నాలుగేళ్లలో 23 లక్షల మంది వెనెజ్వేలాను ఎందుకొదిలేశారు? దేశ సంక్షోభానికి కారణాలేంటి?

వెనజ్వేలా శరణార్థులు

ఫొటో సోర్స్, Getty Images

వెనెజ్వేలా ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అధిక ద్రవ్యోల్బణం, విద్యుత్ కోతలు, ఆహార-ఔషదాల కొరత లాంటి సమస్యలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా లక్షలాది పౌరులు దేశాన్ని విడిచి వెళ్తున్నారు.

దేశాధ్యక్షుడు నికోలస్ మడూరో, ఆయన ప్రభుత్వమే దేశంలో ఈ సంక్షోభానికి కారణమని చాలామంది ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం పరిస్థితి ఏంటి?

ఇటీవలి కాలంలో వెనెజ్వేలా ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న సమస్య అత్యధిక ద్రవ్యోల్బణమే. దేశంలో సగటున ప్రతి 26 రోజులకు ధరలు రెట్టింపు అవుతున్నాయని ప్రతిపక్షం అధీనంలో ఉన్న జాతీయ అసెంబ్లీ పరిశీలనలో తేలింది. ఈ ఏడాది జూలై నాటికి ద్రవ్యోల్బణ రేటు 83,000 శాతాన్ని చేరింది.

పెరుగుతున్న ధరల కారణంగా అక్కడివారు కనీస నిత్యావసరాల్ని కొనుక్కోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక చిన్న కప్పు కాఫీ ధర కూడా 25లక్షల బొలివర్లు పలుకుతుందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కరెన్సీ నోట్ల రూపంలో డబ్బు చెల్లించడం కూడా కష్టంగా మారింది. ఆగస్టు 20న వెనెజ్వేలాలో కొత్త కరెన్సీ ప్రవేశపెట్టారు. అంతకుముందు వరకూ కాఫీకి డబ్బులు చెల్లించాలాంటే వాళ్ల కరెన్సీలో అతిపెద్దదైన లక్ష బొలివర్ల నోట్లు పాతిక అవసరమయ్యేవి.

షాపింగ్‌కు వెళ్లాలంటే గోనె సంచీల్లో డబ్బును తీసుకెళ్లాల్సిన పరిస్థితి. దాంతో ప్రజలు చిన్న చిన్న చెల్లింపులకు సైతం ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్లపై ఆధారపడటం మొదలుపెట్టారు. హోటళ్లలో వెయిటర్లు కూడా కస్టమర్లకు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఇచ్చి, టిప్‌ను నేరుగా అకౌంట్‌లోకే జమచేయమని అడగడం కనిపిస్తుంది.

టాయిలెట్ పేపర్ రోల్ కంటే దాన్ని కొనడానికి అవసరమైన డబ్బు కట్టల ఎత్తే ఎక్కువ
ఫొటో క్యాప్షన్, టాయిలెట్ పేపర్ రోల్ కంటే దాన్ని కొనడానికి అవసరమైన డబ్బు కట్టల ఎత్తే ఎక్కువ

అంత ద్రవ్యోల్బణం ఎందుకు?

చాలా ప్రాథమిక స్థాయిలో చెప్పాలంటే... అక్కడ వస్తువులు అందుబాటులో ఉన్న దానికంటే వాటిని కొనాలనుకునే వారి సంఖ్య ఎక్కువ. అంటే సప్లయి కంటే డిమాండ్ చాలా ఎక్కువ.

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు వెనెజ్వేలాలో ఉన్నాయి. ఈ చమురే పరోక్షంగా వారి ఆర్థిక సమస్యలకు కారణమైంది. చమురు ఎక్కువగా ఉండటంతో ఇతర వస్తువుల తయారీని వెనెజ్వేలా పక్కనబెట్టింది. చమురును అమ్మి, దాని ద్వారా వచ్చిన డాలర్లతో వస్తువుల్ని దిగుమతి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.

