తెలంగాణ: బొంగులో కల్లు.. ఆరోగ్యానికి మంచిదా? కాదా?

ఫొటో సోర్స్, Shyam Mohan/BBC
- రచయిత, శ్యాంమోహన్
- హోదా, బీబీసీ కోసం
తూర్పు కనుమల్లోని అరకు లోయ గిరిజనులు వెదురు బొంగు చికెన్ తయారీలో నిపుణులు. అయితే.. తూర్పు తెలంగాణ కోయ గిరిజనులు వైవిధ్యంగా బొంగుల్లో కల్లు తీస్తూ, అందర్నీ ఆకట్టుకుంటున్నారు.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహదేవపురం, కమలాపురం గ్రామాలు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్నాయి.
కల్లు సేకరించడానికి మట్టి ముంతలను తాటిచెట్లకు వేలాడతీయడం మామూలు పద్ధతి. దీనికి భిన్నంగా ఇక్కడ వెదురు బొంగులను వాడుతున్నారు.

ఫొటో సోర్స్, Shyam Mohan/BBC
చెట్లకు ముంతల స్థానంలో బొంగులు కట్టి కల్లు పడుతున్నారు. ఒక్కో బొంగులో రెండు నుండి మూడు లీటర్ల కల్లు వస్తుంది.
ఈ వేసవిలో తాటి కల్లు కొత్త రుచిలో దొరకడంతో కల్లు బాబులు ఈ గ్రామాల వైపు పరుగులు తీస్తున్నారు. వెదురు బొంగుల్లోని కల్లు త్వరగా పులిసిపోవడం లేదని సహజమైన రుచి ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు.
ఈ కల్లు తాగడం వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఉందని తెలిసింది.

ఫొటో సోర్స్, Shyam Mohan/BBC
ఏంటా రహస్యం?
‘‘చెన్నైలో లెక్చరర్‌గా పని చేసే వాడిని. నాకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని డాక్డర్లు చెప్పారు. చికిత్స చేయించుకున్నాను కానీ పెద్దగా ఫలితం లేదు. కానీ ఏడాదిగా ఈ కల్లు తాగుతున్నాను. ఇపుడు రాళ్లన్నీ కరిగిపోయాయి. కేవలం కల్లు కోసమే చెన్నైలో ఉద్యోగం మానేసి మా సొంతూరు పరకాల (వరంగల్ రూరల్ జిల్లా)లో వ్యవసాయం చేసుకుంటూ సెటిల్ అయ్యాను'' అని పరకాల నుండి కల్లు కోసం వచ్చిన నరోత్తమ్‌రెడ్డి చెప్పారు.
‘వెదురు బొంగులో పట్టిన కల్లులో కిడ్నీ వ్యాధులను తగ్గించే లక్షణాలు ఉన్నాయా?’ అని పలువురు సైంటిస్టులను సంప్రదించగా మైక్రోబయాలజీ ప్రొఫెసర్ భూక్యా భీమా స్పందించారు.

ఫొటో సోర్స్, Shyam Mohan/BBC
పరిశోధన జరుగుతోంది..
అప్పుడే తాజాగా తాటి చెట్టు నుండి తీసిన కల్లు తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మనిషి కడుపులో ఉన్న క్యాన్సర్ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుందని, దీంతో పాటు కిడ్నీ వ్యాధికారక సూక్ష్మజీవులను కూడా ఈ జీవి నాశనం చేస్తుందని గుర్తించినట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం సూక్ష్మజీవశాస్త్రం విభాగం ప్రొఫెసర్ భూక్యా భీమా తెలిపారు.
ఈయన గతంలో తన టీమ్‌తో ఏడాది పాటు ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల్లో 50 రకాల తాటి కల్లు నమూనాలు సేకరించి పరిశోధన చేశారు. ఫలితంగా 18 రకాల సూక్ష్మజీవులు మనిషిలోని రోగకారక సూక్ష్మజీవులను చంపుతున్నట్టు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ద్రువీకరించిందని భూక్యా భీమా చెప్పారు.
జీర్ణ వ్యవస్థలోని, సహజ సిద్ధ సూక్ష్మజీవులతో సహజీవనం చేయడం, వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించడం, ప్రతికూల పరిస్ధితులను తట్టుకోవడం వంటి లక్షణాలు తాటి కల్లులో గుర్తించిన సూక్ష్మజీవుల్లో ఉన్నాయని అంటున్నారు.

ఫొటో సోర్స్, Shyam Mohan/BBC
‘తాజా కల్లుతో మాత్రమే ఈ మేలు!’
‘‘వెదురు బొంగులో అయినా, మట్టికుండలో అయినా కల్లు సహజ గుణాలు చెడిపోవు. ఐతే కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి తాటి కల్లుకు ఉందా? అనే అంశంపై గత కొన్ని నెలలుగా చేసిన మా పరిశోధన పూర్తయింది. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. సైన్స్ జర్నల్‌లో మా రీసెర్చ్ పత్రాలు ప్రచురించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ అని భూక్యా భీమా ధీమాగా చెప్పారు.
‘‘చెట్టునుండి తాజాగా తీసిన కల్లు తాగితేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కల్లు తీశాక కొన్ని గంటలు నిలువ ఉంటే పులిసి ఆల్క్‌హాల్‌గా మారుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు‘‘ అని హెచ్చరిస్తున్నారు ఈ ప్రొఫెసర్.
ఇవి కూడా చదవండి:
- నల్లమల: సంపర్కం, ఆవాసం కోసం పులుల మధ్య పోరాటం
- 'రేప్ పోర్న్': ఆ అమ్మాయి బట్టలు చింపుతున్న వీడియోను మీరెందుకు చూశారు?
- #MeToo: 'నిర్మాతలతో, దర్శకులతో పడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్నారు'
- దాల్మియాలకు గండికోట.. ఎర్రకోట
- పెరుగు తింటే వందేళ్లు జీవిస్తారా?
- కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా?
- ఇవి తింటే.. మీ జుట్టు భద్రం!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








