తెలంగాణ ఎన్నికలు: 'నాయకులారా మా ఊరికి రావద్దు... మేం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం'

- రచయిత, బీబీసీ ప్రతినిధి: దీప్తి బత్తిని, షూట్: శివ, ఎడిట్: నవీన్ కుమార్
- హోదా, ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్
"బిడ్డల మీద ఆధారపడి బతికే వయసు నాది. కానీ, ఇప్పుడు నేనే నా కొడుకు భార్యా పిల్లలను చూసుకోవాల్సి వస్తోంది. నా కొడుకుకు కరెంటు షాక్ తగిలింది. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోవడం వల్ల చనిపోయాడు" అంటూ తన రెండేళ్ల మనవడికి తినిపిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది లంకా బాయి.
అదే సమయంలో ఆమె కోడలు తమ రెండు గదుల పూరిగుడిసెలో ఒక మూలన పడుకుని ఉన్నారు.
ఈ సెప్టెంబరులో కరెంట్ షాక్‌తో లంకా బాయి కొడుకు సంతోష్ చనిపోయారు. "నా కొడుకు ఆవులను మేతకు తోల్కపోయాడు. ఆ రోజు వాన పడుతోంది. నేలంతా తడిసింది. అతడు ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరకు వెళ్లగానే షాక్ కొట్టింది. వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. మా ఊరోళ్లు దావఖానకు తీసుకెళ్లేందుకు ఆటోలో ఎక్కించారు. వాన బాగా పడుతుండడంతో వాగులో నీళ్లు ఎక్కువయ్యాయి. నా బిడ్డను బతికించుకునేందుకు శానా కష్టపడ్డాం. కానీ, ఆ వాగును దాటలేకపోయాం. దాంతో దారిలోనే నా కొడుకు చనిపోయాడు" అని చెప్పింది ఆ తల్లి.


ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గుడిబి గ్రామస్తులకు ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. తాము ఇలాంటి వాటికి అలవాటు పడిపోయామని చెప్పారు గ్రామానికి చెందిన ఒక పెద్దమనిషి.
మండల కేంద్రమైన కరణ్ జీత్‌లో ఉన్న ఆసుపత్రికి వెళ్లాలంటే ఈ గ్రామస్తులు రెండు వాగులు దాటాలి. ఒక వాగులో ఏడాది పొడవునా నీళ్లుంటాయి. "ఆ వాగు దాకా వెళ్లడానికే చాలా కష్టం. మట్టి, రాళ్లతో నిండిన దారిలో ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లాలి. వాగు దాటిన తర్వాత మరో 12 కిలోమీటర్లు మట్టిదారినే వెళ్లాలి" అని స్థానికుడు గంగన్న వివరించారు.
అంతలో మాటల్లోకి వచ్చిన ఒక అమ్మాయి మరో విషయం చెప్పారు. ఆమెకు పెళ్లై రెండేళ్లయింది. కానీ భర్తతో కలిసి ఒక్కసారి కూడా సినిమాకు వెళ్లలేదు. కారణం, వాగు దాటి తడి బట్టలతో థియేటర్‌కి వెళ్లలేక. తాము కనీసం సినిమా టాకీసును కూడా చూడలేదని ఈ ఊరి వాసులు చెప్పారు.
రోడ్డు కోసం ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలను వేడుకుంటున్నా ఒక్క అధికారి వచ్చి సర్వే చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గుడిబి ఒక్కటే కాదు, టేకడి రాంపూర్, కొజ్జంగూడ గ్రామాలది కూడా ఇదే పరిస్థితి. మండల కేంద్రం కరణ్ జీత్‌కి వెళ్లాలంటే వీళ్లంతా వాగులు దాటాల్సిందే.
గుడిబి చివరన ఉండడంతో వారు ఎక్కువ దూరం ప్రయాణించాలి. "మా ఊరు మహారాష్ట్ర సరిహద్దులో చివరన ఉంది. అవతలి వైపు పెన్ గంగ నది, ఇవతలివైపు రాళ్లు, మట్టి, వాగులతో నిండిన రోడ్డు. వానా కాలంలో మా పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. ఎవరితోనూ సంబంధం ఉండదు. ఎంత కష్టమొచ్చినా మా చావు మేమే చావాలి" అని చెప్పారు గయా బాయి.
ఈ మూడు ఊళ్లలో మొత్తం జనాభా 392 కాగా, వారిలో 272 మంది ఎస్టీలు.
ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదన్న విషయాన్ని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. 'రవాణా సౌకర్యం లేని ఆవాసాల' జాబితాలో ఈ గ్రామాలున్నాయని చెప్పారు. ఇలాంటి గ్రామాల్లో క్రమంగా ఒక దాని తర్వాత ఒక ఊరికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య చెప్పారు.

