శ్రీలంక ముస్లింల అసాధారణ చర్య.. హింసాత్మక అతివాదులను దూరం పెట్టేందుకు మసీదు కూల్చివేత

ఈస్టర్ ఆదివారం బాంబు దాడులకు కారణమని ఆరోపణలున్న అతివాద ఇస్లామిక్ గ్రూప్ మీద శ్రీలంక ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆ దాడిలో 250 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
అయితే.. కేవలం అతి కొద్ది మంది మాత్రమే అతివాదులుగా మారారని చూపించటానికి శ్రీలంకలోని ముస్లిం సమాజం ప్రయత్నిస్తోంది. శ్రీలంకలో నిషిద్ధ నేషనల్ తౌహీద్ జమాత్ సంస్థ ఉపయోగించిన ఒక మసీదును.. అతివాదానికి తమ వ్యతిరేకతను చాటటం కోసం ముస్లింలు ధ్వంసం చేశారు.
అతివాదులకు దూరంగా..
''ఈస్టర్ బాంబు దాడుల తర్వాత మా పట్టణంలో ముస్లిమేతరులు మమ్మల్నందరినీ ఉగ్రవాదులుగా చూస్తున్నారు'' అని చెప్పారు ఎం.ఎచ్.ఎం. అక్బర్ ఖాన్.
శ్రీలంకలో మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్లపై జరిగిన ఆత్మాహుతి దాడుల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆ దాడుల్లో 250 మంది చనిపోయారు. ఆ దాడులకు ఓ ముస్లిం ఛాందసవాద సంస్థ కారణమని ఆరోపణలు వచ్చాయి.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రపంచమంతటా ఇస్లాం మతస్తులు ఉపవాసం చేసి, ప్రార్థనలు చేస్తుండగా.. శ్రీలంకలో ఒక చిన్న బృందం.. హింసాత్మక గ్రూపులతో తమకు సంబంధం లేదని చెప్పటానికి అసాధారణ చర్య చేపట్టింది. వాళ్లు ఒక మసీదును ధ్వంసం చేశారు.
శ్రీలంకలోని మదాటుగమ పట్టణంలో గల ప్రధాన మసీదు ట్రస్టీ అక్బర్ ఖాన్ దీనిపై ‘బీబీసీ’తో మాట్లాడుతూ.. మత విశ్వాసాలు ఆచరించేవారు ఇలాంటి అసాధారణ చర్యకు ఎందుకు దిగారనేది వివరించారు.
వారిని వదిలించుకోవడానికి దేనికైనా సిద్ధం
''ఆ దాడుల తర్వాత పోలీసులు ఈ మసీదుకు అనేక సార్లు వచ్చారు. దీంతో జనం ఆందోళనలకు, భయాలకు లోనయ్యారు. మాకు, ఇతర సమూహాలకు మధ్య అపనమ్మకాన్ని మరింత పెరిగింది కూడా'' అని చెప్పారు అక్బర్ ఖాన్.
ఏప్రిల్‌లో దేశాన్ని కుదిపేసిన ఆ ఆత్మాహుతి దాడులకు కారణమని అనుమానిస్తున్న నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్‌టీజే) సభ్యులు ఈ మసీదును ఉపయోగించారని చెప్తున్నారు.
దాడుల తర్వాత ఆ సంస్థను నిషేధించారు. ఎన్‌టీజే లక్ష్యంగా శ్రీలంక ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాడులు చేపట్టింది. తూర్పు ప్రాంతంలోని కట్టన్‌కుడిలో ఉన్న ఒక మసీదును ఆ సంస్థ ఉపయోగించింది. ఆ మసీదును అధికారులు మూసివేశారు.
ఆ మసీదు చారిత్రకంగా కానీ, మతపరంగా కానీ, సాంస్కృతికంగా కానీ ప్రముఖమైనదేమీ కాదు. వేరే అతి-సంప్రదాయవాద బృందం దీనిని నిర్వహిస్తోంది. ఆ బృందానికి, బాంబుదాడులకు సంబంధం లేదు.
