ఇది హెలికాప్టర్లలో పరారైన దొంగల కథ - నమ్మలేరు కానీ నిజం

ఫొటో సోర్స్, EPA
ఈ నెల 1వ తేదీన ఉత్తర ఫ్రాన్స్‌లోని జైలు నుంచి రెడోయిన్ ఫెయిడ్ అనే పేరొందిన ఖైదీ పారిపోవడం సంచలనం సృష్టించింది. ఫెయిడ్ జైలు నుంచి తప్పించుకుని హెలికాప్టర్‌లో పారిపోయాడు.
రాబర్ట్ డి నీరో, అల్ పాసినోలు పోషించిన గ్యాంగ్ స్టర్ పాత్రలే తనకు ప్రేరణ అని ఫెయిడ్ చెప్పుకునేవాడు. 2010లో దొంగతనానికి ప్రయత్నించిన కేసులో ఒక పోలీసు అధికారి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలపై ఫెయిడ్ 25 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతను జైలు నుంచి తప్పించుకోవడం ఇది రెండోసారి. 2013లోనూ అతను జైలు నుంచి తప్పించుకున్నాడు.
అయితే ఇలా నాటకీయంగా తప్పించుకున్నవాడు ఫెయిడ్ ఒక్కడే కాదు. అతనికి ముందు ఇలాంటి ప్రయత్నాలు చాలానే జరిగాయి. వాటిలో కొన్ని ప్రయత్నాలు విజయవంతమైతే, కొన్ని విఫలమయ్యాయి. అయితే అవన్నీ కూడా వేటికవే చాలా ఆసక్తికరమైనవి.

ఫొటో సోర్స్, AFP
హెలికాప్టర్‌ల ద్వారా తప్పించుకోవడానికి జరిగిన ప్రయత్నాలు చాలా అరుదు. వాటిలో కొన్ని ఫ్రాన్స్‌లో జరిగాయి.
గత ఆదివారం ఫ్రాన్స్‌లో ఫెయిడ్ తప్పించుకున్న హెలికాప్టర్ సరిగ్గా యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ నెట్టింగ్ లేని చోట ల్యాండయింది.
గతంలో గ్రీస్‌లో కూడా పేలియోకొస్టాస్ అనే నేరస్తుడు జైలు నుంచి తప్పించుకోవడానికి హెలికాప్టర్‌ను ఉపయోగించుకున్నాడు. అది కూడా ఒకసారి కాదు, రెండుసార్లు. అతను ఇప్పటికీ పట్టుబడలేదు కూడా.
ఈ క్రమంలో నేరస్తులు తప్పించుకోవడానికి డ్రోన్లు చాలా ఉపయోగపడుతున్నాయి. ఫెయిడ్ జైలు నుంచి తప్పించుకోవడంలో కూడా వీటిని ఉపయోగించుకొని ఉంటారని భావిస్తున్నారు.
2017లో కిడ్నాపర్ జిమ్మీ కాసే గ్యాస్ కట్టర్లు, సెల్ ఫోన్లను ఉపయోగించుకుని దక్షిణ కరోలినా జైలు నుంచి తప్పించుకున్నాడు.
2017లో అలబామా జైలు నుంచి 12 మంది ఖైదీలు తప్పించుకున్నారు. వాళ్లు కొత్తగా చేరిన గార్డును ఏమార్చి, డార్మిటరీకి వెళ్లే దారి తెరవడానికి బదులుగా, బయటికి వెళ్లే దారి తెరుచుకునేలా చేసి పారిపోయారు. అయితే, వారందరినీ తొందరగానే తిరిగి బంధించగలిగారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
జైలు నుంచి తప్పించుకున్న వారిలో జోవాక్విన్ 'ఎల్ చాపో' గజ్‌మ్యాన్ చాలా పేరొందాడు. డ్రగ్ సామ్రాజ్యాధిపతి అయిన గజ్‌మ్యాన్ మెక్సికోలో అత్యున్నత భద్రత కలిగిన జైళ్ల నుంచి రెండుసార్లు తప్పించుకున్నాడు.
2001లో అతను లాండ్రీ బుట్ట ద్వారా కస్టడీ నుంచి తప్పించుకున్నాడని అంటారు. అయితే ఈ కథనంపై పలు సందేహాలున్నాయి.
2015లో కూడా అతను సెల్‌లోని కన్నం ద్వారా తప్పించుకున్నాడు. అతని కోసం భూగర్భంలో ఒక మైలు పొడవున్న సొరంగాన్ని తవ్వారు. దానిలో గాలీవెలుతురు ధారళంగా వచ్చేలా ఏర్పాటు చేశారు. గజ్‌మ్యాన్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి మోటర్ బైక్ కూడా సిద్ధంగా ఉంచారు.

