థాయ్‌లాండ్ గుహలో బాలలు: మందులు, ఆహారంతో చేరిన రెస్క్యూ టీం

అదృశ్యమైన చిన్నారులు కొందరితో కోచ్.. ఫేస్‌బుక్ ఫొటో

ఫొటో సోర్స్, FACEBOOK/EKATOL

థాయ్‌లాండ్‌ గుహల్లో సందర్శనకు వెళ్లి అదృశ్యమైన 12 మంది బాలురు, వారి ఫుట్‌బాల్ కోచ్‌ను సజీవంగా గుర్తించిన తరువాత ఎట్టకేలకు వారికి మందులు, ఆహారం అందించగలిగారు.

ఒక వైద్యుడు, నర్సు సహా ఏడుగురు ఉన్న రెస్క్యూ టీం ఒకటి వారు చిక్కుకున్న ప్రదేశానికి చేరింది.

సులభంగా జీర్ణమయ్యే, అధిక శక్తినిచ్చే ఆహారాన్ని వారికి అందించారు. వైద్యుడు వారి ఆరోగ్యాన్ని పరిశీలించారని, ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేరని అధికారులు వెల్లడించారు.

వరద నీటితో నిండిన గుహలో చిక్కుకుపోవడంతో వారిని సురక్షితంగా బయటకు తేవడం ఎలా అనేది సవాలుగా మారింది.

వర్షాలు ఇంకా ఉద్ధృతమయ్యే సూచనలుండడంతో వారున్న ప్రాంతం చుట్టూ నీటి మట్టం పెరిగితే గుహలో ఆక్సిజన్ లభ్యత తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

గత తొమ్మిది రోజులుగా గుహలోనే చిక్కుకుపోయిన వీరు బయటపడాంటే ఈదుకుంటూ రావడం ఒక్కటే మార్గమని.. అందుకు గజ ఈతగాళ్ల స్థాయిలో నైపుణ్యం ఉండాలని, కానీ, వారున్న పరిస్థితుల్లో అలాంటి నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇవ్వడం కష్టమని ఇంతకుముందు సైన్యాధికారులు చెప్పారు.

లేదంటే, వరద నీటిని పూర్తిగా తోడేసిన తర్వాత బయటకు తీసుకురావాలని, అందుకు కనీసం నాలుగు నెలలు సమయం పడుతుందని, అప్పటి వరకూ ఈ బాలలకు అవసరమయ్యే ఆహారాన్ని గుహలోకి పంపించాల్సి ఉంటుందని వివరించారు.

మరోవైపు వారు తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వీలుగా వారు చిక్కుకున్న ప్రదేశానికి ఫోన్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: పాతాళ గుహలో 9 రోజులు చిక్కుకున్నా ప్రాణాలు నిలుపుకున్నారు

అసలు ఎవరీ బాలలు, గుహలో ఎలా చిక్కుకున్నారు?

చియాంగ్ రాయ్‌ రాష్ట్రంలోని థామ్ లువాంగ్ గుహలు.. డోయ్ నాంగ్ నాన్ పర్వతం కింద ఉన్న చాలా సంక్లిష్టమైన గుహలు. ఎన్నో మలుపులు, చీలికలతో విస్తరించి దాదాపు పది కిలోమీటర్ల మేర విస్తరించిన గుహలివి. వర్షాకాలంలో ఈ గుహలు వరద నీటితో నిండిపోతాయి.

ఒక జూనియర్ ఫుట్‌బాల్ టీమ్ సభ్యులు, వారి కోచ్‌తో కలిసి జూన్ 23వ తేదీ శనివారం ఈ గుహల్లోకి వెళ్లారు. కానీ బయటకు రాలేదు. దీంతో వీరి కోసం భారీ ఎత్తున గాలింపు, సహాయ చర్యలు చేపట్టారు. గుహల్లో నీటిలోకి దూకి, గాలించే నిపుణులను రంగంలోకి దించారు.