అతివాదులను వదిలించుకోవటానికి ముస్లిం సమాజం ఎంత దూరం పోవటానికి సంసిద్ధంగా ఉన్నదనేది ఆ మసీదు కూల్చివేత చాటుతోంది.

ఏకగ్రీవ నిర్ణయం
''మా పట్టణంలో ఇప్పటికే ఒక మసీదు ఉంది. మా ప్రాంతంలోని ముస్లింలకు అది సేవ చేస్తుంది. కానీ కొన్నేళ్ల కిందట మరో బృందం ఈ మసీదును ప్రారంభించింది'' అని అక్బర్ ఖాన్ తెలిపారు.
పాత మసీదు సభ్యులు మే నెలలో ఒక సమావేశం నిర్వహించారు. వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న మసీదును తొలగించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. స్థానికులు పలుగులు, సమ్మెటల వంటి పరికరాలను ఉపయోగించి ఆ మసీదును ధ్వంసం చేశారు.
''మీనార్లను, ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశాం. ఆ స్థలాన్ని దాని అసలు యజమానికి అప్పగించాం'' అని ఆయన చెప్పారు.
శ్రీలంక ప్రజల్లో సుమారు 70 శాతం మంది బౌద్ధ మతం పాటిస్తారు. బౌద్ధమతస్తులందరూ దాదాపుగా సింహళ భాషే మాట్లాడుతారు. దేశ జనాభాలో రెండో స్థానంలో హిందువులు ఉన్నారు. ముస్లింలు 10 శాతం మంది, క్రైస్తవులు ఏడు శాతం మంది ఉన్నారు.
ముస్లింలలో అత్యధికులు మాతృభాషగా తమిళం మాట్లాడతారు. కానీ.. సంక్లిష్టమైన రాజకీయ, చారిత్రక కారణాల రీత్యా ముస్లింలు తమను తాము.. ఇతర తమిళులకు వేరైన జాతిగా గుర్తించుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
దేవుడి స్థానం
కానీ ఈ తీవ్ర చర్యను అందరూ అంగీకరించలేదు. ప్రార్థనా స్థలాలను పాడుచేయకూడదని ఆల్ సిలోన్ జమీయతుల్ ఉలేమా అంటోంది. శ్రీలంకలో ఇస్లాం ఆధ్యాత్మిక అంశాలపై ఉన్నత స్థాయి సంస్థగా దీనిని పరిగణిస్తారు.
''మసీదులన్నీ అల్లాకు చెందుతాయి. ఎవరు నిర్వహిస్తున్నారన్నదానితో నిమిత్తం లేదు. వాటిని ధ్వంసం చేయటం, పాడు చేయటం ఇస్లాం సూత్రాలకు విరుద్ధం'' అని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
శ్రీలంకలో 2,596 మసీదులు నమోదు అయ్యాయని, వాటిలో 2,435 పనిచేస్తున్నాయని ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. ఇక నమోదు కాని మసీదులు కూడా డజన్ల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు వదిలివేశారు.

వహాబీ
''ఈ మసీదులను గ్రంథాలయాలు, ఆరోగ్య కేంద్రాల వంటి వాటికి ఉపయోగించుకునేలా ముస్లిం సమాజం మార్చుకోవచ్చు. మసీదులను ధ్వంసం చేసే మార్గంలో పయనిస్తే.. వందలాది మసీదులను ధ్వంసం చేయాల్సి ఉంటుంది'' అని డాక్టర్ ఎ.రమీజ్ వ్యాఖ్యానించారు. శ్రీలంకలోని సౌత్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో సోషియాలజీ విభాగాధిపతి ఆయన.
దేశంలో గల మసీదుల్లో 10 నుంచి 15 శాతం మసీదులను అతివాద బృందాలు నడుపుతున్నాయన్నది ఆయన అంచనా.