ఫొటో సోర్స్, Getty Images
మెక్సికన్ అధికారుల తల తీసేసినట్లు, అతను కన్నం గుండా తప్పించుకోవడం మొత్తం సీసీటీవీలో రికార్డైంది.
అయితే కొన్ని నెలల అనంతరం గజ్‌మ్యాన్‌ను పోలీసులు తిరిగి పట్టుకున్నారు.
2016లో కూడా అతను జైలు నుంచి తప్పించుకున్నాడని వార్తలు వెలువడ్డా, అవన్నీ అసత్యాలే. ప్రస్తుతం అమెరికా కస్టడీలో ఉన్న అతను, డ్రగ్స్ ఆరోపణలపై అక్కడ విచారణను ఎదుర్కొంటున్నాడు.

ఫొటో సోర్స్, BRAZIL CIVIL POLICE
పట్టిచ్చిన హైహీల్స్
2012లో బ్రెజిల్‌లో మాదకద్రవ్యాల కేసులో జైలులో ఉన్న రొనాల్డొ సిల్వాను సందర్శించడానికి అతని భార్య వచ్చింది. ఆ సమయంలో రొనాల్డొ తన భార్య దుస్తులు ధరించి జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
నీట్‌గా షేవింగ్ చేసుకుని, లిప్‌స్టిక్ పూసుకున్న రొనాల్డొ ప్రయత్నాలు హైహీల్స్ కారణంగా బెడిసికొట్టాయి. అలవాటు లేని హైహీల్స్‌తో ఇబ్బంది పడుతున్న రొనాల్డొ నడకలో తేడాను పసిగట్టిన గార్డులు అతన్ని తిరిగి బంధించారు.
యోగ నిపుణుడిగా పేరొందిన దక్షిణ కొరియాకు చెందిన చోయి గాప్-బోక్ 2012లో దైగు ప్రావిన్స్‌లోని జైలు నుంచి తప్పించుకున్నాడు.
ఒంటికి మొత్తం నూనెను పట్టించుకున్న అతను ఆహారం కోసం ఏర్పాటు చేసిన 15 సెంటీమీటర్ల పొడవు, 45 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న కన్నం లోంచి దూరిపోయి తప్పించుకున్నాడు. 52 కిలోల బరువున్న అతను కేవలం నిమిషం వ్యవధిలా ఆక్టోపస్‌లా కన్నంలోంచి దూరిపోయాడని పోలీసులు అధికారులు ఆశ్చర్యపోతుంటారు. అయితే కేవలం ఆరు రోజుల్లో అతణ్ని తిరిగి బంధించారు.

ఫొటో సోర్స్, Getty Images
హాలీవుడ్ సినిమాకు ప్రేరణ
1962లో శాన్‌ఫ్రాన్సిస్కో సమీపంలోని అల్కాట్రాజ్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడం వీటన్నిటిలో ప్రముఖమైనది.
అప్పట్లో అల్కాట్రాజ్ జైలుకు దేశంలోనే అత్యంత ఎక్కువ భద్రత కలిగిన జైలుగా పేరుండేది. అక్కడ అత్యంత కఠినమైన నియమాలు పాటించేవారు.
ఇతర జైళ్లలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారికి శిక్షగా వారిని అల్కాట్రాజ్ జైలుకు పంపేవారు. అయినా మూడు దశాబ్దాల కాలంలో అక్కడ డజను కంటే ఎక్కువ సార్లు తప్పించుకునే ప్రయత్నాలు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
1962 జూన్‌లో ఉదయం ఖైదీల హాజరు తీసుకుంటుండగా, అన్నదమ్ములైన జాన్, క్లారెన్స్ ఆంగ్లిన్‌లు, మరో ఖైదీ ఫ్రాంక్ మోరిస్‌లు తప్పించుకున్నట్లు గుర్తించారు.
తమ పడకలపై డమ్మీలను పడుకోబెట్టి, గాలి కోసం ఏర్పాటు చేసిన కన్నాల ద్వారా వాళ్లు జైలు నుంచి బైటపడ్డారు. ఒక చిన్న తెప్ప మీద వాళ్లు ఆ ద్వీపాన్ని దాటేందుకు ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత వాళ్ల ఆచూకీ లేదు.
ఈ ప్రయత్నంలో వాళ్లు నీళ్లలో మునిగి చనిపోయి ఉంటారని ఎఫ్‌బీఐ తేల్చింది. కానీ ఎఫ్‌బీఐ వెబ్ సైట్ పేజీలో మాత్రం ఇంకా ముగ్గురి ఆచూకీ తెలియజేయాలనే విజ్ఞప్తి కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- బర్త్‌డే పార్టీ కోసం గుహలోకి వెళ్లి చిక్కుకుపోయారు
- YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
- ప్రజ్ఞానంద: అక్కను ఓడించాలని చెస్ నేర్చుకున్నాడు.. ఇప్పుడు గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు
- ఉత్తరాదిలో రెండు లక్షల మంది తెలుగు వారు ఏమయ్యారు?
- మేఘాలయ: ‘దేవతల గుహ’లో దాగిన రహస్యాలు
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- ఈ విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా? లేవా?
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు : బీబీసీ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్
- వ్యోమగాములను సురక్షితంగా కిందకు తెచ్చే శక్తి భారత్ సొంతం
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