తొమ్మిది రోజుల తర్వాత.. ఇద్దరు బ్రిటిష్ గజ ఈతగాళ్లు నిర్విరామంగా కొనసాగించిన గాలింపులో భాగంగా గుహలో కొంత విశాలంగా ఉన్న ప్రాంతంలోని ఒక దిబ్బ మీద వీరు చిక్కుకుపోయి ఉండటాన్ని గుర్తించారు.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటలకు ఈ బృందాన్ని కనిపెట్టారు. అయితే.. గుహలో నీటి మట్టం పెరుగుతుండటం.. అక్కడికి చేరుకోవటానికి బురద ఆటంకంగా ఉండటంతో వారిని సురక్షితంగా వెలికి తీయటం సవాలుగా మారింది.

గుహల మ్యాప్

వీరిని ఎలా కనిపెట్టారు?

గుహల్లో అదృశ్యమైన బృందం.. గుహలోపల పెరుగుతున్న వరద నీటి నుంచి తప్పించుకోవటానికి వీరు భూగర్భంలో ఒక దిబ్బ వద్దకు చేరి ఉంటారని సహాయక సిబ్బంది భావించారు. ఆ దిబ్బను స్థానికులు పటాయా బీచ్ అని వ్యవహరిస్తుంటారు. కానీ.. అక్కడికి 400 మీటర్ల దూరంలో మరింత ఎత్తైన ప్రదేశంలో వీరు కనిపించారు.

బ్రిటిష్ సహాయకులు రిక్ స్టేషన్, జాన్ ఒలాంథెన్‌లు గత వారం ఆరంభంలో ఈ సహాయ చర్యల్లో పాల్గొనటానికి థాయ్‌లాండ్ వచ్చారు. గుహలో తప్పిపోయిన బృందాన్ని వీరు సోమవారం చేరుకున్నారు.

థాయ్ నేవీ సీల్ ప్రత్యేక బలగాలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో.. ఆ బృందంతో బాలురు ఇంగ్లిష్‌లో మాట్లాడుతుండటం వినిపిస్తుంది. కొంచెం విశాలంగా ఉన్న గుహ గదిలో నీటి మట్టం కన్నా ఎత్తుగా ఉన్న దిబ్బ మీద కూర్చున్న ఆ బృందంతో టార్చి‌లైట్ వెలుగులో ఈ బాలురు మాట్లాడుతున్నారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

‘‘మీరు ఎంత మంది ఉన్నారు?’’ అని ఒక సహాయకుడు అడిగారు.

‘‘పదమూడు!’’ అని జవాబు వచ్చింది.

‘‘పదమూడు మంది? బ్రిలియంట్!’’

తమను బయటకు ఎప్పుడు తీసుకెళతారని వాళ్లు అడిగింది. ‘‘ఈ రోజు కాదు. మేం ఇద్దరం ఉన్నాం. మేం ఈతకొట్టాల్సి ఉంటుంది. మేం వస్తున్నాం. సరేనా? చాలా మంది వస్తున్నారు. మేం ముందుగా వచ్చాం’’ అని ఒక సహాకుడు వివరించారు.

ఆ బాలురలో ఒకరు.. ‘‘తిండి.. తిండి.. తిండి.. మేం ఆకలిగా ఉన్నామని వారికి చెప్పండి’’ అనటం వినిపించింది.

ఆ బృందంలోని వారి గొంతులు అస్పష్టంగా ఉన్నాయి. అది ఏ రోజు అని ఒకరు అడిగగా.. ‘‘సోమవారం, సోమవారం. మీరు ఇక్కడ పది రోజులుగా ఉన్నారు. మీరు చాలా బలంగా ఉన్నారు’’ అని సహాయకుడొకరు జవాబిచ్చారు.

గుహలో బాలురు

ఫొటో సోర్స్, AFP/ROYAL THAI NAVY

ఫొటో క్యాప్షన్, గుహలో అదృశ్యమైన బాలురిని తొమ్మిది రోజుల తర్వాత గుర్తించారు

అయితే ఇప్పుడు తాము తిరిగి వెళ్లాల్సి ఉంటుందని.. మళ్లీ తిరిగి వస్తామని బ్రిటిష్ డైవర్స్ వివరించారు.

‘‘చాలా కృతజ్ఞతలు’’ అని చెప్పారు బాలురు. ‘‘మీరు ఎక్కడినుంచి వచ్చారు?’’ అని కూడా వాళ్లు అడిగారు.