గత రెండు దశాబ్దాల కాలంలో వహాబీ సిద్ధాంతానికి సంబంధించిన విభిన్న పాయలతో స్ఫూర్తి పొందిన ముస్లిం గ్రూపులకు గణనీయమైన ఆదరణ లభించింది.
మతాన్ని ఆచరిస్తున్న ముస్లింలు చాలా మంది అవిశ్వాసకులు అంటూ ముద్ర వేసిన అతివాదులను శ్రీలంక ముస్లింలు చాలా ఏళ్లుగా సహించారు.
కానీ.. ఈ సమాజం మౌనం వహించటమే ఆ అతివాదులు మారుతూ వెళ్లటానికి దోహదపడిందని డాక్టర్ రమీజ్ అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉక్కుపాదం
వేడిగా ఉక్కపోతతో ఉండే శ్రీలంకలో ముస్లిం మహిళలు శరీరాన్ని పూర్తిగా కప్పివేసే ముసుగులు ధరించటం అంతకంతకూ పెరుగుతోంది. శ్రీలంక ముస్లిం జీవితానికి కేంద్ర బిందువు భావించగల కట్టన్‌కుడి పట్టణంలో వీధులు, ప్రభుత్వ భవనాల పేర్లు అరబిక్ భాషలో ఉంటాయి. కానీ అరబిక్ చదవటం, రాయటం తెలిసిన స్థానికులు చాలా చాలా తక్కువ.
ఇప్పుడు ప్రభుత్వం ఈ పరిణామాలను మార్చటానికి బలవంతంగా ప్రయత్నిస్తోంది. బాంబు దాడుల అనంతరం బహిరంగ ప్రదేశాల్లో ముఖాలకు బురఖా ధరించటం నిషేధించింది. రోడ్లు, భవనాల పేర్లను ప్రదర్శించటానికి శ్రీలంక అధికారిక భాషలు - సింహళం, తమిళం, ఇంగ్లిష్ మాత్రమే ఉపయోగించాలని సర్క్యులర్ జారీ చేసింది.
శ్రీలంక ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించింది. అయితే.. ఆ దాడిలో ప్రమేయం ఉన్న వారందరూ చనిపోవటమో, అరెస్ట్ చేయటమో జరిగిందని చెప్తోంది. అత్యవసర పరిస్థితి జూన్ 22 వరకూ కొనసాగుతుంది.
కానీ.. ముస్లింలు అన్ని వైపుల నుంచీ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దాడులు
మే రెండో వారంలో పశ్చిమ శ్రీలంకలో పాతికకు పైగా పట్టణాల్లో ముస్లింలకు చెందిన ఇళ్లు, వ్యాపారాల మీద సింహళ మూకలు దాడులు చేశాయి.
''మేం దాడులకు, అవమానాలకు గురవటం అంతకంతకూ మామూలు విషయంగా మారుతోంది. ప్రభుత్వం నిర్బంధించిన మా సహోద్యోగి ఒకరిని కలవటానికి ఇటీవల నేను మరో నలుగురితో కలిసి ఒక జైలుకు వెళ్లాను. మేం బయటకు వచ్చినపుడు ఒక వ్యక్తి మమ్మల్ని తిట్టటం మొదలుపెట్టాడు'' అని డాక్టర్ రమీజ్ తెలిపారు.
''మీ కార్లలో బాంబులు దాచిపెట్టారు' అంటూ కేకలు వేశారు. ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించి మేం అక్కడినుంచి వెళ్లిపోయాం'' అని వివరించారు.
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అతివాద ఇస్లాం సిద్ధాంతం మీద.. సామాజిక, రాజకీయ, మతపరమైన మార్గాలను ఉపయోగించుకుని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అంటారు.
''అతివాదుల అభిప్రాయాలను అత్యధిక ప్రజలు ఆమోదించరు. చాలా ప్రాంతాల్లో నేరస్తులను చట్టం ముందు నిలుచోబెట్టడానికి పోలీసులకు ప్రజలు క్రియాశీలంగా సహకరిస్తున్నారు'' అని చెప్పారు.