వెనెజ్వేలా ఎగుమతుల్లో 95శాతం వాటా చమురుదే. కానీ 2014లో అంతర్జాతీయంగా చమురు ధర క్షీణించడంతో వెనెజ్వేలాలో విదేశీ మారకం కొరత ప్రారంభమైంది. దాంతో ఆ దేశానికి వస్తువులను దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది.

ఫలితం: వ్యాపార సంస్థలు వస్తువుల ధరలు పెంచేశాయి. దాంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.

వలస

ఫొటో సోర్స్, BORIS MIRANDA / BBC MUNDO

దీనికి తోడు వెనెజ్వేలా ప్రభుత్వం అవసరమైనప్పుడల్లా అధిక కరెన్సీని ముద్రించేది. పేదల్లో పేరు సంపాదించడానికి కనీస వేతనాలను తరచూ పెంచేది. దాంతో డబ్బు విలువ తగ్గుతూ వచ్చింది.

వెనెజ్వేలా ప్రభుత్వానికి అప్పు దొరకడం కూడా కష్టంగా మారింది. బ్యాంకులు వెనెజ్వేలాకు అప్పు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం మళ్లీ కరెన్సీని ముద్రించడం ప్రారంభించింది. దాంతో ఆ డబ్బు విలువ మరింత క్షీణించి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.

ప్రభుత్వం ఏం చేస్తోంది?

గతంలో ఉన్న ‘స్ట్రాంగ్ బొలివర్’ స్థానంలో ప్రభుత్వం కొత్తగా ‘సావరీన్ బొలివర్’ను ప్రవేశపెట్టింది. కరెన్సీలో నుంచి ఐదు సున్నాలను తీసేసి 2, 5, 10, 20, 50, 100, 200, 500ల కొత్త సోవరీన్ బొలివర్లను, రెండు కొత్త నాణేలను అందుబాటులోకి తెచ్చింది.

వెనెజ్వేలా ఆర్థిక స్థితిని గాడిలో పడేయడానికి ఇది ‘మేజిక్ ఫార్ములా’ అని ప్రభుత్వం చెబుతోంది.

కనీస వేతనాన్ని గతంలో కంటే 34రెట్లు పెంచారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.

వెనెజ్వేలాలో ‘పితృభూమి గుర్తింపు కార్డు’ లేని వాళ్లకు ఇంధన రాయితీలను నియంత్రిస్తూ ప్రభుత్వం ఆంక్షలను విధించింది.

వ్యాట్‌ను 4శాతం నుంచి 16శాతానికి పెంచింది.

వెనెజ్వేలాలో కొత్తగా ప్రవేశపెట్టిన కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వెనెజ్వేలాలో కొత్తగా ప్రవేశపెట్టిన కరెన్సీ

ప్రజలు ఎలా స్పందిస్తున్నారు?

ప్రజలు తమ స్పందనను కాళ్లతోనే తెలియజేస్తున్నారు. ఐక్య రాజ్య సమితి లెక్కల ప్రకారం 2014లో ఆర్థిక సంక్షోభం మొదలైననాటి నుంచి దాదాపు 23లక్షలమంది ప్రజలు వెనెజ్వేలాను వదిలి వెళ్లారు. వాళ్లలో ఎక్కువ మంది పొరుగు దేశం కొలంబియాకు చేరుకున్నారు. అక్కడి నుంచి కొందరు ఈక్వెడార్, పెరు, చిలీ, బ్రెజిల్ లాంటి దేశాలకు వలసపోయారు.

వెనెజ్వేలా నుంచి 2లక్షల మందికి పైగా పౌరులు స్పెయిన్‌కు వలస వెళ్లారు. వాళ్లంతా 1950-60ల్లో వెనెజ్వేలా అవకాశాల గనిగా ఉన్న సమయంలో స్పెయిన్ నుంచి వెనజ్వేలాకు వలస వచ్చిన వారి పిల్లలు, మనవళ్లే.

వెనెజ్వేలాలో కొత్త కరెన్సీ ప్రవేశపెట్టాక డబ్బు చెల్లింపులు కాస్త సులువయ్యాయి. కానీ కొత్త నోట్ల కోసం బ్యాంకుల బయట క్యూలు పెరిగిపోయాయి.

