ఖషోగ్జీని చంపింది సౌదీ ప్రభుత్వమే, కానీ సల్మాన్ ప్రమేయం ఉందనుకోను - టర్కీ

ఫొటో సోర్స్, Getty Images
జమాల్ ఖషోగ్జీ హత్య వెనుక సౌదీ ప్రభుత్వ హస్తం ఉందని టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్దోగన్ అన్నారు. ఖషోగ్జీ హత్య విషయంలో సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా ఎర్దోగన్ ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి.
''జమాల్ ఖషోగ్జీని హత్య చేయాలన్న ఆదేశాలు.. సౌదీ ప్రభుత్వంలోని పైస్థాయి నుంచి వచ్చాయని మాకు తెలుసు'' అని వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన లేఖలో ఎర్దోగన్ అన్నారు.
అయితే టర్కీ, సౌదీ దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను ప్రస్తావిస్తూనే, 'ఇందులో సౌదీ రాజు సల్మాన్ ప్రమేయం ఉందని అనుకోవడం లేదు' అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖషోగ్జీ హత్య కేసులో 18మందిని అరెస్టు చేశామని, వారిపై సౌదీలోనే విచారణ జరుగుతుందని సౌదీ ప్రభుత్వం తెలిపింది. అయితే, వారిని తమకు అప్పగించాలని టర్కీ కోరింది.
''సౌదీ ప్రభుత్వం అరెస్టు చేసిన 18మందిలోనే నేరస్థులు ఉన్నారు. ఖషోగ్జీని హత్య చేసి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారికి ఆదేశాలు అందాయి. ఆ ఆదేశాలు.. సౌదీ ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి నుంచి వచ్చినట్లు మాకు అర్థమైంది'' అని తాను రాసిన లేఖలో ఎర్దోగన్ పేర్కొన్నారు.
''ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారిని బయటపెట్టాలి. నాటో సంకీర్ణ భూభాగంలో ఇకపై ఎవ్వరూ ఇలా చేయడానికి సాహసించకూడదు. ఎవరైనా ఈ హెచ్చరికను విస్మరిస్తే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు'' అని టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ అన్నారు.
టర్కీ వదిలి పారిపోయిన సౌదీ కాన్సుల్ జనరల్‌పై ఇంతవరకూ ఏవిధమైన చర్యలూ తీసుకోలేదని ఫిర్యాదు చేశారు.
దర్యాప్తులో సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమకు సహకరించడంలేదని, చిన్నచిన్న ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పడం లేదని ఎర్దోగన్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, AFP
‘ముక్కలు చేసి, యాసిడ్‌లో వేశారు’
జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీని హత్య చేసిన తరువాత మృతదేహాన్ని యాసిడ్లో వేసి కరిగించి ఉంటారని తాను భావిస్తున్నట్లు టర్కీ ఉన్నతాధికారి, అధ్యక్షుడి సలహాదారు యాసిన్ అక్తాయ్ అన్నారు.
ఇస్తాంబుల్‌లో ఖషోగ్జీని చంపిన హంతకులు 'ఎలాంటి ఆధారాలు లేకుండా' చేసేందుకే ఇలా చేసి ఉంటారని ఆయన అన్నారు. తార్కికంగా చూస్తే అదే నిజమనిపిస్తోందని ఆయన వివరించారు.
సౌదీ పాలకుల మీద విమర్శనాత్మక వ్యాసాలు రాసే జర్నలిస్ట్ ఖషోగ్జీ అక్టోబర్ 2న సౌదీ కాన్సులేట్ కార్యాలయంలో హత్యకు గురయ్యారు.
అయితే, రసాయనాలలో ఆయన మృతదేహాన్ని కరిగించి ఉంటారనడానికి ఎలాంటి ఫోరెన్సిక్ ఆధారాలు లేవు.
హరియత్ డైలీ వార్తాపత్రికతో మాట్లాడుతూ అక్తాయ్, "యాసిడ్‌లో పూర్తిగా కరిగించేలా చేసేందుకే వారు ఖషోగ్జీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశారు" అని చెప్పారు.