మొహమ్మద్ హషీమ్ ఒక సామాజిక కార్యకర్త. ఆయన ఇప్పుడు ముస్లిం యువతలో అతివాద ఆలోచనలను సంస్కరించటం కోసం పనిచేస్తున్నారు.
''యువత గూగుల్‌లో సెర్చ్ చేయటం ద్వారా, చాట్ గ్రూపుల్లో చేరటం ద్వారా, యూట్యూబ్ వీడియోలు చూడటం ద్వారా ఇస్లాం గురించి తెలుసుకుంటున్నారు. కానీ ఈ సైబర్‌స్పేస్‌లో అతివాదుల ప్రాబల్యం అధికంగా ఉంది'' అని ఆయన పేర్కొన్నారు.
మసీదును ధ్వంసం చేయటం ఒక శక్తివంతమైన సంకేతమని ఆయన పరిగణిస్తున్నారు.
''ఉగ్రవాదం మీద పోరాడటానికి ఇదే ఉత్తమమైన ఉమ్మడి ప్రయత్నమని ఆ ప్రాంత ముస్లింలు భావించి ఉంటారు'' అని అభిప్రాయపడ్డారు.
శ్రీలంక ముస్లింలలో అతివాద ఆలోచనలు తొలగించటం తక్షణ ప్రాధాన్యమేనని అంగీకరించారు. అదే సమయంలో.. ఎవరూ విద్వేష భావజాలాలను బోధించటానికి అనుమతించరాదని.. సింహళ బౌద్ధులు, హిందూ తమిళుల్లో అతివాద శక్తులు ఇష్టానుసారం దాడులు చేయటానికి వీలుకల్పించరాదని పేర్కొన్నారు.
''ముస్లింలు అయినంత మాత్రాన ప్రజలను వేధిస్తే.. మరింత ఎక్కువ మంది అతివాదులుగా మారుతారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
భయం
మరోవైపు.. ముస్లింలయిన ఒక మంత్రి, ఇద్దరు రాష్ట్ర గవర్నర్లను తొలగించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రజలను ప్రభావితం చేయగల బౌద్ధ గురువు ఒకరు బెదిరించటంతో రాజకీయ ఉద్రిక్తతలు కూడా పెరిగిపోయాయి.
వాళ్లు రాజీనామా చేశారు. ఇతర ముస్లిం మంత్రులందరూ - మరో ఎనిమిది మంది - కూడా మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు.
అతివాదులతో తలపడే విషయంలో ముస్లిం సమాజం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అదే సమయంలో.. ఆ అతివాదులు చేసిన దాడులకు తాము వివక్షకు గురయ్యే మూల్యం చెల్లిస్తోంది.
అయితే.. మదాతుగామాలో పరిస్థితి కొంత మెరుగుపడింది.
''మసీదును ధ్వంసం చేసిన తర్వాత మా పట్ల శత్రుభావం కొంత తగ్గింది. సింహళీయులు, తమిళులు మమ్మల్ని ఇరుగుపొరుగు వారిగా చూడటం, కలుపుకోవటం మొదలైంది. అది ఉద్రిక్తతలను తగ్గించింది'' అంటారు అక్బర్ ఖాన్.
- గ్రౌండ్‌రిపోర్ట్: శ్రీలంక ఘర్షణల్లో ఆదుకున్న ఇరుగుపొరుగు
- విరాట్ కోహ్లీ: స్టీవ్ స్మిత్‌ను అభినందించాలని భారత అభిమానుల్ని ఎందుకు కోరాడు?
- క్రికెట్‌కు యువరాజ్ సింగ్ గుడ్‌బై
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- అమెరికా - ఇరాన్ ఘర్షణ: హోర్ముజ్ జలసంధిలో సంక్షోభం మీ మీద, ప్రపంచం మీద చూపే ప్రభావం ఏమిటి?
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- గాడిద లాగే టాబ్లెట్ కంప్యూటర్‌తో ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