ద్రవ్యోల్బణానికి మూలాలు కనుగొని సమస్యను పరిష్కరించకపోతే ఈ కొత్త నోట్లకు కూడా పాత నోట్ల పరిస్థితి రావొచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ధరలు పెరిగే కొద్దీ ఆ కరెన్సీ విలువ మళ్లీ తగ్గుతుందని వాళ్లు అంటున్నారు.

మ్యాప్

మరో పక్క వ్యాపార సంస్థలు కూడా పెరిగిన కనీస వేతనాన్ని ఎలా చెల్లించాలో తెలియట్లేదని చెబుతున్నాయి. సూపర్ మార్కెట్లు సరుకులు లేక వెలవెలబోతున్నాయి. కొన్ని నగరాల్లో నీటి కొరత, విద్యుత్ కోతలు మామూలైపోయాయి. ఆస్పత్రులనూ ఈ సమస్యలు వేధిస్తున్నాయి.

దేశాన్ని విడిచి వెళ్లేవాళ్లలో చాలామంది వైద్య సేవల్లో లోపాన్ని కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. గర్భవతులు కాన్పు కోసం సరిహద్దు దాటి కొలంబియా వెళ్తున్నారు. పిల్లలకు వ్యాక్సీన్లు కూడా అక్కడే వేయిస్తున్నారు.

కొలంబియా వెళ్లలేని వాళ్లు రోజుల తరబడి వైద్య సేవల కోసం ఎదురుచూస్తున్నారు. ఆహార కొరత విపరీతంగా పెరగడంతో పిల్లల్లో పోషకాహారలేమి కూడా రికార్డు స్థాయికి చేరింది.

వీడియో క్యాప్షన్, వీడియో: కప్పు కాఫీ తాగాలంటే నాలుగు కట్టల డబ్బు కావాలి

ప్రజలు ఏమంటున్నారు?

దేశ మాజీ అధ్యక్షుడు హ్యుగో చవేజ్, ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మడూరోలే దేశంలో ఈ పరిస్థితికి కారణమని ప్రజలు ఆరోపిస్తారు. చవేజ్ సోషలిస్ట్ పథకాలు పేదలకు మేలు చేసేవే అయినా, 1999లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో అసమానతలు తీవ్రంగా ఉండేవని వాళ్లు చెబుతారు.

ధరల నియంత్రణనే తీసుకుంటే... పేదలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేందుకు చవేజ్ వాటి ధరలను తగ్గించారు. దాంతో వ్యాపార వర్గాలు ఆ ఉత్పత్తులను తయారు చేయడం లాభదాయకం కాదనే నిర్ణయానికి వచ్చేశాయి.

2003లో విదేశీ కరెన్సీపైన చవేజ్ విధించిన నియంత్రణ కూడా పరిస్థితి దిగజారడానికి కారణమైందని చెబుతారు.

ఇప్పటికీ చాలా మంది అధ్యక్షుడు మడూరోను సమర్థిస్తారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇప్పటికీ చాలా మంది అధ్యక్షుడు మడూరోను సమర్థిస్తారు

కానీ ఇప్పటికీ ప్రభుత్వాన్ని సమర్థించే ప్రజలు చాలా మంది ఉన్నారు. దేశంలో పరిస్థితులకు మడూరో, చవేజ్‌లు కారణం కాదని, ప్రతిపక్షాలే కుట్రపన్నుతున్నాయని, దానికి అమెరికా కొలంబియా లాంటి దేశాలు తోడయ్యాయని వారు చెబుతారు.

అమెరికా ఆంక్షల వల్లే ప్రభుత్వానికి అప్పు దొరకలేదని, ఫలితంగా దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొందని వారు అంటారు. ప్రభుత్వ పథకాల ద్వారా లాభపడుతున్న పేదలు మాత్రం ఇప్పటికీ తమ పరిస్థితి 1999లో చవేజ్ అధికారంలోకి రావడానికి ముందుకంటే చాలా బావుందని చెబుతారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)