ఇక్కడ 85 ఆవాస ప్రాంతాల్లో ఇంకా రోడ్లు లేవని జిల్లా అధికారులు తెలిపారు. బీబీసీ న్యూస్ తెలుగు ఇందులో కొన్ని ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నం చేసింది. నార్నూర్ మండలంలోని గిరిజన గ్రామం ఉమ్రికి వెళ్లింది.
ఇక్కడ రాథోడ్ రామ్ అనే పత్తి రైతు ఉన్నారు. ఆయనకు నలుగురు పిల్లలు. అక్టోబర్ మొదటి వారంలో ఆయన భార్య పురుగుల మందు తాగారు. పత్తి పంట దెబ్బతినడం, అప్పుల భారం పెరగడంతో తట్టుకోలేక ఆమె ఆలా చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
తన భార్యను బతికించుకునేందుకు రాథోడ్ రామ్ అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ, రోడ్డు సౌకర్యం లేని కారణంగా, భార్యను భుజాన మోస్తూ వాగు దాటి వెళ్లేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయారు.

అక్కడే ఉన్న ఒక పెద్దాయన మాట్లాడుతూ, "ఎన్నో ఏళ్ల క్రితం మా ఊరికి బ్రిడ్జి పనులు ప్రారంభించారు. కానీ, రెండేళ్ల నుంచి పనులు ఆగి పోయాయి. మేము మండలం ఆఫీసుకి, బ్యాంకుకి, దావఖానకు... దేనికి పోవాలన్నా గతుకుల మట్టి రోడ్డు మీద, వాగులు దాటి, మళ్లీ గతుకుల మట్టి బాటలో వెళ్లాల్సిందే. మా ప్రాణాలు వాగులోనే పోతున్నాయి. మాకు జ్వరాలు లాంటివి రాకూడదని కోరుకుంటున్నాం" అని అన్నారు.

ఈ బ్రిడ్జి అసలు కథ ఏంటన్నది తెలుసుకునేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులను అడిగే ప్రయత్నం చేసింది బీబీసీ న్యూస్ తెలుగు.
ఏఈ, కె. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, "ఆ వంతెన నిర్మాణాన్ని ఐదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన మాట వాస్తవమే. కానీ మధ్యలో కాంట్రాక్టర్‌తో ఇబ్బందులు రావటంతో పనులు నిలిపివేయాల్సి వచ్చింది. మరోసారి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాం. 2019 మార్చి 31 నాటికి పూర్తవుతుంది" అని చెప్పారు.
గ్రామస్థులు మాత్రం ఈ వంతెన మీద ప్రయాణం చేసే వరకూ నమ్మకం లేదంటున్నారు.
మరికొంత దూరంలో ఇచ్చోడ మండలంలోని జల్దా గ్రామస్థులు కూడా రోడ్డు, తాగు నీటి కోసం ఇంకా ఎదురు చూస్తున్నామని చెప్పారు.
"మొత్తం దేశమంతా ఎక్కడికో వెళ్ళిపోతోంది. ప్రపంచమంతా ఆధునికత వైపు పరుగులు పెడుతుంటే, మేం మాత్రం ఇంకా రోడ్డు కోసం, నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాం" అని 31 ఏళ్ల నవనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు వచ్చాయి. ఇక్కడి యువకులంతా ఆ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.
"మాలో చాలామందికి మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వచ్చింది. ఓటుకు ఉండే విలువేంటో మాకు తెలుసు. ఒక్క ఓటుతో రాబోయే ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు. కానీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా మా సమస్యలు తీరడం లేదు. ఎన్నోఏళ్లుగా మా తాతలు, తండ్రులు ఓటు వేస్తూనే ఉన్నారు. అయినా, మా ఊరి కష్టాలు తీరలేదు. అందుకే ఈ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాం" అని 26 ఏళ్ల కిశోర్ అన్నారు.
అయితే, ఇదే ఊరిలో పెద్దలు ఈ ఆలోచనకు ఒప్పుకున్నప్పటికీ యువకులతో పూర్తిగా ఏకీభవించట్లేదు. "రేపు ఏదైనా రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేము ఓట్లు వేయలేదని మమ్మల్ని మొత్తానికే పట్టించుకోవడం మానేస్తే?" అన్న ఆందోళన వ్యక్తం చేశారు తులసి రామ్.

జల్దా ఊరు ఒక్కటే కాదు, బోథ్ నియోజకవర్గంలోని గుబిడి, ఉమ్రి వంటి ఇంకా కొన్ని గ్రామాల్లోనూ ఈ ఎన్నికలను బహిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
గుబిడి గ్రామస్థులు ఊరు బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. "మా ఊరిని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. కాబట్టి, రాజకీయ నాయకులెవరూ మా గ్రామంలో అడుగుపెట్టేందుకు వీల్లేదు" అని ఆ ఫ్లెక్సీల మీద రాశారు.
ఇవి కూడా చదవండి:
- బౌడికా: రోమన్లను తరిమికొట్టిన తొలి మహారాణి, ఆమె నేర్పే ఆరు జీవిత పాఠాలు
- తెలంగాణ: ‘24 గంటల కరెంట్ మాకొద్దు’
- సర్దార్ వల్లభాయ్ పటేల్: నర్మదా నదీ తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- శ్రీలంక విషయంలో భారత్-చైనా ఒక్కటవ్వాలా?
- ఒక్క కోడిని కూడా చంపకుండా చికెన్ తినడం ఎలా?
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