"ఇప్పుడు వాళ్ళు ఆయన శరీరాన్ని ముక్కలు చేయడమే కాదు, అదృశ్యం చేశారు" అని కూడా ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, EPA
సౌదీ యువరాజు మీద వచ్చిన ఆరోపణలేమిటి?
జమాల్ ఖషోగ్జీ ఒక ప్రమాదకర ఇస్లామిక్ వాదిగా తాను భావిస్తున్నానని సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాకు చెప్పినట్లు మీడియా వార్తలు పేర్కొన్నాయి.
ఇస్తాంబుల్‌లోని తమ రాయబార కార్యాలయంలో ఖషోగ్జీ హత్యకు గురయ్యారని సౌదీ అరేబియా అంగీకరించటానికి ముందు, ప్రిన్స్ మొహమ్మద్ అమెరికా అధ్యక్ష కార్యాలయానికి ఫోన్ చేసినపుడు ఇలా వ్యాఖ్యానించారని ఆ కథనాలు చెబుతున్నాయి.
వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ పత్రికల్లో వచ్చిన ఈ కథనాలను సౌదీ అరేబియా తిరస్కరించింది.
ఖషోగ్జీ ఫియాన్సీ హతీజే జెంగిజ్.. గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికల్లో రాసిన ఒక సంపాదకీయంలో.. ఈ హత్యకు కారకులను చట్టం ముందు నిలబెట్టాలని ప్రపంచ దేశాల నేతలకు విజ్ఞప్తి చేశారు.
ఖషోగ్జీ హత్యలో తమ రాచకుంటుంబం పాత్ర ఉందన్న ఆరోపణలను సౌదీ అరేబియా తిరస్కరిస్తోంది. దీని వెనుక ‘‘అన్ని వాస్తవాలనూ వెలికితీయటానికి కృతనిశ్చయంతో ఉన్నాం’’ అని చెప్తోంది.
‘‘ఆ నేరం సౌదీయులందరినీ బాధపెట్టింది’’ అని ప్రిన్స్ మొహమ్మద్ గత నెలాఖరులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఆ ఫోన్ కాల్‌లో ఏం చెప్పారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌లతో ప్రిన్స్ మొహమ్మద్ ఫోన్‌లో మాట్లాడారని.. ఖషోగ్జీ వివిధ దేశాలతో కూడిన ఇస్లామిక్ వాద సంస్థ ముస్లిం బ్రదర్‌హుడ్ సభ్యుడిగా ఉన్నారని ఆయన చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది.
ఖషోగ్జీ ‘అదృశ్యమైన’ వారం రోజుల తర్వాత అక్టోబర్ 9వ తేదీన ఆ ఫోన్ కాల్ చేసినట్లు చెప్తున్నారు.
అమెరికా - సౌదీ స్నేహాన్ని కాపాడాలని కూడా ప్రిన్స్ మొహమ్మద్ విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఖషోగ్జీ యువకుడిగా ఉన్నపుడు ముస్లిం బ్రదర్‌హుడ్‌లో చేరారని.. కానీ ఆ తర్వాత అందులో పనిచేయటం లేదని ఆయన స్నేహితులు చెప్పారు.
2011 తిరుగుబాట్ల నేపథ్యంలో పలు దేశాల్లో అధికారం హస్తగతం చేసుకున్న ఇస్లామిక్ గ్రూపులకు ఖషోగ్జీ మద్దతు తెలిపారు.
అయితే, ముస్లిం బ్రదర్‌హుడ్ సభ్యుడన్న వాదనను ఖషోగ్జీ కుటుంబం తిరస్కరించింది. ఇటీవలి సంవత్సరాల్లో ఆయనే స్వయంగా చాలాసార్లు దీనిని తిరస్కరించారని పేర్కొంది.
‘‘జమాల్ ఖషోగ్జీ ఏ రకంగానూ ప్రమాదకరమైన వ్యక్తి కాదు. ఆయన ప్రమాదకారి అనటం విడ్డూరం’’ అని వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు పంపిన ఒక ప్రకటనలో ఖషోగ్జీ కుటుంబం చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
దర్యాప్తులో ఇప్పటివరకూ ఏం వెల్లడైంది?
