భారత్ Vs వెస్టిండీస్: ధోనీ స్లో బ్యాటింగ్‌పై విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే..

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

క్రికెట్ వరల్డ్ కప్‌లో గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఆ తర్వాత అత్యధిక స్కోరు మహేంద్ర సింగ్ ధోనీదే. అతడు 61 బంతుల్లో అజేయంగా 56 పరుగులు చేశాడు.

అయితే, ధోనీ ఇన్నింగ్స్ తీరు గురించి చర్చ జరుగుతోంది. అతడి ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా మొదలైంది. మొదటి 20 పరుగులు చేసేందుకు 40 బంతులు ఆడాడు. ఈ కారణంగా క్రీజులో ధోనీ సహచర బ్యాట్స్‌మెన్‌ కూడా ఒత్తిడి ఎదుర్కొన్నట్లు కనిపించారు.

ఆఖరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి భారత ఇన్నింగ్స్‌కు ధోనీ మంచి ముగింపు ఇచ్చాడు. అయితే, మధ్య ఓవర్లలో అతడు నెమ్మదిగా ఆడుతుండటమే చర్చనీయాంశమవుతోంది.

కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

దీని గురించి కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ విషయంలో ధోనీని అతడు సమర్థించాడు.

''ఆటగాళ్లెవరికైనా చెడ్డ రోజు ఉంటుంది. ధోనీ విఫలమైన రోజు అందరూ అతడి గురించే మాట్లాడుతుంటారు. మేం మాత్రం అతడికి అండగా ఉంటాం. ఆఖరి ఓవర్లలో 15-20 పరుగులు అవసరమైనప్పుడు ధోనీ మాకు సాధించిపెడతాడు'' అని కోహ్లీ అన్నాడు.

టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ ఎలా చేయాలో ధోనీకి బాగా తెలుసని, పదిలో ఎనిమిది సార్లు అతడి అనుభవం తమకు పనికివస్తుందని చెప్పాడు.

ధోనీ, కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

''పరిస్థితిని బట్టి బ్యాటింగ్ గతిని మార్చుకోగలిగే ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో ధోనీ ఒకడు. పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకుని, దానిపై ఎంత స్కోరు సాధ్యమన్నది అతడు సరిగ్గా అంచనా వేయగలడు'' అని కోహ్లీ అన్నాడు.

''ఏదైనా పిచ్‌పై 265 పరుగులు మంచి స్కోరు అని ఒకవేళ ధోనీ అంటే, మేం 300 గురించి ఆలోచించడమే మానేస్తాం. అతడు చాలా గొప్ప ఆటగాడు. ఎప్పుడూ జట్టుతోపాటే కొనసాగాలని మేం కోరుకుంటుంటాం'' అని కోహ్లీ చెప్పాడు.

గత రెండు మ్యాచ్‌ల్లో అనుకున్నట్లుగా ఆడలేకపోయినా విజయాలు సాధించామని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ గెలవగలిగే సామర్థ్యం తమ జట్టుకు ఉందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)