PAK Vs SA: దక్షిణాఫ్రికాపై 49 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం.. సెమీస్ రేసు నుంచి సౌతాఫ్రికా ఔట్

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ కప్‌లో ఆదివారం నాటి మ్యాచ్‌లో 309 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను పాకిస్తాన్ 259 పరుగులకే కట్టడి చేసింది. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఈ పరాజయంతో సెమీస్ రేసు నుంచి దక్షిణాఫ్రికా నిష్క్రమించింది. సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టు ఇదే. ఈ రేసు నుంచి అఫ్గానిస్థాన్ ఇప్పటికే నిష్క్రమించింది.
ఆదివారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్, వాహబ్ రియాజ్ చెరో మూడు వికెట్లు తీశారు. మొహమ్మద్ ఆమిర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
59 బంతుల్లో 89 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన పాక్ ఆటగాడు హారిస్ సొహైల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో హమీమ్ ఆమ్లా 2 పరుగులకు, క్వింటన్ డీకాక్ 47 పరుగులకు ఔటయ్యారు. ఆ తరువాత ఎయిడెన్ మార్క్రామ్ కూడా 16 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
రాసీ వాండర్ డసెన్, డేవిడ్ మిల్లర్ కుదురుగా ఆడుతూ అయిదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు మళ్ళుతోందనిపించేలోపు డసెన్ 36 పరుగులు వద్ద షాదాబ్ బంతిని హఫీజ్‌కు క్యాచ్‌గా పంపి వెనుతిరిగాడు.
ఆ తరువాత డేవిడ్ మిల్లర్ కూడా 31 పరుగుల వద్ద షాహీన్ అఫ్రిది బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అంతకుముందు, ఫాఫ్ డూప్లెసిస్ ఒక్కడే కుదురుగా ఆడి 79 బంతుల్లో 63 పరుగులు చేసి ఆమిర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఓపెనింగ్‌లోనే తడబాటు
ఓపెనర్‌గా వచ్చిన క్వింటన్ డీకాక్ మొదటి ఓవర్లో రెండో బంతికే ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. మిడాన్‌లో వాహబ్ రియాజ్ క్యాచ్ వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్న డీకాక్ ఆ తరువాత రెండు సిక్సర్లు మూడు ఫోర్లతో 60 బంతుల్లో 47 పరుగులు చేసి షాదాబ్ బౌలింగ్‌లో ఇమామ్-ఉల్-హక్‌కు క్యాచ్ ఇచ్చి హాఫ్ సెంచరీ చేయకండానే వెనుతిరిగాడు.
రెండో ఓవర్లో ఆమిర్ వేసిన మొదటి బంతికి హషీం ఆమ్లా ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. ఆ తరువాత ఆమిర్ ఒక మేడిన్ ఓవర్ వేశాడు. దాంతో, దక్షిణాఫ్రికా జట్టు ప్రారంభంలోనే తడబడినట్లయింది. ఆరు ఓవర్లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా ఒక వికెట్ కోల్పోయి కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఫొటో సోర్స్, Getty Images
పాక్‌కు భారీ స్కోరు అందించిన హారిస్, బాబర్
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.
హారిస్ సొహైల్ (59 బంతుల్లో 89), బాబర్ ఆజమ్ (80 బంతుల్లో 69) రాణించారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్‌గిడికి మూడు, ఇమ్రాన్ తాహిర్‌కు రెండు వికెట్లు పడ్డాయి.
ఇన్నింగ్స్ ఆరంభం బాగానే ఉన్నా, మధ్యలో స్పిన్ బౌలింగ్‌లో పాక్ తడబడింది.
ఓపెనర్లు ఇమామ్ ఉల్ హఖ్ (44), ఫఖార్ జమాన్ (44) తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
ఈ దశలో బంతి అందుకున్న తాహిర్ తన తొలి ఓవర్‌లోనే ఫఖార్‌ను క్యాచౌట్ చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
20వ ఓవర్లో తాహిర్ మరోసారి షాకిచ్చాడు. తన బౌలింగ్‌లోనే ఇమామ్ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అందుకున్నాడు.
దీంతో 98 పరుగులకు పాక్ రెండు వికెట్లు నష్టపోయింది.
ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన బాబర్ ఆజమ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతలను తీసుకున్నాడు. హఫీజ్‌తో కలిసి మూడో వికెట్‌కు 45 పరుగులు, హారిస్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించాడు.
ఈ క్రమంలో అతడి హాఫ్ సెంచరీ కూడా పూర్తైంది. 41.2 ఓవర్లకు 224 స్కోరుతో పాక్ మంచి స్థితికి చేరుకున్న సమయంలో నాలుగో వికెట్‌గా అతడు ఔటయ్యాడు.
బాబర్ వెనుదిరిగిన తర్వాత హారిస్ బ్యాటింగ్‌లో జోరు పెంచాడు. 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
హారిస్‌కు ఇమాద్ వసీం (15 బంతుల్లో 23) నుంచి మంచి సహకారం అందింది. వీరిద్దరూ క్రమం తప్పకుండా బౌండరీలు బాదడంతో పాక్ స్కోరు వేగం పెరిగింది. ఆ తర్వాతి ఐదు ఓవర్లలో దాదాపు 60 పరుగులు వచ్చాయి.
వసీం వికెట్ పడే సమయానికి పాక్ స్కోరు 295-5. మరో రెండు ఓవర్లు మిగిలున్నాయి.
రబాడా వేసిన 49వ ఓవర్‌లో 9 పరుగులు రాగా, ఎన్‌గిడి వేసిన ఆఖరి ఓవర్లో నాలుగు పరుగులే వచ్చాయి. రెండు వికెట్లు పడ్డాయి. సెంచరీ కోసం వేగం పెంచే ప్రయత్నంలో హారిస్ కూడా ఔటయ్యాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇప్పటివరకూ ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, పాక్ కేవలం చెరొక మ్యాచ్ మాత్రమే గెలిచాయి. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ రెండు జట్లకూ ఇది తప్పక గెలవాల్సిన మ్యాచే.
చారిత్రక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అక్కడికి పాక్ ఆర్మీ చీఫ్ కూడా వెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి
- క్రికెట్ వరల్డ్ కప్ 2019 : వన్డేల్లో అత్యుత్తమ భారత జట్టు ఇదేనా...
- స్వామి వివేకానంద నుంచి మోదీ వరకు.. యోగాను ఎలా ప్రపంచవ్యాప్తం చేశారు
- 'వీర్యదాత చట్టపరంగా తండ్రి': కోర్టు తీర్పు
- సుజనా చౌదరి మీద సీబీఐ, ఈడీ దర్యాప్తులు ఎందుకు? కేసులు ఏమిటి?
- భారీ విమానాన్ని సముద్రంలో ముంచేసిన టర్కీ.. ఎందుకంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








