతంత్రంగా వ్యవహరించే అధికారులు) చేసిన పని అని ప్రభుత్వం వెల్లడించింది.

సయీద్ ఇమామీ అనే మాజీ డిప్యూటీ ఇంటెలిజెన్స్ మంత్రి ప్రధాన అనుమానితుడు, కుట్రదారుడని అధికారులు చెప్పారు. అతడు ప్రభుత్వ నిర్బంధంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. వెంట్రుకలు తొలగించటానికి ఉపయోగించే ద్రవం తాగి అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు పేర్కొన్నారు.

మొత్తంగా 18 మందిపై విచారణ జరిగింది. ముగ్గురికి మరణశిక్ష విధించారు. ఆ శిక్షలను తర్వాత జైలు శిక్షలుగా మార్చారు. మరో ఇద్దరికి జైలు శిక్షలు విధించి.. ముగ్గురిని వదిలిపెట్టారు.

ఆ విచారణ ఎదుర్కొన్న వారిలో ఖార్సో బరాటి ఒకరు. కవులు, రచయితలు ప్రయాణించిన బస్సుకు తానే డ్రైవర్‌‌నని అతడు ఆ తర్వాత అంగీకరించినట్లు చెప్తారు.

కానీ.. ఈ దర్యాప్తులో గుర్తించిన విషయాలను మృతుల కుటుంబాలు తిరస్కరించాయి. అవన్నీ కట్టుకథలన్నది వారి విశ్వాసం. నిందితుల వాంగ్మూలాలన్నిటినీ.. ఫారోర్ దంపతుల కుమార్తె పరాస్తో, ఆమె తరఫు న్యాయవాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఎబాదీలు క్షుణ్నంగా అధ్యయనం చేశారు.

‘‘నిందితుల్లో ప్రతి ఒక్కరూ.. తాము ఇంటెలిజెన్స్ మంత్రి ఆదేశాల మేరకు నడుచుకున్నామని చెప్పారు. ఇది వారి వాంగ్మూలాల్లో ఉంది. కానీ కోర్టు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఒకరు ఇతరులను ఎటువంటి రాజకీయ కారణాలూ లేకుండానే చంపుతారన్నట్లుగా మాత్రమే వ్యవహరించింది’’ అని పరాస్తో పేర్కొన్నారు.

ఈ కేసు నేపథ్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఘోర్బనాలి డోరి-నజాఫాబాది రాజీనామా చేశారు. అయితే ఆ హత్యల్లో తన పాత్ర ఏదీ లేదని తిరస్కరించారు.

కొన్నేళ్ల తర్వాత లీకైన కొన్ని వీడియోటేపుల్లో.. అనుమానితులు కొందరు నేరాన్ని అంగీకరించేలా హింసించినట్లు కనిపించింది.

అక్బర్ గంజీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అక్బర్ గంజీ 2006లో విడుదలయ్యాక.. ఇరాన్‌లో ఇతర రాజకీయ ఖైదీల తరఫున ఉద్యమించారు

మరోవైపు.. ఈ కేసుపై పలువురు పరిశోధక పాత్రికేయులు లోతుగా తవ్వటం మొదలుపెట్టారు. 1980ల చివర్లో జరిగిన మేధావులు, రచయితల అంతుచిక్కని హత్యలకు లింకులను గుర్తించారు. వారిని ఊపిరాడకుండా చేయటం, పొడవటం, పొటాషియం ఇంజెక్షన్లు ఇవ్వటం మొదలుకుని.. గుండెపోటులు వచ్చేలా చేయటం వరకూ అనేక రకాలుగా ఆ హత్యలు జరిగాయి.

ఆ జర్నలిస్టుల్లో ఒకరు అక్బర్ గంజీ. అంతకుముందున్న ప్రభుత్వాన్ని, కొందరు సీనియర్ మత పెద్దలను వేలెత్తి చూపుతూ వరుస కథనాలు ప్రచురించినందుకు గాను ఆయనను ఐదేళ్లు జైలులో నిర్బంధించారు. ఈ ఆరోపణల్లో వేటి మీదా ఇరాన్ ప్రభుత్వం దర్యాప్తు చేయలేదు. ఆ హత్యల్లో చాలా వరకూ ఇంకా అపరిష్కృతంగానే మిగిలి ఉన్నాయి.

ఆ దురదృష్టకర బస్సు ప్రయాణం నుంచి బతికి బయటపడటం తన అదృష్టమని అక్బర్ గంజీ సహ పాత్రికేయుడు ఫరాజ్ సర్కోహి చెప్తారు. అయితే.. ఆయన ఒక టార్గెట్‌గానే ఉన్నారు. ఆ బస్సు సంఘటన జరిగిన కొద్ది కాలానికే ఆయనను ఇరాన్ సీక్రెట్ సర్వీస్ అపహరించింది. అంతర్జాతీయ సమాజం జోక్యంతో ఆయన మరణశిక్ష నుంచి తప్పించుకోగలిగారు. ఆయన ఇప్పుడు ఇరాన్ వదిలేసి జర్మనీలో ప్రవాస జీవితం గడుపుతున్నారు.

సోహ్రబ్‌ టీనేజీ వయసుకు కూడా రాక ముందే అతడి తండ్రి హత్యకు గురయ్యాడు. తనకు అది ‘ప్రపంచం అంతమైనట్లే’నని ఆయన అంటారు.

‘‘ఏం జరిగిందో నాకు నిజంగా అర్థం కాలేదు. ఆ వయసులో చావు, బతుకుల గురించి నాకు ఏమీ తెలియదు’’ అని పేర్కొన్నారు.

పరాస్తో ఇప్పుడొక కళాకారిణి. చాలా అవార్డులు అందుకున్నారు. ఇంకా జర్మనీలోనే నివసిస్తున్నారు. అయితే ప్రతి శరదృతువులోనూ ఇరాన్ వెళుతుంటారు.. తన తల్లిదండ్రులకు నివాళులు అర్పించటానికి. ఈ సంస్మరణలు నిర్వహించకుండా కూడా తనను, తమ బంధువులను అధికారులు తరచుగా అడ్డుకునేవారని ఆమె చెప్తారు.

‘‘ఇప్పటికి 20 ఏళ్లు గడిచిపోయాయి. ఆ జ్ఞాపకాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. న్యాయం కోసం మా ఎదురుచూపులు కూడా...’’ అని ఆమె అంటారు.

అదనపు సమాచారం: నికీ మహజోబ్

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)