శ్రీలంకలో దొరికిన ఈ అస్థిపంజరాలు ఎవరివి?

లంక అస్థిపంజరాలు
ఫొటో క్యాప్షన్, అస్థిపంజరాలు లభించిన చోట ఫోరెన్సిక్ నిపుణులు
    • రచయిత, అన్బరసన్ యతిరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తర శ్రీలంకలో ఒకప్పుడు అంతర్యుద్ధం జరిగిన చోట జరిగిన తవ్వకాల్లో సామూహిక ఖననం జరిగిన ఒక ప్రాంతం బయటపడింది. అందులో పెద్ద సంఖ్యలో మానవ అస్థిపంజరాలు దొరికాయి. అవి ఎవరివి, వారిని ఎవరు చంపారనేది గుర్తించడం నిపుణులకు సవాలుగా మారింది.

మన్నార్ పట్టణంలోని ఒక ప్రాంతం నుంచి ఇప్పటివరకూ 90కి పైగా అస్థిపంజరాల అవశేషాలను వెలికితీశారు.

2009లో ఘర్షణలు ముగిసిన తర్వాత, సామూహిక ఖననం జరిగిన ఒక ప్రాంతంలో భారీగా మృతుల అవశేషాలు దొరకడం ఇది రెండోసారి.

శ్రీలంక సైన్యం, తమిళ విప్లవకారుల మధ్య 26 ఏళ్లపాటు జరిగిన అంతర్యుద్ధంలో సుమారు లక్ష మంది మరణించారు. చాలా మంది గల్లంతయ్యారు.

అస్థిపంజరాలు దొరికిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది ప్రారంభంలో మన్నార్ బస్ స్టేషన్ దగ్గర ఒక పాత కోఆపరేటివ్ డిపో దగ్గర కొత్త భవనానికి పునాదులు తీస్తుండగా ఈ అవశేషాలు కనిపించాయి.

"ఈ మొత్తం ఏరియాను రెండుగా విభజించవచ్చు. ఒక భాగంలో మామూలు స్మశానం ఉంది. రెండో భాగంలో పెద్ద సంఖ్యలో మానవ అస్థిపంజరాలు దొరికాయి. వాటిని ఒక క్రమం లేకుండా పూడ్చిపెట్టినట్టు తెలుస్తోంది" అని కెలనియా యూనివర్సిటీ ఫోరెన్సిక్ ఆర్కియాలజిస్ట్, ప్రొఫెసర్ రాజ్ సోమదేవ తెలిపారు. అస్థిపంజరాలు దొరికిన ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న నిపుణులకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు.

"అక్కడ ఇంకా తవ్వాల్సి ఉంది. మరిన్ని అస్థిపంజరాలు దొరికే అవకాశం ఉంది" అని సోమదేవ చెప్పారు. ఆయన బృందం వెలికితీసిన అస్థిపంజరాల్లో పిల్లలవి కూడా ఆరు ఉన్నట్టు తెలుస్తోంది.

లంక అస్థిపంజరాలు
ఫొటో క్యాప్షన్, బాధితులను గుర్తించలేకపోతున్నారు

ఎన్నో చిక్కు ప్రశ్నలు

ఈ అస్థిపంజరాలు ఎవరివి? వారిని ఎవరు, ఎప్పుడు చంపారు? అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. మన్నార్ పట్టణంలో శ్రీలంకలో మైనారిటీలైన తమిళుల జనాభా ఎక్కువగా ఉంది.

అస్థిపంజరాలు దొరికిన ప్రాంతంలో ఆధారాలు తారుమారు కాకుండా పోలీసులను కాపలా ఉంచారు. ఫోరెన్సిక్ ఆర్కియాలజిస్టులు మట్టిలోంచి ఎముకలు, పుర్రెలను వెలికితీస్తున్నారు. తవ్వకాల్లో అవి పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అస్థిపంజరాలు దొరికిన ప్రాంతంలో వాటిని గుర్తించడానికి సాయం చేసే బట్టలు, ఇతర వస్తువులేవీ దొరకలేదు. అంతర్యుద్ధం సమయంలో మన్నార్ పట్టణం ఎక్కువగా సైన్యం అదుపులోనే ఉంది. దాని చుట్టుపక్కల, జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తమిళ టైగర్ల ఆధిపత్యం ఉండేది. భీకర యుద్ధం తర్వాత సైన్యం మొత్తం జిల్లాను తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇది దాదాపు పదేళ్ల కిందటి సంగతి.