ఖషోగ్జీ ఎలా చనిపోయారన్న అంశం ఇంకా ఓకొలిక్కి రాలేదు.
ఆయన తన ఫియాన్సీ, టర్కీ యువతి హతీజే జెంగిజ్‌తో తన వివాహం కోసం అవసరమైన పత్రాలను తీసుకోవటానికి సౌదీ కార్యాలయంలోకి ప్రవేశించారు.
ఆయన దౌత్య కార్యాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే, ‘ముందస్తుగా వేసుకున్న ప్రణాళికల ప్రకారం’’ గొంతు నులిమి చంపి, శరీరాన్ని ముక్కలు చేశారని టర్కీ బుధవారం నాడు తెలిపింది.
ఖషోగ్జీని హత్య చేయటానికి ముందు హింసించారని నిరూపించేందుకు టర్కీ వద్ద ఆడియో రికార్డులు ఉన్నాయని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ టర్కీ మీడియా గతంలో చెప్పింది.
ఖషోగ్జీకి ఏం జరిగిందనే విషయమై సౌదీ అరేబియా ముందు చెప్పిన మాటలను తర్వాత మార్చింది.
మొదట్లో ఖషోగ్జీ అదృశ్యమైనపుడు, ఆయన రాయబార కార్యాలయం నుంచి సజీవంగా బయటకు వెళ్లారని చెప్పింది. తర్వాత ఆయన హత్యకు గురయ్యారని, అది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని, అది ‘రోగ్ ఆపరేషన్’ (ప్రభుత్వ అనుమతి లేకుండా చేపట్టే చర్య) అని పేర్కొంది.
ఖషోగ్జీ హత్యతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా చాలా దేశాలు సౌదీ అరేబియాను తీవ్రంగా విమర్శించాయి.
టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ గత వారంలో సౌదీ రాజు సల్మాన్‌తో మాట్లాడారు. ఖషోగ్జీ హత్య కేసు దర్యాప్తులో పరస్పరం సహకరించుకోవాలని ఇద్దరూ అంగీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖషోగ్జీ ఫియాన్సీ ఏమన్నారు?
ఖషోగ్జీ ఇటీవలే ఒక ఇల్లు కొన్నారని.. కుటుంబాన్ని ప్రారంభించాలని ఆయన కోరుకున్నారని ఆయన ఫియాన్సీ జెంగిజ్.. ద గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికల్లో ప్రచురితమైన ఒక సంపాదకీయంలో పేర్కొన్నారు.
ఆయనను ‘‘కిరాతకమైన, ఆటవికమైన, నిర్దాక్షిణ్యంమైన’’ హత్య తర్వాత తను అనుభవిస్తున్న ‘‘ఆక్రోశా’’న్ని ఆమె వర్ణించారు.
‘‘నిరంకుశ పాలకులు ఇంకెన్నడూ జర్నలిస్టులను హత్య చేయజాలవన్న స్పష్టమైన సందేశాన్ని మనం పంపించితీరాలి’’ అని చెప్పారు.
ఖషోగ్జీ హత్య వెనుక నిజాలను బయటపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ చర్యలు చేపట్టాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియా: 'వాళ్లు మమ్మల్ని సెక్స్ టాయ్స్‌లా భావించారు'
- వీర్యం కావాలి... దాతల కోసం ఫేస్బుక్లో వెతుకుతున్న మహిళ
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- సర్దార్ వల్లభాయ్ పటేల్: నర్మదా నదీ తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం
- షారుఖ్ ఖాన్ తల్లిది హైదరాబాదే
- తెలంగాణ ఎన్నికలు-2018: 'నాయకులారా మా ఊరికి రావద్దు... మేం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం'
- అభిప్రాయం: ‘యాంటీ కాంగ్రెస్’ చంద్రబాబుకు ఇప్పుడు రాహుల్ గాంధీతో స్నేహం ఎందుకు?
- కొరియా మహారాణిగా మారిన అయోధ్య రాజకుమారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