‘‘ఇంగ్లండ్. యునైటెడ్ కింగ్‌డమ్’’ అని డైవర్లు బదులిచ్చారు.

‘‘ఓహో. సరే. రేపు కలుద్దాం’’ అని వారు బదులిచ్చారు.

ఆ బృందం దుస్థితి దేశాన్ని ఉద్విగ్నతతో నింపింది. వారికి మద్దతు వెల్లువెత్తింది.

ఆ బాలుర వయసు 11 నుంచి 16 ఏళ్ల వరకూ ఉంది.

బాలుర తల్లిదండ్రుల్లో ఆనందం

ఫొటో సోర్స్, AFP

ఆశలు నింపిన విజయం

జొనాథన్, థామ్ లువాంగ్ బీబీసీ న్యూస్ హెడ్

గుహ ప్రవేశ ద్వారం దగ్గర ఆనందోత్సాహాల దృశ్యాలు కనిపించాయి. గుహల్లో సహాయ చర్యల్లో పాల్గొంటున్న డజన్ల కొద్దీ డైవర్ల కోసం గాలి ట్యాంకులను నింపుతూ, నీటిని తోడే పంపులకు విద్యుత్‌ను సరఫరా చేస్తూ జనరేటర్లతో నిండిపోయిందీ ప్రాంతం. ఆ డైవర్ల నిరంతర అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది.

ఇప్పుడు వారిని ఎలా బయటకు తీసుకు రావాలి అనేదానిపై అధికారులు ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. వారున్న చోటుకి వెళ్లి కుర్రాళ్లకు వైద్య చికిత్స, ఆహారం అందించటం.. తద్వారా వారి శారీరక శక్తిని పునర్నిర్మించటం మొదటి ప్రాధాన్యం.

ఈ ఆపరేషన్ ప్రతి దశనూ దేశం మొత్తం ఊపిరిబిగబట్టి వీక్షిస్తూ వచ్చింది. అయితే.. రోజులు గడిచేకొద్దీ ఈ ఆపరేషన్ ఆనందంగా ముగుస్తుందన్న ఆశలు తగ్గిపోతూ వచ్చాయి.

వారు ఇంకా బయటకు రాలేదు. కానీ ఇది మనోధైర్యాన్నిచ్చే విజయం. ఆ కుర్రాళ్ల ప్రాణాలను కాపాడేందుకు థాయ్ ప్రభుత్వం తను చేయగలిగిన కృషినంతా చేస్తోంది.

తల్లిదండ్రుల్లో ఆనందం

ఫొటో సోర్స్, AFP

ఈ 13 మంది ఎవరు?

12 మంది బాలురు.. మూ పా (అడవి పంది) ఫుట్‌బాల్ టీమ్ సభ్యులు.

వారి కోచ్ ఎక్కోపోల్ జాన్‌థావాంగ్ వయసు 25 ఏళ్లు. అతడు టీమ్ సభ్యులను అప్పుడప్పుడూ బయటకు తీసుకెళుతుంటాడు. ఇదే గుహలకు రెండేళ్ల కిందట కూడా తన టీమ్ సభ్యులను తీసుకెళ్లాడు.

ఈ బృందంలోని 11 ఏళ్ల చానిన్ ‘టైటన్’ విబ్‌రన్‌రన్‌గ్రూయెంగ్ అందరికన్నా పిన్నవయస్కుడు. అతడు ఏడేళ్ల వయసు నుంచే ఫుట్‌బాల్ ఆడటం ఆరంభించాడు.

టీమ్ కెప్టెన్ దువాంగ్‌పెట్ ‘డోమ్’ ప్రోంటెప్ వయసు 13 ఏళ్లు. ఆ బృందానికి అతడు స్ఫూర్తి నింపుతూ ఉంటాడని చెప్తారు.

తిన్నాకోర్న్ బూన్‌పీమ్ కుమారుడు 12 ఏళ్ల మోంగ్‌కోల్ కూడా ఈ 13 మందిలో ఉన్నాడు. ఆమె గుహ ద్వారం దగ్గర వేచిచూస్తున్నారు. వారందరూ క్షేమంగా ఉన్నారన్న మాట తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో ఆమె చెప్పారు.

‘‘అతడు శారీరకంగా మానసికంగా బలంగా ఉండాలని కోరకుంటున్నా’’ అన్నారామె.