సామూహిక ఖననం జరిగిన ప్రాంతంలో శవాలు ఉన్న తీరు.. నిపుణులకు చిక్కుముడిలా మారింది.

"వాటిని ఖననం చేసిన తీరు మాకు చాలా ఆందోళన కలిగించింది. అది చాలా భయానకంగా ఉంది. లోపల కంకాళాలు రెండు పొరలుగా దొరికాయి" అని ప్రొఫెసర్ సోమదేవ చెప్పారు.

సోమదేవ బృందం వెలికి తీసిన మానవ అవశేషాలను మన్నార్ కోర్టు కస్టడీకి తరలించారు. తవ్వకాలు పూర్తయిన తర్వాత వాటిని ఏం చేయాలనేదానిపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

బాధితులు ఎలా చనిపోయారు, మృతుల వయసు ఎంతుంటుంది అనే విషయం సోమదేవ, ఆయన బృందం ఇంకా నిర్ధారించలేదు.

ఈ మరణాలకు బాధ్యులుగా ఇప్పటివరకూ ఎవరిపైనా ఆరోపణలు రాలేదు.

లంక అస్థిపంజరాలు
ఫొటో క్యాప్షన్, సమాధానాల కోసం ప్రొఫెసర్ సోమదేవ అన్వేషణ

మా సైన్యానికి సంబంధం లేదు: శ్రీలంక

శ్రీలంకలో ఘర్షణలు ముగిసిన తర్వాత నుంచి యుద్ధం జరిగిన చోట సామూహిక ఖననం జరిగిన ప్రాంతాలు బయటపడుతూనే ఉన్నాయి.

2014లో మన్నార్‌లోని మరో ప్రాంతం, ప్రముఖ హిందూ ఆలయం అయిన 'తిరుకేతీశ్వరం' దగ్గర 96 మందికి సంబంధించిన అవశేషాలు దొరికాయి. ఆ తర్వాత ఒకే ప్రాంతంలో అంతకంటే ఎక్కువ మందికి సంబంధించిన అవశేషాలు ఎప్పుడూ లభించలేదు.

కానీ గత నాలుగేళ్లుగా ఈ కేసులోనూ అస్థిపంజరాలు ఎవరివనే దానిపై ఎలాంటి స్పష్టతా రాలేదు. అవి ఎవరివో, వారిని ఎవరు చంపారో తెలియలేదు.

సైన్యం, తమిళ టైగర్ల మధ్య ఘర్షణల వల్ల చాలా మంది పౌరులు మృతి చెందారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతర్యుద్ధం సమయంలో సుమారు 20 వేల మంది గల్లంతయ్యారని చెబుతున్నాయి.

కానీ పౌరుల మృతి, గల్లంతుకు తమ సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది.

గల్లంతైనవారి కోసం ఓఎంపీ ఏర్పాటు

అంతర్జాతీయ ఒత్తిళ్లు పెరగడంతో ప్రభుత్వం దీనిపై 'ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్ (ఓఎంపీ)' అనే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ప్రారంభం వరకూ ఇది దర్యాప్తు చేసింది. మన్నార్‌లో తవ్వకాలకు ఓఎంపీ కొన్ని నిధులు కూడా అందించింది.

మన్నార్‌లో తాజాగా గుర్తించిన సామూహిక ఖనన ప్రాంతం గురించి పూర్తి విచారణ జరిపిస్తామని ఓఎంపీ చెబుతోంది.

గల్లంతైనవారిని గుర్తించి, వారు ఎలాంటి పరిస్థితుల్లో కనిపించకుండా పోయారో బంధువులకు సమాచారం అందించడమే ఓఎంపీ ప్రధాన లక్ష్యం.

దీన్ని గుర్తించగానే సహజంగా, ఇవి కనిపించకుండా పోయిన వారివేమో, వారినే ఇక్కడ సామూహికంగా ఖననం చేశారేమో అనే ఆలోచన వస్తుంది.

కానీ అంతకు ముందు దొరికిన అవశేషాల దర్యాప్తులో అధికారులు విఫలం కావడంతో, తాజాగా లభించిన అస్థిపంజరాల కేసులోనూ ఎలాంటి పురోగతీ ఉండదని కొందరు తమిళులు నిరాశ వ్యక్తంచేస్తున్నారు.

లంక అస్థిపంజరాలు

ఫొటో సోర్స్, Getty Images

అంతర్యుద్ధంలో అమానుషం

"ఘర్షణలు జరిగినపుడు మన్నార్ జిల్లా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న కొన్ని వందల మంది కనిపించకుండా పోయారు" అని మన్నార్ కాథలిక్ చర్చికి చెందిన విక్టర్ సొసై తెలిపారు.

"ఘర్షణల నుంచి తప్పించుకుని పడవల్లో భారతదేశం పారిపోయేందుకు ప్రయత్నించిన చాలా మంది తమిళులను కూడా అడ్డుకున్నారు, వారు ఏమయ్యారో ఇప్పటికీ తెలీదు".

సామూహిక ఖననం జరిగిన ప్రాంతంలో మొదట తవ్వకాలు జరుగుతున్నప్పుడు మన్నార్ బిషప్‌తో కలిసి సొసై ఆ ప్రాంతంలో పరిశీలించారు.

"అక్కడ పెద్దలు, చిన్నపిల్లల అస్థిపంజరాలు దొరికాయని మాకు తెలుసు. మేం ఇప్పుడు ముఖ్యంగా వీళ్లు ఎవరు, ఎలా చనిపోయారు, దానికి బాధ్యులెవరు అనేది కూడా గుర్తించాలి" అని సొసై తెలిపారు.

లంక అస్థిపంజరాలు

ఫొటో సోర్స్, HUMAN RIGHTS WATCH

ఫొటో క్యాప్షన్, అంతర్యుద్ధంలో ఎన్నో అమానుషాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి

ఎవరు ఎవరిని ఖననం చేశారు?

తమిళ టైగర్లు తమ వ్యతిరేక తమిళ విప్లవకారులను, వారి మద్దతుదారులను క్రూరంగా హత్య చేశారని ఆరోపణలు వస్తున్నాయి. యుద్ధంలో దొరికిన శ్రీలంక సైనికులకు కూడా టైగర్లు మరణశిక్ష విధించారని కొందరు చెబుతున్నారు.

యుద్ధం చివరి రోజుల్లో ఘర్షణలు ముగిసిన వెంటనే ముల్లైతీవు జిల్లా తీరంలో పారిపోతున్న పౌరులపై విప్లవకారులు కాల్పులు జరిపారని కొందరు తమిళులు చెప్పారు. శ్రీలంక సైన్యం కూడా అమానుషాలకు పాల్పడిందని ఆరోపించారు.

"ఈ ఖననాలకు, ఆర్మీకి కచ్చితంగా ఎలాంటి లింక్ లేదు. ఇప్పటివరకూ సైన్యంపై ఎవరూ ఆరోపణలు చేయలేదు" అని ప్రభుత్వం చెప్తోంది.

కానీ శ్రీలంక తన గత ఒప్పందాలకు కట్టుబడి, ఈ సామూహిక ఖననాలు, గల్లంతైన వారి గురించి నిజాయితీగా దర్యాప్తు జరిపించాలని చాలా మంది మైనారిటీ తమిళులు డిమాండ్ చేస్తున్నారు.

అప్పుడు మాత్రమే బాధితుల కుటుంబాలకు తమవారు ఏమయ్యారో తెలుస్తుంది, అంతర్యుద్ధం చేసిన గాయం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.