ఈ బృందంలోని మరో బాలుడి తండ్రి.. వారంతా క్షేమంగా ఉన్నారన్న సమాచారం తెలుసుకుని సంతోషంతో ఏడ్చేశారు. ‘‘నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను’’ అని ఆయన స్పందించారు.

ఆక్సిజన్ సిలిండర్లు

ఫొటో సోర్స్, AFP/ROYAL THAI NAVY

ముందున్న సవాళ్లు ఏమిటి?

‘‘వాళ్లంతా క్షేమంగా ఉన్నారు. కానీ పని ఇంకా పూర్తి కాలేదు’’ అని చియాంగ్ రాయ్ గవర్నర్ నరోంగ్‌సాక్ ఒసోటానకోర్న్.. గుహ ప్రవేశ ద్వారం దగ్గర మీడియాతో పేర్కొన్నారు.

‘‘గాలించటం, రక్షించటం, ఇంటికి పంపించటం మా పని. ఇప్పటివరకూ మేం వారిని కనిపెట్టామంతే. వారిని గుహ నుంచి క్షేమంగా బయటకు తీసుకొచ్చి ఇంటికి పంపించటం మా తర్వాతి కార్యక్రమం’’ అని చెప్పారు.

గుహలో నీటిని తోడటాన్ని కొనసాగిస్తామని.. బాలురు, కోచ్ ఆరోగ్యాన్ని పరీక్షించటానికి డాక్టర్లు, నర్సులను గుహ లోపలికి పంపిస్తామని తెలిపారు.

‘‘వారిని అక్కడి నుంచి కదిలించటానికి వారికి తగినంత శక్తి ఉందని డాక్టర్లు చెప్తే.. అప్పుడు వారిని గుహ నుంచి బయటకు తెస్తాం. మళ్లీ స్కూలుకు తిరిగి వెళ్లే వరకూ వాళ్ల సంరక్షణ మేం చూసుకుంటాం’’ అన్నారు.

‘స్కూబా పరికరాలతో తీసుకొచ్చే ప్రయత్నం ప్రమాదకరం‘

వరద నీటితో నిండిన ఈ గుహల నుంచి స్కూబా పరికరాల సాయంతో బాలురను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేయవద్దని.. ఇంటర్నేషనల్ అండర్‌వాటర్ కేవ్ రెస్క్యూ అండ్ రికవరీ ఆర్గనైజేషన్‌కు ఫ్లోరిడాలో కో-ఆర్డినేటర్‌గా ఉన్న ఎడ్ సోరెన్సన్ హెచ్చరిస్తున్నారు.

‘‘అది చాలా ప్రమాదకరం. నేనైతే ఇక మరో మార్గమేదీ లేదని తేలినప్పుడు మాత్రమే ఆ పని చేస్తాను’’ అని ఆయన బీబీసీతో పేర్కొన్నారు.

‘‘మనకు పరిచయం లేని ప్రాంతంలో కళ్లు ఏ మాత్రం కనిపించని చోట ఉండటం.. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. వాళ్లు భయకంపితులైపోయి ప్రాణాల మీదికి తెచ్చుకోవచ్చు. అంతే కాదు, తమను రక్షించటానికి వచ్చిన వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేయొచ్చు’’ అని వివరించారు.

‘‘కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆహారం, నీళ్లు, ఆక్సిజన్ వంటివి అక్కడికే తీసుకెళ్లి అందించటం ఉత్తమం. వారికి అక్కడ కనీసం లైట్లు ఉన్నాయి. అక్కడికి ఆహార సరఫరాలు తీసుకెళ్లి అందించగలిగే వరకూ వేచి ఉండి.. వారు శక్తి కూడగట్టుకునేలా చేయటం మంచిదని నా అభిప్రాయం’’ అని ఆయన చెప్పారు.

ఈ ఆపరేషన్‌లో 1,000 మందికి పైగా పాలుపంచుకుంటున్నారు. బ్రిటన్ సహా చైనా, మయన్మార్, లావోస్, ఆస్ట్రేలియా, అమెరికాల నుంచి వచ్చిన సహాయ బృందాలు కూడా ఈ బాలల గాలింపు చర్యల్లో భాగమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)